సుజ్ఞాని అమ్మ

సుజ్ఞాని అమ్మ

రచయిత:: నెల్లుట్ల సునీత


అమ్మ తోడుంటే చాలు
ఏ ధన ధాన్యాలు ఎందుకు?

అనంత నీలాకాశంలో నీ
బరువంతా అంతః క్షేత్రంలో దాచి
నీ ఊపిరి ఆగిన మెరుపుల పోరాటంతో
పురిటినొప్పులను దాటి
ఉనికే లేని పిండానికి  ఊపిరిని ఇచ్చి!
నీ కంటి రెప్పలలో నా రూపాన్ని చూసి మురిసిపోయావు  అనురాగదేవతగా

నీ తనువుతో పెనవేసుకుని
నీ తలపుల మనసుతో ముడి వేసుకుని
పేగు బంధమై రూపం ఇచ్చావు నాకు
సృష్టి రహస్య వర్ణ చిత్రాలకు ప్రతిరూపంగా నిలిచావు

నీ మమతానురాగాల మాధుర్యములు పంచే అమృతమూర్తిగా నిలిచి
నా కడుపు నిండిందో లేదోనని చూసిన నీ అమ్మతనం ఎంతో కమ్మదనం కదమ్మా

నా కోసం నీ కోరికల్ని శ్రమను త్యాగం చేసి త్యాగశీలివి
నీ అనురాగాలు ఆత్మీయతలు పంచిన కల్పవల్లివి!

నీ శ్రమలోనే నా సంతోషాన్ని వెతికి
నా భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శిగా తొలి గురువుగా జ్ఞానం పంచిన సుజ్ఞానివి
పాలకడలి చిలికినప్పుడు అమృతం వచ్చినట్లుగా!
నేను ఎంత ఈసడించుకున్నా
నీలోంచి ప్రేమ అమృతం నిరంతరం వస్తూనే ఉంటుంది కదమ్మా

నీ ప్రేమని అక్షరాలలో బంధించి
చూపించలేనిది!
ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది!
నీకోపంలోనైనా నా మంచిని కోరుకునే దేవతవి కదా

నీ గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు భాషలు చాలవు!
అనంతమైన అచంచలమైన నమ్మకమే అమ్మ… అమ్మ… అమ్మ నా శకుంతలమ్మ ..నా లక్ష్మీ అమ్మ.

(మాతృ దినోత్సవం సందర్భంగా నా కవితా కుసుమాలు అమ్మకు అంకితం )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!