అమ్మ చేతులు
రచయిత :: శ్రీతరం బింగి శ్రీకాంత్
పొద్దు కన్నులు విచ్చుకోక ముందే
మేలుకొన్న అమ్మ చేతులు
చుక్క పొడిచినా ఆగకుండా
పిండి మరలా ఆడుతూనే ఉండేవి
వంటింట్లో మసిగుడ్డలా మారి
ఇంటిల్లిపాదీ జఠరాగ్నిని చల్లార్చి
సాగు బడిలో నాన్నకు సాయంగా
తెడ్డువేస్తూ బ్రతుకు నావను ముందుకు నడిపించేవి
మాలో ఎవరికి సుస్తీ చేసినా
విలవిలలాడుతూ, అమ్మ చేతులు
ముందుగా కనువాకిట పొంగే నదిలో
తడిసేవి తెల్లవార్లూ…
ఆకాశమంత ప్రేమను
భూదేవి అంతా సహనాన్ని
చేతుల్నిండా నింపుకుని
పెళ్లి,పేగు బంధాలలో కరిగిపోతు వెలుగునిస్తుంది
మా ఇంటి లక్ష్మీదేవీ మాతృమూర్తి.
కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు
ఎంత చేసినా అమ్మ పని గుర్తింపు లేనిది
ఆమె చేతుల గాయల రాత మారనిది
అయినా మా చిరునామాకు అలికిడికి అవే.