ఆధ్యాత్మిక యోధుడు సంత్ సేవాలాల్ మహారాజ్

ఆధ్యాత్మిక యోధుడు సంత్ సేవాలాల్ మహారాజ్

(సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌ 284 జయంతి సందర్భంగా..)

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచయిత: రాథోడ్ శ్రావణ్
9491467715
ఉట్నూర్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణ.

  • బంజారా సమాజంలో హిందూధర్మ రక్షకుడు.
  • తన భోధనలతో సమాజాన్ని సంఘటితం చేసి, భక్తి ఆయుధంగా సంస్కరణలు చేసిన యుగ పురుషుడు.
  • బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఉద్దీపింపజేసిన మహోన్నతమైన మానవతమూర్తి.
  • తన భవిష్యవాణితో సమాజాన్ని దిశా నిర్దేశాలు చూపించిన ఆధ్యాత్మిక గురువు.
  • భారత దేశంలో 18 కోట్ల బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ శిరోమణి సేవాలాల్ మహారాజ్ గారి 284 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసం.
    శ్రీ సంత్ శిరోమణి సేవాలాల్ మహారాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని, రాంజీ నాయక్ తాండాలోని, రామావత్ గోత్రంలో భీమానాయక్, ధర్మణిమాత దంపతులకు 1739లో కాళయుక్తి నామ సంవత్సరం, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి నెల, 15వ‌ తేది ఆదివారం రోజున మగ శిశువు జన్మించారు. తాండా వాసులు ఆనందంతో నృత్యాలు చేశారు. తల్లి మాయను అక్కడే భూమిలో పాతి పెట్టి దాని పై ఒక బండ వుంచారు. మూడవ రోజు దళవాధోకాయరో కార్యక్రమాలు చేశారు. 21వ రోజున దేవతలు (సాతిభవాని) వచ్చి ఉయ్యాలలో వేసి, చెవిలో సేవా, సేవా, సేవా అని మూడు సార్లు చెప్పి పాటలు పాడుతు పేరు పెట్టి ఆనందంగా వెళ్ళిపోయారు.
    సంత్ సేవాలాల్ మహారాజ్ తండ్రి భీమానాయక్ ఆవులను పోషించేవారు. వీరి ఇంట్లో అధిక సంఖ్యలో ఆవుల మంద ఉండేది. దంపతులిద్దరు జగదాంబ దేవి భక్తులు, వీరికి చర్లోపల్లి గ్రామం దగ్గర గొల్లలదొడ్డి సమీపంలో, సేవాఘడ్ తాండాలో సేవాలాల్ అనే కుమారుడు జన్మించాడు. సేవాలాల్ చిన్నప్పటి నుండి జగజ్జనని జగదాంబ దేవి భక్తుడు.
    12 సంవత్సరాల వయస్సులోనే అద్భుతమైన చమత్కారం చేసాడని అప్పటి నుండి తల్లిదండ్రులు తాండా ప్రజలు సేవాలాల్ ను దైవాంశ సంభూతుడుగా కొనియాడారు.
    క్రీ.శ 18వ శతాబ్దంలో భారత దేశం మొత్తం సంచరిస్తూ, ఆవులను మేపుకుంటు, సమస్త బంజారా సమాజాన్ని జాగృతం చేసారు. తన జీవితాన్ని త్యాగం చేసి, తన బోధనలను మాటలకే పరిమితం కాకుండా ప్రతీది ఆచరించి చూపించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. తన సమాజ ప్రజలతో భారతదేశమంతా తిరిగి గోవులను మేపుతు, హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి కృషి చేసిన గొప్ప బ్రహ్మచారి. ఆ కాలంలో సమాజంలో పేరుకుపోయిన దూరాచారాలని, మూఢ నమ్మకాలని, జంతు బలి మొదలగు ఆచారాలను వ్యతిరేకంగా పోరాడారు. బంజారా సమాజం పట్ల తనకున్న ప్రేమతో ప్రతి మనిషిని ప్రేమించి కోపతాపాలు లేకుండా సృష్టిలో ప్రతి జీవి పైన ప్రేమ, దయ, కరుణ చూపించాలని కోరారు. తన సమాజానికి అనేక సంస్కరణలు చూపారు.
    సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి భక్తుడు. దేవి అనుగ్రహంతో గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, భవిష్యత్తులో జరుగబోయేది ముందే చేప్పిన మహాజ్ఞాని, ఝమూరి జోల్ (ఝండీజోల్) బావన్ బరాడ్, దట్టమైన కీకారణ్యం ప్రాంతంలో మాతా జగదాంబ దేవి ప్రత్యక్షమై సకల విద్యలు, గోవుల సేవకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ కు దేవి నేర్పుతుండేది అని, భజన గాయకులు తమ పాటలో చెపుతుంటారు. సంచార జీవితం నుండి తాండాల రూపంలో స్థిర నివాసం ఏర్పరుచుటకై తన వంతు కృషి చేశారని అందుకే ఈ రోజు 18 కోట్ల బంజారా ప్రజల ఆరాధ్య దైవంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు‌. బంజారా తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవి ఆలయంలో రెండు జెండాలు ఉంటాయి. అందులో ఒకటి గులాబీ రంగు, రెండోది తెలుపు రంగు ఈ రెండు జెండాలు విజయ చిహ్నంగా భావిస్తారు.

సేవార్ బోల( సేవాలాల్ భవిష్యవాణి):-

కలియుగం గూర్చి ఇలా ముందే చెప్పారు. ఇది సతి యుగము, ఆ తర్వాత కలియుగం వచ్చును, కలియుగంలో అల్లకల్లోలమగును, అమ్మకు బిడ్డ భారమగును, నీళ్ళ ప్యాకెట్లు మరియు ఒక రూపాయికి పదమూడు శెనగలు అమ్ముడు పోవును.మహమ్మారి గురించి ఇలా అన్నారు.. మనుషులకు రకారకాల రోగాలు రావచ్చు, వైద్యులు రోగాల పరీక్షలు చెయ్యొచ్చు, కాని రోగం ఏదో తెలియక పోవచ్చు, మాట్లాడుతూ మాట్లాడుతూ రోగి చనిపోవచ్చు, ఇంటింటికి నాయకులు కావచ్చు, ఆకాల కష్టవిపత్తులు సంభవించవచ్చు, ఊరి పెద్దలు పంచాయతీ చేసి పేద ప్రజలను దండించి తినొచ్చు, వాళ్ళ వంశం నరకం అనుభవించవచ్చు. అడవి నెమళ్ళలను తినొద్దు, గోవులను కసాయిలకు అమ్మొద్దు. ఈ ప్రపంచంలో మహిళల రాజ్యం రావచ్చు, చరవాణి గురించి అప్పట్లో అన్నారు క్షణంలోనే సమాచారం అంతటా వ్యాపించవచ్చు, అన్నదమ్ముల, తండ్రికొడుకుల,అత్తకోడళ్ళ కొట్లాటలు జరగొచ్చు. తోళారామ్ అనే పేరు గల అశ్వం పై కూర్చుని దక్కన్ పీఠభూమి ప్రాంతంలో గోదళము‌ తీసుకొని తిరుగుతూ నైజాం నవాబు గోదళమును చూసి భయపడి ప్రజలందరిని గమనించి బంజారా హిల్స్ లో ఉండండి అని వేడుకొనవచ్చు.ఎవరి పరిపాలన సాగునో వారు అబద్ధం చెప్పిన నిజమగును, సత్యం అసత్యమగును, స్త్రీల పై అత్యాచారం జరుగును, పాపిష్టుల కాలం రావచ్చు, వారి ఇంట్లో డబ్బులు కొదవ ఉండక పోవచ్చు, వీరి పాలన భరించలేక మనుషులు అడవి బాట పట్టవచ్చు. ఒక ఆవు ఖరీదు లక్ష కావచ్చు, గోవులకు మేత దొరక్కుండా పోవచ్చు, వాటిని ఎవరు పట్టించుకోకపోవచ్చు, గోవు కళేబరాలు కుప్పలు తెప్పలుగా పడొచ్చు, నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజము కావచ్చు.

సేవాలాల్ మహిమలు:-
నరులను నారి చేసి ( చింగ్ రియ్యా అనే యువకుని యువతి చేసి), రాళ్ళతో డప్పు చేసె, మట్టితో నైవేద్యం చేసి, నిర్జీవిని సజీవి చేసిన సేవాభయ కులమత భేదాలు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో అద్భుతాలు సృష్టించి, అహింసా పాపము మత్తు మందు శాపము చెప్పిన సేవాభయ బంజారా ప్రజలను సన్మార్గంలో నడిపించిన దేవుడు.
హైదరాబాదులో గోవులను మేపుతున్న కాలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ మహిమను తెలసుకున్న అప్పటి నిజాం ప్రభువు సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని గీయించి తన మ్యూజియంలో పెట్టినారని బంజారా గాన గంధర్వులు(ఢాడి) కథల ద్వారా చేపుతుంటారు.
భారతదేశ భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో మధ్యయుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఘన కీర్తి ప్రతిష్టలు పొందుతున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం గూర్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తి ఉద్యమకారుల జాబితాలో చేర్చి ఈయన జీవితచరిత్రను పాఠ్యాంశంగా మార్చవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతో ఉంది.
సంత్ సేవాలాల్ మహారాజ్ 1806 డిసెంబర్ 04న మహారాష్ట్ర లోని, వాసీం జిల్లా మనోరా తాలుకాలోని, ఉమ్రి తాండా సమీపంలో రూయిగడ్ ప్రాంతంలో పరమవదించారు. ఆయన సమాధి భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన బంజారాల కాశీ పౌరాగడ్ లో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రివర్యులు సంజయ్ బావు రాథోడ్ కలిసి మందిర నిర్మాణానికి ₹593 కోట్లు మంజూరు చేసి, తేది 12-02-2023న పౌరాగడ్ పీఠాధిపతి సంత్ శేకర్ మహారాజ్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది.
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున సెలవు ప్రకటించాలని, సేవాలాల్ జయంతిని రాష్ట్రమంతట ఒకే రోజున జరుపుకోవాలని సేవాలాల్ ఉత్సాహ కమిటీ నాయకులు కోరుతున్నారు.

*********

You May Also Like

One thought on “ఆధ్యాత్మిక యోధుడు సంత్ సేవాలాల్ మహారాజ్

  1. చాలా అందంగా ఆకర్షణీయంగా నా వ్యాసానికి ఆన్లైన్ పత్రికలో అవకాశం కల్పించాలన తపస్వి మనోరమ పబ్లికేషన్స్ సంపాదకులు గౌ శ్రీ నిమ్మగడ్డ కార్తీక్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు… రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!