బందీలయిన బ్రతుకులు

 బందీలయిన బ్రతుకులు

కవయిత్రి : వేముల ప్రేమలత

సమీక్షకురాలు : సిద్ధలలిత చిట్టే.
~~🍃🌺🍂
శాస్త్రం, జ్ఞానం కలిసిన విజ్ఞానంతో ఉద్భవించిన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ నేడు భూమిపై మనుషుల మనుగడను, జీవితాలను శాసిస్తోంది. మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసి యంత్రాలకు బందీలుగానూ, బానిసలుగానూ మార్చుతోంది.
ప్రస్తుత కాలంలో మనిషి తన గుప్పిట్లో మొబైల్ ఫోన్ ను వుంచుకుని ప్రపంచమే తన చేతిలో వున్నట్లుగా భావించి మురిసిపోతున్నాడు. మైమరచిపోతున్నాడు.
కానీ ఎక్కువైన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని తన గుప్పెట్లలోకి తీసుకుని మనిషికి సంకెళ్ళు వేసి బందీగా మార్చుతోంది. మనిషికి మనిషిని దూరం చేస్తోంది. మనసువిప్పి మాట్లాడుకునే మమతలు, మమకారాల్లో విషంలాంటి రేడియేషన్ ను, కృత్రిమతను కలుపుతోంది. మనిషిని మొబైల్ ఫోన్ కు బానిసగా చేసి బంధాలను విడదీస్తోంది.
మారే కాలంతో పాటూ మార్పును స్వాగతించి సద్వినియోగపరచుకుంటే మంచిదే. వక్రమార్గాల్లో వినియోగిస్తేనే ముప్పు తప్పదు.
ఏ పరికరాన్నైనా సరే దుర్వినియోగపరిస్తే దానికి తగిన మూల్యాన్ని మనం చెల్లించక తప్పదు.
అతి సర్వత్రా వర్జయేత్…. అన్నారు పెద్దలు.
~~🍂🌺🍃
మన కవయిత్రి వేముల ప్రేమ లత గారు
ఈ ఆధునిక కాలంలో మనిషి ఏ విధంగా మొబైల్ కు బానిస అయ్యాడో దాని దుష్ప్రభావం మనిషిపై ఎంతగా పడిందో, ఆ పరిణామం ఏమిటో.. పర్యవసానం ఎంతో.. తెలియజేస్తూ తనదైన శైలిలో చక్కగా వివరిస్తూ.. ‘బందీలయిన బ్రతుకులు’ అనే కవితను వ్రాసారు. చక్కటి అంశం.
పిల్లలు, కుర్రకారు, పెద్దలు అందరూ వయసుతో నిమిత్తం లేకుండా ఫోనుకు ఎంతగా ఆకర్షింపబడ్డారో, దానికి ఎంతగా హత్తుకుపోయారో.. బందీలుగా మారిపోయారో వివరిస్తూ రాసిన ఆ కవితను ఒకసారి మనం చూద్దాం.
~~🍃🌺🍂
శీర్షిక : బందీలయిన బతుకులు

తన అభివృద్ధి కోసం తయారు చేసుకున్న చరవాణి
నేడు వెయ్యి తలల విషనాగై కాటేస్తోంది..

బంధాలను వదిలేసి దీని బారిన పడి
బయట పడలేక సతమత మవుతున్నారు
పిల్లలకు బాల్యనుభూతుల్ని దూరం చేసి..
ఎన్నడూ లేని ఆన్లైన్ చదువులను నేర్పి..
యువతకు పుస్తక పఠనాన్ని దూరం చేసి..

పనికిరాని గేములు, అసభ్య చిత్రాల్ని చూపి..
చుట్టాలొస్తే పలకరింపులు కూడా లేకుండా..
పగలూ రాత్రీ సెల్లోనే కాపురం..

చాటింగులు చీటింగులు..
కాపురాల్లో చిచ్చులు..
వెరసి మోసాలు, కటకటాల పాలు
కాలక్షేపమనుకున్నావో.. నిన్ను కాటికి పంపేదాకా వదలదు..

రాత్రుళ్లు నిద్రలేక కంటి జబ్బులు
చెవులకు మిషన్లు, ఒంటరితనం..
కూర్చున్న చోటుకే అన్ని తెప్పించుకుని
వ్యాయామం లేక ఊబకాయం..
మంచికా? చెడుకా?
ఎలా వాడాలో నువ్వే నిర్ణయించుకో..!

-వేముల ప్రేమలత.
~~🍃🌺🍂
మాటలురాని పసిపిల్లలు సైతం మొబైల్ ఫోన్ లో రైములూ.. గేములకూ అలవాటుపడిపోయారు. ఇంత చిన్నవయసులోనే ఎలక్ట్రానిక్ వస్తువులకు అలవాటైపోతే అందులోని రేడియేషన్ స్లో పాయిజన్ లా శరీరంలోకి ప్రవేశించి అనర్థాలను ఎదుర్కోక తప్పదు.
ప్రపంచాన్ని ఈ కరోనా కమ్ముకున్నాక పిల్లల చదువులు కూడా ఆన్ లైను లోనే.
ప్రస్తుతం ఫోను లేక పోతే గడవని స్థితి అయింది.
ఫేస్ బుక్.. వాట్సప్.. లాంటి సామాజిక మాధ్యమాలు కాలాన్ని హరించి మనుషులను దూరం చేసి మొబైల్ ని దగ్గర చేసాయి.
పగలూ రాత్రీ మొబైల్ చేతిలో లేకపోతే కలవరపడే స్థితి. నిద్రలో కూడా చంటిపిల్లను వెతుక్కున్నట్లు తడుముకునే పరిస్థితి.
చాటింగులూ.. అందువల్ల కలిగే చీటింగులూ.. ఘోరాలు.. నేరాలూ.. అనుమానాలూ.. హత్యలూ తద్వారా లెక్కపెట్టే కటకటాలూ..
నిత్యం వినబడే వార్తలు ఎన్నని..?
మొబైల్ ఫోను వల్ల కలిగే అనర్థాలను
కవయిత్రి ప్రేమలత కూలంకషంగా
ఈ ‘బందీలయిన బతుకుల్లో’ బహు చక్కగా వివరించారు.👏
~~~🍃🌺🍂
చివరగా..
ఇది మంచికా, చెడుకా నువ్వే నిర్ణయించుకో అంటూ ముగించడం బావుంది. ఇక్కడ జవాబును పాఠకుల విజ్ఞతకే వదిలేసారు.
ఎందుకంటే.. మంచేదో చెడేదో మనకు బాగా తెలుసు. ఆలోచించే పరిణతి, మేధస్సు మనకు వుంది.
ఈ మొబైల్ విసిరిన ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడకుండా..
పరిమితుల నెరిగి పద్దతిగా నడచుకోవాల్సిన బాధ్యత మన మీదే వుంది.
మన ఆరోగ్యం, మన సమయం, మన జీవిత విధానం
సరిగ్గా వుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకు మనం మన అలవాట్లను మార్చుకోవాలి.
సమాజహితమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మన స్వంతం చేసుకోవాలి.
ఏ అలవాటుకూ బానిసవకూడదు.
భావి తరాలకు కూడా ఏది అనర్థకమో, అనారోగ్యమో సవివరంగా వివరించి మనవంతుగా వారికి మార్గనిర్దేశకం చెయ్యాలి.
~~~🍃🌺🍂
కవితా శిల్పం కాస్త మెరుగులు దిద్దుకోవలసిన ఆవశ్యకత వుంది కానీ కవితలోని భావం, కవితావేశం మదిని అలరించాయి.
కవయిత్రి ఎంచుకున్న అంశం.. ఆ కోణం, స్పృశించిన అంశాలు ప్రశంసనీయం.
చక్కని కవితను అందించిన కవయిత్రి వేముల ప్రేమలత
ఈ కవయిత్రి మరిన్ని ఉపయుక్తమైన కవితలతో పాఠకులను అలరించాలని కోరుతూ ఈ కవితా సమీక్షను ముగిస్తున్నాను.
~~🍃🌺🍂
సమీక్షల పట్ల ఆపేక్ష కలిగిన పాఠకులకు ధన్యవాదములు.💐

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!