బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయ విశిష్టత

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్ లో వేంకటేశ్వర స్వామి గుడి తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన గుడి. బ్రహ్మాండపురాణంలో కనకదుర్గమ్మను శక్తిపీఠంగా వర్ణించారు.

కనక దుర్గమ్మ గుడికి ఎలా వెళ్ళాలి?

విజయవాడలో కృష్ణానది ప్రక్కన ఇంద్రకీలాద్రి అనే చిన్న కొండ మీద అమ్మవారి గుడి ఉంది. విజయవాడ బస్ స్టాండ్ మరియు రైల్వేస్టేషను నుండి కనక దుర్గమ్మగుడి వద్దకు వెళ్ళటానికి దేవస్థానం వారు ఉచిత బస్ సర్వీసులు నడుపుతున్నారు. కొండ మీదకు ఘాట్ రోడ్డు కలదు. ఆటోలు, టాక్సీలు కూడా కొండ మీదకు వెళ్తాయి. కొండ మీదకు వెళ్ళటానికి మెట్లమార్గం కూడా ఉంది.

దగ్గరలోని ఎయిర్ పోర్టు: గన్నవరం, విజయవాడకు 30 కి.మి దూరంలో ఉంది.

కనక దుర్గమ్మ గుడి:

అమ్మవారి గుడి కొండ మధ్యలో ఉంది. అమ్మవారి గుడి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. దుర్గాదేవి గుడి బంగారు శిఖరంతో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. గర్భగుడి ప్రవేశద్వారం పైన ఒక చక్కటి శ్లోకం వ్రాసి ఉంటుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ఇతర ప్రదేశాలు:

భవానీ మంటపం:

బస్ దిగిన వెంటనే మనకు ఎడమ వైపు భవానీ మంటపం కనిపిస్తుంది. అక్కడ చాముండా, మహాకాళి మొదలైన ఉగ్రమైన అమ్మవారి రూపాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. భవానీ మాల వేసుకున్న భక్తులు అక్కడ పూజలు చేస్తారు. ప్రతీరోజు అక్కడ ఉత్సవమూర్తులకు కుంకుమార్చన చేస్తారు. ఇదివరకు కాలంలో అక్కడ ఒక కోనేరు ఉండేది. దానిని దుర్గాకుండం అని పిలిచేవారు. బ్రహ్మాండపురాణంలో దాని మహత్మ్యం గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో దేవస్థానం వారు ఇప్పుడు ఒక బిల్డింగు కట్టేశారు.

అశ్వథ్థవృక్షం:

అమ్మవారికి ఎదురుగా ఒక అశ్వథ్థవృక్షం ఉంది. దాని క్రింద ఆంజనేయ స్వామి [గుడికి క్షేత్రపాలకుడు] విగ్రహం ఉంది.

మల్లేశ్వరస్వామి :    

మల్లేశ్వరస్వామి గుడి మెట్ల మార్గంలో నుండి వస్తుంటే మొదట కనిపిస్తుంది. విఘ్నేశ్వరుడు, నటరాజ స్వామి, శివకామ సుందరిల గుళ్ళు దుర్గాదేవి గుడికి మల్లేశ్వరస్వామి గుడికి మధ్యలో ఉన్నాయి. ఈ మూడు గుళ్ళు ఒకే వరసలో ఉంటాయి.

 

 

నాగేంద్ర స్వామి:

దుర్గాదేవి గుడి ప్రక్కన ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్నది. పెళ్ళైన స్త్రీలు సంతాన ప్రాప్తికోసం నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తారు.

లక్షకుంకుమార్చన స్థలం:

ఇది అమ్మవారి ధ్వజస్థభం దగ్గర ఉంది.

నిత్యపూజా స్థానం:

పూర్వకాలంలో ఈ  ప్రదేశంలో ఉన్న శ్రీచక్రం దగ్గర నిత్యపూజలు నిర్వహించేవారు. కాని ప్రస్తుతం రద్దీ పెరగటం వలన నిత్య పూజలను ప్రాకార మంటపం లోనికి మార్చారు.

కళ్యాణ మంటపం:

పూర్వం ఈ ప్రదేశంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించేవారు. ప్రస్తుతం భవానీ మంటపంలో దుర్గాదేవి కళ్యాణం చేస్తున్నారు.

శంకరాచార్య మంటపం:

ఇది మల్లేశ్వరస్వామి గుడి ప్రక్కన ఉంది. ఇందులో ఆదిశంకరాచార్య స్వామి విగ్రహం ఉంది.

చండీహోమ మందిరం:

ఇది ఆదిశంకరాచార్య మంటపం ప్రక్కన ఉంది. ఇందులో ప్రతీరోజు చండీ హోమం చేస్తారు.

ఇంకా కనక దుర్గ గుడి ప్రాంగణంలో నవగ్రహాలయం, శాంతి కళ్యాణ వేదిక, గోపీకృష్ణుని విగ్రహం, నిత్యాన్నదాన భవనం, అద్దాల మంటపం ఉన్నాయి.

స్థలపురాణం:

కనక దుర్గమ్మకు సంబంధించి మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఇంద్రకీలుని కథ, రెండోది అర్జుని కథ, మూడోది మాధవవర్మ కథ.

ఇంద్రకీలుని కథ:

ఇంద్రకీలుడు జగన్మాత భక్తుడు. అతను చిరకాలం భక్తితో అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి దర్శనం పొందాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన వద్దనే ఉండాలని వరం కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు తర్వాత జన్మలో నీవు కొండ రూపం ధరిస్తావని, ఆ కొండమీద తను మహాలక్ష్మి రూపంలో అవతరిస్తానని వరమిచ్చింది.

అర్జునుడు మరియు మల్లేశ్వరస్వామి:  

పాండవ మధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞ మీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి, పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు. అలా అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా బాణాలనుండి తప్పించుకొని పారిపోతుంది. ఎట్టకేలకు అర్జునుడు గురి చూసి దాని మీదకు బాణం వేసాడు. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అంతలో ఒక కోయదొర వచ్చి ఆ పందిని తీసుకొని వెళ్ళసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహరించాను కాబట్టి ఆ పంది నాది అని వాదించ సాగాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు అతనితో ఎవరు గొప్పో తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు.

అర్జునుడు ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా కూడా ఆ కోయరాజుని ఏమీ చేయలేక పోయాడు. తన దివ్యాస్త్రాలన్ని వృధాఅయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకొని ఆ కోయరాజు తలమీద కొట్టబోతాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై ఆ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షమై నవ్వుతూ కనిపిస్తాడు. పరమశివుని తో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు ఎంతో సిగ్గుపడి, బాధపడతాడు. తర్వాత శివుని స్తుతిస్తాడు. దానికి సంతసించిన శివుడు అర్జునికి పాశుపతాస్త్రం ఇచ్చి, దాన్ని అత్యవసర సందర్భాలలో, అరుదుగా మాత్రమే వాడాలి అని చెప్తాడు. తర్వాత శివుడు అర్జునికి నిగ్రహం సాధించమని చెప్పి అప్పుడు మాత్రమే అస్త్రాలు లోకకళ్యాణంకు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమవుతాడు. అర్జునికి వరాలిచ్చిన మల్లేశ్వరస్వామి శక్తి కనక దుర్గ . ఇంద్రుడి చేత కీలితం చేయబడ్డాడు కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి ఉన్న విజయనామం వల్ల యీ ప్రాంతానికి విజయపురి, విజయవాటిక, విజయవాడ, బెజవాడ, బెజ్జువాడ అని పేర్లు వచ్చాయని చెప్తారు.

మాధవవర్మ కథ:

పూర్వం విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను అతి జాగ్రత్తతో ప్రజలను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకొనేవాడు. అతను నిత్యం మల్లేశ్వరస్వామిని పూజ చేసేవాడు. ఒకానొక రోజు అతని కుమారుడు రధం మీద విజయవాడ పురవీధులలో తిరుగుతున్నాడు. కానీ అనుకోకుండా ఒక చిన్న పిల్లవాడు అతివేగంగా వెళ్తున్న ఆ రధచక్రాల క్రింద పడి మరణిస్తాడు. ఆ పిల్లవాడు ఆ రాజ్యంలో నివసిస్తున్న ఒక పేద బిచ్చగత్తె ఒక్కగానొక్క కుమారుడు. ఆమె వెళ్ళి మాధవవర్మకు అతని కుమారుని కారణంగా తన బిడ్డ చనిపోయాడు అని ఫిర్యాదు చేస్తుంది. మాధవవర్మ తన జీవితంలో ఎప్పుడూ తప్పుడు తీర్పులు చెప్పలేదు. అతనికి ప్రస్తుత పరిస్థితి పరీక్షలాగా మారింది. అతను వెంటనే భవిష్యత్తు రాజు అయిన తన కుమారుడికి మరణ శిక్ష వేసి అమలు పరిచాడు. అతని తీర్పుకి సంతసించిన దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. కాబట్టి ఆమెకు కనకదుర్గ అని పేరు వచ్చింది. మల్లేశ్వరస్వామి ఇద్దరి బిడ్డలకు తిరిగి బ్రతికిస్తాడు.

నవరాత్రి ఉత్సవాలు:

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

మొదటి రోజు

స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి

రెండవ రోజు

బాల త్రిపురసుందరి దేవి

మూడవ రోజు

గాయత్రి దేవి

నాలుగవ రోజు

అన్నపూర్ణా దేవి.

ఐదవ రోజు

లలితా త్రిపురసుందరి దేవి

ఆరవ రోజు

సరస్వతి దేవి

ఏడవ రోజు

దుర్గాదేవి

ఎనిమిదవ రోజు

మహాలక్ష్మిదేవి

తొమ్మిదవ రోజు

మహిషాసురమర్దినిదేవి

పదవ రోజు

రాజరాజేశ్వరిదేవి

ఈ ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మనక్షత్రంగా అనగా మూలా నక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థాన దర్శన వేళలు :

4:00 A.M – 6:30 P.M & 6:15 P.M – 10:00 P.M (ఉచిత దర్శనం).

ఎలా చేరుకోవాలి?

కొండ పైకి చేరుకోవటానికి దేవస్థానం బస్సులు ఉన్నాయి. సిటీ బస్సులు కూడా కొండ పైకి వెళుతుంటాయి.

విజయవాడ చేరుకోవడం ఎలా? విజయవాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరం :

హైదరాబాద్ – 283 km, బెంగళూరు- 512 km, గుంటూరు -40 km, వైజాగ్ – 347 km, రాజమండ్రి – 157 km, తిరుపతి – 413 km, శ్రీశైలం – 263 km, చెన్నై – 387 km.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.  అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.

త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణం లో ఉంది.

పరిసరాల్లోని ఉపాలయాలు: 

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.

దర్శన సమయాలు:

  • వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
  • ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
  • ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
  • మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.

రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టు పై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.

దేవస్థానంలో నిర్వహించే పూజలు:

ఇంద్రకీలాద్రి పై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.

అన్నప్రసాద వితరణ:

1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.

రవాణా సౌకర్యాలు: 

విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్‌ నెహ్రూ సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.

వసతి సౌకర్యం:

ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌ హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌ హౌస్‌ ల్లో కలిపి మొత్తం (ఏసీ&నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటు లో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరం లో పలు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

(తీర్ధయాత్రలు – క్షేత్రమహిమలు ఫేస్ బుక్ గ్రూపు వారి సౌజన్యంతో)

You May Also Like

2 thoughts on “బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయ విశిష్టత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!