చిరిగిననోటు

“వర్షపు చినుకులు మెల్లిగా నేలను తాకాడానికి గొడవ పడకుండా ఒకదాని వెనుక ఒకటి పద్దతిగా వచ్చేస్తూ, మట్టి రేణువులతో కలిసి ఆడుకుంటున్నాయి”. రోడ్డు పక్కన రమణయ్య మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఈ రోజు బోణి బేరం కూడా కాలేదు. నేను ఏమైనా డబ్బులు తీసుకెళ్తేనే ఇంట్లో వంట చేయాలి అనుకుంటూ వచ్చి పోయే బండ్లను చూస్తూ ఎవరైనా ఆగకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు.

రాయల్ ఎన్ ఫీల్డ్ బండిపై రాకీ స్టంట్లు చేస్తుంటే దాన్ని వాటర్ ప్రూఫ్ కెమెరాతో వీడియో తీసాక, సరిగ్గా రమణయ్య ఉన్న గుడిసె దగ్గరికి వచ్చారు విక్కీ మరియు రాకేష్ . ఒక రెండు కంకులు ఇవ్వు తాత అని చెప్పి, విక్కీ రాకీ కి తను తీసిన వీడియో చూపిస్తున్నాడు. అరేయ్ విక్కీ చాలా బాగా తీసావురా!”నేను ఏ వీడియో పెట్టినా సెన్సేషన్, ఇక వీడియో తో ఇంకా వ్యూస్ పెరుగుతాయి రా” అన్నాడు రాకీ. అరేయ్ నోట్లో సిగరేట్ ఉంటే ఇంకా బాగుండురా? అది ఎంత పని నా బ్యాగ్లో ఉన్నాయి అని సిగరెట్ బాక్స్ తీసి ఇంకా వెతుకున్నాడు.

ఏమైందిరా? ఏమిలేదురా,లైటర్ మర్చిపోయాను అని అతని చూపు మొక్కజొన్న పొత్తులు కాలుతున్న నిప్పు కణికలపై పడ్డాయి. నువ్వు వీడియో స్టార్ట్ చేయిరా ఇది ఇంకా వ్యూస్ వస్తాయి అని చెప్పి ముందుకు కదిలాడు. స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తూ రమణయ్య దగ్గరికి వెళ్లి ఒక మొక్కజొన్న కంకి తీసి ఒక చేతితో పట్టుకొని మరో చేతితో సిగరేట్ నోట్లో పెట్టుకొని మండుతున్న బొగ్గులతో వెలిగించాడు. రమణయ్య రాకీనే చూస్తూ కాల్చిన కంకులను ఇదిగో బాబు అని ఇచ్చాడు.

వెంటనే రాకీ కి సూపర్ ఐడియా వచ్చింది. వెంటనే పర్సు తీసి 2000 నోటు తీసిచ్చాడు. రమణయ్య కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. కానీ ఆత్మాభిమానం అడ్డు వచ్చి వద్దు బాబు 40 రూపాయిలు ఇవ్వండి చాలు అన్నాడు. తాత, నేను ప్రేమతో ఇస్తున్నాను తీసుకో అంటూ చేతిలో పెట్టాడు. అదే చేతులను రమణయ్య కళ్ళకు అద్దుకొని కన్నీరు కారుస్తున్నాడు.  ఇంకా మనుషులలో మంచితనం ఇంకిపోలేదయ్యా అని.

విక్కీ వీడియో ఆఫ్ చేసి , రాకీ రాగానే ఇద్దరు కలిసి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూపర్ రా రాకీ, ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది చూడు, నీ ఫాలోయింగ్ క్రేజ్ అలాంటిది అంటూ మొక్కజొన్న పొత్తులు తింటూ మాట్లాడుకుంటున్నారు. వర్షం కూడా తగ్గిపోవడంతో రమణయ్య ఎంతో ఆశగా ఈ రోజు కడుపునిండా భోజనం చేయొచ్చు అనుకుంటూ అన్ని సర్దుకొని తన ఇంటికి బయలుదేరాడు.

రాకీ అసలు నువ్వు సిగరేట్ వరకే వీడియో తీయమన్నావ్ కదరా! మనీ కాన్సెప్ట్ సూపర్ వచ్చిందిరా అంటూ నవ్వుతున్నాడు విక్కీ. “హహహ వీడియో కోసం లైక్స్ కోసం ఏ దారినైన వదిలిపెట్టను, అది చిరిగిననోటు ఎక్కడ చెల్లలేదు, ఇప్పటికి వీడియోకి అవసరం పడింది”. అలాగే ఆశ్చర్యంగా చూస్తూ, అదే పిల్లికి కూడా భిక్షం పెట్టవ్, అదే 2000 ఎలా ఇచ్చావనుకున్నారా! అన్నాడు విక్కీ

నీకు నాతో వీడియోలు చేసే ఉద్దేశ్యం లేదా? వేరే అతన్ని నా ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంటా అని బెదిరించినట్లు మాట్లాడాడు రాకీ. నాకెందుకు సామి ఇవన్నీ ఈ వీడియో మాత్రం సూపర్బ్ అని ఇద్దరు కూర్చొని అప్లోడ్ చేశారు. 5 నుంచి 10 నిమిషాలలోనే ఫుల్ వైరల్ అయిపోయింది. పెరుగుతున్న ఫాలోయింగ్ లైక్స్ చూసి మురిసిపోతున్నాడు రాకీ. షాపులో ఒక అబ్బాయి రాకీ న్యూ అప్డేట్ రాగానే వీడియో చూడటంలో మునిగిపోయి చూస్తున్నాడు. బాబు బాబు అంటూ.రమణయ్య పిలిచిన వినిపించుకోవట్లేదు.

మొత్తం చూసినువ్వు గ్రేట్ అన్న అని కామెంట్ పెట్టి చూసేసరికి ఎదురుగా రమణయ్య. అబ్బాయి మళ్ళీ వీడియో ఆన్ చేసి చూసి, వావ్ నువ్వు రాకీని కలిసావ, ఎంత అదృష్టం అని చాలా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రాకీ ఎవరు బాబు అనగానే ఓ తాత సెలబ్రిటీ అయిపోయావు చూడు అంటూ వీడియో చూపించాడు ఆ అబ్బాయి. చాలా సంతోషంగా నవ్వుతూ మురిసిపోతూ చూస్తున్నాడు రమణయ్య. చెప్పు తాత, ఏం కావాలి అనగానే రమణయ్య సరుకులు చెప్పాడు. అన్ని ఆ అబ్బాయి ఇచ్చాక 2000 రూపాయల నోటు ఇచ్చాడు రమణయ్య. ఆ అబ్బాయి చిరిగివున్న నోటుని అటు ఇటు తిప్పి చూస్తూ ఇదే ఇచ్చాడా అంటూ అడిగాడు. అవునయ్య అన్నాడు రమణయ్య. సరే అని సరుకులు ఇచ్చి పంపించాడు.

రమణయ్య సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టొచ్చు అనే సంతోషంతో. ఇలాంటి వాళ్లకు బుద్దిచెప్పాలని, సీసీ కెమెరా లో రికార్డ్ అయినా వీడియోని ఎడిట్ చేసి రాకీ వీడియో కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేసాడు ఆ అబ్బాయి. ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుంది, అతను ఇచ్చిన చిరిగిననోటు వల్ల తనకు తాను దిగజారేలా చేసుకున్నాడు. ఒక చిరిగిన నోటు ఆ అబ్బాయికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. రమణయ్య కి సంతోషాన్ని ఇచ్చింది. రాకీ ఇతరులను మోసం చేద్దాం అనుకున్నాడు కానీ తానే బొక్కబోర్లాపడ్డాడు.

“మన వల్ల మంచి జరగకున్నా పరవాలేదు కానీ ఇతరులను నమ్మించి మోసం మాత్రం చేయకూడదు”

జ్యోతిరాణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!