పాడవే కోయిలా

పట్టె మంచం, మెత్తని పరుపు, చల్లని గాలి నిస్తూ నిశబ్దంగా తిరిగే ఫ్యాన్,వెలుగులు విరజిమ్ముతున్న నియాన్ లైట్స్… ఏవీ ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఒక మూలన వున్న బల్ల పైన నాజూకైన గాజు కూజా లోని తాజా రోజా పువ్వులు సువాసనలు వెదజల్లుతూ వున్నాయి . కిటికీలకు వున్న సిల్కు తెరలు గాలికి మెల్లగా కదులుతూ వున్నాయి. అప్పటికే పైపైకి ఎగ బాకిన సుధాంశుడు కొబ్బరాకుల నడుమ నుండి దోబూచులాడుతూ కిటికీలోకి తొంగి చూస్తున్నాడు.

కొడుకూ, కోడలు కొసరి కొసరి వడ్డించినప్పటికి మితంగానే తిని తనకు కేటాయించిన గది లోకి అడుగు పెట్టింది జానకి. అంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఆ గదిలో నిద్రించింది. కానీ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఆ గది ఎంతో విశాలంగా వున్నా, ఆమెకు ఇరుకు గోడల మధ్య బంధింపబడినట్లుగా ఉంది. బల్ల పైన పొందికగా అమర్చిన పుస్తకాలని నిరాసక్తత తో తిరగేసి, మళ్లీ అక్కడే పెట్టేసింది. మరో వైపు వున్న అద్దాల బీరువాలో కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. బీరువా తెరిచింది జానకి. అందులో తను ఎంతో భద్రంగా దాచుకొనే అన్నమయ్య కీర్తనల పుస్తకం కూడా వుంది. కొడుకు శ్రద్ధకు రవ్వంత తృప్తి కలిగింది. అందులో ముత్యాల్లాంటి దస్తూరితో తాను రాసుకున్న అనేక కీర్తనలు ఉన్నాయి.

అప్రయత్నంగానే ఆమె గతంలోకి జారుకుంది. పల్లెటూర్లో తన ఇల్లు, ఇంటి చుట్టూ వున్న రకరకాల పచ్చని చెట్లూ, ముఖ్యంగా ఇంటి ముందున్న పెద్ద పెద్ద అరుగులు, వాటి మీద కూర్చుని తన భర్తతో కలిసి తాను ఆడుకొన్న ఆటలు, ముచ్చట్లు, పాడుకొన్న పాటలూ అన్నీ ఆమె స్మృతిపథంలోకి కదలాడసాగినవి.

జానకి నేపథ్య గాయని జానకి లాగే పాడుతుంది. ఆ ఊరి వేణు గోపాలుడి గుడిలో ప్రతీ నిత్యం ఆమె పాటతోనే భజన మొదలయ్యేది. ఊరిలో అందరికీ ఆమె అన్నా, ఆమె పాట అన్నా ఎంతో ఇష్టం. ఆమెకు అనుకోకుండా వచ్చిన కొండంత కష్టానికి ఆ ఊరిలో కంటతడి పెట్టని వారే లేరు. హైస్కూల్ హెడ్మాస్టర్ గా పదవీ విరమణ చేసిన ఆమె భర్త కోదండరామ్ ఇటీవలే అనాయాస మరణంతో తానెంతో ప్రేమించిన భార్యను, ఒక్కగానొక్క కొడుకును, కోడలిని వదిలి వెళ్ళాడు.

కొడుకు సూర్య ప్రకాష్, కోడలు సుశీల ఉద్యోగ రీత్యా నగరం లో వుంటున్నారు. మొదట్లో సూర్యకు వున్న ఊర్లోనే ఉద్యోగం వుండేది. నాలుగేళ్ల క్రితం వేరే ఊరికి బదిలీ అయింది. అంతకుముందు ఎప్పుడో కొన్న స్థలంలో మూడు బెడ్ రూమ్ లున్న ఇల్లు కట్టించి, సూర్యకు అద్దె ఇంట్లో వుండే బాధ లేకుండా చేసాడు కోదండరామ్. సుశీల నిజంగా సార్థక నామధేయురాలే. భర్తంటే ప్రేమానురాగాలతో పాటు, అత్త మామల పట్ల గౌరవం, అభిమానం ఆదరణ ఆమెకు వున్నాయి. అత్త గారింట్లో వున్నప్పుడు ఆమె ఎన్నో నేర్చుకుంది.

అత్త మామల అనురాగ దాంపత్యం ఆమెకు అబ్బురంగా తోచేది. తీరికవేళల్లో ఇంటి ఆవరణలో అరుగుల పైన కూర్చుని అత్త మామలు చదరంగం మొదలుకొని, అష్టా చెమ్మా వరకూ ఆడే ఆటలు, ముచ్చట్లు ఆమెకు వినోదం కలిగించేవి. అప్పుడప్పుడు తను కూడా వారి ఆటల్లో పాలు పంచుకొనేది. ఉదయం లేవగానే కోడలికి పనుల్లో సాయం చేస్తూనే, భర్త కోసం పూజా ఏర్పాట్లు కూడా చేసేది జానకి. రోజూ తులసికోటలో నీళ్ళు పోసి, ఏవో శ్లోకాలు పఠిస్తూ ప్రదక్షిణాలు తప్పకుండా చేసేది.

ప్రతీ రాత్రీ తమ గదిలో ఉన్న ఉయ్యాల బల్ల పైన ఒత్తిగిలి పడుకొని జానకి వైపే చూస్తూ, ఆమె పాడే”జో అచ్యుతానంద జోజో ముకుందా”అనే పాటను వింటూ నిద్ర లోకి జారుకునేవాడు కోదండరాం. తాంబూలం అందిస్తూ, మెల్లగా జోల పాట పాడి, భర్త నిద్ర పోగానే, ప్రక్కనే వున్న మరో మంచం పైన తాను కూడా నిద్రకొరిగేది జానకి. రోజూ అదే పాట వింటున్నా విసుగు పుట్టేదికాదు. నిశ్శబ్ద నిశీధిలో, మృదు మధుర స్వరంతో జానకి పాడే జోల పాట అంటే సూర్య, సుశీలలకు కూడా ప్రాణం. రోజూ జానకి , కోదండరామ్ లు వేణుగోపాలుడి గుడికి వెళ్ళేవారు. జానకి పాట తోనే భజన ఆరంభం అయ్యేది. మైక్ లో ఆమె పాటను వింటూ ఊరి జనం అంతా మైమరిచిపోయేవారు. ఒక గంటసేపు గుడిలో గడిపి ఇరువురూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చే వారు ఆ దంపతులు.

పచ్చని పసిమి చాయ గల జానకి కాసంత బొట్టు పెట్టుకొని, జుట్టు ముడిలో తప్పకుండా ఏదో ఒక పువ్వు పెట్టుకొని అపర లక్ష్మీ దేవిలా వుండేది. ఆ జంటను ఇష్టపడని వారే వుండరు. ఎంతసేపు అయినా భర్తకు తనే స్వయంగా వండి పెట్టడం జానకి కి ఇష్టం. ఆమె చేతివంట ఇష్టంగా తిని, ఆమె జోల పాట వింటూ పడుకోవడం కోదండరామ్ కు ఇష్టం. వారి అన్యోన్య దాంపత్యం చూసి సుశీల చాలా సంతోషించేది. రోజూ అత్తగారి మధురగానం వినడం ఆమెకు ఎంతో బాగుండేది.

సూర్యకు బదిలీ అయి, నగరంలో వున్న స్వంతింటికే వెళ్లే ముందు “అత్తయ్యా, మామయ్య ఎలాగూ రిటైర్ అయ్యారు కదా? మీరు కూడా అక్కడకే రండి”అని మరి మరి అడిగింది. కానీ జానకి సున్నితంగానే ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది. సిటీకి వెళ్ళినా, తరచుగా రాక పోకలు సాగిస్తూ, బంధాలను పదిలంగా కాపాడు కుంటున్న ఆ కుటుంబం పైన ఎవరి వక్రదృష్టి పడిందో, ఏ దేవుడికి కన్ను కుట్టిందో, రోజూ లాగే ఉదయం లేవగానే భర్తను నిద్ర లేపడానికి వచ్చిన జానకి అతని స్పర్శ చల్లగా తగిలేసరికి తృళ్ళిపడింది. అపనమ్మకంగా, అతని గుండె చప్పుడు వినేందుకు ప్రయత్నించింది. అది మూగబోయిందని గ్రహించగానే “ఏమండీ” అంటూ కేక పెట్టి విరుచుకుపడింది. పెరట్లో బట్టలు వుతుకుతున్న పనిమనిషి పరిగెత్తుకుని వచ్చి,”వామ్మో, ఏమైందమ్మా?”అని గొల్లుమంది.

నిమిషాల్లోనే విషయం ఊరంతా పాకింది. తిరుణాళ్ళకు వచ్చినట్లుగా జనం తరలివచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న సూర్య, సుశీలలు ఆగ మేఘాల మీద వచ్చేసారు. జానకి స్పృహలోకి రావడానికి చాలా సమయం పట్టింది. కొడుకు, కోడళ్లను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది జానకి. చెరో వైపు ఆమెను పట్టుకుని, కన్నీరు మున్నీరు అయ్యారు సూర్య ,సుశీల. అందరూ తమ స్వంత పని లాగే తలంచి , కోదండరామ్ అపర కార్యక్రమాలు చేయడం లో సూర్యకు తోడ్పడ్డారు. మౌనంగా ఉయ్యాల బల్ల ముందే కూర్చుని, రోజూ విలపించే అత్త గారిని చూస్తే గుండెలు పిండినట్లు బాధ కలిగేది సుశీలకు.

పదిహేను రోజుల తరువాత సూర్య తల్లి దగ్గిరకి వెళ్లి “అమ్మా! ఈ ఇల్లు అద్దెకు ఇచ్చేసి, నువ్వు కూడా మాతో వచ్చేయమ్మా” అన్నాడు. మౌనంగానే తల అడ్డంగా ఊపింది జానకి.”నెల రోజులు సెలవు తీసుకుని వచ్చారుగా?  ఇప్పుడు ఏం తొందర వచ్చింది?  తరువాత మాట్లాడ వచ్చు లెండి” అని సుశీల భర్త మాటకు అడ్డుకట్ట వేసింది. ఆమె కనుసైగ ను అర్థం చేసుకుని, ఆ ప్రస్తావనను వదిలేసాడు సూర్య. ఇప్పుడు జానకి పాడడం లేదు. గుడిలో కూడా మైకు వినిపించడం లేదు. జానకికే కాదు, కోదండ రామ్ మరణం ఊరికే గ్రహణం పట్టినట్లయింది.

అంతా భయంకర నిశబ్దంగా వుంది. ఎండిపోయి, నేలరాలడానికి సిద్ధంగా వున్న పూల తీగ లాగ వుంది జానకి. ఎంత చెప్పినా వినకుండా, కేవలం బ్రతకడం కోసమే ఏదో తిన్నాననిపిస్తూ, చిక్కి శల్యం అవసాగింది. ఆమెను అలాగే వదిలేస్తే, తను కూడా దక్కదేమో, అని సుశీలకు భయం కలిగింది.”అత్తయ్యా, మళ్లీ గొంతెత్తి పాడండి. మీరు ఇలాగ మూగనోము పడితే మేము భరించలేకపోతున్నాము” అని బ్రతిమాలినా జానకి లో ఏ స్పందనా లేదు. మౌనం వీడడం లేదు. సూర్య కూడా అమ్మను మామూలు మనిషిని చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు.

ఉన్నట్లుండి ఏదో పని చేసుకుంటున్న సుశీల దగ్గిరకి వచ్చి కూర్చుంది జానకి. తనకు తానుగా వచ్చిన అత్తగారి వైపు అభిమానంగా చూస్తూ, చేతిలో పని ఆపి”చెప్పండి అత్తయ్యా!”అన్నది సుశీల.”నీకో రహస్యం చెప్పనా అమ్మా?”గుస గుస చెపుతున్నట్లు మెల్లగా అన్నది జానకి. ఆశ్చర్యపోతూ “ఏమిటి అత్తయ్యా?”అని అడిగింది సుశీల. కొద్ది దూరంలోనే కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న సూర్య కూడా ఆశ్చర్యంతో, కుతూహలంగా వినసాగాడు.”రామ్ నేనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తెలుసా?” రహస్యం లాగే చెప్పింది జానకి. ఉలిక్కి పడింది సుశీల.”ఏమండీ!”అని మాత్రమే భర్తను సంబోధించే అత్త గారు ఇప్పుడిలా చెపుతుంటే విస్తుపోయింది. నోరు తెరుచుకొని వినసాగింది.

జానకి ఏదో ట్రాన్స్ లోకి వెళ్లినట్లు కళ్ళు మూసుకుని, మంద్ర స్వరం తో చెప్పసాగింది.”నేను డిగ్రీ చేసే రోజుల్లో రామ్ రోజూ బస్స్టాప్ లో కనిపించేవాడు. మొదట్లో నేను గమనించలేదు. చాలా రోజుల తర్వాత నేను గమనించాను. అందమైన నొక్కుల జుట్టుతో, చక్కని రూపం తో ఆకర్షణీయంగా వున్న రామ్ ను ఏ కన్నె పిల్లయినా ఇష్టపడగలదు. కొన్నాళ్ళు కేవలం చూపులతోనే మాట్లాడుకున్నాం. రామ్ అప్పుడు B.Ed ట్రైనింగ్ చేస్తున్నాడు. నేనింకా డిగ్రీ రెండో సంవత్సరంలోనే వున్నాను. ఒకరోజు తనే ముందుగా నన్ను పలుకరించాడు.”ఏం చదువుతున్నారు? ఏ కాలేజీలో చదువుకుంటున్నారు?” అంటూ.

అలా మొదలైన మా పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రణయంగా మారింది. నా డిగ్రీ పూర్తి అయింది. ఈ లోగా తన ట్రైనింగ్ పూర్తి అయి, జాబ్ కూడా వచ్చింది. అప్పుడు ధైర్యంగా మా అమ్మానాన్నల ముందుకు వచ్చి మొదట రామ్, తరువాత నేను మా ప్రేమ గురించి చెప్పాం. అందం, చదువూ, ఉద్యోగం ఇంకా సంస్కారం వున్న యువకుడు తనకు తానుగా వచ్చి”మీ అమ్మాయిని పెళ్ళాడుతాను” అంటే ఏ తల్లి తండ్రి కాదంటారు? మా అమ్మ నాన్న కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన రామ్ మా నాన్నను కన్న తండ్రి లాగే చూసేవాడు. మా అత్తగారు ఒక దేవత. నన్ను స్వంత బిడ్డ కన్నా మిన్నగా చూసుకునేది.

డిగ్రీ తరువాత రామ్ చెప్పినా నేను ఇంక చదవడం ఆపేసాను. సూర్య పుట్టడం మా జీవితం లో గొప్ప ఆనందాన్ని తెచ్చింది. వాడి ఆలనా పాలనలో నేను చదువుకున్నాను అనే విషయమే మరిచి పోయాను. కానీ చిన్నప్పటి నుండీ పాటల పైన వున్న మక్కువతో వాటిని మాత్రం వదిలేయలేదు. నా పాటలంటే మా అత్తగారికి ఎంతో ఇష్టం. రామ్ కు కూడా అంతే. మా అత్తగారు నా పాట వింటూనే కళ్ళుమూసారు. చివరికి రామ్ కూడా……”అంటూనే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. బిత్తర పోయి వింటున్న సూర్య, సుశీల చటుక్కున స్పృహ లోకి వచ్చారు.

సుశీల అత్తగారిని పొదివి పట్టుకొని “ప్లీజ్ అత్తయ్యా, ఏడవకండి.” అన్నది. తన తల్లిదండ్రుల్ని గురించిన నిజాలను అప్పుడే వింటున్న సూర్యకు అమిత అశ్చర్యంగా వుంది. అమ్మ డిగ్రీ పూర్తి చేసిన విషయం ఏ రోజూ చెప్పలేదు. తనకు బళ్ళో అర్థం కాని అన్ని సబ్జెక్ట్ లు దగ్గిర కూర్చోబెట్టుకొని, చక్కగా వివరించిన తల్లి రూపం కళ్ళముందు మెదిలింది. కొంచెం పెద్దయ్యాక ఆమె ఏదైనా చెప్పబోతే “నీకేం తెలీదులే అమ్మా” అని తనంటే , మెల్లగా నవ్వేది. కానీ తనకు తెలుసనీ, చెప్ప గలననీ అనలేదు. నాన్న కూడా ఎప్పుడూ చెప్పలేదే? ” అనుకొంటూ “అమ్మా! అన్నీ తెలిసిన నీకు మేం చెప్పేంతవాళ్ళం కాదు. ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్”అని మొదటి సారి గా ఇంగ్లీష్ లో అన్నాడు.

కొద్ది సేపు అక్కడ నిశబ్దం రాజ్యమేలింది. “అన్నీ చూసే, శుభ ముహూర్తంలోనే పెళ్ళి చేస్తారుకదా! పెళ్ళిళ్ళు స్వర్గం లోనే జరుగుతాయని అంటారు కదా? ఇలా విడదీయాలనుకున్నప్పుడు దేవుడు ఆ జంటలను ఎందుకు కలపాలసలు?” అని నిలదీస్తున్నట్లుగా అడిగింది జానకి. ఏం చెప్పాలో అర్థం కాలేదు సూర్య, సుశీలలకు.”నాతి చరామి”అని వాగ్దానం చేసి, కడదాకా కలిసి వుంటానని ఆశ పెట్టీ, ఈ జనారణ్యంలో నన్ను ఒంటరిని చేసి ఎలా వెళ్ళగలిగావ్ రామ్?” అని అశ్రుపూరిత నయనాలతో గొణుక్కుంటూ వున్న అత్త గారిని చూస్తే సుశీల మనసు జాలితో ద్రవించి పోయింది.

“అత్తయ్యా !మామయ్య ఎక్కడికీ పోలేదు. అచంచలమైన మీ ప్రేమలో, మీ మనసులో చిరంజీవిగా వున్నారు. మీరు ఇలాగ శుష్కించి పోతే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. మీరు ఎప్పటి లాగే వుండాలి. ముందులాగే మీ గళం విప్పాలి. గుడిలో భజనలు కూడా జరగడం లేదు. మీ పాట లేకుండా అన్నీ మూగబోయినవి. రేపన్నా గుడికి వెళ్ళి వద్దాం.”అన్నది. జానకి తల అడ్డంగా ఊపింది.”లేదమ్మా, నేను పాడ లేను. నా గొంతు మీ మామయ్య తోనే పోయింది” అన్నది మెల్లగా. సూర్య వచ్చి తల్లి చేయి పట్టుకుని”అలా అనకమ్మా. నిస్సందేహంగా మీది అమరప్రేమే. ఆదర్శదాంపత్యమే. కానీ విధి రాతను ఎవరు మార్చ గలరు? నువ్విలా వుంటే, ఏ లోకంలో వున్నా, నాన్నకు శాంతి వుండదు. నా కోసమైనా మళ్ళీ పాత జానకమ్మవు కావాలి. సుశీ, అమ్మకు స్టిక్కర్ పెట్టు”అన్నాడు.

జానకి ఏదో అనేంత లోనే సుశీల ఎర్రని, గుండ్రని స్టిక్కర్ ఆమె నుదుట పెట్టింది.”ఇదేంటి అమ్మా?” అని దానిని తీసేయ బోయింది జానకివెంటనే ఒక వైపు సూర్య మరో వైపు సుశీల ఆమె చేతులు పట్టుకొని ఆపేసారు. “అత్తయ్యా, హిందూ స్త్రీ కి పుట్టుకతోనే వచ్చిన అలంకారాలు బొట్టు ,కాటుక, పూలు. వివాహితకు అదనంగా వచ్చేవి తాళిబొట్టు, మెట్టెలు. దురదృష్టవశాత్తూ ఆ బంధం తెగిపోతే అవి మాత్రమే తీయాలి కదా? మీకు అవన్నీ వద్దు అనుకున్నా, కనీసం ఈ స్టిక్కర్ తో నైనా మాకు మీ రూపం నిండుగా కనిపించే అవకాశం కలిగించండి. దయచేసి అది తీయవద్దు” అని అభ్యర్థించింది సుశీల.జానకి తన ప్రయత్నం మానుకొంది. ప్రాణం వున్న రాతిబొమ్మ లాగా మారింది ఆమె.

ఎంత ప్రయత్నించినా ఆమెను మునుపటిలా మార్చలేకపోతున్నాము అని సుశీల, సూర్య బాధ పడుతున్నారు. సెలవులు అయిపోవడంతో “కొద్ది రోజుల కోసమైనా రమ్మని, ఎంతగానో చెప్పి ,ఒప్పించి ఆమెను సిటీ లో వున్న తమ ఇంటికి తీసుకొని వచ్చారు వాళ్ళు. అయితే జానకి లో మార్పు ఏమీ లేదు గోడకు ఉన్న భర్త ఫోటో వైపే చూస్తూ నిశబ్దంగా కూర్చుంటుంది. ఏదైనా పనిలో పడితేనైనా కొంచెం మార్పు వస్తుందేమో అని సుశీల ఏదో ఒక పని పురమాయించితే రోబో లాగా ఆ పని పూర్తి చేసి, మళ్లీ మౌనమనే గూటిలో దాగి పోతున్నది జానకి. ఆమె పరిస్థితి చూసి సుశీల చాలా బాధ పడుతూ. ఎలాగైనా తిరిగి అత్తగారు పాడితే బాగుండు అని అనుకునేది. సూర్య కూడా తల్లి పాట వినాలని తహ తహ లాడుతున్నాడు. రోజులు నిస్సారంగా, యాంత్రికంగా గడుస్తున్నాయి.

చనిపోయిన తండ్రి మైనపు బొమ్మను చేయించి పెళ్ళి ఫోటోలు దిగిన కూతుళ్ళ గురించిన వార్త పేపర్ లో చూసిన సుశీలకు మెరుపు లాంటి ఆలోచన కలిగింది. వెంటనే భర్తకు చెప్పింది.”నీకేమన్నా పిచ్చా ? నలుగురూ వింటే నవ్వుతారు. అయినా అది లక్షలతో కూడుకున్న పని.”అని అభ్యంతరం వ్యక్తం చేసాడు సూర్య. అయితే సుశీల ఊరుకో లేదు.”ఎవరెందుకు నవ్వుతారు? నవ్వేవాళ్ళు మనకేమైనా సాయం చేస్తారా? పదహారు ఏళ్ల పడుచు వాళ్ళదే ప్రేమా? వారి కథలే గొప్పవా? అత్తయ్యా మామయ్యల ప్రేమ మహోన్నతమైనది. మామయ్య సన్నిధి లో అత్తయ్య అన్ని రకాల ప్రేమను పొందారు. ఆయన లేని లోకం ఆమెకు శూన్యంగాతోస్తుంది. అందుకే ఆమె ఒక మరబొమ్మ లాగా మారి పోయారు.

ఆమెకు కొంచెం స్వాంతన కలిగించే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఊళ్ళో వున్న ఉయ్యాల బల్ల తెప్పిద్దాం. దాని పైన రోజూ మామయ్య పడుకొనే ఫోజు లోనే మైనపు బొమ్మ చేయించి, అత్తయ్య గదిలో పెట్టిద్దాం. ఇంక డబ్బులంటారా? ఇప్పుడు బంగారం ధర లక్షల్లోనే వుంది. ఊరికే లాకర్ లో పడి వున్న నా నగల్లో కొన్ని అమ్మినా చాలు. అయినా అవి పెళ్ళప్పుడు అత్తయ్య పెట్టినవే. అన్నీ బాగుంటే మళ్లీ చేయించుకోవచ్చు. నామాట వినండి. మూగబోయిన అత్తయ్య కోకిల గానం మళ్లీ వినే అదృష్టం రావొచ్చు కదా?”అని భర్తను ఒప్పించింది. ఆమె గొప్ప మనసుకు తనలో తనే పొంగిపోయాడు సూర్య.

జానకితో ఏమీ చెప్ప కుండానే వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫీస్ పని అని సూర్య తరచుగా ఏదో ఊరికి వెళ్ళడం గమనించినా జానకి పెద్దగా పట్టించుకోలేదు. ఒక నెల పైనే గడిచాక, ఒక రోజు జానకి నిద్ర లేవగానే ఆమె గదిలో ఉయ్యాల బల్ల మీద ఒత్తిగిలి పడుకొని తనవైపే చూస్తున్న భర్తను చూసి తుళ్లిపడింది. “నిజమా?”అని ఆశ్చర్యంగా తాకి చూసింది. తబ్బిబ్బు అవుతూ, కళ్ళు విప్పార్చుకుని చూడ సాగింది. ఆమెనే గమనిస్తూ, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి తృప్తిగా నిశ్వసించారు సూర్య ,సుశీలలు.

సంతోషంగా తల్లిని చుట్టేస్తూ”పాడవే కోయిలా! నాన్నను చూసి ఇకనైనా”అని రాగం తీసాడు సూర్య.”అత్తయ్యా, మీ పాటలు వినెందుకే మామయ్య మళ్లీ వచ్చారు. ఆయనను నిరాశ పరచకుండా మళ్లీ మీ గొంతు విప్పాలి. అది విని మేమూ తరించాలి.” అన్నది సుశీల. సంతోషంతో ఉక్కిరబిక్కిరైన జానకి రెండు చేతులతో కొడుకు కోడళ్లను దగ్గిరకి తీసుకొని ఆనందాశృవులను రాల్చింది. ఎన్నో నెలల తరువాత అత్త గారి గదిలో నుండి ఆ రాత్రి చిన్నగా , మధురంగా “జో అచ్యుతానంద జోజో ముకుందా”అని పాట విని ఎంతో సంతోషించింది సుశీల. సూర్య కూడా ఎంతో ఆనందిస్తూ”ఇది నీ వల్లే సాధ్యమైంది సుశీ”అని ఆప్యాయంగా ఆమెను సందిట బంధించాడు.

కొన్నాళ్ల తర్వాత సుశీల “అత్తయ్యా! ఇప్పుడు మామయ్య సజీవంగానే రాబోతున్నారు”అని సిగ్గు పడుతూ చెప్పింది. ఆ మాట విని ఉప్పొంగి పోయింది జానకి. సూర్య, సుశీలల కలల పంటగా భువి పైకి వచ్చిన చిన్నారి కోదండరామ్ జానకికి ఆరో ప్రాణం అయ్యాడు. ఆ పసివాడి కోసం ఆమె రోజూ జోల పాడుతున్నది.

చల్లా సరోజినీదేవి

You May Also Like

One thought on “పాడవే కోయిలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!