పరిమళ

న్యూ ఢిల్లీ, జనవరి 21,2021, పరిమళ మందిర్, రాత్రి 7 గంటలు, యూనియన్ మినిస్టర్ రాజేష్ ఇల్లు..

ఇది మేము ఎదురు చూసిన రోజు. ఇంకొన్ని గంటల్లో ఇన్నాళ్లు నేను రాజేష్ చేసిన మహా యజ్ఞం పూర్తి కావొస్తోంది, మా ఈ కథ మా ఈ యజ్ఞానికి ఎక్కడ అయితే పునాది పడిందో, అక్కడే ఇది పూర్తి చేసే సమయం వచ్చింది. మా ఇద్దరి లో ఓ రకమైన ఉద్వేగం నిండిపోయి ఉంది. ఈ రోజు కోసం మేము పడిన కష్టాలు ఏంటో మాకు మాత్రమే తెలుసు.

“Mr.చరణ్, మేము రేపు పొద్దున్నే బయలుదేరి పెద్దాపురం దగ్గర ఉన్న చిలకలపాడుకి చేరాలి. మా ఇద్దరి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి” చెప్పారు మా వారు PA కి. పెద్దాపురం పేరు వినగానే మా PA ముఖం లో ఏవగింపు కనిపించింది. ఢిల్లీ యూనియన్ మినిస్టర్ అయి ఉండీ, అందునా “మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్మెంట్” కి అధిపతి అయి ఉండి భార్య తో కలిసి ఢిల్లీ నించి పెద్దాపురం వెళ్తానంటాడు. ఏమిటి చీప్ గా అని చరణ్ ఉద్దేశం అయి ఉంటుంది. బహుశ అప్పటిదాకా మా వారి మీద ఉన్న గౌరవం కూడా ఒక పిసరు తగ్గి ఉంటుంది. కానీ క్షణం లో సర్దుకుని చెప్పిన పని మీద ఫోకస్ చేయసాగాడు. మరి నేను కూడా పెద్దాపురం చిలకలపాడులో వ్యభిచార కూపం నించి వచ్చిన పరిమళాన్ని అని ,  తెలిస్తే ఏమయిపోతాడో.

***

పెద్దాపురం అనగానే అందరికీ ఒకటే ఆలోచన. అదొక వ్యభిచార కూపం అని అక్కడి ఆడవాళ్ళంతా వ్యభిచారులేనని. కానీ ఇప్పుడు పెద్దాపురం బాగా మారిపోయింది. వ్యభిచారం చేసేవాళ్ళు, సినిమాల్లోకెళ్లేవాళ్ళు అక్కడ కూడా తగ్గారు. అమ్మాయిలు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకొని విదేశాలు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిలకలపాడులోని రాజేంద్ర భూపతి తోట మాత్రం ఇంకా 150 సంవత్సరాల క్రితం సంప్రదాయాలు ఆచారాలు వీడలేదు. అక్కడి ఆడవారంటే దేవదాసీలు, అక్కడి ఆడవారంటే వ్యభిచారులు, అక్కడి ఆడవారంటే బానిసలు, అక్కడి ఆడవారు…కాలిన పూలు. ఆ పూలగాయాలు మాన్పి తిరిగి చిగురింపజేయడానికే నా ఈ ప్రయాణం. 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రయాణం.

***

అది 1994:

అప్పటికే జమిందార్ రాజేంద్ర భూపతి వంశీయులు “కళాపోషణ” పేరుతో 30 ఏళ్లుగా కనిపించిన ప్రతీ కన్నెపిల్లని తన మామిడితోట లోని బంగ్లాలో పడేసేవారు. పాతికెకరాల ఆ తోటలో , రంగురంగుల అద్దాల మేడల్లో పంజరంలో చిలకల్లా బంధించబడ్డ ఆ ఆడపిల్లల అరుపులు ఏడుపులు కూడా ఎవరికీ వినబడనంత ఏకాంతం .. భయంకరమయిన ఏకాంతం అలముకున్న తోట అది. అక్కడ బంధింపబడ్డ ఆడవారికి ఎన్నటికీ విముక్తి లేదు. పైగా రోజురోజుకీ కన్నెపిల్లల సంఖ్య పెరిగేదే కానీ తరిగేది కాదు. ఆకలివేసినా దాహం వేసినా పట్టించుకునే దిక్కులేదు, ఏ వేళలో ఎవడు వచ్చినా వాడి కోరిక తీర్చవలసిందేనని రాజా వారి ఆజ్ఞ.

మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకునే నాథుడేలేడు. ఆరోగ్యాలు పాడయితే వైద్యం చేయించకపోగా అతి కిరాతకంగా తీసుకెళ్లి ఊరవతల లోయలో పడేసే వారు, పాపం ఎవరిని ఏ రాబందులు పీక్కుతిన్నాయో దేవుడికే ఎరుక. కాపలాగా ఉండే పదిమంది వస్తాదులే వాళ్ళకి భోజనాది ఏర్పాట్లు చూసేవాళ్ళు. అటువంటి మృగ పురుషుల ముళ్ల చెరసాలలో చిక్కుకున్నాను నేను. అప్పుడు నా వయసు 18. శ్రీరామ మెడికల్ కాలేజీ లో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నాను. కాలేజీ నించి ఇంటికి వస్తుంటే రాజేంద్ర భూపతి కంట్లో పడ్డాను. అందరిలోకీ ప్రత్యేకంగా ఉండేదాన్ని. జాంపండు రంగులో 5.6 ఎత్తుతో , అసలు పల్లెటూరి పోకడలు లేకండా మోడరన్ చుడీదార్ లలో ఉండేదాన్ని. అలా మిగతా అమ్మాయిలకన్నా ఎత్తుగా తెల్లగా ఆకర్షణీయంగా ఉండటమే నా దౌర్భాగ్యం.

వారం రోజులపాటు నా వివరాలు కుటుంబ వివరాలు సేకరించి దిక్కూమొక్కూ లేని ఒక క్లర్క్ కుటుంబం అని తెలిసి చెలరేగిపోయాడు భూపతి. నేను కాలేజీ నించి వస్తుండగా దారి కాసి కిడ్నాప్ చేసి తోటలో బంధించాడు. అయితే ఒక బంపర్ ఆఫర్ మాత్రం ఇచ్చాడు. “ ఈ తోటకి మహారాణి నువ్వే, ఇక్కడున్న పాతికమంది చిలకలకి మహారాణి నువ్వే, నువ్వు ఏమి చెప్తే అది వాళ్ళు పాటించాలి లేదని తోక ఝాడించారో వాళ్ళ తలలు నరికేస్తా. నీకు వీళ్ళతో పాటు కాకుండా పక్కనే మంచి అందమయిన బంగ్లా కట్టిస్తా. నిన్ను నేను తప్ప ఎవడూ తాకకండా ఆజ్ఞలు జారీచేస్తా! ఇక్కడున్న పదిమంది వస్తాదులు కూడా నీ ఆజ్ఞ మీరకుండ తొత్తులుగా పడి ఉంటారు. నీకు కావలసినన్ని పట్టుచీరలు నగలు పెట్టిస్తా, నీకు కావలసిన భోజనం ముప్పూటలా ఏర్పాటు చేస్తా.కానీ. కానీ..నువ్వు శాశ్వతంగా నాదానివి కావాలి. నాకే సొంతం కావాలి”

ఇది వాడు నాకు ఇచ్చిన ఆఫర్. కానీ వాడికి తెలియని విషయం ఒకటుంది. నేను అప్పటికే మా బావ అయిన రాజేష్ ని ప్రేమించాను అని అతడు కాబోయే IAS ఆఫీసర్ అని, ఢిల్లీ లో ట్రైనింగ్ లో ఉన్నాడు అని. ఎట్టి పరీస్థితుల్లోనూ మా పెళ్లి జరిగి తీరుతుంది అని మనసులో అగ్నిపర్వతం లాంటి ఆలోచనతో వాడు చెప్పిన అన్ని షరతులకు మహదానందంగా ఒప్పుకున్నట్టే నటించాను. పెదాల మీద విషం పూసిన చిరునవ్వు పులుముకున్నాను, కానీ పెద్ద ప్రణాళికే రచించాను. నా ప్రేమ సంగతి దాచి, రాజావారికి అన్ని విషయాలలోనూ అనుకూలంగా ఉన్నట్టే నటించాను. నా ప్రణాళిక అమలు పరచే సమయం కోసంఎదురుచూస్తున్నాను. కొన్ని రోజుల తరువాత రాజావారు రాజకీయాల్లోకి వస్తున్నారని MLA గా టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అని తెలిసింది. ఇదంతా నా చలవే అని నాకు నిలువెత్తు బంగారం చేయించారు వెర్రి రాజా వారు పైగా ఇంకా ఏం కావాలో కోరుకో అన్నాడు..

”బావ బావ నువ్వు రాజకీయాల్లో తిరిగితే నీతో మాట్లాడకుండా నేను ఉండలేను బావ ఒక టెలిఫోన్ పెట్టించు బావ” అన్నాను నేను వగలుపోతూ. ఆ బావ అనే పదం వాడటంతో మత్తెక్కిపోయాడు వాడు. వారం రోజుల్లో ఇంట్లో టెలిఫోన్ పెట్టించాడు. అయితే దానికి తాళం ఉండేది నేను తప్ప ఎవరూ వాడటానికి వీలు లేదు అని ఆజ్ఞ జారీ చేసాడు. వాడు ప్రచారానికి వెళ్లినప్పుడల్లా నేను రాజేష్ కి ఫోన్ చేసి ‘బావ బావ ‘ అంటూ మాట్లాడుతుంటే వస్తాదులు రాజా వారితోనే మాట్లాడుతున్నాను అనుకునేవారు. కానీ IAS  ట్రైనింగ్ అవుతున్న రాజేష్ తో మాట్లాడి సమాచారం తెలుసుకునేదాన్ని.

ఆరు నెలలు అక్కడ చెరసాలని చిరునవ్వుతో భరించాను. సమయం కోసం చూడసాగాను. మా బావకి IAS ట్రైనింగ్ పూర్తి అయి హర్యానాకి 1స్ట్ పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని వారాలకి భూపతిరాజా కూడా MLA  గా గెలిచి హైదరాబాద్ లో శాసనసభకి వెళ్ళవలసి వచ్చింది. “ బావ నీతో పాటు హైదరాబాద్ వచ్చి ఊరు చూస్తా బావ”అని మళ్ళీ వగలుపోయాను. అంతే ఠక్కున ఒప్పుకున్నాడు. మర్నాడు మందీ మార్బలంతో పాటు “రాజు వెడలే రవితేజములలరగ” అన్నట్టు బయలుదేరాము. అదే వాడు చేసిన పొరపాటు.

హైద్రాబాద్ చేరగానే వాడు, వాడి రౌడీలు దిగిన హోటల్ లో అప్పటికే రాజేష్ ఉన్నాడు. అయితే రాజేష్ ఎవరో వీళ్ళకి తెలియదు. హోటల్ లో రూమ్ లో దిగాక ఈ రాక్షసులు రాజాతో కలిసి పీకలదాకా తాగి పడిపోయారు, అందులో రాజేష్ ఇచ్చిన మత్తు పొడి కలిపింది నేనే అని తెలియక ఎన్ని పెగ్గులు పోస్తే అన్నీ తాగేశారు. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నేను హోటల్ నించి నెమ్మదిగా బయట పడ్డాను. అప్పటికే నాకోసం బయట ఎదురుచూస్తున్నాడు రాజేష్. అతనితో కలిసి బేగంపేట విమానాశ్రయం చేరాను. ఫ్లైట్ ఎక్కి శాశ్వతంగా ఆ నరకాసురుడి చెర నించి తప్పించుకున్నాను.

***

రాజేష్ నేనూ ఢిల్లీ లో దిగిన తరువాత దుర్గ గుడిలో పెళ్లి చేసుకుని హర్యానా చేరాము. కొత్త కాపురం మోజు లో పడకండా మా ప్రణాళిక. దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఆ ప్రణాళిక పేరు సంహారం. ఏం సంహారం ఎవరి సంహారం అనేది మాత్రం సమయం వచ్చినప్పుడే చెప్తాను.కాదు చేసి చూపిస్తాను.

మా ఆయన IAS అవడం వల్ల తరచూ ట్రాన్స్ఫర్ లు ఉండేవి అలా 1994 నుంచీ నార్త్ఇండియా అంతా తిరగవలసి వచ్చింది. దానివల్ల చాలా విషయాలు తెలిసి వచ్చాయి నాకు. ఇప్పుడు నా ప్రణాళిక మరింత పెద్దది అయింది. క్రమంగా నా వేషభాషలు మారిపోయాయి. అచ్చం బొంబాయి మోడల్ లాగా తయారయ్యాను. ఇప్పుడు మా పెద్దాపురం వాళ్ళు ఎవరు నన్ను చూసినా పోల్చుకోలేరు. కానీ అది కాదు నాకు ముఖ్యం. ఇన్ని రాష్ట్రాలు తిరగడం వల్ల రాజవారి తోటలో చిలకల్లాగా దేశవ్యాప్తంగా ఎంతమంది మగ్గిపోతూ ఉన్నారో తెలిసి వచ్చింది.

దీనికోసం బాగా తిరిగి విషయ సేకరణ చేసేదాన్ని చాలా ఏళ్ళపాటు.. ఒక్కో నిజం తెలిసే కొద్దీ గుండె బద్దలయిపోతున్న అంత బాధగా ఉండేది, ఆవేశం ఉప్పొంగేది.అయితే ఆవేశంతో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు ఎత్తులకి పై ఎత్తులు వేయాలి. ఈ వ్యభిచారం అనే సమస్య ని కూకటివేళ్ళతో సహా పెకిలించి వేయాలి. అందుకే నేను రాజేష్ ఆలోచించాం.ఈ సమస్య ఒక్క చిలకలపాడులోనే కాదు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఉంది. దీనికి పరిష్కారం కావాలంటే పదవి చేతిలో ఉండాలి అనిపించింది నాకు. అందుకే రాజేష్ ని క్రమంగా రాజకీలయాలవైపు ప్రేరేపించాను. IAS గా పదేళ్లు సర్వీస్ చేసిన రాజేష్ రాజకీయాల్లోకి రావడానికి అదును కోసం చూడసాగాడు. అలాంటి అదును ఒకనాడు దొరికింది.

2004 నవంబర్ :

ఒకనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి తన ఇంట్లో ఇచ్చిన విందులో పాల్గొనటానికి వెళ్లిన రాజేష్ కి అద్భుతమయిన అవకాశం దొరికింది. ఎవరో ముఖ్యమంత్రి మీద తుపాకులతో హత్యా ప్రయత్నానికి ఒడిగట్టారు. రాజేష్ చాకచక్యంగా ముఖ్యమంత్రిని రక్షించి స్టోర్ రూమ్ లో దాచి దుండగులు ఇద్దరినీ కాల్చి చంపేశాడు. అయితే ఎవరికీ తెలియని రహస్యం ఏమిటి అంటే ముఖ్యమంత్రి మీదకి నక్సల్స్ ఉసిగొల్పింది రాజేష్ ఏ. పోలీస్ ఇన్ఫార్మర్ లుగా నటిస్తూ తమ నక్సల్స్ కి ప్రభుత్వ సమాచారం అందిస్తున్న నక్సల్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వణికి పోతున్న ఆ నక్సల్స్ కి ఆఫర్ ఇచ్చాడు..

“మీకు శిక్ష పడకండా ఉండాలన్నా మీ నక్సల్స్ కి మా ఆయుధాలు అక్రమంగా కావాలన్నా ముఖ్యంగా మీరు ఎన్ కౌంటర్ అవకండా ఉండాలన్నా నేను చెప్పినట్టు చేయండి. లేదా ఎంకౌంటర్ చేయించేస్తా ఈ రోజే…మీరు చేయాల్సింది ఏమిటంటే .. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ని హత్య చేయండి”. ఆఫర్ ఇస్తున్నాడో బెదిరిస్తున్నాడో ఆ నక్సల్స్ తేల్చుకోలేకపోయారు. కానీ ఒకటిమాత్రం ఖాయం. ఈ సాయం చేసినా చేయకపోయినా ప్రాణం మాత్రం పోతుంది అని. ప్రాణం పోయేలోగా ముఖ్యమంత్రిని చంపేస్తే మేము చచ్చినా మా నక్షల్స్ కి బలం పెరుగుతుంది అని భావించారు. కానీ రాజేష్ మొత్తం సీన్ మార్చేశాడు.

అప్పట్లో ఢిల్లీ ముఖ్య మంత్రి రతన్ అహ్లూవాలియా మీద జరిగిన ఈ హత్యా ప్రయత్నం గురించిన వార్త దేశం అంతా సంచలనం అయింది. రాజేష్ ఫోటోలు టీవీ లో పేపర్ లో తరచు రాసాగాయి. ఒక ఆరునెలలు ఇదే హడావిడి దేశం అంతా. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న రాజేష్ రాజకీయ తెరంగేట్రం చేయడానికి సంకల్పించాడు. ముఖ్యమంత్రి కూడా తన ప్రాణదాతకు శాలువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించి MLA టికెట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి అండదండలతో క్రమక్రమంగా ఎదిగి యూనియన్ మినిష్టర్ అయ్యాడు రాజేష్.

అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో స్త్రీ-శిశు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రపంచానికి తెలియని నిజం ఒకటుంది. యూనియన్ మినిస్టర్ అయినప్పటినించీ ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం దేశవ్యాప్తంగా పదివేల మంది సుశిక్షితులయిన మహిళలతో ఒక అండర్ కవర్ ఆపరేషన్ కి సంసిద్ధుడు అవుతున్నాడు రాజేష్. ఆ అండర్ కవర్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా అమలు అయ్యేది రేపే. దానికోసమే నేను రాజేష్ రేపు చిలకలపాడు బయలుదేరుతున్నాము. అందుకే మేమిద్దరం అంత ఉద్వేగంగా ఉన్నాము. 27 సుదీర్ఘ సంవత్సరాలుగా లోలోపలే ఉడుకుతున్న అగ్నిపర్వతం అర్థరాత్రి బద్దలు కాబోతోంది.

***

జనవరి 22 , 2021, చిలకలపాడు, రాత్రి 11 గంటలు, రాజావారితోట.

ప్రశాంతంగా ఊరంతా నిద్రపోతున్న వేళ. ఆ తోటలో చిలకలని మాత్రం బ్రతకనివ్వకండా గుడ్లగూబలు హింసించడానికి పూనుకొనే సమయం. MLA భూపతి రాజా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న కొత్త చిలకకి రెక్కలు కత్తిరించబోతుండగా. ఆ పిల్ల గావుకేకలని డామినేట్ చేస్తూ రయ్ రయ్ రయ్ మంటూ వచ్చాయి రెండు పోలీస్ వ్యాన్ లు. అందులో ఇద్దరు IPSఅధికారులు, 20 మంది మహిళా పోలీసులు, 4 అంబులెన్స్ లు, 20 టీవీ చాన్నేళ్ళు కెమెరామెన్, మహిళా రిపోర్టర్లు. అందరూ కలిసి దాదాపు వందమంది తలుపులు బద్దలు కొట్టుకుని గేట్లు బద్దలు కొట్టుకొని వాహనాలతో సహా లోపలకి వచ్చేసారు. అడ్డగించబోయారు వస్తాదులు. పోలీసులు అక్కడి వస్తాదుల మోకాళ్ళ మీద కాల్పులు జరిపి చేతులు వెనక్కి విరిచి సంకెళ్ళేసి వ్యాన్ లో పడేస్తున్నారు.

మీడియా వారు అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లోపల భూపతి రాజా ఈ హడావుడికి కలవరపడిపోయాడు. అతడి చెరలో ఉన్న అమ్మాయిలు కూడా భయపడిపోయారు ఏమయిందో అర్థం కాక అందరూ అయోమయంగా ఉన్నారు. తతంగమంతా నేనూ రాజేష్ కార్ లో కూర్చునే మౌనం గా చూస్తున్నాం. అర్థ నగ్నంగా ఉన్న MLA భూపతి రాజా గదిలోకి బిలబిలమంటూ ఆ వంద మందీ తన్నుకు వచ్చేసారు. వాడి మీద కెమెరాలన్నీ ఫోకస్ అయ్యాయి. వ్యభిచార ముఠా నడుపుతున్న భూపతి రాజా అరెస్ట్ అయ్యాడు. అమ్మాయిలందరినీ అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించారు. ఇదంతా అన్ని ఛానెల్స్ లైవ్ టెలీ కాస్ట్ చేస్తున్నాయి.

***

అన్ని టీవీ ఛానల్స్ లో, సోషల్ మీడియాలలో, యూట్యూబ్ ఛానెల్స్ లో దినపత్రికల్లో ఒకటే వార్త దావానలం లాగా వ్యాపించింది. “20 సంవత్సరాల పక్కా ప్రణాళికతో, సమకూర్చుకున్న పక్కా సమాచారంతో, సుశిక్షితులయిన మహిళా పోలీస్, డాక్టర్, మీడియా సహకారం తో, యూనియన్ మినిస్టర్ రాజేష్ జరిపించిన సోదాలలో, దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన రైడ్ లలో దేశం దిగ్భ్రాంతికి గురయ్యే నిజాలు లైవ్ లో వెలుగుచూశాయి. 16 నించి 36 సంవత్సరాల స్త్రీలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న బడా బాబులందరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీళ్ళలో రాజకీయనాయకులు, సినిమా దిగ్గజాలు, స్పోర్ట్స్ మెన్, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ లు వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వీరికి సత్వరంగా ఏక కాలం లో ఉరిశిక్ష అమలు జరపాలని భారతీయులంతా ముక్త కంఠం తో కోరుకుంటున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మృగాళ్లందరికీ ఏకకాలంలో ఉరిశిక్ష పడితే అది ప్రపంచ చరిత్ర లోనే అరుదైన ధర్మవిజయం గా నిలిచిపోతుంది.

ఈ రైడ్స్ గురించి ఇప్పటికే అసెంబ్లీ లలో పార్లమెంట్ లో గగ్గోలు మొదలయింది. ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగక, చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆశిద్దాం.ఈ మ్యాటర్ గురించి యూనియన్ మినిస్టర్ రాజేష్ ఏమంటారో చూద్దాం”

“భారతీయులందరికీ నమస్కారం. భారతదేశం లోని కలుషితాలు అన్నింటినీ ఊడ్చేసి పరిశుభ్రమయిన భారతదేశాన్ని భావితరాలకు అందించటం కోసమే ఎన్నో స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఇన్ని ఏళ్ళూ అమలు చేశాం. అందులో భాగంగానే ఇవాళ పక్కా సమాచారం తో దేశవ్యాప్తంగా రైడింగ్ లు నిర్వహించి 13 లక్షల 27వేల 862 మంది మహిళలకి వ్యభిచార కూపం నించి శాశ్వత విముక్తి కలిగించాం. స్త్రీలు శిశువు లు స్వేచ్ఛగా ఎదిగిననాడే దేశం అభివృద్ధి చెందినట్టు అని మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే మృగాళ్ల చెర నించి విముక్తి పొందిన బాలికలకూ, స్త్రీలకూ ఉన్నతమైన గౌరవ ప్రదమైన జీవితం అందించాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత వైద్యం అందించాలి అని నిర్ణయించాం . అంతే కాదు పట్టుబడ్డ దోషులందరి ఆస్తులు స్వాధీనం చేసుకుని వాళ్ళ వ్యభిచార గృహాలని కూడా స్వాధీనం చేసుకుని ఆ బంగ్లా లను నేల మట్టం చేస్తాం. వారి ఆస్తులతోనే ..ఆయా స్థలాలలో ఈ మహిళల కోసం ఒక పాఠశాల, కళాశాల,వైద్యశాల, లైబ్రరీ, చిల్డ్రన్స్ పార్క్, ఇత్యాది ప్రాథమిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అని వాగ్దానం చేస్తున్నాము.”

రాజేష్ చెప్పటం ముగించగానే , ఇంట్లో టీవీ లో ఆ వార్త చూస్తున్న పరిమళ. లేచి నిలబడి ఆనందం తో కళ్లనీళ్ళతో, ఆగకండ చప్పట్లు కొట్టసాగింది. ఇంట్లో పనివారు కూడా ఆమె ఆనందాన్ని అర్థం చేసుకున్నట్టు చప్పట్లు కొట్టటసాగారు. 27 సంవత్సరాల సుదీర్ఘమయిన నిరీక్షణ ఫలించిన రోజు అది. పరిమళకి ఆనందబాష్పాలు ఆగడంలేదు. రాజేష్ మీద ఆమెకి చిన్నప్పటినించీ ఉన్న నమ్మకం ఏనాడు వమ్ము కాకపోగా అనుకున్నదానికన్నా ఎక్కువ అద్భుతాలు చేసి చూపిస్తాడు. “ఇటువంటి వాడి చేతుల్లో నా దేశం ఉన్నంత కాలం నాకు నా స్త్రీ జాతికి ఏ భయమూ లేదు” గర్వంగా అనుకుంది పరిమళ.

ఇంటర్వ్యూ ముగించి ఇంటికి వస్తూ

“పరిమళ లాంటి కరణేషు మంత్రి , భార్య గా దొరికితే ఏ నాయకుడయినా దేశాన్ని తప్పకండా ఆభివృద్ధి చేస్తాడు” గర్వం గా అనుకున్నాడు రాజేష్.

మాధురి ఇంగువ

You May Also Like

5 thoughts on “పరిమళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!