యత్ర నార్యంతు పూజ్యంతే

హోరున వర్షం కురిసి, అప్పుడే తగ్గుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రాత్రి డ్యూటీ వాళ్ళు వస్తే, తాము వెళ్లిపోవచ్చు అన్నట్టు, అసహనంతో ఎదురుచూస్తున్నారు, ఆ పోలీస్ థానా లోని పోలీసులు. అంతలో, తడిచిన బట్టలతో, చేతికి గాయం అయ్యి, రక్తం మరకలతో, లోపలికి అడుగు పెట్టింది ఒక యువతి. లోపలికి ప్రవేశిస్తూనే అలిసిపోయినట్టు, పక్కనే కూలబడింది. మొహంలో రక్తపు చుక్క లేనట్టు, నిర్వీర్యంగా అచేతనంగా ఉన్న ఆ యువతి దగ్గరికి, ఆ స్టేషన్ ఎస్.ఐ గారి కనుసైగతో, ఒక మహిళా కానిస్టేబుల్ వెళ్ళింది. దగ్గరగా వెళ్లి, భుజం మీద మెల్లిగా తట్టింది. వెంటనే ఆ యువతి ఉలిక్కిపడి, భయంతో వణికిపోతూ,

“వద్దు… వద్దు… నన్ను ఏమీ చేయొద్దు…” అంటూ అరిచింది. ఊహించని ఆ పరిణామానికి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కోలుకుని, ఆ కానిస్టేబుల్…

“ఏం భయం లేదమ్మా… మేము అందరం ఉన్నాం కదా… భయపడకు…”

“నీ పేరు ఏంటి… మీ ఇల్లు ఎక్కడ” అని అడిగింది…

ఒక్కసారిగా నిశ్శబ్దం… ఆ యువతి శూన్యం లోకి చూస్తూ ఉండిపోయింది. అంతలో ఎవరో, ఒక టవల్ లాంటిది తెచ్చి ఆ యువతికి ఇచ్చారు. “ముందు ఒళ్లు తుడుచుకోమ్మ… వేడిగా కొంచెం టీ తాగుదువు…” అంది ఆ మహిళ. కొద్దిసేపు, ఆ యువతిని సామాన్య స్థితికి రావడానికి సమయం ఇచ్చి, ఒక మహిళా ఇన్స్పెక్టర్ని పిలిపించి, అసలు ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు సిబ్బంది…

“నా పేరు అవని. నా వయసు ఇరవై రెండు. మా నాన్నగారు, మా గ్రామంలో చిన్న కిరాణా కొట్టు వ్యాపారం చేస్తూ, కష్టం మీద మా కుటుంబాన్ని నడిపించేవాడు. మా అమ్మ , నాన్న సంపాదనతో ఇల్లు గడిపే ప్రయత్నంలోనే ప్రతి రోజూ గడిపేది. నా తర్వాత ఏడు సంవత్సరాలకు పుట్టాడు తమ్ముడు. వాడిని చూసుకుంటూ, బడికి వెళ్ళి వస్తూ, నేను సంతోషంగా బ్రతికేదాన్ని. అలాంటిది, నా ప్రస్తుత పరిస్థితికి మూలం, నా ఎనిమిదేళ్ళ వయసులోనే పడింది.

తమ్ముడి మొదటి పుట్టిన రోజు అని, అమ్మ, మా వీధిలోని వాళ్లనందరినీ కేక్ కటింగ్ కి పిలిచింది. భోజనం పెట్టే స్థోమత లేకపోయినా, స్వీట్, ఖారా ఇచ్చి, కేక్ ఇచ్చి పంపించాలని ఆలోచన. ఎంతో సంతోషంగా అందరికీ ప్లేట్లు అందించి సంబరంగా నిలుచున్న నన్ను, పక్కింటి వెంకట్ మామయ్య పిలిచాడు.

‘ఏంటి మామయ్య…?’ నవ్వుతూ వెళ్ళాను.

‘ఏం లేదు అవని… ఒకసారి ఇలా రా.’ అన్నాడు, కిందికి పైకి చూస్తూ… ఆ చూపులకు, కొంచం భయంగానే దగ్గరికి వెళ్ళాను. వెంటనే నన్ను ఎత్తి, తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.

‘ఎంత పెద్దగా అయిపోయావు… ముద్దుగా ఉన్నావు…’ అంటూ, తన చేతులతో నా శరీరం అంతా తడుముతున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

‘వదులు మామయ్య… అమ్మ దగ్గరికి వెళ్ళాలి…’అన్నా, విడిపించుకునే ప్రయత్నం చేస్తూ…

‘అరే…. అంత తొందరేం ఉంది… కాసేపు ఉండు… మామయ్య దగ్గర భయం ఏంటి.!?’ అంటూ అలాగే పట్టుకున్నాడు.

చుట్టుపక్కల చూసాను. ఎవరి మాటల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఎవరూ మమ్మల్ని గమనించట్లేదు. ఇంటికి వచ్చిన అందరి ముందు గట్టిగా అరవాలి అంటే భయం వేసింది. ‘ప్లీజ్ మామయ్య…’ అంటూ… బలంగా విడిపించుకొని అక్కడి నుండి పారిపోయాను.

వెళ్లేప్పుడు,  వెంకట్ మామయ్య ఏదో పని ఉంది అంటూ, నాన్నకు చెప్పి, నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు.

‘నేను వెళ్ళను అమ్మా.’ అని అమ్మకి చెప్పినా,

‘పరవాలేదు…. మన మామయ్యే కదా…. మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాడు కదా… ప్రసాదం ఇస్తానన్నాడు. నీ కోసం ఏదో బహుమతి కూడా తెచ్చాడట. వెళ్ళి తెచ్చుకో….’ అంది తమ్ముడికి అన్నం తినిపిస్తూ. ఖచ్చితంగా ‘వెళ్ళను’ అనే అవకాశం ఇక నాకు కనిపించలేదు. దేవుడి ప్రసాదం ఇవ్వడానికి పిలిచి, అసహ్యమైన పనులు ఏమి చేయడులే అని ధైర్యం తెచ్చుకుంటూ, బయట నుండే ప్రసాదం తీసుకొని వచ్చేయాలి అనుకుంటూ, వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

‘అత్తమ్మా… అత్తమ్మా… పిలిచావట…’ అంటూ బయట నుండే అరిచాను. మామయ్య బయటకు రావడం చూడగానే ఒక్క సారిగా నాకు భయం వేసింది.

‘ఆ… అవనీ… వచ్చావా… రా…” అన్నాడు లుంగీ పైకి కడుతూ.

‘ప్రసాదం ఇస్తా అన్నావట… ఇవ్వు వెళ్తా…’ అన్నా అక్కడి నుండే. ‘తొందరగా ఇవ్వు… వెళ్ళాలి…’ అన్నా

‘ముందు లోపలికి రా… నీ కోసం ఎంత మంచి బహుమతి తెచ్చానో చూద్దువు…’ అన్నాడు లోపలికి వెళ్తూ…

భయం భయం గానే లోపలికి అడుగులు వేసా.

‘అత్తమ్మ లేదా…?’ అన్నా

‘లేదు… అందుకేగా నిన్ను రమ్మన్నది…’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

‘నాకు ప్రసాదం ఇస్తే నేను వెళ్తా.’ అన్నా కోపంగా.

‘ఇస్తా లే… ఇదిగో చూడు… నీ కోసం ఏం బొమ్మ తెచ్చాను చూడు.’ అన్నాడు నన్ను దగ్గరగా పట్టుకొని.

ఒక అందమైన అమ్మాయి బొమ్మ చూడగానే ఆ చిన్న వయసులో నాకు చాలా సంబరంగా అనిపించింది. ఆ క్షణం నా కళ్ళల్లోని మెరుపుని గమనించినట్టు, మామయ్య ‘దీన్ని చూడగానే నువ్వే గుర్తు వచ్చావు. ఎంత అందంగా ఉందో కదా… ముద్దుగా, నవ్వుతూ, చిన్న గౌన్ వేసుకొని…’అంటూ… ఆ బొమ్మని పైనుండి కింది వరకు తాకుతూ, ఒక చేతితో నన్ను, ఒక చేతితో దాన్ని, గట్టిగా ఒత్తుతూ అన్నాడు.

‘ప్రసాదం ఇస్తే వెళ్లిపోతా.’ అన్నా… విడిపించుకుంటూ. ఆ బొమ్మ, ప్రసాదం, రెండు చేతిలో పెట్టి, నన్ను దగ్గరగా తీసుకొని, మన ఇద్దరి విషయం ఎవ్వరికీ చెప్పకు, పెద్ద గొడవ అవుతుంది, మీ అమ్మ వాళ్ళ పరువు పోతుంది అన్నాడు నన్ను బెదిరిస్తున్నట్టు. నీకు అప్పుడప్పుడు పెద్ద చాక్లెట్ ఇస్తా లే’ అన్నాడు నాకు ఆశ చూపిస్తూ. ఏమి చెప్పకూడదో, ఎందుకు చెప్పకూడదో నాకు అర్ధం అవ్వలేదు కానీ, ‘అసలు ఏమి చెప్పాలో, చెప్పిగొడవ ఎందుకులే, అందరూ నన్ను ఏమి అంటారో’, అనే ఒక తెలియని భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయా.

నాన్న తన వ్యాపారంతో, అమ్మ, ఇల్లు, తమ్ముడు, మా అవసరాలు చూసుకోవడంలో ఎప్పుడూ సతమతమవుతూ ఉండడం చూసి, నాకు వాళ్లకు చెప్పే ధైర్యం కలగలేదు. అది అదునుగా తీసుకొని, వెంకట్ మామయ్య, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను తాకుతూ, ఇబ్బందికరంగా వ్యవహరించేవాడు. నేను ఎప్పుడూ తన నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. ఆ భయంతో, ఎన్నో రాత్రులు నిద్ర నుండి ఉలిక్కిపడి లేచేదాన్ని. రాత్రంతా నిద్ర పోకుండా ఉండేదాన్ని. ఒక్కదాన్నే వెక్కి వెక్కి ఏడిచేదాన్ని.

అలా రోజులు గడుస్తున్న సమయంలో, ఎనిమదవ తరగతిలో, నాకు ఒక మంచి ప్రభుత్వ హాస్టల్లో సీట్ దొరకడంతో ఎంతో సంతోషంగా, అమ్మ వాళ్ళను వదిలి వెళుతున్న బాధ ఏమాత్రం లేకుండా, హాస్టల్ కి వెళ్ళిపోయాను. అది ఆడపిల్లల హాస్టల్. అక్కడ ఎంతో ఆనందంగా, చలాకీగా, ఉండే దాన్ని. చక్కగా చదువుకుంటూ, హుషారుగా ఆడుకుంటూ, స్నేహితులతో సంతోషంగా గడిపేదాన్ని. నేను పదవ తరగతి చదువుతుండగా, నాన్న తన వ్యాపారంలో కొద్దిగా మెరుగు అయ్యి, దగ్గరిలోని టౌన్ లో తన వ్యాపారం మొదలు పెట్టి, అమ్మ, తమ్ముడితో అక్కడే ఉండడం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి ఇక జీవితంలో వెంకట్ మామయ్య ని చూసే అవసరం రాదని ఎంతో సంబరపడ్డా.

రోజులు సంతోషంగా గడుస్తుండగా, మెల్లి మెల్లిగా, నేను ఆ చేదు జ్ఞాపకాలను, పీడ కలలను మర్చిపోతున్న సమయంలో, నేను ఇంటర్ చదువుతుండగా, ఒక రోజు సాయంత్రం నేను స్నేహితులతో, పట్నంలోని ఒక సంత, అంటే, పెద్ద ఎక్సిబిషన్ కి వెళ్ళాను. అక్కడ లైట్లు, రంగురంగుల బట్టలు, ఆట వస్తువులు, ఆ సందడి చూసి, మురిసిపోతూ, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ముందుకు వెళ్తున్నాం. రంగుల రాట్నం దగ్గర చాలా రద్దీగా ఉంది. టికెట్ తీసుకునే లైన్ దగ్గర, ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉన్నారు. మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నారు.

ఆ రద్దీలో నేను నా స్నేహితులు కొంచం దూరం దూరం అయ్యాము. అందరికీ ముందుకు వెళ్లాలనే తొందర కదా… అక్కడ ఒక్క సారిగా ఎవరో నా నడుముని పట్టుకున్నట్టు అనిపించింది. ఒక్క సారిగా గుండె ఆగినట్టు అనిపించింది. ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. చుట్టూ మనుషులు. ఆ వ్యక్తి, గట్టిగా నన్ను పట్టుకొని నా శరీరం అంతా తన శరీరంతో తాకుతూ, ఒక చెయ్యి నడుము నుండి పైకి పంపిస్తూ, మాటల్లో చెప్పలేనంత అసహ్యం గా వ్యవహరిస్తున్నాడు. ఒక్క సారిగా, గట్టిగా తోసేసి, గట్టిగా అరిచి, ఆ రద్దీ నుండి దూరంగా వెళ్లిపోయా. ఆ స్పర్శ తలపుతో ఒక్కసారిగా వాంతి చేసుకున్నా. నన్ను చూసి, వెంటనే నా స్నేహితురాలు నా దగ్గరికి వచ్చింది. కళ్ళల్లో నుండి నీళ్ళు ఆగకుండా కారుతున్నాయి. అయోమయంగా నన్ను చూస్తూ, ‘ఏం అయింది అవని.’ అని అడిగింది… ఒక నిమిషం పాటు, వెక్కి వెక్కి ఏడ్చి, నన్ను నేను సముదాయించుకొని, ‘ఏమీ లేదు… నాకు ఒంట్లో బాగా లేదు… నేను వెళ్తాను. మీరు ఎంజాయ్ చేయండి.’ అని లేచా. ‘తోడుగా నేను కూడా వస్తాలే…’ అంది… ‘వద్దు వద్దు… నా వల్ల మీరు ఇబ్బంది పడకండి. పర్వాలేదు. నేను వెళ్లిపోతా…’అని అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయా. ఈ రోజుకీ ఆ సంఘటన తలుచుకుంటే, నాకు అసహ్యం, ఆవేశం వస్తుంది.” అంది.

పోలీస్ స్టేషన్లో అందరూ అవని మాటల్లో నిమగ్నమయి ఉన్నారు. అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో ఆవేదన. వాళ్ళందరినీ ఒక సారి చూసి, అవని, పక్కనే ఉన్న నీళ్ళు తీసుకొని తాగింది. “అసలు ఒక అమ్మాయి అనుమతి లేకుండా తన శరీరాన్ని ఎలా తాకగలరు సర్… ఆడపిల్ల మాత్రం ఒక మనిషి కాదా… తనకు మనసు ఉండదా… ఆ క్షణంలో ఆ మగ వెధవలకు తన తల్లి, చెల్లీ, పెళ్ళాం, కూతురు, ఎవరూ గుర్తుకు రారా…!!?” అంది ఆవేదనతో. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి కళ్ళల్లో బాధ, కొందరి కళ్ళల్లో కన్నీటిపొర… స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“తప్పు కేవలం వారిదే కాదు మేడం… మగ పిల్లల్ని కని, గాలికి వదిలేసి, వారు ఎలాంటి వ్యక్తిత్వంతో ఎదుగుతున్నారు అని పట్టించుకోని తల్లితండ్రులది, పుస్తకాల్లోని పాఠాలు కాక, విలువలతో కూడిన జీవిత పాఠాలు నేర్పడంలో విఫలమవుతున్న గురువులది, ఆడవారిని గౌరవించడం, సాటి మనిషిగా చూడడం, బాధ్యతగా వ్యవహరించడం నేర్పించని సమాజానిది, కష్టం వస్తే ధైర్యంగా బయటకు చెప్పుకునే, తప్పు చేసిన వారిని నిలదీసే పరిస్థితిని కలిపించలేని వ్యవస్థది. అందరూ… అందరూ దోషులే…” అంది ఆవేశంగా.

అంగీకరించలేని విషయం ఏమీ లేనందున, అందరూ కాసేపు మౌనంగా ఉండి పోయారు. ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ, ఇన్స్పెక్టర్ “నీ ఆవేదన అర్ధం అవుతుందమ్మా… కానీ, తరవాత ఏమి జరిగింది చెప్పు… ఆ దెబ్బ ఏంటి… ఆ రక్తం ఏంటి… ఈ వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు…” అని అడిగింది ఓదార్పుగా.

“అలాంటి ఎన్నో చేదు అనుభవాల మధ్య, స్వతహాగా చలాకీగా ఉండేదాన్ని అయినా, నేను తెలియకుండానే రోజు రోజుకీ మౌనాన్ని ఆశ్రయిస్తూ, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా, కొత్త వాళ్ళతో కలవకుండా, అకారణంగా కోపగించుకుంటూ, మగవారిని చూస్తేనే చిరాకు పడుతూ ఉండడం అలవరచుకున్నా. దానితో నాకు స్నేహితులు తక్కువ, చుట్టాల్లో ఇష్టపడే వాళ్ళు తక్కువే. అయినా దానికి నేను ఎప్పుడూ బాధ పడలేదు. డిగ్రీ కాలేజ్ లో చేరాక, అబ్బాయిలు స్నేహంగా పలుకరించినా, సోదర భావంతో దగ్గరికి వచ్చినా, అన్ని రకాల భావోద్వేగాలకూ అతీతంగా ఉంటూ, నా బ్రతుకు నేను బ్రతుకుతూ, ఎప్పటికైనా కొందరైనా ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇచ్చే స్థాయికి రావాలనే సంకల్పంతో, బ్రతుకుతూ, మనోధైర్యాన్ని వీడకుండా ఉన్నా. గుండెను రాయి చేసుకొని, పొగరుబోతు, అహంకారి వంటి ఎన్నో బిరుదులను మోస్తూ, నా డిగ్రీ పూర్తి చేశాను. అంతలో, అనుకోకుండా అమ్మ ఆరోగ్యం పాడవడంతో, నాకు తొందరగా పెళ్ళి చేసేయాలి అని ఇంట్లో వాళ్ళు నిర్ణయించారు.

‘నేను అప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేను, ఎవరో తెలియని ఒక వ్యక్తితో జీవితాంతం బ్రతకడానికి ధైర్యం లేదు,’ అని ఎంత చెప్పినా, బాధ్యత తీర్చేసుకోవాలి అని కన్న వాళ్ళు, ఆ పెళ్ళికొడుకు ఒప్పుకోగానే, నా ఇష్టానికి ఏ మాత్రం విలువ లేనట్టు, బలవంతంగా నాకు పెళ్ళి చేశారు. నా జీవితానికి సంబంధించిన అతి పెద్ద నిర్ణయం, నా ఆమోదం లేకుండానే జరిగిపోయింది. పెళ్లితో నా చదువు, ఆశలు, ఆశయాలు, అన్నీ అంతం అయ్యాయి. భర్త అవసరాలు తీర్చడం, తనను సంతోషపెట్టడమే ఒక స్త్రీ జీవిత పరమార్ధం అన్నట్టు అందరూ నాకు హిత బోధలు చేసి, వైవాహిక జీవితం అనే ఒక మహా సముద్రంలో నన్ను తోసేసి, ఒక బలి పశువును చేశారు. మరొక దారి లేక, నా శరీరాన్ని వాడికి అప్పచెప్పి, శరీరానికి అవుతున్న నొప్పిని, మనసుకు అవుతున్న గాయాన్ని ఓర్చుకుంటూ, ఒక మరమనిషిలా మారి, జీవితం అంటే ఇంతేనేమో… పెళ్లి అంటే ఇదేనేమో, అనుకుంటూ, బరువైన బంధాన్ని గుండెలపై మోస్తూ కాలం గడిపేస్తున్నా.

అలాంటిది ఈ రోజు… ఈ రోజు…” అంటూ… ఇంకిపోయాయనుకున్న కన్నీళ్లు, ఇంకా ఉన్నాయని గుర్తు చేయగా, ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ… “ఈ రోజు నా భర్త సాయంత్రం ఆఫీస్ నుండి బాగా తాగి వచ్చాడు. వస్తూనే, నాకు బిర్యానీ పాకెట్, మల్లె పువ్వులు ఇచ్చాడు. ‘తిను అవని…’ అంటూ ప్రేమగా పక్కన కూర్చున్నాడు. ఎప్పుడూ లేని ఆ వింత చేష్టకి అనుమానిస్తూనే ఉన్నా… ‘నాకు వద్దు, నేను తినేసాను’ అని చెప్పాను… ఏం చెప్పబోతున్నాడో అని భయంగా ఎదురుచూస్తున్న…

‘ఇవాళ క్లబ్ లో, నాకు లక్ అస్సలు కలిసి రాలేదు అవని. ఎన్ని ఆటలు ఆడినా ఓడిపోయాను. జేబులో ఉన్న డబ్బులు అన్ని అయిపోయాయి.’ అన్నాడు బాధ పడుతున్నట్టు. ‘ఇంట్లో కూడా ఏం డబ్బులు లేవు. అయిందేదో అయిపోయింది. ఇంకొక సారి ఆడకండి.’ అన్నను. ‘అలా అంటే ఎలా…. నేను ఎప్పుడూ అంత సులువుగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు కదా… అందుకే… ఆఖరి సారిగా ఒక్క ఆట ఆడి, పోగొట్టుకున్నవి అన్నీ మళ్ళీ గెలుచుకోవాలి అనుకున్నా.’ అన్నాడు నాకు దగ్గరగా వచ్చి, భుజం మీద చెయ్యి వేస్తూ.

‘కానీ, ఆ వెధవలు, ఓడిపోయినవి అన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ, ఏదో ఒకటి పందెం కాయవలసిందే అని షరతు పెట్టారు. నేను ఏమి చేయగలను చెప్పు…’అన్నాడు తన చేతులతో నా చెయ్యి పట్టుకుంటూ… ‘మరి… నా అదృష్ట దేవతవు నువ్వే కదా… నిన్ను మించి నా దగ్గర ఇంక ఏమి ఉంది’ అన్నాడు చేతులతో నా చెంపను మెల్లిగా గిచ్చుతూ.

ఏమి చెప్పబోతున్నాడో అని భయంగా వింటున్న నాకు, వినకూడదు అనుకుంటున్న మాటే వినిపించింది. ‘కాబట్టి నిన్ను పందెంగా పెట్టి, ఆఖరి ఆట ఆడాను. కానీ, నా దురదృష్టం ఏంటో… అది కూడా ఓడిపోయాను.’ నా గుండెల్లో ఒక్క సారిగా బండ పడినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు.

‘ఏం మాట్లాడుతున్నారు….!’ అన్నా… భయాన్ని దాచుతూ, కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ.

‘ఈ ఒక్క పూటనే అవని. ఏమి పర్లేదు. మన ముగ్గురి మధ్యనే ఉంటుంది విషయం. నన్ను నమ్ము, వాడు నిన్ను నిరుత్సాహ పరచడులే…’అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

‘ఛీ… ఏం మాట్లాడుతున్నావ్… ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా భరించాను, కానీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. నేను ఇక నీతో బ్రతకను’ అని కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లబోయా. తలుపు దగ్గరే వేచి చూస్తున్న ఆయన స్నేహితుడు, వెంటనే నాకు అడ్డుగా నిలుచున్నాడు. ఊహించని ఆ ప్రమాదానికి, నిర్ఘాంతపోయిన నేను, వెంటనే ఒక అడుగు వెనక్కి వేసా. వెంటనే నా భర్త వెనక నుండి పట్టుకొని, ‘అనవసరంగా గొడవ చేసి, సమస్య తెచ్చుకోకు. ఒప్పుకుంటే అందరికి మంచిది, లేదన్నా వాడు నిన్ను వదలడు. ఇవాళ్టికి మాత్రం నువ్వు వాడి సొత్తువి.’ అని చెప్పి, నన్ను బలవంత పెట్టాడు.”

“ఆ సమయంలో నేను ఏమి చేయాలి మేడం.!? మీరు చెప్పండి…” అంది అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ తో. సమాధానం ఏం చెప్పాలో తెలియని ఆవిడ, నిశ్శబ్దంగా ఉండిపోయింది. పక్కనే ఉన్న ఒక మహిళ కానిస్టేబుల్ మాత్రం, “అలాంటి వాడిని చంపినా తప్పు లేదు అమ్మ.” అంది ఆవేశంగా.

“అంతే కదా మేడం. అదే ఆలోచనతో, ఆవేశంలో, ఎక్కడినుండి వచ్చిందో తెలియని ఒక ధైర్యంతో నేను రోకలితో వాళ్ళిద్దరినీ బాగా బాది వచ్చాను. చచ్చారో బ్రతికి ఉన్నారో తెలియదు. “అంది ఆవేశంగా….”అయినా, ఒక మనిషి మీద పందెం వేయడం ఏంటి మేడం… నాతో సంబంధం లేకుండా, నన్ను వేరే వాళ్లకు అప్పగించడం ఏంటి… ఆడది అంటే ఎందుకు అందరికి అంత చులకన… మేము మాత్రం మనుషులం కాదా…!! నేను చేసింది తప్పో కాదో నాకు తెలియదు… జరిగింది చెప్పేసా… ఇక మీరు ఏమైనా చేయండి. నాకైతే, జైల్లోనే క్షేమంగా ఉండగలను అనిపిస్తుంది. నన్ను జైల్లో వేసేయండి మేడం. స్త్రీకి స్వేచ్చలేని, ఒక స్త్రీ మనసుకు, వ్యక్తిత్వానికి విలువ లేని ఈ సమాజంలో నేను ఉండలేను మేడం…” అంది ఆవేశంగా…

ఆ కథ అంత విన్న ఆ స్టేషన్ సిబ్బంది, కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా మిగిలిపోయారు. కొన్ని నిమిషాల తరువాత, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ,

“ఆత్మరక్షణ కోసం చేసింది తప్పు కాదు అవని. భయపడకు. ఇక మీద నుండి నువ్వు నిర్భయంగా ఉండు. నువ్వు భయాన్ని జయించావు. ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిన్ను ప్రస్తుతం ఒక సఖి హోమ్ కి పంపిస్తాము. క్షేమంగా ఉండొచ్చు. నీకు నచ్చిన పని చేస్తూ, నువ్వు ఇక మీద ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఎందరో మహిళలకు ప్రేరణగా నిలవవచ్చు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. నిరుత్సాహపడకు. ఇది నీ జీవితానికి అంతం కాదు, ఒక గొప్ప జీవితానికి ఆరంభం… ముందు ముందు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పు” అని ధైర్యం చెప్పారు. అవని ఒక కొత్త ఉత్సాహంతో, ఎనలేని ధైర్యంతో వెనుదిరిగి చూడకుండా కొత్త దారిలో, ఒక గొప్ప జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగింది.

ఇది ఒక అవని కథ కాదు, ఇందులో పేర్కొన్న సంఘటనలు చాలా వరకు స్త్రీలు ఏదో ఒక సందర్భంలో ఎదురుకొన్నవే. సహనాన్ని వీడితే, ప్రళయ తాండవం తప్పదు అనే నిజాన్ని దుర్బుద్ధితో ఉండే ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాలి…!!

“యత్ర నార్యంతు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః”

డా. ప్రతిభా లక్ష్మీ

You May Also Like

2 thoughts on “యత్ర నార్యంతు పూజ్యంతే

  1. Nijame ఆడపిల్లకి ఇలా ఉండాలి అల ఉండాలి అని చెప్తారు తప్ప అబ్బాయిలకి ఎందుకు చెప్పారు ఆ conditions అన్ని
    చాలా మంది ఉన్నారు అల కానీ బయటపడే వల్లే lucky one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!