ఎండమావులు

చల్లని గాలి మొహమంతా పరచుకుంది, కిటికీ తలుపు తీయగానే ఒక హాయి అయిన భావన మనసంతా నింపుకుంటుంటే, చందన పరిమళాలు నన్ను హత్తుకున్నాయి. ఎక్కడి నుండి వస్తుంది ఈ పరిమళం అని కిటికీ బయటకు చూస్తే, ఎదురిల్లు కనిపించింది. మా కిటికీ నుండి వాళ్ళ హాల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లివింగ్ రూమ్ తప్పించి మిగతా ఏ గదిలోకి వెళ్లాలన్న హాల్ నుండే వెళ్ళాలి కాబట్టి, ఆ ఇంట్లో ఏం జరిగినా కిటికీ తలుపు తెరిచి ఉంటే అన్ని కనిపిస్తాయి.

ఎవరో అక్క అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటుంది. తలస్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకున్నట్టు ఉంది, ఆ చందనపు పరిమళాలు తను వెలిగించిన అగర్బత్తి వల్లే వస్తున్నాయి. కొత్తగా ఈ అపార్ట్మెంట్ కి వస్తూ చాలా బెంగగా అనిపించింది., సూర్యోదయాన్ని, చెట్లను చూడలేనని. కానీ ఇవాళ ఆ అక్కను, వాళ్ళింటి వాతావరణాన్ని చూశాక బెంగ మొత్తం పోయింది, మనసుకు చాలా హాయి అనిపించింది. అదే రోజు కాలేజీకి వెళ్తుంటే గేట్ వేస్తూ ఆ అక్క కనిపించింది. పసుపు రంగు చుడీదార్ లో చాలా అందంగా ఉంది. నాకే తనను ఒక్కక్షణం ఆగి చూడాలి అనిపించింది. ముందు తను, వెనుక నేను  బస్టాప్ వరకు తననే గమనించాను.

అది మొదలు, ప్రతిరోజు తనను గమనించడం నాకు చాలా ఇష్టమైన పని అయ్యింది. కానీ తనని ఎప్పుడు పలకరించలేదు. ఒక ఆదివారం రోజు నా గది సర్దుకుంటూ అనుకోకుండా కిటికీ వైపు చూసాను, అక్క గులాబీ రంగు చీరకట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కాఫీ తాగుతూ.. నేను చూసినప్పుడే తను కూడా నా వైపు చూసి పలకరింపుగా నవ్వింది. నేను ఆశ్చర్యపోయాను, ఇన్ని రోజుల్లో అక్క ఎవరితోనూ మాట్లాడడం నేను చూడలేదు. నేనంటే కొత్తగా వచ్చాను, కానీ మిగతావారంతా పాతవారేగా, వారెవరిని కూడా పలకరించడం, నవ్వడంలాంటివి చెయ్యదు. తన దారిని తను మౌనంగా వెళ్ళిపోతుంది. అలాంటిది ఇవాళ నన్ను చూసి నవ్వితే నాకు చాలా ఆశ్చర్యంగాను, సంతోషంగాను అనిపించింది. నేను కూడా తనను చూసి నవ్వాను.

తర్వాతి రోజు కాలేజీకి వెళ్తుంటే, గేట్ బయట అక్క కనిపించలేదు. నిరాశగా నేను వెళ్లిపోతుంటే వెనుక నుండి ఎవరో పిలిచినట్లు అనిపించింది., చూస్తే అక్క  నన్నే పిలుస్తుంది అని అర్థమయ్యి చాలా సంతోషంగా అనిపించింది. నా దగ్గరకు వస్తూనే  “మీరు ఎదురింట్లోకి కొత్తగా వచ్చారా..?” అని అడిగింది. “అవును” అని చెప్పాను. బస్ స్టాప్ వరకు ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళాం. అక్క ఏదో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాను అని చెప్పింది. ఇద్దరం మా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం. అప్పటినుండి ఇద్దరం రోజూ కలిసే బస్టాప్ వరకు వెళ్ళేవాళ్ళం. నిజం చెప్పాలంటే, అలా అక్క నా పక్కన నడుస్తూ.. నాతో కబుర్లు చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపించేది.

ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి  అమ్మ కాళికాదేవిలా సీరియస్ గా ఉంది. రాగానే చాలా కోపంగా..

“ఎందుకు ఆ ధృతితో మాట్లాడుతున్నావ్..?” అని అడిగింది.

“ధృతినా..? ధృతి ఎవరు అమ్మ..?”.

“ఎవరో తెలియకుండానే రోజు తనతో బస్టాప్ వరకు వెళ్తున్నవా..?”

“ఒహ్హ్.. ఆ అక్క పేరు ధృతినా!! ఇన్నిరోజుల్లో ఎప్పుడు తన పేరు అడగలేదు. వావ్.. తనలానే తన పేరు కూడా చాలా బావుంది కదా. తెలుసా అమ్మ, అక్క చాలా మంచిది. నాకు ఏమేం చదవాలో, ఎలాంటి కోర్స్ లు చదవాలో గైడ్ కూడా చేస్తుంది. తను అందంగా ఉంటుంది, పెద్ద జాబ్ చేస్తుంది., అయినా కూడా అస్సలు గర్వమే ఉండదు.చాలా మంచిదమ్మా అక్క”.

“ఇంక ఆపుతావా లేదా..” అమ్మ గట్టిగా అరిచింది. “ఏం తెలుసని ఆ అమ్మాయిని తెగ పొగిడేస్తున్నావ్. పైకి మంచిగా కనిపించే వాళ్ళందరు లోపల మంచిగా ఉండరు. ఆ అమ్మాయికి దూరంగా ఉండు. ఇక నుండి ఆ అమ్మాయిని కలిసినా, మాట్లాడావని తెలిసినా ఊరుకోను..” అని అంది.

“ఎందుకమ్మా..? ఏమయ్యింది..? అక్కతో ఎందుకని మాట్లాడకూడదు..?”

“ఆ అమ్మాయి మంచిది కాదట, అందరూ అనుకుంటున్నారు. అందుకే తనకు దూరంగా ఉండు. ఇదే చివరి సారి చెప్పడం. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు”.

“అది కాదమ్మ..”

“నోరుముయ్యి.. ఇంక నాతో వాదించాలని చూడకు, వద్దని చెప్పాను కదా.. అర్థం కాదా నీకు..”.

“సరే అమ్మ..” అని అక్కడినుండి రూమ్ కి వెళ్ళిపోయాను.

నా మనసేమి బాలేదు. మా అమ్మ, అక్క గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అక్కను రోజు చూస్తున్న, మాట్లాడుతున్న.. తనలో తప్పు పట్టే విషయం ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. మరి ఎందుకు అమ్మ తన గురించి అలా మాట్లాడిందో అర్థం కాలేదు. అక్క గురించి చెప్పింది అంతా నిజమని నమ్మడానికి నా మనసెందుకో ఒప్పుకోవడం లేదు., అలా అని ఇప్పుడు అమ్మను కాదని అక్కతో మాట్లాడలేను. చేసేదేమిలేక రోజు టైం కన్నా అరగంట ముందే కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాను, అక్కను అవాయిడ్ చెయ్యడానికి.

మాకు బాగా తెలిసిన బామ్మగారు, అక్క వాళ్ళ బిల్డింగ్ లో, వాళ్ళ ఎదురింట్లోనే ఉంటారు. అమ్మ వాళ్లకు ఏవో వస్తువులు ఇచ్చి రమ్మంటే వెళ్ళాను. వాళ్ళ తలుపు కొడుతుంటే, అక్క ఎక్కడికో బయటకు వెళ్ళడానికని తలుపు తీసింది. నన్ను చూడగానే తన మొహంలో చాలా సంతోషం కనిపించింది.

“ఎలా ఉన్నావ్.. ఈ మధ్య కనిపించడం లేదే” అని అడిగింది.

“కాలేజీ టైమింగ్స్ మారాయి” అని అప్పటికి ఏదో అబద్ధం చెప్పాను.

“ఒహ్హ్.. అలాగా, రోజూ నువ్వొస్తావేమో అని చూస్తున్న, కనిపించడం లేదు. అడగడానికి నీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, సరే.. నీ నెంబర్ ఇవ్వు, కనీసం ఫోన్ లో అయినా మాట్లాడుకుందాం” అంది.

ఇక ఏం చెప్పి తప్పించుకోవాలో తెలియక నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇంతలో బామ్మ తలుపు తీసి, నేను తనతో మాట్లాడడం చూసారు. అక్క బై చెప్పి వెళ్ళిపోయాక, నన్ను ఇంట్లోకి లాక్కెళ్లి..

“తనతో ఎందుకు మాట్లాడుతున్నావ్, మీ అమ్మ చెప్పలేదా నీకు”.

“అది కాదు బామ్మ.. ఎదురుగా ఉండి పలకరిస్తే,  సమాధానం చెప్పకపోతే ఏం బావుంటుంది. అందుకే మాట్లాడాను”.

“మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడదు.. తనలానే ఇంకో నలుగురిని చెడగొట్టాలిగా, ముదనష్టపు సంత. పోనీ వెల్లగొడదామ అంటే.. దానిది సొంత ఇల్లు అయిపోయింది. దీని వల్ల మనలాంటి వాళ్ళం ఉండలేం, వేరే చోటికి పోలేం. ఎన్నాళ్ళో మనకీ తిప్పలు”.

“బామ్మ.. తను మంచిది కాదా. చూడడానికి మంచి అమ్మాయిలానే కనిపిస్తుంది కదా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా?”.

“నన్నేం చేస్తుంది కాని.. గుణమే మంచిది కాదు”.

“అంటే..?” అన్నాను నేను.

“అంటే ఏముంది.. పాపం తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. వాళ్ళను వదిలేసి, ముక్కు మొహం తెలియనివాడితో లేచిపోయింది. ఇది చేసిన పనికి అవమానంతో కుమిలిపోయేలా చేసింది. పోనీ ఆ పెళ్ళి చేసుకున్న భర్తతో అయినా బావుండాలి కదా, పని చేసే చోట వేరే వాడితో చనువుగా ఉండేదట. అది తెలిసి భర్త తట్టుకోలేక తాగుడుకి అలవాటు పడిపోయాడు. భర్తను జాగ్రత్తగా చూసుకుంటూ అలవాటు మానిపించి, అతన్ని మార్చుకోవడం మానేసి.. ఇదే ఛాన్స్ అని ఆ అబ్బాయితో తిరిగేది. రాత్రి 12 అయినా ఇంటికొచ్చేది కాదు. ఒక్కోసారి తెల్లవారితే గాని వచ్చేది కాదు. ఇక్కడ ఈ భర్త ఏమో తాగి తాగి, తను రాగానే గొడవపడేవాడు. రోజూ గొడవలు వినలేక చచ్చేవాళ్ళం. ఒక రోజు దీని చెడు ప్రవర్తన చూసి విసుగొచ్చి చేయి చేసుకున్నాడు, అంతే ఆ ఆఫీస్ లో పని చేసే అబ్బాయికి చెప్పి, వాడి చేత మొగుడిని కొట్టించి, బయటకు గెంటేసింది. బలవంతంగా విడాకులు తీసుకుంది”.

“వాళ్ళ గొడవలు చూసి విసుగొచ్చి, చూడమ్మా ఇది కాపురాలు ఉండే ఏరియా.. ఇక్కడ ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే చూస్తూ ఊరుకోము, అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాము అందరం కలిసి. కొంచెం భయపడిందిలే.. పోలీస్ రిపోర్ట్ ఇస్తాం అని బెదిరించాక. తర్వాత ఏం అయ్యిందో కానీ ఆ ఆఫీసులో పని చేసే అబ్బాయి రావడం మానేశాడు. ఇది కూడా మాకు భయపడి జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు మాత్రం అస్సలు దానితో మాట్లాడకు, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. అర్థమయ్యిందా…”. “సరే బామ్మ..” అని అక్కడనుండి వచ్చేసాను.

ఇంటికొచ్చాక కూడా నాకు బామ్మ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఎంత సర్దిచెప్పుకున్న, అక్క అలాంటిది అంటే నమ్మలేకపోయాను. ఆ తర్వాత అక్క అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేది. నేను మొహమాటానికి మాట్లాడేదాన్ని కానీ, ఇదివరకు అంతటి ఇష్టంతో మాత్రం కాదు. తను మంచిగా ఉన్నంత వరకు మాట్లాడదాం, ఏమైనా తేడాగా ఉంటే  బ్లాక్ చేసేద్దాం అని అనుకున్నాను. అలా చాలా రోజులు గడిచిపోయాయి. అక్క ఎప్పటిలానే మంచిగానే మాట్లాడేది. తనలో వెతుకుదాం అన్నా తప్పు కనిపించేది కాదు. మరి అందరూ తన గురించి ఎందుకలాంటి అభిప్రాయంతో ఉన్నారో అర్థమయ్యేది కాదు. ఏదిఏమైనా తన మీద నా మనసులో ఒక సాఫ్ట్ కార్నర్ అలానే ఉంది.

ఒకరోజు ఫోన్ స్విచ్ ఆన్ చేసేటప్పటికి, అక్క నుండి 10 వరకు మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమై ఉంటుంది.. ఇన్నిసార్లు కాల్ చేసింది అని కంగారుపడి తిరిగి చేశాను. అక్క ఒక హాస్పిటల్ పేరు చెప్పి, బామ్మకు దెబ్బలు తగిలాయి అని చెప్పి, మమ్మల్ని అక్కడికి అర్జంట్ గా రమ్మంది. నేను వెంటనే అమ్మకు విషయం చెప్పి, నాన్నతో తాతయ్యను పిక్ చేసుకుని హాస్పిటల్ కి వచ్చేయమని.. అమ్మ, నేను హాస్పిటల్ కి వెళ్ళాం. మేమంతా వెళ్ళేటప్పటికి, అక్క.. బామ్మ చెయ్యి పట్టుకుని దగ్గిరే కూర్చుని వుంది.  అమ్మ వాళ్ళు బామ్మ చుట్టూ చేరేసరికి, అక్క మాకు ప్రైవసీ ఇవ్వాలని అక్కడినుండి బయటకు వెళ్ళింది.

అది చూసి, నేను అక్క వెనుకే వెళ్ళి, ఏం జరిగిందని అడిగాను. “మధ్యాహ్నం, మెట్ల దగ్గర ఎవరిదో మూలుగు వినిపించినట్లు అయ్యింది. చూస్తే  బామ్మ పడిపోయి ఉన్నారు. తల నుండి రక్తం వస్తుంది, ఇంట్లో తాతగారు ఉన్నారేమో అని చూసాను కానీ లేరు. పక్కన వాళ్ళు ఎవరైనా సాయం వస్తారేమో అని అడిగాను, ఆదివారం కదా కొంత మంది బయటకు వెళ్లిపోయారు. మిగతా వారు రాలేదు. నువ్వేమో ఫోన్ ఎత్తడం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం అని ఆటోవాడిని సాయం పట్టమని, హాస్పిటల్ కి తీసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారు..” అని చెప్తుంటే.. అమ్మ అక్కడికి వచ్చి, కోపంగా నా చేయి పట్టుకుని అక్కడినుండి తీసుకెళ్ళిపోయింది. అంత హెల్ప్ చేసిన అక్కతో అమ్మ అలా రూడ్ గా ఉండడం నాకు చాలా బాధ కలిగించింది. పాపం అక్క అక్కడినుండి వెళ్ళిపోయింది. తను ఏమైనా కావొచ్చు, ఎలాంటి వాళ్ళైన కావొచ్చు.. కానీ హెల్ప్ చేసిన వాళ్ళకు థాంక్స్ చెప్పడం మర్యాద.. అది మా అమ్మకు తెలియకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది.

తర్వాతి రోజు మధ్యాహ్నానికి బామ్మకు పూర్తిగా స్పృహ వచ్చింది. స్పృహలోకి వస్తూనే తను అడిగిన మొదటి ప్రశ్న “ధృతి ఏది..” అని. ‘తను వెళ్ళిపోయింది’ అని చెప్పాము. ‘ధృతిని చూడాలి అని  ఒక్కసారి తీసుకురమ్మని’ బ్రతిమాలారు. ఎవరికి అక్క రావడం ఇష్టం లేకపోయినా, బామ్మ బ్రతిమాలారు అని అక్క రావడానికి ఒప్పుకున్నారు. నేను వెంటనే అక్కకు కాల్ చేసి విషయం చెప్పి.. రమ్మని అడిగాను. తను వెంటనే వచ్చేసింది. బామ్మ తనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అది చూసి నాకు చాలా సంతోషం వేసింది. తను వెళ్ళాక, మా వాళ్ళ మొహాలు మాడిపోయి ఉండడం గమనించి, బామ్మ చెప్పడం మొదలుపెట్టారు.

“తల తిరిగినట్టు అయ్యి ఒక్కసారిగా మెట్ల మీద నుండి జారిపోయాను. అరవడానికి ఓపిక లేదు, ఒక పక్క దెబ్బల వల్ల బాధ.. నరకం అనుభవిస్తుంటే, ఆ పిల్ల దేవతలాగా వచ్చింది. తనతో నేనెంత దురుసుగా ప్రవర్తిస్తానో గుర్తొచ్చి.. ఈ పిల్ల నాకు సాయం చెయ్యదు అనుకున్న. పాపం ఆ పిల్ల నన్ను చూస్తూనే కంగారు పడి, అందరి తలుపులు బాదింది. ఎవరూ సాయం రాలేదు. ఎలాగో ఒక ఆటోవాడిని తీసుకొచ్చి, వాడు కేస్ అవుతుందేమో.. ఇలాంటి వాటికి నేను రాను అంటే, వాడిని బ్రతిమాలి.. ఎక్కువ డబ్బులు ఇస్తాను అని ఆశ పెట్టి హాస్పిటల్ కి తీసుకొచ్చింది. వీళ్ళు ఏమో అడ్మిట్ చేసుకోము అన్నారు. డాక్టర్స్ అందరితో వాదించి నాకు వైద్యం చేసేలా చేసింది. ఆ అమ్మాయే లేకపోతే నేను ఈ రోజు ప్రాణాలతో బ్రతికిఉండేదాన్నే కాదు. ఇంత చేసిన ఆ అమ్మాయికి కృతజ్ఞత చెప్పకపోతే నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. అందుకే పిలిచాను..” అని చెప్పారు.

“కానీ..ఆ అమ్మాయి ఎలాంటిదో మీకు కూడా తెలుసు కదా..” అని అమ్మవాళ్లు అంటుంటే.. “ఎలాంటిదో.. ఏమో.. ప్రాణదానం చేసినవాళ్ళు దేవుడితో సమానం అంటారు కదా. నా వరకు ఆ అమ్మాయి దేవతే.. ఎందుకో తెలుసా, ఏ బంధం లేకపోయినా, రోజూ నేను ఎంత ఛీత్కారంగా మాట్లాడినా, అవేం మనసులో పెట్టుకోకుండా సాయం చేసి, నా ప్రాణం కాపాడింది. అదే నా స్థానంలో తను ఉండి ఉంటే.. నేను తనని కాపాడేదాన్నో లేదో. ఆ పిల్ల తనను ద్వేషించేవాళ్లను కూడా కాపాడింది. అదే దేవి లక్షణం. నాకెందుకో ఇన్ని రోజులు ఆ అమ్మాయిని అపార్ధం చేసుకున్నామేమో అనిపిస్తుంది..” అని అన్నారు. బామ్మ చెప్పినది విన్నాక, మా వాళ్ళు అందరూ కూడా కన్విన్స్ అయ్యారేమో.. ఏం మాట్లాడలేదు.

తర్వాత కొన్ని రోజులకు బామ్మను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళాం. ఒక ఏకాదశి రోజు, బామ్మ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూర్తయ్యి.. అందరికి తాంబూలాలు ఇస్తుంటే, ఎర్రని పట్టుచీర కట్టుకుని నిజంగా దేవతేనేమో అనిపించేలా, హుందాగా నడుచుకుంటూ అక్క అక్కడికి వచ్చింది. ఆమెని చూసి మిగతా పేరంటాలు అందరూ.. మొహం అదోలా పెట్టినా, బామ్మ విషయంలో తను చేసిన సాయం గుర్తొచ్చి అందరూ సైలెంట్ గా ఉండిపోయారు.

అప్పుడు బామ్మ అక్కను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని  తన పక్కనే కూర్చోపెట్టుకుని.. “మెరిసేదంతా బంగారం కాదు, ఒక్కోసారి మన కళ్ళు, చెవులే మనల్ని మోసం చేస్తాయి అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ ధృతి విషయంలో కూడా మనం అలానే పొరపాటు పడ్డాం. ఇప్పుడు నిజమేంటో తన మాటల్లోనే విందాం… ధృతి ! నీ జీవితంలో ఏమేం జరిగాయో, నువ్వు ఎలాంటి కష్టాలు పడ్డావో, వీళ్లకు కూడా చెప్పమ్మా.. ఈ రోజుతో నీ గురించి అందరికి ఉన్న చులకన భావం పోవాలి. అందరూ నిన్ను తమ ఇంటి ఆడపిల్లలా గౌరవించాలి. నాకు చెప్పిన విషయాలన్నీ వీళ్లకు కూడా చెప్పు.. ” అన్నారు

అప్పుడు ధృతి అక్క…

“20 ఏళ్ళు నేను మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. నా జీవితంలోకి అనుకోకుండా వచ్చాడు అభయ్.. నా భర్త, తను నాకు కాలేజీలో సీనియర్, ప్రేమించాను అని వెంటపడేవాడు., నిజమని నమ్మి మనసిచ్చాను. చదువయ్యాక ఇంట్లో చెప్తే, మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి మన అంతస్తుకు సరిపోడు అన్నారు. నేను అభయ్ మాయలో పడిపోయి.. అమ్మ నాన్నల కన్నా తనే ఎక్కువ అనుకుని ఇల్లు వదిలి తనతో వచ్చేసాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. కొన్నాళ్ల తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. నన్ను మా పేరెంట్స్ ని అడిగి డబ్బు తెమ్మనేవాడు. నేను వినకపోయేసరికి కొట్టేవాడు. డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాను అని, డబ్బు తేకపోతే నాతో ఉండనని హింసించేవాడు.

ఇంతలో తనకు జాబ్ కూడా పోయింది. దానితో మరీ రాక్షసంగా బిహేవ్ చేసేవాడు. నాకు వచ్చే జీతం మొత్తం తీసేసుకునేవాడు. ఇంటి ఖర్చులకు కూడా ఇచ్చేవాడు కాదు. నేనూ ఓపిగ్గా చూసాను, తను మారతాడేమో అని. కానీ తనలో మార్పు రాలేదు, రోజురోజుకి రాక్షసత్వం పెరిగిపోయేది. మొదట్లో ఎక్కడో తాగి ఇంటికొచ్చేవాడు. తర్వాత ఇంట్లోనే తాగడం మొదలుపెట్టాడు. సిగరెట్ తో కాల్చేవాడు, వేడి వేడి కాఫీ మీద పోసేవాడు. వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే అన్నా మారతాడేమో అని వాళ్లకు చెప్పి చూసాను. నా వల్లే అభయ్ అలా ఐపోయాడని వాళ్ళు కూడా నన్నే తిట్టారు. ఇదంతా భరించలేక విడాకులు ఇచ్చేయమని అడిగాను. అప్పటి నుండి ఇంకా హింసించడం మొదలుపెట్టాడు.

నేను పని చేసే కంపెనీలోనే నా ఇంజినీరింగ్ క్లాస్మేట్ గౌతమ్ కూడా పని చేస్తున్నాడు. ఇద్దరం ఒకేసారి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం. నైట్ షిఫ్ట్ అప్పుడు ఒక్కదాన్నే వెళ్లడం సేఫ్ కాదని, ఒక్కోసారి తను డ్రాప్ చేసేవాడు. అది చూసి.. గౌతమ్ వల్లే నేను విడాకులు అడుగుతున్నాను అని, మా ఇద్దరిని లింక్ చేస్తూ చాలా అసభ్యంగా తిట్టేవాడు. విడాకులు తీసుకుని వాడితో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావేమో.. అందరిలోనూ నీ పరువు తీసి   తల ఎత్తుకుని తిరగకుండా చేస్తాను అని, మీ అందరిముందు, ఆఫీస్ లో.. నా గురించి, గౌతమ్ గురించి చెత్తగా వాగేవాడు. ఆ విషయాలు మీక్కూడా తెలుసు కదా. నాకంటే ఎలాగూ తప్పదు, కానీ గౌతమ్ కి కొత్తగా పెళ్ళైయ్యింది. తన వైఫ్, అత్తమామలు, పేరెంట్స్ ముందు కూడా గొడవ చేసాడు. అది చూసి తట్టుకోలేక గౌతమ్ కొట్టాడు. దానితో నేనే, మా ఇద్దరికీ అడ్డుగా ఉన్నాడని.. గౌతమ్ చేత కొట్టించాను అని ప్రచారం చేసాడు.

అభయ్ తో పడలేక, ఫ్యామిలీ లైఫ్ నాశనం అవుతుంది అని గౌతమ్ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. తను పెట్టే చిత్రహింసలు పడలేక, అవమానాలు భరించలేక, నేను విడాకులకు అప్లై చేసాను. ముందు ఇవ్వను అన్నాడు, తర్వాత నా ఒంటి మీద గాయాలు చూపించి, గృహహింస కేస్ పెట్టి బయటకు రాకుండా చేస్తాను.. అని నా తరపున వాదించే లేడీ లాయర్ బెదిరిస్తే, అప్పుడు విడాకులు ఇచ్చాడు. దాని వల్ల నాకు శారీరక బాధలు తప్పాయేమో కానీ, మానసిక గాయాలు అలానే ఉండిపోయాయి. అందరి ముందు దోషిగా నిలబడి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నా తల్లిదండ్రులకు నేను చేసిన ద్రోహానికి, నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అనుకుని బ్రతుకుతున్నాను..” అని చెప్పడం ఆపి బామ్మను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

ఎన్ని సంవత్సరాల నాటి బాధ ఇవాళ కట్టలు తెంచుకుని బయటకు వచ్చిందేమో అనిపించింది. అక్కడ ఉన్నవాళ్లు అందరూ కూడా అక్క వంక జాలిగా చూడడం నేను గమనించాను. బామ్మ తనని ఊరుకోబెడుతూ.. “చూడమ్మ ధృతి.. నువ్వు జీవితంలో అనుభవించాల్సిన కష్టాలు అన్ని అనుభవించేశావ్, ఇక నీకు అన్ని మంచి రోజులే. పాత విషయాలు అన్ని మర్చిపో. తెలిసో తెలియకో నేను నిన్ను బాధపెట్టాను. నిన్ను చాలా మాటలు అన్నాను. అవన్నీ మర్చిపోయి నాకు ప్రాణదానం చేసి నీ మనసు ఎంత గొప్పదో మా అందరికి తెలిసేలా చేశావ్. నువ్వు ఇక ఇలా అనాథలా  గతాన్ని తలుచుకుని నీలో నువ్వే కుమిలిపోకూడదు అని, నీకు తెలియకుండా మీ తల్లిదండ్రులుతో మాట్లాడాను. నీ గురించి చెప్పాను. వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళడానికి రేపు ఇక్కడకు వస్తున్నారు, ఇక పై నీ కష్టాలు, బాధలు అన్ని తీరిపోయాయి. ఏడ్చే రోజులు అన్ని అయిపోయాయి. అందుకని అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు..” అని అంటుంటే  మిగతావారు కూడా ధృతి అక్కను ప్రేమగా కౌగలించుకున్నారు.

కొన్ని క్షణాల క్రితం వరకూ ద్వేషించిన అమ్మాయి మీద  నిజం తెలియగానే అందరూ ప్రేమ చూపిస్తుంటే అనిపించింది.. ‘ఒక్కోసారి మనం అబద్ధపు కళ్ళజోడు పెట్టుకుని మనుషులను దారుణంగా అపార్థం చేసుకుంటాం, ఒక్కసారి ఆ కళ్ళజోడు తీసి చూస్తేనే కదా ఈ అపార్థాల వెనుక ఎన్ని అమాయక జీవితాలు నలిగిపోతున్నాయో తెలిసేది’ అని.

ప్రశాంతి భావమాలిక

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!