షావుకారు

ఆకాశం వైపు చూసి నడుస్తున్నాను. నన్ను మరింత భయపెడుతూ ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయింది. చలిగాలి మొదలైంది. ఆ సూచనలన్ని మరికొద్దిసేపటిలో వర్షం రాబోతుంది అని తెలియజేస్తున్నాయి. ఆకాశంలో ఉరిమిన శబ్ధం గట్టిగా వినబడితే చెవులు మూసుకున్నాను. ఈ మధ్యన మాయదారి బి.పి ఒకటి శరీరంలో వచ్చి కూర్చునుంది. నా శరీరం వంక చూసుకున్నాను. దారిద్య్రరేఖకి దిగువున ఉన్న బ్రతుకులకి గుర్తుగా బక్కచిక్కి పోయి ఉంది. నాకు షావుకారు గుర్తుకు  వచ్చాడు. భారీ శరీరం, చేతులకి నాలుగేసి ఉంగరాలు, కోర మీసంతో  షావుకారు రూపం చూస్తేనే భయం. అటువంటిది ఈ వాతావరణం వలన పరిస్థితి ఎటు పోయి ఎటు వస్తుందో తెలియని సమయంలో షావుకారి రూపం గురుతు వచ్చి గుండె వేగం పెరిగి, రక్త పోటు ఎక్కువయినట్టుంది. మెడ నరాలు లాగి, ఆయాసం ఎక్కువవుతుంది.

గాలి విపరీతంగా వీయడం మొదలైంది. ఆ గాలి తాకిడిని బక్కచిక్కిన నా శరీరం అడ్డుకోలేక పోతుంది. ఆ గాలితో పాటు నేనున్న అంటూ చిన్నగా వర్షం మొదలైంది. ఇప్పటి వరకు ఉన్న ఆశలన్ని వర్షపు నీటిలో కలిసిపోవడానికి కనుల వెంట నీటి రూపంలో వస్తుండగా వెనుతిరిగాను ఇంటి వైపు. నేను వెనుతిరిగినందుకు కోపం తెచ్చుకున్నట్టుగా వర్షం మరింత ఎక్కువయ్యింది. అలా ఇంటికి వెళుతూ దారిలో షావుకారి ఇల్లు దాటే వేళ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నేను వర్షంలో తడుస్తూ ఇల్లు చేరాను.

ఎదురుగా నా భార్య చేతిలో తుండుగుడ్డతో వచ్చేసరికి ఆలోచనలను పక్కకు పెట్టి, తడిచిన తలను తనకి అప్పగించాను. తను తుండుగుడ్డతో తల తుడుస్తూనే, ముందే చెప్పానుగా వెళ్ళద్దని, నా మాట ఏ రోజు వినరు. మీకు నచ్చిన పనే చేసేస్తారు. ఇప్పుడు చూడండి పదిరోజులలో అనుకున్నది అవుతుంది అనుకుంటుండగా ఈ వర్షం. ఇప్పుడు ఉన్నది పోయే షావుకారు అప్పు ఇచ్చినది పోయే. వాడసలే చెండ శాసనుడు. రేపు ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తే, ఎక్కడ నుండి తెచ్చి ఇస్తారు. వద్దు వదిలేయండి పట్నం పోయి పని చేసుకుందాం అంటే వినరు. వద్దు వద్దు అని మొత్తుకున్న వినకుండా మొదలు పెట్టారు. చేయండి ఇప్పుడు ఏం చేయగలరో అని నాలుగు మాటలు నన్ను దులిపేసి, తడిచిన తుండుగుడ్డను దులుపుకుని లోపలకు వెళ్ళిపోయింది. తను నాలుగడుగులు వేసేసరికి , నాలుగు నెలల క్రిందటి విషయం గురుతుకు వచ్చింది.

ఆ రోజు ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుండగా “దేశానికి రైతే రాజురా” అని వీరయ్య నవ్వుతున్నాడు. అందరు వాడి నవ్వులో శృతి కలిపారు. నాకెందుకో వారి నవ్వులో శృతి కలపాలి అనిపించలేదు. ఏరా అందరం నవ్వుతుంటే నీకు నవ్వు రావడం లేదా అని అడిగాడు వీరయ్య. ఎందుకు నవ్వాలి వీరయ్య దేశానికి రైతే రాజు అన్న మాట మహానుభావులు ఎంతో ఆలోచించి అని ఉంటారు. అటువంటి మాటని నువ్వు ఎగతాళిగా అని నవ్వితే నాకు నవ్వు రావడం లేదు అన్నాను.

అరే మనందరం రైతులమే ? కానీ, ఏ రోజైనా రాజుల భోజనం చేయగలిగామా? లేదు. బ్యాంకు రుణాలతో పంటను మొదలుపెడతాం. పంట మొదలుపెడదాం అనుకునే సరికి విత్తనాలు అందవు. విత్తనాలు అందితే ఎరువులు అందవు. ఎరువులు అందితే నీళ్ళు ఉండవు. నీళ్ళు ఉంటే వర్షాలు పడుతూనే ఉంటాయి. వేసిన పంట మునిగిపోతుంది. మంత్రిగారు హెలికాఫ్టర్లో చూసి పంట నష్టం అంచనా వేస్తారు. అది అందేది ఎప్పటికో? ఈ లోపు మన ఆకలి అంచనాలు దాటిపోతుంది. కుళ్ళి పోయిన పంటను తీసివేయడానికి కూలివాళ్ళ జీతాల కోసం మరలా అప్పుకి పరుగు పెట్టాలి. పంట వేయడానికి అప్పు. తప్పు ఎవరిదైనా పంట కుళ్ళిపోతే తీయడానికి అప్పు.

రైతు భూమిని అమ్ముకోలేక నమ్మకం పెంచుకోడు. తన భూమిని అమ్మ అనుకుని నమ్మకం పెంచుకుంటాడు. ఈ ఏడాది పంట పండుతుంది… ఈ ఏడాది పంట పండుతుంది…. అని ఎదురుచూపులు. ఏళ్ళు గడుస్తాయి, ప్రభుత్వాలు మారతాయి, బ్యాంకుల లాభాలు సంవత్సరానికి వేల కోట్లలో ఉంటాయి. తాగేవాడు తాగుతాడు, తినేవాడు తింటాడు, తిరిగే వాడు తిరుగుతాడు, పాలించే వాడు పాలిస్తాడు. మరి రైతేం చేస్తుంటాడు. సంవత్సరం మొత్తం తన పంట చుట్టు తిరుగుతూనే ఉంటాడు. అదృష్టం బాగుండి ఒక ఏడు పంటలు పండితే, అన్ని ధరలు పెరుగుతాయి. రైతులకిచ్చే మద్దతు ధర తప్ప. ఇంక “దేశానికి రైతే రాజు” అని చెప్పుకుని రొమ్ము విరుచుకుని తిరగమంటావా చెప్పు అని వీరయ్య అడుగుతున్నాడు.

వీరయ్య నువ్వు చెప్పింది వాస్తవమే కావచ్చు, నాకు తెలిసినది నేను రాజునా రైతునా అని కాదు, నేను భూమిని తల్లిలా భావించి ఆ తల్లి సాయంతో ధాన్యాన్ని పండించి, నా బిడ్డల లాంటి మరి కొంత మంది బిడ్డల ఆకలి తీర్చాలని అన్నాను. సరేరా! నీకు విషయం తెలిసినట్టు లేదు. ఈ సీజన్ పంటను మేమెవరం వేయడం లేదు అన్నాడు వీరయ్య. నాకు ఆశ్చర్యం వేసింది. ఊరిలో ఎవరు వేయడం లేదా? అన్నాను. “అవును, మేము ఎవరం వేయడం లేదు. నువ్వేస్తావా?” అని వెకిలిగా చూసి నవ్వాడు వీరయ్య. వీరయ్య వెకిలి నవ్వు నాకు నచ్చకపోయిన వేస్తాను వీరయ్య అని చెప్పి వెనుతిరిగి ఇంటి వైపు బయలుదేరాను.

నేను ఇంటికి రావడం కంటే ముందే నేను పంట వేయబోతున్న విషయం ఇంటికి చేరినట్టుంది. నా భార్య నన్ను చుట్టుముట్టి మీకు మతి ఉందా ? అందరు పంట వేయకుండా ఆగిపోతే… తగుదునమ్మా అని మీరు వేస్తాను అన్నారంటా అని అడిగింది. ”అవును” మహాలక్ష్మి వేస్తాను. పంట వేస్తే తప్పు ఏం ఉంది. అది తరతరాలుగా చేస్తున్న వృత్తేగా ! ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ సారైనా పంట బాగా పండుతుందనే నమ్మకం నాకుంది అన్నాను. తను నా వైపు చూసి నవ్వి లోకం మీలా నమ్మకం మీద నడవడం లేదు, అంతా అమ్మకం మీదే నడుస్తుంది. అయినా పంట వేయడానికి పెట్టుబడికి కావలసిన ధనం మన దగ్గర లేదుగా ? మరి ఎలా వేస్తారు పంట అంది.

అదే ఆలోచిస్తున్నాను నేను కూడా! ఒక సారి మన ఊరి షావుకారుని కలిసి అప్పు అడగాలి. షావుకారు ఇస్తే పంట పనులు మొదలు పెట్టొచ్చు అన్నాను. తను బుగ్గలు నొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చి మీకు నిజంగా మతి పోయింది. షావుకారు దగ్గర అప్పు చేసి పంట వేస్తారా? పంట అటు ఇటు అయితే మీరు ఏ పురుగుల మందో తాగి చావాల్సి వస్తుంది. ఆ షావుకారు బాధ భరించలేక అంది.

నేను గత ఆలోచనల నుండి బయటపడ్డాను. నిజమే ఆ రోజు నా భార్య చెప్పినట్టు, ఊరి వాళ్ళు చెప్పినట్టు పంటను వేయకుండా ఆగి ఉంటే బాగుండేదేమో? భూమిని నమ్మిన రైతుగా, వాళ్ళ మాటలు నమ్మలేకపోయాను. నిజమే ఇప్పుడు నాకున్న దారి ఒకటే ! షావుకారి చేత మాటలు పడి, ఊరి వాళ్ళ, ఇంటిలో వాళ్ళ మాటలు పడి అవమానం పడడం కంటే, చనిపోవడమే మేలు అనిపిస్తుంది. నేను ఇంటి అటక మీదకు చూసాను. రెండు మూడు రంగుల్లో మెరిసిపోతుంది పురుగుల మందు డబ్బా. బయటకు చూశాను వర్షం ఆగింది. కానీ, వర్షపు నీళ్ళు కాలువలా ప్రవహిస్తున్నాయి. నాకు తెలుసు ఆ వర్షపు నీరంతా ప్రవహించి ప్రవహించి నా పంటను ముంచేస్తుందని. నేను వెళ్ళి అటక మీద పురుగుల మందు డబ్బాను అందుకున్నాను.

వెనుక నుంచి మా ఆవిడ పిలుస్తుంది. ఏవండి భోజనం చేసి వెళ్ళండి అని. నాకు నవ్వు వచ్చింది. మరి కొద్ది సేపటిలో చనిపోయే ప్రాణాలకి ఆహారం అవసరమా అనిపించి చేను వైపుగా నడుస్తున్నాను. నాతో పోటి పడుతున్నట్టుగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. నేను నా పొలాన్ని చేరుకుని పంట వైపు చూశాను. పంట మొత్తం మునిగి పోయి ఉంది. నా మనసు కూడా లోకం అనుకునే మాటలతో నిండిపోయి ఉంది. నెమ్మదిగా పురుగుల మందు డబ్బా మూత తీశాను. ప్రవహిస్తున్న నీళ్ళ చప్పుడు,. వేగంగా కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు వినిపిస్తుంది.

మరి కొద్ది సేపటిలో అన్ని బంధాలను,బాధలను వదిలించుకుంటూ నా ఆత్మ శూన్యంలో కలిసిపోతుంది. నాకు ఆనందంగా అనిపించింది. నేను రైతుగానే చనిపోతున్నాను. ఉన్న పొలాన్ని అమ్ముకుని, పట్నంలో కూలిపని చేసుకుంటూ బ్రతుకును ఈడ్చడం కంటే ఒక రైతుగా చనిపోవడం నా ఆత్మకు సంతృప్తి. నెమ్మదిగా పురుగు మందును గొంతులో పోసుకోవడానికి నోరు తెరచి డబ్బా పైకెత్తి కనులు మూసుకున్నాను. టప్ మని నా చేతిపైన దెబ్బపడేసరికి అసంకల్పితంగా చేతిలోని పురుగుల మందు డబ్బాను నేల మీదకి జారవిడిచాను.నా ఎదురుగా షావుకారు భారీకాయం నిలబడి ఉంది.

నాకు ఆయన వైపు చూసే ధైర్యం సరిపోలేదు. తల నేలకు దించుకున్నాను. షావుకారు చేయి నా భుజం మీద పడిందిపద వెళ్ధాం అంటూ, నెమ్మదిగా ఆయనతో నడుస్తున్నాను. ఆయన నన్ను అప్పు కట్టమని తిట్ట లేదు. కానీ కొన్ని మాటలు చెపుతున్నాడు.

“చూడు” అచ్యుత్ దేశానికి రైతే రాజు అని ఎందుకన్నారో తెలుసా? ఒక రాజు ఎలా అయితే తన రాజ్యాన్ని సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆపదల నుండి రాజ్యాన్ని రక్షించుకుంటాడో? అలానే రైతు కూడా తన పంటను రక్షించుకోవడానికి అహర్నిశలు కష్టపడి ప్రకృతితో – పురుగులతో – ఆపదలతో పోరాడుతూ పంటను పండించి దేశానికి అన్నం పెడతాడని. నా దగ్గర డబ్బు ఉంది. నేను ఆకలి వేస్తే డబ్బును తినలేను. ఆ డబ్బుతో వచ్చే ఏ హంగు ఆర్భాటాలను తినలేను. నేను తినగలిగేది ఓ రైతుగా నువ్వు పండించే అన్నం మాత్రమే! నేను నీకు అప్పు ఇచ్చింది నువ్వు పండించి వడ్డి ఇస్తావని కాదు. అందరు పంట వేయమని వెనుకడుగు వేస్తే, నువ్వొక్కడివే పంట వేస్తావని ముందుకు వచ్చినందుకు సంతోషంతో ఇచ్చాను. పోయిన పంటతో డబ్బు పోగుట్టుకున్నావు అనుకున్నాను.

కానీ, నువ్వేమిటయ్యా అచ్యుత్ నా నమ్మకాన్ని, నీ ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోయి ఇలా ప్రవర్తిస్తావు అనుకోలేదు అన్నాడు. ఎందుకో ఆయనను చూస్తే నా ధైర్యం నన్ను చేరుకున్నట్టనిపించింది. రెండు చేతులు జోడించి నమస్కరించాను. ఆయన నా చేతులను దించి ఇవి నమస్కరించకూడదు నాగలి పట్టాలి. రేపు ఇంటికి వచ్చి డబ్బు పట్టుకెళ్ళు. మరో పంటలో నా రుణం తీర్చుకోవచ్చు అని ముందుకు వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తున్నాను. ఆపదలో ఆదుకునే ఆపన్నహస్తం ఉంటే ఎవరి ఆత్మవిశ్వాసం అయినా ఆత్మహత్యగా మారదుగా అనిపిస్తుండగా.

గాయత్రి

You May Also Like

One thought on “షావుకారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!