ప్రేమ తీరంలో

చదువుతున్న పుస్తకం మూసేశాను.. కానీ, కొత్తగా చదువుతున్న భావాలు, తెలుసుకుంటున్న భావనలు అన్నీ.. సరికొత్త ప్రశ్నలుగా మారి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి.

ప్రేమ.. ఇంత బాగుంటుందా..!

ప్రేమిస్తే ఇంతగా మోహిస్తారా..!

మోహం ఇంత గాఢంగా వుంటుందా..!

ఇన్నేళ్లు ఇవన్నీ నాకు ఎందుకు తెలియలేదు?

ఆలోచించలేదా..?

అలా ఆలోచించాలి అనుకోలేదా..?

ఆలోచించాలి అంటే భయం వేసిందా..?

మనసులో ఈ భావాల్ని నాలో ఎందుకు ఇన్నాళ్లుగా అణిచివేశాను..?

ఎవరు కారణం అంటే.. ఏమో.. చాలా చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడు నాకు అవన్నీ ముఖ్యం కాదు. ప్రేమలోని ఈ భావాలన్నీ నాకు తనలో చూడాలి అని వుంది, తెలుసుకోవాలని వుంది, ఆస్వాదించాలని ఉంది., కానీ ఎలా..? ఎలా? ప్రేమ ఇలా.. ఇంత మాధుర్యం ఉంటుందని తెలిసిన తర్వాత కూడా ఆగడం, ఇక నా వల్ల కావడం లేదు.. ఎలా..?

ఏవేవో ఊహల్లో విహరిస్తున్న మనసుకి, ఈ చల్లగాలి జంటగా చేరి, ఆలోచించింది చాల్లెమ్మంటూ.. నన్ను నా తోడు దగ్గరకి వెళ్ళమని, ఇక తన ప్రేమలో ఏ ఒక్క క్షణం మిస్ అవకూడదని చెప్తున్నట్లుంది. రోజూ తను వెళ్లిన క్షణం నుండి మళ్ళీ తన కోసమే ఎదురు చూస్తూ, తను వదిలి వెళ్ళిన ఆ మేని పరిమళం.. అనుక్షణం తన తలపు వలపులను తట్టి లేపుతుంటే కుదురుగా ఉండలేక.. తెలియని ఆ తీయని బాధని.. కోపంగా మార్చుకుని తనపై కసిరేదాన్ని.

“నీ చిరునవ్వులోనే నేను వుండేది.. అదే నీ మోముపై లేని నాడు నేను ఉన్నా లేనట్లే బుజ్జి..” అని తను అంటుంటే.. తన కళ్ళలో నాపై ఆరాధన.. నా మీద తనకి ఉన్న అలౌకికమైన ప్రేమ.. అపుడు తెలియలేదు నా పిచ్చి మనసుకి. ఆ భావం, తన ప్రేమ ఇప్పుడే తెలుస్తుంది. తను వచ్చే టైం అవుతున్న కొద్దీ మనసులో అలజడి. అవునూ.. ఇది తను చెప్పిన.. ఆ అలజడే కదా..”సంద్రంలో ఎగిసే అలలు చూసిన.. నిన్ను చూసినా మనసులో ఒకేలాంటి భావం కలుగుతుంది తెలుసా బుజ్జి..”అంటూ బీచ్ లో వున్నప్పుడు.. తను నాతో అన్న మాటల అర్దం ఇప్పుడే, ఈ క్షణమే.. నా మది తనకై ఎదురు చూసే ఈ ఆరాటంలోనే తెలుస్తుంది.

‘కొప్పున మల్లెల కవ్వింపుతో.. చిరుస్వేదం చిందిస్తున్న.. ఈ తనువు తమకాన్ని చూసి.. జాలి కలిగిన ఆ సూర్యుడు సైతం.. రేయిని రమ్మంటూ ఆహ్వానించి వెళ్ళిపోయింది.. కానీ నా మది తెలిసిన మగడు మాత్రం ఇంకా రాలేదే..’ఏంటి ఈ భావాలు, ఈ కవితలు నాలో కొత్తగా., ఇదంతా ఎక్కడ దాగింది ఇన్నాళ్లు. “త్వరగా రా బావ చూడాలని ఉంది…” మనసులోని మాటలు పైకే అనేస్తున్నా ఒక్కోసారి ఆగలేక.

ఇదేంటి పెళ్లి అయి 15 యేళ్లు దాటిన నేను ఇలా ఆలోచిస్తున్నా..? ఏమో? అయినా వయసుకి, మనసుతో సంబంధం ఏంటి అసలు, ఎందుకు ఆలోచించకూడదు..! నా జీవితం.. నా బావ.. నా ఇష్టం..! మనసుకి, ఆలోచనలకు.. స్వేచ్ఛను ఇస్తే ఇంత బాగుంటుందని ఇప్పుడే కదా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇవే భావాలు, ఇవే ఎదురుచూపులు, ఇవే ఆలోచనలు.. ప్రతి రోజూ నాలో. ఇంతలో… కాలింగ్ బెల్ సౌండ్. బావ వచ్చేసాడు, మనసులో అలజడి మళ్ళీ మొదలైంది. వెళ్ళి తలుపు తీశాను. నా వైపు చూడకుండా లోనికి వెళ్తున్నాడు. ఏదో బాధ, చూడలేదనా, నన్ను పట్టించుకోలేదనా తెలీదు.

“బావ…” నెమ్మదిగా పిలిచాను. “హ ఏంటి..” నన్ను చూడకుండా సమాధానం చెప్తున్నాడు. నా ప్రేమంతా మాటలుగా మార్చి “ఓ..య్ బావా…..” అన్నాను. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇలా ప్రేమగా పిలిచేదాన్ని. నా పిలుపులోని తేడా తెలిసింది అనుకుంటా, నా వైపు తదేకంగా, ఆశ్చర్యంగా చూస్తూ “ఏంటి బుజ్జీ..” అంటుంటే, ఆ చూపులకు సిగ్గేసి  “ఏం లేదులే..” అంటూ లోపలికి వెళ్ళిపోయాను. తను ఆశ్చర్యంగా నన్నే చూస్తున్న విషయం ఇంకా తెలుస్తుంది, కానీ పట్టించుకోనట్లు పని చేసుకుంటూ ఉన్నాను. బావ నాలో మార్పు గమనిస్తున్నాడా..? లేదా..?, అసలు నాలో రేగే ఈ అలజడి ఎలా చెప్పాలి. పెళ్లి అయిన కొత్తలో ఇలా అనిపించేది, కానీ ఎంత బావ అయినా.. తను మగాడే కదా, చొరవ తీసుకుంటే, ఏమైనా అడగాలి అంటే.. ఏం అనుకుంటాడో అని భయం.

పెళ్లికి ముందు నేను ఎక్కువగా మాట్లాడలేదు తనతో, తను మాట్లాడ్డానికి ట్రై చేసినా, ఎందుకో ఏదో తెలియని బిడియం. నాలో ఎంత ప్రేమ ఉన్న.. ఎప్పుడూ తన దగ్గర ఒక భయం ఉండేది. అది నేను పెరిగిన పద్దతి వల్లనా, సమాజం వల్లనా, లేక సహజంగా వచ్చిందా తెలీదు. ఇక తర్వాత బాబు పుట్టడం, కొన్నేళ్లకు అత్తగారు, మామగారు చనిపోవడం, ఆడపడుచు పెళ్లి అంటూ ఒక్కో బాధ్యత తీర్చుకుంటూ, వాటి మధ్య ప్రేమను ఆస్వాదించాలి అనే ఆలోచనే రాలేదు., సెక్స్ కూడా ఏదో పని అన్నట్లుగా మెకానికల్ లైఫ్ కి అలవాటు పడిపోయిన నాకు కాలం ఎలా గడిచిందో గుర్తే లేదు.

ఈ కరోనా టైంలో బాబు, మా చెల్లి ఊరికి వెళ్లి వాళ్ళ పిల్లలతో అక్కడే ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉండిపోయాడు. ఇంట్లో ఇద్దరమే ఉంటున్నా, ఏదో మౌనం ఇద్దరి మధ్య. బోర్ గా అనిపించి ఆన్లైన్లో బుక్స్ చదువుతున్నా. అలా ఈ మధ్య కొత్తగా తపస్వి అనే రైటర్ రాసిన కథలు, కవితలు చదివాను, అందులోని ప్రతి ప్రేమకథ, కవిత.. నాలో దాగిన భావాలను సరికొత్తగా ఆలోచించేలా చేశాయి. ఆ ఆలోచనల ప్రభావమే నాలో ఈ మార్పు. ‘నాకే కొత్తగా ఉన్న ఈ భావాన్ని, నీకెలా చెప్పను బావ. నా మౌనంలో ఈ మార్పు నువ్వే అర్దం చేసుకుంటే ఎంత బాగుండు..’ అనుకుంటూ పనులన్నీ త్వరత్వరగా కానిచ్చి, బావని డిన్నర్ కి పిలిచాను, కానీ ఎంతకీ రాలేదు.

ఏం చేస్తున్నాడు బావ పిలిచిన పలక్కుండా అర్ధం కాలేదు. “బావా… బావా..” అంటూ బెడ్ రూంకి వెళ్ళి చూస్తే.. స్నానం చేసి, ఎప్పటిదో లోపల ఉన్న తెల్ల పంచెని లుంగిలా కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆశ్చర్యంగా అనిపించింది. అలా మా పెళ్ళైన కొత్తలో కట్టుకునే వాడు., ఈ రోజు ఏంటి ఇలా.. నా మనసు తెలిసిపోయిందా బావకి, నాలో మార్పు అర్దం అయి ఉంటుందా, అలా అనుకోగానే ఏదో తెలియని బిడియం మళ్ళీ నాలో. “ఏంటి బావ పిలుస్తుంటే రాకుండా ఇక్కడ కూర్చున్నావు” మెల్లిగా అన్నాను. “బుజ్జి ఇలారా..” ప్రేమగా పిలిచాడు. వెళ్లి ఎదురుగా నిలుచున్నాను, నన్ను దగ్గరగా తీసుకుని తన కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని.. గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంతలా అంటే నా ఊపిరి ఆగిపోతుందేమో అనేంతలా.

ఏం జరుగుతుందో ఏమో.. నాకు ఏమి అర్దం కాలేదు, కానీ.. చినుకు తడికి పురివిప్పిన నెమలి.. పులకరించి నాట్యమాడినట్లు.. ఆ బిగి కౌగిలిలో, తన విరహంలో.. ఇన్నాళ్లుగా నాలో దాగిన కోరికలన్నీ, దాచిన భావాలన్నీ ఒక్కసారిగా తుళ్లిపడ్డాయి. “బావా…..” అంటూ ఆగలేని తనువు ఆరాటంగా తనని ఇంకా గట్టిగా హత్తుకుంటుంటే..

నాలోని మోహం, ప్రేమ, కోరిక.. అక్షరాలై మనో ఫలకంపై లిఖిస్తుంటే..

అదిరే నా పెదవుల సడి.. నీ గుండె సవ్వడితో కలిసి..

నను నీ అధరామృతాన్ని గ్రోలి.. నీకు మధురామృతం పంచమంటుంటే..

ఆపలేని నా పరువాల మత్తు.. నీ కోరికల కళ్ళాన్ని చిత్తుగా ఓడిస్తుంటే..

నా జఘన గగనాలను తాకాలని.. నీ మగసిరి మేఘమై ఉరకలు వేస్తుంటే..

నా మది గదిలో దాగిన భావం.. నిను నా దరి చేర్చి.. మనల్ని ఒకటై పొమ్మంటుంటే..

స్వేదంగా మారిన మన ఊసులు.. జ్ఞాపకాలై పోతుంటే..

జ్వలిస్తున్న ఈ కోరికలు.. రవికిరణంలా మారి సరికొత్తగా నను పలకరిస్తుంటే..

ఏకమవుతున్న మన శ్వాస.. అలాగే సాగిపోవాలని కోరుకుంటుంటే..

మన కలయిక చూసి సిగ్గుపడిన నింగి.. మేఘాలను అడ్డుగా పెడుతుంటే..

మన దేహాన్ని కప్పేయాలని ఆరాటపడే..మట్టి రేణువు సైతం.. మురిసిపోతూ మౌనమై పోతుంటే..

మన వేడి నిట్టూర్పులతో మైమరచి.. పంచభూతాలు పరవశంలో పులకరిస్తుంటే..

నలు దిక్కులు.. దారి తెలియక.. ఈ చీకటిలో కరిగిపోతుంటే..

నీ నుండి నిన్నే వేరు చేసి.. నాలో కలిపేసుకుంటుంటే..

నా శ్వాసతో.. నిను పరిపూర్ణం చేసేస్తుంటే

రతిని నేనై.. మన మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్న వేళలో..

ఈ సరాగాల సరస శృంగార కేళిని ఆప ఆ బ్రహ్మ తరమౌనా..!?

అవధులు లేని ఆ రసానుభూతిలో విడివడిన మా వలువలు సైతం వింత అనుభూతిలో.. మరల మాపై వచ్చి చేరాయి. ఒక్కో క్షణం అలౌకిక ఆనందంలో ఉక్కిరిబిక్కిరైన ఈ సమయం.. ఊపిరి పీల్చుకుని టిక్ టిక్ మంటూ గోడపై వి(క)నపడగానే.. బావ ఆకలి గుర్తు వచ్చి.. “అయ్యో బావ చూడు ఎంత టైం అయ్యిందో.. వంటలు అన్నీ చల్లారిపోయి వుంటాయి, పద వెళ్లి భోజనం చేద్దాం..” అంటుంటే.. “ఏంటి దేవి గారి ఆకలి ఇంకా తీరలేదా…” అంటూ.. లేస్తున్న నన్ను తన పైకి లాగి.. తడి ఆరుతున్న పెదవుల పై.. మరో మధుర జ్ఞాపకం తీపిగా అద్దుతుంటే.. తనివి తీరని నా మోహం.. అడ్డు చెప్పలేదు.

తన కోరిక.. కావాలనిపించే ప్రేమ

తన స్పర్శ.. వదలలేని మత్తు

తన మోహం.. తీరని దాహం

అనుక్షణం.. అనుభవించినా

క్షణక్షణం.. ఆస్వాదించినా

క్షణాలు ఎన్ని ఆగి.. విరహంతో వేగినా..

రాబోయే క్షణంలో.. ఇంకా ఏదో మిగిలే వుంటుందేమో

వర్ణింపలేని ఈ మధుర భావంలో అనిపించింది.

“ఇన్నాళ్లుగా నాకు తెలియని ఈ బుజ్జిని ఎక్కడ దాచావే…” అంటూ ఒక్క క్షణం కూడా వదలలేని చంటి పిల్లాడిలా నన్ను అలాగే కౌగిలిలో బంధించి…”నీలో ఈ మార్పు… ఈ ప్రేమ చూడాలనే కదరా ..! ఎన్నేళ్ళగానో ఎదురు చూసింది, ఇప్పటికి నా కల నెరవేరింది, ఇక ఎప్పటికీ ఇలాగే ఉండురా బుజ్జి.. అస్సలు మారకు ప్లీజ్.”

‘తనువు… మనసు కలిసే అద్భుతమైన ప్రేమ తీరంలోని అలౌకికమైన భావాలు చూపించేందుకు, తను కూడా ఆ తీరం చూసేందుకు ఎంతగా ఎదురు చూసాడు నా బావ…’ “ఇక పై నా ప్రతి క్షణం.. నీ కోసమే బావ.. కేవలం నీకు మాత్రమే సొంతం.

నా అణువణువు నిండిన నీ రూపం.. నా కనులలో..

నా తనువులో నీపై మోహం.. నా స్పర్శలో..

నా గుండెల్లో దాగిన ప్రేమ.. శ్వాసగా..

నిను క్షణక్షణం పలకరిస్తూనే ఉంటుంది బావ..”

అంటూ తన నుదిటి పైన ముద్దుతో ప్రామిస్ చేసాను. “నా బుజ్జిలో ఇంత మార్పుకి కారణం ఏంటో…” అంటూ ముద్దు ముద్దుగా అడుగుతున్న బావకి…”మళ్ళీ రాత్రికి ఇలా ఇంకో మంచి గిఫ్ట్ ఇవ్వు.. అప్పుడు చెప్తా..” అని అక్కడి నుండి జారుకున్నాను.

ఇపుడిపుడే మొదలైన ఈ భావాలన్నీ.. గుండెల్లో పదిలంగా దాచుకుంటూ.. చెరగని అక్షరాలుగా మార్చి..

నా ప్రేమతీరం డైరీలో రాసుకుంటున్నా..!

బుజ్జమ్మ పలుకులు

You May Also Like

13 thoughts on “ప్రేమ తీరంలో

  1. ప్రేమ కదా బుజ్జిమ్మ చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది.💖👌👌👏🏻👏🏻

  2. చాలా బాగా చెప్పారు తన భర్త పట్ల ఉండే ప్రేమని అది తెలుపటానికి మీరు ఉపయోహించిన కవిత్వం చాలా చక్కగా ఉంది

    1. తీరిక లేని కుటుంబ జీవితాన
      మనువాడిన వాడిపై మనసులో కలిగే ప్రణయ రసరమ్య భావాలను సిగ్గు బిడియంతో లోలోపల ఊహించుకుంటున్న మగువ మదిలోని… మాటలను గ్రహించిన తన బావ చాటుమాటు సరసాలతో సాగే అందమైన ప్రణయ కావ్యాన్ని రచించారు.
      కథ మొదట్లో చెప్పినట్లు
      ప్రేమ యింత బాగుంటుందా
      ప్రేమిస్తే యింతగా మోహిస్తారా
      మోహం యింత గాఢంగా ఉంటుందా అని
      ప్రేమ తాలూకు గాఢతను చదువరుల మది అనుభవించేంత అద్భుతంగా రాశారు.
      ఇద్దరు మనుషుల ఏకమై
      ఒకే ఆలోచనతో… కలిసిపోయే ఏకాంత సమయాన్ని
      కవిత్వికరించిన తీరు అమోఘం 👏👏👏👏👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!