శ్రీవారికి ప్రేమలేఖ

ప్రియ సఖా…

ఎలా ఉన్నావు ? బాగున్నావా..? కొత్తగా ప్రేమ లేఖలు ఏంటా అన్ని ఆశ్చర్యపోతున్నావా, మరి ఏం చెయ్యను? టెక్నాలజి పెరిగి పోయాక, వాట్సప్, ఫేస్ బుక్ ఇవన్నీ వచ్చాక మనం మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేకుండా పోయింది. మార్నింగ్ నువ్వు ఆఫీస్ కి వెళ్లిపోవడం, ఈవినింగ్ వచ్చాక ఫేస్ బుక్, వాట్సప్ అంటూ కూర్చోవడం, నాకేమో బాబుతో సరిపోతుంది. నాతో మాట్లాడమంటే ఇప్పుడు సమయం లేదు అంటూ దాటేయడం.. ఇవన్నీ చూసి ఇక ఆగలేక ఇలా రాస్తున్నాను.

మీకు గుర్తుందా! మన తొలి పరిచయం…

ఆ క్షణం నన్ను నేను మరిచిపోయి రోడ్డు మీద నడుస్తున్న, ఎదురుగా ఏం వస్తుందో గమనించడం లేదు. సడన్గా ఎవరో నా చేతిని పట్టి లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసాను, ఎదురుగా నువ్వు ఎంత బాగా కనిపించావు తెలుసా నా కంటికి, ఆ క్షణమే నేను నువ్వయిపోయాను. నా మనసంతా నువ్వే అయిపోయావు.           నువ్వు నన్ను తిడుతున్నా నాకు ఆ మాటలు ఏమీ వినిపించడం లేదు, నువ్వు నాకు ఎన్నో జన్మల నుంచి పరిచయం ఉన్న వాడిలా కనిపించావు.

వెనుక నుండి నా ఫ్రెండ్ లల్లి, నీకు గుర్తుండే ఉంటుంది కదా. లల్లి నా వెనుక నుంచి నన్ను కదుపుతూ ఉంటే నాకు ఏమీ అర్థం కాకుండా నిన్ను చూస్తూ నిలబడిన ఆ క్షణం.. నాకు భూమి ఆకాశం ఒకటే అయిపోయిన విధంగా కనిపించాయి తెలుసా. నేను తేరుకునే లోపే నువ్వు వెళ్ళిపోయావు, కాసేపు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. లల్లి ఏమో నీకేమైనా పిచ్చా రోడ్ మీద అలా నడుస్తూ వెళుతున్నావు… ఎదురుగా ఏం వస్తున్నాయో తెలియలేదా అంటూ తను తిట్టడం మొదలు పెట్టింది. నేనేమో దూరం అవుతున్న నీ రూపాన్ని అలా చూస్తూ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి నీ రూపాన్ని నా కనులలో నిలుపుకోసాగాను.

కాలేజీలో మొదటి రోజు…

బీటెక్ చదవడం ఏమో గాని, నాకేమో సైకాలజీ  చదవాలని ఉంది కానీ మా నాన్న పోరు పడలేక ఈ బీటెక్ లో జాయిన్ అయ్యాను. అదే నాకు, నీకు మంచి చేసిందేమో కదా. ఇద్దరు మనుషులు కలవాలి అని రాసి ఉంటే సప్త సముద్రాలు అవతల ఉన్న ఇద్దరు కలుస్తారు అని కథల్లో అంటుంటే అలా కూడా జరుగుతుందా అనుకున్న. కానీ.. ఆ రోజు నిన్ను రోడ్డు మీద చూసిన క్షణం నుండి, బయటకి వచ్చిన ప్రతిసారీ నా కళ్ళు నీ కోసమే  వెతికేవి. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా తెలిసిన ప్రతి సోషల్ మీడియాలో నీ కోసం వెతికా, అయిన నా పిచ్చి కానీ కాలమే నిన్ను మళ్లీ నా దగ్గరకి తీసుకురావాలని ప్లాన్ చేస్తే నాకు నువ్వు అంత తేలిగ్గా ఎందుకు దొరుకుతావు. ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా గుర్తు ఉందా అని అడగకు. నిన్ను చూసిన క్షణం నుండి నీ ప్రతి చిన్న విషయం నాకు బాగా గుర్తు.

నేను కాలేజ్ జాయిన్ అయిన 3వ రోజు..

క్యాంటీన్ కి అని వెళ్ళిన నన్ను లల్లిని సీనియర్స్ ఆపి రాగింగ్ చేస్తుంటే బిక్కముఖాలు వేసుకుని, వచ్చే ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నపుడు సడన్ గా నాకు సీనియర్స్ కి మధ్య వచ్చిన నీ రూపం.. ఏంటో ఆ పరిస్థితుల్లో కూడా వెనుక నుండి నిన్ను చూసి, అదే నువ్వు అని గుర్తు పట్టేసా.. భయం, ఏడుపు, బాధ ఆ క్షణంలో ఎక్కడకి పోయాయి తెలీదు. అసలు ముందుకి వచ్చి అది నువ్వే అని తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా అలాగే వెనుక నుండి నిన్ను గట్టిగా పట్టుకోవాలి అనిపించింది. బహుశా మళ్లీ ఎక్కడ మాయమైపోతావు అన్న భయం అనుకుంటా.

అసలు అక్కడ ఏం జరిగింది, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడావు అనేది కూడా ఆ క్షణం నాకు తెలీదు. గుర్తు ఉందల్లా.. నువ్వు మా వైపు తిరిగి ఏదో మాట్లాడుతున్నావు. నేనేమో నీ కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిదానిలా నవ్వుతూ ఉన్నాను. నీకేం అర్థం అయిందో ఏమో.. నా చెయ్యి పట్టుకుని నన్ను అక్కడ నుండి పక్కకి లాక్కుని వచ్చావు.  కోటలోని రాజకుమారి కోసం ప్రియుడు రెక్కల గుర్రం వేసుకు వస్తే, చెయ్యి పట్టుకుని గుర్రం ఎక్కి ఎగిరి వెళ్ళిన భావన నాకు. ఆ క్షణంలో ప్రపంచం కూడా మూగబోతుంది అని ఆ క్షణం మళ్లీ తెలిసింది. ఎలా నడుస్తున్నాను, ఎక్కడకి అనే ఆలోచన కూడా రాలేదు. బహుశా నువ్వు అలా ప్రపంచం అంచులకి తీసుకెళ్లిన వచ్చేసేదాన్ని ఏమో.

ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఎందుకో సిగ్గు, నవ్వు వస్తాయి. ఆ క్షణంలో నన్ను అలా చూసి ఏమనుకున్నావో కదా. దాని తరువాత ఎన్ని సార్లు అడిగినా నువ్వు చిన్నగా నవ్వి మాట దాటేసావు కానీ అసలు విషయం చెప్పలేదు ఏంటో.. నీ ఆ నవ్వు చూస్తే ఇప్పటికీ నన్ను నేనే మర్చిపోతా కదా, ఎందుకు అంటావు అలా.. నీ ఆ నవ్వులోని మాయా అది!!? లేక నాలో నీపై ఉన్న పిచ్చినా!!?.

అయినా ఆ రోజు నువ్వు నన్ను అలా పక్కకి తీసుకొచ్చి ఏదో మాట్లాడి వెళ్లిపోతుంటే “వెళ్ళిపోతున్నాడు”, ఆ ఒక్క మాటే నా నోటి నుండి వస్తే..”ఏమైంది పిచ్చిదానిలా ఆ చూపులు.. ఆ నవ్వు ఏంటే!!” అంటూ నేనో పిచ్చిదాన్ని అని నా ఫ్రెండ్ లల్లి నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది కదా. కానీ ఆ పిచ్చి విచిత్రంగా నాకు నిన్ను చూసిన మొదటి క్షణం నుండి పట్టుకుంది అని ఎలా చెప్పాలో తెలియక.. “ఎవరే అతను..”, మాట దాటేస్తు అడిగాను లల్లిని అపుడు. కానీ ఆ క్షణం నుండి ఇప్పటికీ నీపై పిచ్చి పెరుగుతుందే కాని తగ్గటం లేదు అని ఎలా చెప్పను??

ఆ రోజు తరువాత నుండి నీ గురించి తెలుసుకోవటానికి ఎంత ట్రై చేశాను అనుకున్నావు.  నువ్వేంట్రా అంటే నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయేవాడివి. రోజూ కాలేజీకి వచ్చి నేను మొదట చేసే పని నీ కోసం వెతకటం. అపుడపుడు క్యాంటీన్ దగ్గర, ఒక్కోసారి బయట సిగరెట్టు తాగుతూ, ఇంకోసారి బండి మీద కూర్చుని,

క్లాస్ లో.. ఇలా నువ్వు కనపడే వరకు నీ కోసం వెతుకుతూ తిరిగే దాన్ని. అప్పటికే నాకు నీ పిచ్చి పట్టింది అని అర్థం చేసుకున్న లల్లి తల కొట్టుకుంటూనే నాతో వచ్చేది. అసలు అపుడు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్ధం అయ్యేది కాదు. అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలి అని ప్రయత్నం చేసేవాడివి కాదో తెలిసేది కాదు.

కానీ నీకు గుర్తు ఉందా మళ్లీ 6 నెలల తరువాత నేను 3 రోజులు కాలేజికి రాకపోతే తరువాత రోజు నేను క్లాస్ లో ఉండగా నేరుగా నువ్వు నా క్లాస్ కి వచ్చి.. “ఈ 3 రోజులు ఏమైపోయావు?” అని నువ్వు అడిగిన ప్రశ్న….. నాకు “ఐ లవ్ యూ ” అని నువ్వు నాకు చెప్పినట్టు వినిపించి, నేను ” మీ టూ ” అన్నాను. ఇప్పటికీ అది గుర్తు వస్తే నాకు నవ్వు ఆగదు. ఆ రోజు నుండి మన మధ్య పరిచయం ఎంత ఫాస్ట్ గా పెరిగింది. ఆఖరికు కాలేజి బెస్ట్ కపుల్ అని మన గురించి అనుకునేవాళ్లు గుర్తు ఉందా.

కానీ విచిత్రం ఏంటంటే.. ఏ రోజు కూడా నువ్వు నాకు I LOVE YOU చెప్పలేదు, నేను నీకు చెప్పలేదు. హా హా.. అయినా అదేంటో కలలో కూడా రోజూ వందల సార్లు నీకు  I LOVE YOU చెప్పాలి అనుకునేదాన్ని. ప్రతిసారీ నిన్ను కలిసే క్షణం ముందు వరకు కూడా అనుకుంటూ ఉండేదాన్ని అలా చెప్పాలని, కానీ అదేమిటో నీ కళ్ళలోకి చూస్తే చెప్పాలి అన్న విషయం మర్చిపోయేదాన్ని.

నాకంటే 2 సంవత్సరాలు సీనియర్ అవ్వటం వల్ల నువ్వు వదిలి వెళ్లటం, ఎంత నరకంగా ఉండేది తెలుసా నాకు. కాలేజిలో మనం తిరిగిన ప్రతి చోట, మాట్లాడుకున్న చోటులో.. పిచ్చిదానిలా తిరిగేదాన్ని. ఆఖరికి సిగరెట్ కొట్టుకు వెళ్లి అక్కడ చూసేదాన్ని. ఇపుడు అంటే మానేసావు కానీ.. అప్పటిలో గుర్తు ఉందా.. నువ్వు నేను పక్కన వుండగానే సిగరెట్ తాగుతూ ఆ పొగ వదిలితే చివరకు అది కూడా నేను పీల్చి.. నిన్నే నాలో నింపుకున్న ఫీలింగ్ ఇచ్చేదాన్ని. అలా ఒకసారి చేస్తే.. నాకు అనుకోకుండా విపరీతమైన దగ్గు వచ్చి నా ముఖం ఎర్రగా కందిపోయి, నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. అది చూసిన నువ్వు బాధతో ఆ క్షణమే సిగరెట్ పడేసావు. ఆ సంతోషంలో నేను నిన్ను గట్టిగా హగ్ చేసుకుంటే అందరూ ఆశ్చర్యంతో చూసారు కదా. అయినా నీకు కూడా సిగ్గు లేదు, నేనే అనుకుంటే నువ్వు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నావు ఆ క్షణం. ఆ క్షణంలో మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని చూసిన చూపు ఇప్పటికీ నాకు గుర్తు.

నువు జాబ్ కోసం వెళ్లి 3 నెలలకి ఒకసారి వస్తూ, ఫోన్లోనే మన ప్రేమకథ నడుపుకుంటూ, ఆ రోజులే చాలా అందంగా ఉండేవి, ఎందుకు అంటావు?? కానీ ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి. మన ప్రేమ వల్ల, నీవల్ల నేను నీ లోకంలో బ్రతుకుతూ.. చదువు ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్న అని అనుక్షణం నన్ను చదువు, చదువు అంటూ విసిగించావు చూడు.. అపుడు కోపం వచ్చేది కానీ, ఇపుడు అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది. నా చదువు కూడా అయ్యి.. నీ దగ్గరకే వచ్చి ఉద్యోగం చేద్దాం అనుకున్న. కానీ నా చదువు అయిన నెలకే నువ్వు మన ప్రేమ కథ గురించి మా ఇంట్లో చెప్పటం, మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే సరే అనటం.. ఏంటో నాకే షాక్.

నిశ్చితార్థం జరిగిన తరువాతే కదా నాకు తెలిసింది, మీ నాన్న , మా నాన్న ఫ్రెండ్స్ అని.. ఆ రోజు నువ్వు నన్ను కాలేజిలో వెతుక్కుంటూ వచ్చి రక్షించింది కూడా మీ నాన్న చెప్పబట్టేనని, మా నాన్నే నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు అని. నువ్వో పెద్ద మాయగాడివి, అన్ని సైలెంట్గా చేసి, ఏమి తెలియని వాడిలా నవ్వుతూ ఉంటావు. నేను సరిగా చదవటం లేదు అన్న విషయం కూడా మా నాన్న చెప్పబట్టే నువ్వు నన్ను అలా మందలించావు అని కూడా నువ్వు చెబితే తప్ప తెలుసుకోలేకపోయాను.

ఇక పెళ్లి.. నిజంగా నా కంటే అదృష్టవంతురాలు ఉంటుందా? ఎంత బాగా జరిగింది కదా మన పెళ్ళి. ఇన్ని సంవత్సరాల్లో కనీసం నా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టని నువ్వు. నిశ్చితార్థం అయిన దగ్గర నుండి నన్ను.. ఎందుకులే ఇపుడు పక్కన లేవు.. మళ్లీ ఆ ఆలోచనలు తట్టుకోలేను. ఇక మన మొదటి రాత్రి.. రతీమన్మధ యుద్ధంలా జరిగింది కదా. ఒక రకంగా నన్ను మానసికంగా తయారు చేసింది కూడా నువ్వే. నిశ్చితార్థం తరువాత, అల్లరి మాటలు, ఆ రొమాన్స్.. ఉఫ్ఫ్.. వద్దులే. ఆ కష్టం ఏంటో మన పెళ్లి అయ్యాక వచ్చిన ఆషాఢానికి తెలుసు. అయినా మనం ఎన్ని దొంగదారులు వెతుక్కోలేదు.. కానీ నువ్వు? నేను వెళ్ళను అని ఏడ్చి గోల చేస్తే.. వెళ్ళాలి అంటూ ఇంటికి పంపింది నువ్వేగా. అయినా ఇంటికి వెళ్లి నీ మీద కోపం చూపించాలి అనుకున్నా.. కానీ రెండో రోజుకే నువ్వు వస్తే మా ఇంట్లో అబద్ధం చెప్పి బయటకి వచ్చేయలేదా.

నిజంగా ఒక సంవత్సరం మన మధ్య రోజులు ఎలా గడిచాయి అన్నదే గుర్తులేదు నీ ప్రేమలో. ఆ తరువాత మన ప్రేమకి గుర్తుగా మన బాబు నా కడుపులో పడటం.. అవన్నీ మధురానుభూతులు కదా. ఎంత జాగ్రతగా, ప్రేమగా చూసుకున్నావు నువ్వు.  నిజంగా నా మీద నాకే అసూయ కలిగింది. ఇలాగే ఎప్పుడూ కడుపుతో ఉంటే బాగుండు కదా అని అనిపించింది. బాబు పుట్టడం.. ఇక అదో రకమైన సంతోషం. కానీ వాడు మన జీవితాల్లోకి వచ్చిన దగ్గర నుండి మన మధ్య బంధంలో కొంచెం గ్యాప్ వచ్చింది ఏమో అనిపిస్తుంది. కానీ అంతా ఆలోచిస్తే నాదే తప్పు అని అర్థం అవుతుంది. నిజం చెప్పాలి అంటే నీ ప్రేమని నేను మన బాబుతో పంచుకోవటం కూడా భరించలేక ఇలా నువ్వు నాకు దూరం అవుతున్నావని ఆలోచన చేస్తున్న అని అర్థం అయింది. ఆ ఆలోచన వల్లే నేను నీ మీద కోపం, చిరాకు చూపిస్తున్నాను అని కూడా అర్థం అయింది. ఏం చేయమంటావు, నన్ను నీ ప్రేమలో అంత పిచ్చిదాన్ని చేసేసావు.

కానీ నిజం చెప్పాలి అంటే.. నువ్వు ప్రేమ చూపించేది మన ప్రేమకి ప్రతిరూపం అయిన మన బాబు మీద అన్న చిన్న విషయం నేను మర్చిపోయా. అందుకు నన్ను క్షమించు. వాడు పుట్టిన దగ్గర నుండి పెరిగిన బాధ్యత వల్ల నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడుతుంటే, నేనేమో పిచ్చిగా నన్ను పట్టించుకోవటం తగ్గింది అని బాధపడుతున్నాను.

ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇంత ప్రేమగా.. ఇంత ఎమోషనల్ గా ఇది రాస్తే ఎందుకు ఆ నవ్వు? అలా నవ్వకు.. చూడు నువ్వు ఇది చదువుతూ నవ్వుకుంటావు అనే ఆలోచనకే, నాకు ఇక్కడ నవ్వు వస్తుంది.          సరే ఇదిగో వీడు ఇంకా ఆగటం లేదు, అల్లరి చేస్తున్నాడు, ఉత్తరం చదివి కోపం వస్తే మాత్రం కోపం చూపించకు, తట్టుకోలేను. ఒకవేళ కోపం చూపించాలి అంటే మాత్రం ఆ ఆలోచన విరమించుకో.. ఎందుకు అంటే.. ఇపుడు నేను మళ్ళీ కడుపుతో ఉన్నాను అర్థం అయిందా.

                                                                                      నీ ప్రత్యుత్తరం కోసం ఆశగా ఎదురు చూసే

                                                                                              నీ ప్రియ సఖి

రచన : ప్రశాంతి

You May Also Like

2 thoughts on “శ్రీవారికి ప్రేమలేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!