నేటి కథ

“హలో రమ్యా.. నీతో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి ఎక్కడున్నావు” అంటూ ఫోన్లో కంగారుగా మాట్లాడుతుంది బిందు. “ఎక్కడుంటానే ఇంట్లోనే వున్నా, సరే చెప్పు.. ఏంటి విషయం కంగారు పడుతున్నట్లుగా ఉన్నావు. రుచిత, రఘు ఇద్దరు బాగానే ఉన్నారుగా..” అంటూ ఆత్రంగా అడిగాను.

“వాళ్ళు బాగానే ఉన్నారే, నేనే నీతో మాట్లాడాలి” అన్నది బిందు.

“సరే చెప్పు”

“ఇలా ఫోన్లో కాదు ఇంటికి వస్తాను”

“సరే రా..”

“ఇంట్లో ఉదయ్ లేడు కదా” అని అడిగింది.

“లేదే 9 కల్లా ఇల్లు ఖాళీ అవుతుందిగా. వరుణ్ స్కూల్ కి, ఉదయ్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఎవరు లేరులే. నువ్వు రా” అన్నాను.

“హ సరే.. పది నిమిషాల్లో అక్కడ వుంటాను” అన్నది.

“సరే” అని ఫోన్ పెట్టేసి, ఇదేంటి ఇంత కంగారు పడుతుంది. ఏదో పెద్ద సమస్యని తెస్తుందా ఏంటి.. అనుకుంటూ బిందు వస్తే మళ్ళీ పని కుదరదు అని, మేడ మీద బట్టలు ఆరేసి వచ్చి, రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసాను.

ఉదయం వరుణ్ స్కూల్ కి, ఉదయ్ ఆఫీస్ కి లంచ్ బాక్స్ తీసుకు వెళ్ళాలి కాబట్టి.. కర్రీ మాత్రం ఒకేసారి చేసేస్తాను. ఇక పెద్ద పనులేమి లేకపోవడంతో బిందు కోసం ఎదురు చూస్తూ మొబైల్ చేతిలోకి తీసుకుని ఫేస్ బుక్ ఆన్ చేసాను. ఫేస్ బుక్ లో ఏవో స్టోరీస్, ఫొటోస్ చూస్తూ ఉన్నా.. అంతలో ఇంటి గేట్ చప్పుడు వినిపించింది. బయటికి చూసాను బిందు లోపలికి వస్తూ కనిపించింది.

“రావే ఏంటి అంత తొందర, ఆ కంగారు. అంత అర్జెంట్ విషయం ఏంటి, రుచిత ఏదీ..” అని అడిగాను.

“స్కూల్ కి పంపించేశానులే, రఘు కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు” అన్నది.

“సరే ముందు వాటర్ తెస్తానుండు” అంటూ లేవబోయాను.

“వద్దు రమ్యా.. నువ్వు ముందు కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలి” అన్నది.

“సరే నువ్వు ముందు కాస్త రిలాక్స్ గా ఉండు, తర్వాత చెప్పు” అన్నాను.

“లేదే చెప్తేనే ప్రశాంతంగా ఉంటాను” అన్నది.

“సరే అయితే చెప్పు” అన్నాను.

“నీకు కమల్ తెలుసు కదా..” అన్నది.

“కమల్ ఎవరే నాకెలా తెలుస్తుంది..” అన్నాను.

“అదేనే పోయినసారి మనం కలిసినప్పుడు చెప్పా కదా, ఇన్స్టాగ్రాంలో ఒక అతను ఫాలో చేస్తున్నారు నన్ను అని. మోడలింగ్ లో ట్రై చేస్తున్నాడని… అబ్బా ఒక్క నిమిషం ఉండు..” అంటూ తన ఫోన్లో ఇన్స్టాగ్రాం ఓపెన్ చేసి అతని ఫొటోస్ చూపించింది. అప్పుడు గుర్తొచ్చింది, పోయినసారి మాటల్లో ఎవరో ఒక అబ్బాయి నాకన్నా రెండేళ్లు చిన్నవాడు, నాతో చాలా బాగా మాట్లాడుతున్నాడు అని బిందు చెప్పడం గుర్తొచ్చింది.

“హా గుర్తొచ్చింది ఇప్పుడేమయ్యింది, ఆ అబ్బాయికి ఏమైనా అయ్యిందా ఏంటి..” అన్నాను ఆ ఫోటో వంక చూస్తూ.

“ఆ అబ్బాయికి ఏమీ కాలేదు, అతను నిన్న నాతో ఒక మాట అన్నాడు. అది ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు.  నాకంతా అయోమయంగా, కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే నీకు చెప్తే ఏమైనా చెప్తావని ఇలా వచ్చాను” అన్నది.

“నువ్వు అంత కంగారు పడే మాట ఏం చెప్పాడో” అన్నాను నవ్వుతూ.

“అదీ.. అదీ..” అంటూ నీళ్ళు నములుతుంది ఏమీ చెప్పకుండా. దాని వాలకం ఎందుకో కొత్తగా అనిపించింది.

“ఏంటే ఆ నీళ్ళు నమలడం. నీ వాలకం ఏంటి కొత్తగా ఉన్నావు” అంటూ “ముందు అతను ఏమన్నాడో చెప్పు” అన్నాను.

“కమల్  I LOVE YOU అని చెప్పాడే.. ఆ మాట విన్న దగ్గర్నుండి చాలా కంగారుగా ఉంది” అన్నది.

ఆ మాట విన్న నేను పెద్దగా నవ్వేసాను.. “హా హా హా… దీని కోసమా ఇంత కంగారు పడ్డావు” అన్నాను.

బిందు నా వైపు కొంచెం కోపంగా, కొంచెం చిరాకుగా చూసింది.

“ఇందులో నువ్వు నవ్వడానికి ఏముంది??” అన్నది.

“ఇందులో నువ్వు కంగారు పడటానికి ఏముంది??” అన్నాను.

“అదేమిటి అలా అంటావు..!!”

“మరి ఏమనాలి??? సరే ఒక విషయం చెప్పు. కమల్ తో నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావు ఇన్ని రోజులు..” అని అడిగాను.

“నిజం చెప్పాలంటే రుచిత, రఘు ఇద్దరు స్కూల్, ఆఫీస్ అని వెళ్ళిపోతారు. పని అయ్యాక కాసేపు ఫోన్ పట్టుకుని, ఈ సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తుండే దానిని. ఆ సమయంలో అనుకోకుండా నన్ను ఫాలో చేశాడు ఇంస్టాగ్రామ్ లో. మొదట్లో ‘హాయ్ మేడం’ అంటూ పలకరించినా, ఎవరో తెలియని వాళ్ళతో మనకి ఎందుకులే అని పట్టించుకోనట్లు వదిలేసాను. కానీ అతను రోజూ మూడు పూటలా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని మెసేజ్ చేసేవాడు. నేను చూసి రిప్లై ఇవ్వకుండా వదిలేసేదాన్ని.

‘తిన్నారా.. ఎలా వున్నారు.. మీ ప్రొఫైల్ చాలా బాగుంది..’ అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. సరే రోజు మెసేజ్ చేస్తున్నాడు, ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుందిలే… అనుకుని అతనితో మాటలు కలిపాను. తన గురించి చెప్పేవాడు. నేను కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేసాను. ఇద్దరం ప్రతి విషయంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకునే వాళ్ళం. తన అమ్మ, నాన్నా, సిస్టర్ పిక్స్ పంపించాడు. నేను కూడా రుచిత, రఘు పిక్స్ చూపించాను. అంతా బాగానే వుంది మాట్లాడటానికి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. అతనితో ఏ విషయమైనా  ఫ్రీగా, ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు అనుకున్నాను.

కానీ నిన్న సడెన్ గా ‘I LOVE YOU’ అని మెసేజ్ చేసాడు. నిజంగా నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్దం కాలేదు. నా మాటలు, నా ఫ్రెండ్లీ నేచర్ ని అతను తప్పుగా అర్దం చేసుకున్నాడు అనుకుంట. ఇప్పుడు నేను NO అంటే నన్ను తప్పుగా అనుకుంటాడు కదా. నేను అతనితో టైం పాస్ చేసాను అని ఫీల్ అవుతాడు., కాని నిజానికి నేను అతనిలో ఒక మంచి స్నేహితున్ని చూసాను.. ఈ విషయం చెప్తే అతను ఎలా ఫీల్ అవుతాడో అని భయంగా వుంది..” అంటూ నావైపు చూసింది.

“చూడు బిందు.. ఇందులో నువ్వు అతన్ని తప్పు పట్టాల్సింది కానీ, అతను నిన్ను తప్పుగా అనుకోవడం కానీ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో పరిస్థితి ఇలానే వుంది. ఎవరి వరకో ఎందుకు??? నాకు కూడా బోర్ కొట్టినప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలి అనిపిస్తుంది. ఇప్పుడున్న సమాజంలో హడావుడి యుగంలో అందరూ తెల్లవారుఝాముకల్లా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో పనులు చేసుకుని కాసేపు ఖాళీగా ఉన్నప్పుడు, మనతో ఎవరైనా ఫ్రెండ్లీగా.. ఒపెన్ గా.. మాట్లాడితే బాగుంటుంది అని మనసు కోరుకుంటుంది. ఆడవాళ్ళం కదా.. జన్మతః కొంచెం ప్రేమను ఎక్కువగా పంచుతాం. అలాగే మెత్తని మాటలు కోరుకుంటాం అది మన స్వభావం.

ఇంట్లో వుండే మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం, ఏమైనా అవసరం అయితే తప్ప మనతో మాట్లాడక పోవడం, పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ కొంచెం కొంచెంగా దూరం కావడం.. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఎవరితో అయినా స్నేహాన్ని ఆశించడం తప్పు కాదు అనుకుంటాం. నిజానికి తప్పు కాదు కూడా, అది ఎప్పటివరకు అంటే.. అవతలి వారిని కేవలం స్నేహం పరిధిలో ఉంచినప్పటి వరకు మాత్రమే.

నువ్వు ఎదుటి వారి మాటల్లో వారి ఉద్దేశాన్ని కనిపెట్టలేని అమాయకురాలివి కాదు కదా. అవతలి వ్యక్తి హద్దులు దాటి.. నీ పర్సనల్ లైఫ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే, నువ్వు ముందే అతనికి గట్టిగా చెప్పేయడం మంచిది. నువ్వు కేవలం నా స్నేహం మాత్రమే అని.. అది అతనికి నచ్చితే నిజంగా నిన్ను ఫ్రెండ్ లా భావిస్తే అతనేమీ తప్పుగా అర్ధం చేసుకోడు. అతను నిన్ను వేరే ఉద్దేశంతో చూస్తే నువ్వు అలాంటి వాటిని ఒప్పుకోవు అని అర్దం అయితే అతనే తప్పుకుంటాడు.

స్నేహం తప్పు కాదు, నువ్వు ఇస్తున్న స్నేహం ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటున్నాడు.. అని నువ్వు గమనించాలి. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అనిపిస్తే, నువ్వే ఆ స్నేహాన్ని ముగించాలి. ముందు ఆ క్లారిటీ నీకు వుండాలి. అది అవతలి వ్యక్తికి గట్టిగా చెప్పగలగాలి. నువ్వు ఇప్పుడు అతను భాధ పడతాడేమో అని ఆలోచించి.. అతనికి సమాధానం చెప్పకుండా వుంటే, దానిని అతను నీ అంగీకారంగా తీసుకుని నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలి అనుకుంటే అతనికి గట్టిగా నీ అభిప్రాయం చెప్పేయడం మంచిది. అయినా ఒక మాట ఓపెన్ గా మాట్లాడుకుందామా..?? నువ్వు తప్పుగా అనుకోకూడదు..” అన్నాను

“ఏంటి చెప్పు.. నిన్ను నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను. అసలు అలా అనుకుంటే ఈ విషయం నీ దగ్గర ఎందుకు చెబుతాను” అన్నది.

“సరే అయితే మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుందాం.. అప్పుడు సమాధానం మనకే దొరుకుతుందేమో చూద్దాం సరేనా” అన్నాను.

“సరే అడుగు” అన్నది.

“పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఒక మహిళను, ఎవరైనా ఒక మంచి అందమైన అబ్బాయి ఏ ఉద్దేశం లేకుండా నిజంగా ప్రేమిస్తాడా??? ఒకసారి సమాధానం నిజాయితీగా చెప్పుకుందామా???” అన్నాను.

“హ్మ్మ్” అన్నది.

“నాకు తెలిసిన జ్ఞానం మేరకు, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఏ అమ్మాయిని అయినా.. ఒక మగాడు ప్రేమించడు. అసలు ప్రేమ అని పేరు పెట్టాడు., అంటే అర్దం అతను నీ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నాడు అని. అతని జీవితంలోకి తనకంటూ ఓ భార్య, ఓ లవర్ ఎవరైనా వచ్చినప్పుడు అతను నీ గురించి కనీసం ఆలోచించడు కూడా. ఇంకా చెప్పాలి అంటే నువ్వు అతనితో మాట్లాడటం అసలు నీదే తప్పు అని కూడా అనేస్తాడు. సో అతని గురించి నువ్వు అంత సీరియస్ గా తీసుకోవద్దు.  నీ మనసులో ఉద్దేశ్యం కేవలం స్నేహం అని అర్థమయ్యేలా చెప్పు. అతడు నీ స్నేహాన్ని నిజంగా కోరుకుంటే నిన్ను అర్దం చేసుకుంటాడు. లేదంటే ఇంతటితో స్టాప్ చేస్తాడు. ఏది జరిగినా మంచికే. ఇతని విషయాన్ని ఒక పాఠంగా నేర్చుకుని ముందు ముందు ఎలా మెలగాలో నేర్చుకుంటావు.. అంతే.

ఇందులో నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు క్లియర్ గా ఉన్నంత వరకు, నీ అనుమతి లేకుండా.. నీ జీవితంలోకి ఎవరు రాలేరు అది గుర్తుపెట్టుకో” అన్నాను. బిందు ఏమి ఆలోచిస్తుంది అని తన భావాలు చదివే ప్రయత్నం చేశాను. నా మాటల ప్రభావం తనపై పని చేసినట్లే ఉంది, కానీ ఎందుకో ఇంకా ఏదో అనుమానంతో వుంది.

“ఏంటి బిందు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు..” అన్నాను.

“ఒక మాట చెప్తాను.. నువ్వు నన్ను తప్పుగా అనుకోవు కదా” అన్నది.

“అనుకోనులే చెప్పు” అన్నాను.

“నాకు అతనితో మాట్లాడటం నచ్చుతుంది రమ్యా.. ఇప్పుడు అతను నాతో మాట్లాడటం మానేస్తే ఎలా అని ఒక భయం ఉండిపోయింది..” అంటూ నా కళ్ళలోకి చూసి తల దించుకుంది. తన భావాల్ని అర్దం చేసుకున్నాను, తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను..

“చూడు బిందు ఇందులో నిన్ను నేను తప్పుగా అనుకోను. ఎందుకంటే నేను కూడా ఆడపిల్లని. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. అతన్ని స్నేహం అనే పరిధిలో వుంచాలి అనుకుంటున్నావు. కానీ అతను ఒప్పుకోకపోతే ఎలా, ఇక మళ్ళీ అతను నీతో మాట్లాడడేమో అని భయపడుతున్నావు. కానీ ఒకటి ఆలోచించు.. నీ ఉద్దేశ్యం కేవలం స్నేహం. అతనేమో ఇంకేదో ఆశిస్తే.. ఇలాంటి ఒక స్నేహంలో నువ్వు ఎక్కువ రోజులు సంతోషంగా ఉండగలవా.. అసలు ఇది కుదురుతుందా.. కాదని నువ్వు సర్డుకుపోతూ, అతన్ని నువ్వు భరించడం మొదలుపెడితే.. అది నీ పర్సనల్ లైఫ్ కి దెబ్బగా మారుతుంది. అప్పుడు తప్పు అతనిది కాదు నీదే అవుతుంది. ముందు నువ్వు బాగా ఆలోచించు. అతని స్నేహం ముఖ్యమా..?? లేక నీ లైఫ్ ముఖ్యమా..?? అని, అప్పుడు సమాధానం నీకే తెలుస్తుంది” అన్నాను

బిందు మొహంలో కొంచెం ఊరట కనిపించింది.

“సరే రమ్యా.. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటాను. థాంక్స్ రమ్యా.. ఈ గజిబిజి ఆలోచనల నుండి నాకు ఒక క్లారిటీ వచ్చేలా చేసావు. నిజంగా నువ్వు నా ఫ్రెండ్ గా వుండటం నా లక్” అంటూ నా భుజం చుట్టూ రెండు చేతులు వేసి కౌగలించుకుంది.

“నువ్వు అప్పుడప్పుడు మరీ చిన్న పిల్లవైపోతావే” అంటూ నవ్వేసాను.

“సరే రమ్యా ఇక ఇంటికి వెళ్తా, రుచిత స్కూల్ నుండి లంచ్ కి వచ్చే టైం అయ్యింది” అన్నది.

“సరే అయితే ఎక్కువ ఆలోచించకు.. టేక్ కేర్” అన్నాను.

“ఒకే ఒకే I WILL HANDLE IT.. BYE” అంటూ వెళ్ళిపోయింది.

రెండు రోజుల తర్వాత, హాల్ లో ఫోన్ రింగ్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు. కిచెన్ లో వరుణ్ కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నా. శ్రీవారి పిలుపు “ఏమోయ్  నీ ఫ్రెండ్ ఫోన్” అంటూ. “కాస్త ఫోన్ తీసుకొచ్చి ఇవ్వండి” అన్నాను. ఉదయ్ ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చి “ఆ స్టౌ ఆఫ్ చేసి మాట్లాడు, తర్వాత చూసుకోవచ్చు” అంటూ హాల్ లోకి వెళ్లిపోయారు. బిందు మిస్డ్ కాల్ వుంది. స్టౌ ఆఫ్ చేసి బెడ్ రూంలోకి వెళ్ళి బిందుకి కాల్ చేశాను. వెంటనే లిఫ్ట్ చేసింది.

“ఏంటి మేడం.. ఏంటి సంగతి” అన్నాను.

“నువ్వు చెప్పింది నిజమేనే” అన్నది.

“ఏ విషయం గురించి అంటున్నావు” అన్నాను.

“అదేనే.. అవతలి వారిని హద్దులు దాటనివ్వకూడదు, అని అన్నావుగా అది నిజమే అంటున్నా” అన్నది.

“ఏం జరిగింది” అన్నాను.

“కమల్ మళ్ళీ మళ్ళీ I Love You అని మెసేజ్ చేస్తుంటే, నాకు నీ మీద అలాంటి అభిప్రాయం లేదు అని, నువ్వు నాకు మంచి స్నేహితుడివి మాత్రమే ఇంకోసారి అలా I Love You చెప్పవద్దు అని గట్టిగా చెప్పేశాను…” అంటూ ఆగిపోయింది.

“సరే తర్వాత ఏమన్నాడు ???” అని అడిగాను.

“వెంటనే 5 నిమిషాల్లో మెసేజ్ చేశాడు, ‘నువ్వేమైనా పెళ్లి కానీ కన్నెపిల్లవా??? నిన్ను లవ్ చేయడానికి నేనేమైనా పిచ్చి వాడినా?? ఏదో సరదాగా మాట్లాడుతున్నావు, కుదిరితే నీతో ఒక రోజు స్పెండ్ చెయ్యొచ్చు అనుకున్నాను. అంతకు మించి ఒక పెళ్ళైన అడదానితో ఎవరైనా ఎందుకు మాట్లాడుతారు. ఫ్రెండ్ అనడానికి నువ్వు ఏమైనా నా క్లాస్ మేట్ వా.. అసలు నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి?? నువ్వు నాతో పాటు ఇంకెంత మందితో మాట్లాడుతున్నావో.. ఎవరికి తెలుసు. నీతో నాకు ఫ్రెండ్షిప్ అవసరం లేదు, కుదిరితే ఒక్క నైట్ తప్ప. అది కుదరదు అన్నావు కదా, ఇక నువ్వు నాకెందుకు గుడ్ బై’ అని మెసేజ్ చేసి బ్లాక్ చేసేసాడు” అంటూ చెప్పింది. దాని మాటల్లో అర్థమైపోతుంది ఏడుస్తుంది అని.. “బిందు ఎందుకు ఏడుస్తున్నావు”

“అది కాదు రమ్యా.. నేను అతన్ని మంచి ఫ్రెండ్ లా చూసాను. అన్నీ విషయాలు షేర్ చేసాను, వాడు కొంచెం కూడా విలువ లేకుండా అలా మాట్లాడేసరికి కొంచెం కష్టంగా వుంది” అన్నది.

“బిందు ముందు ఆ ఏడుపు స్టాప్ చెయ్యి, వాడి నిజస్వరూపం ఇప్పటికైనా తెలిసింది అని సంతోషించు. చూడు ఒకవేళ ప్రేమ అని నువ్వు ఏదో బలహీన క్షణంలో అతనికి ఒకే చెప్పేసి వుండి, అతను నిన్ను వాడుకున్నాక నీతో ఇలా మాట్లాడి వుంటే.. ఏం చేయగలిగే దానివి. అటు ఇంట్లోనూ చెప్పలేక, ఇటు నువ్వు తట్టుకోలేక పరిస్థితులు మరీ దిగజారి పోయేవి ఇప్పుడు అవేమీ జరగలేదు. అందుకు ఆనందపడు. ఇక వాడి మాటలు అంటావా, కావలసింది దొరకదు అనుకున్నప్పుడు.. మనిషి అసలు స్వరూపం బయటకు వస్తుంది. అది అతని క్యారెక్టర్. నిన్ను నువ్వు తక్కువగా అనుకోవద్దు. వాడి బుద్ది అది అనుకో. అసలు వాడి గురించి ఆలోచించడం ఇదే చివరిసారి అవ్వాలి.. అర్దం అయ్యిందా” అన్నాను. బిందు “సరే” అంటూ ఏడుపు గొంతుతో చెప్పింది.

“చూడు బిందు నువ్వు వాడి గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే వాడికి అంత ఇంపార్టెంట్ ఇచ్చి నిన్ను తక్కువ చేసుకుంటున్నావని అర్దం. వాడి కోసం నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవడం.  ఆడవాళ్ళం ప్రేమను పంచగలం, అదే ప్రేమ అవతలి వాళ్ళు అలుసుగా తీసుకుంటే, వారికి నీ గౌరవమే నీకు ముఖ్యం అని అర్థమయ్యేలా చెయ్యగలం. నువ్వు అలానే ఉంటావని అనుకుంటున్నా” అన్నాను.

“అవును ఉంటాను. వాడి మాటలకి నేనెందుకు, నన్ను నేను తక్కువ చేసుకోవడం. నేను నా గౌరవం కోసం అతన్ని నా జీవితం నుండి నెట్టేశాను. అంతే..” అన్నది.

“వెరీ గుడ్.. అది కదా అసలైన బిందు అంటే” అన్నాను నవ్వుతూ. అవతలి వైపు నుండి బిందు కూడా గట్టిగా నవ్వేసింది.

“సరే రేపు పని అయ్యాక ఇంటికి రా, ఇద్దరం సరదాగా షాపింగ్ కి వెళ్దాం” అన్నాను.

“సరే వస్తాను బై” అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది.

 స్వప్నప్రియ

You May Also Like

3 thoughts on “నేటి కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!