ఆవిడ

వాణీ నిలయం మామిడి తోరణాలతో కళకళలాడిపోతోంది. ఇంట్లోంచి మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. లాస్యని పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తున్నారు. బుగ్గన చుక్కపెట్టబోతున్న మాధవిని వద్దని వారిస్తూ కోపంగా చూసింది లాస్య.“నువ్వేం నాకు బుగ్గన చుక్క పెట్టనవసరం లేదు. అత్తా నువ్వు పెట్టు” అంది మేనత్త రాఘవి వైపు చూసి. మాధవి మనస్సు చివుక్కుమంది. అయినా లాస్యకి తనని అవమానించడం కొత్త కాదు కదా! అని వెంటనే తమాయించుకుని “రాఘవి లాస్యకి బుగ్గన చుక్కపెట్టు అందంగా ముస్తాబు చేయి” అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పెరటివైపు నడిచింది మాధవి.

బాధ కలిగినా కన్నీరు వచ్చినా పెరట్లో ఉన్న మొక్కల మధ్య కాసేపు ఒంటరిగా గడుపుతుంది మాధవి. వాటితో తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఓవైపు ఇంట్లో సందడిగా ఉంటే మొక్కల మధ్య కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్న భార్యని గమనించాడు శేఖర్. లాస్య మళ్లీ మాధవిని ఏదో అవమానించి ఉంటుందని అనుకున్నాడు. “ఏమోయ్!! ఇంట్లో అంత హడావిడి పెట్టుకుని ఈ మొక్కల మధ్య కూర్చున్నావ్? ఏమైంది మధు? అని అడిగాడు శేఖర్. “ఏం లేదండీ నిన్నమొన్నటి దాకా ఇంట్లో సందడిగా తిరిగిన లాస్య పెళ్లై వెళ్లిపోతోందంటే ఆశ్చర్యంగానూ ఉంది దూరంగా వెళ్లిపోతోందని బెంగగానూ ఉంది” అంటూ ఒక్కసారిగా భోరుమంది.

పిచ్చిదానా? ఆడపిల్లకి పెళ్లై అత్తారింటికి వెళ్లకపోతే ఎలా? ఎంత దూరం వెళ్లినా వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది. దీనికే నువ్వింతలా? పద పద నువ్విలా కూర్చుంటే చూసిన మన బంధువులు ఏమనుకుంటారు చెప్పు?” అని భార్యని చిన్నగా మందలించాడు శేఖర్. “అవునండీ లాస్య వెళ్లిపోతుందనే బెంగలో నేను ఎవర్నీ సరిగా పట్టించుకోవట్లేదు. లోనికి వెళ్తున్నా చాలా పనులున్నాయ్ ! ” అంటూ ఇంట్లోకి నడిచింది. “మాధవి మంచితనం లాస్య ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో?” అనుకుంటూ నిట్టూర్చాడు శేఖర్.

లాస్యకి మాధవి అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకు కారణం మాధవి సవితి తల్లికావడం. శేఖర్ కి మాధవి కంటే ముందే శ్రావణితో పెళ్లైంది. రోడ్డు ప్రమాదంలో శ్రావణి చనిపోవడం లాస్య చిన్నపిల్ల కావడంతో ఇంట్లో వాళ్ల మాట కాదనలేక మాధవిని చేసుకున్నాడు శేఖర్. మాధవి లాస్యని కన్న కూతురిలాగే భావించింది. కానీ లాస్య మాధవికి దగ్గర కాలేకపోయింది. తల్లి చనిపోయేనాటికి లాస్యకి ఊహ తెలియడం, చుట్టుపక్కల వాళ్ల చెప్పుడు మాటలు లాస్య మనసులో బలంగా నాటుకుపోయాయి. తాతయ్య, నానమ్మ, అప్పుడప్పుడు వచ్చిపోయే మేనత్త రాఘవిలతో తప్ప లాస్య ఏనాడు మాధవితో సరిగా మాట్లాడింది కూడా లేదు. మాధవి పెళ్లై వచ్చిన దగ్గర్నుంచి అంతా ఆమెతో కలుపుగోలుగానే ఉన్నారు ఒక్క లోటల్లా మాధవికి లాస్య దగ్గర కాలేకపోవడం. ఒక్కసారైనా నోరార అమ్మా! అని పిలవకపోవడం.

చాలాసార్లు తను హాస్టల్ కి వెళ్లి చదువుకుంటానని లాస్య తండ్రితో గొడవపడేది. ఆపని చేయొద్దని మాధవి వారించడం వల్లే శేఖర్ ఆమెను హాస్టల్ లో జాయిన్ చేయలేదు. లాస్యకి చదువు పూర్తై మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి శ్రీధర్ అమెరికాలో ఉద్యోగం. శేఖర్ ఉద్యోగంలో చాలానే కూడబెట్టాడు. ఆస్తి కూడా బాగానే ఉంది. ఒక్కగానొక్క కూతురు లాస్యకి వైభవంగా పెళ్లిచేయాలనుకున్నారు. లాస్య పెళ్లి వైభవంగా జరిగింది అర్ధరాత్రి ముహూర్తం కావడంతో పెళ్లయ్యాక అందరూ ఎవరి గదుల్లో వారు పడుకోవడానికి వెళ్లిపోయారు. తెల్లారితే అప్పగింతలు లాస్య అత్తారింటికి ఆ తరువాత అమెరికాకి వెళ్లబోతోంది. వాణీనిలయం నిశ్శబంగా ఉంది.

అలంకరణ అంతా తీసేసి వాష్ రూంలోకి వెళ్లబోతున్న లాస్య చిన్నగా ఏడుపు ఏవో మాటలు వినబడుతుంటే తండ్రి గదివైపు నడిచింది. ఆ ఏడుపు మాధవిది. శేఖర్ ఆమెని ఓదారుస్తున్నాడు. “మాధవి! నిన్ను లాస్య చిన్నతనం నుంచి తల్లిగా అంగీకరించలేకపోవడం తన దురదృష్టం. ఇప్పుడు కాదు అది ఎప్పటికీ నీకు దగ్గర కాలేదు. ఇన్నాళ్లు దానితో నానా మాటలు పడ్డావు. ఇకపైన ప్రశాంతంగా ఉండు ” అన్నాడు. “ఎంత మాటన్నారు? ఏరోజైనా లాస్య నన్ను అవమానించిందని మీతో చెప్పానా? నేను పెళ్లై వచ్చేటప్పటికి అది ఏడేళ్ల పసి పిల్ల. దానికేం తెలుసు? ఇప్పటికీ లాస్య చిన్నపిల్లేనా కళ్లముందు పెరిగిన పిల్ల దానిపై నాకేం కంప్లైంట్స్ లేవు లాస్యని ఏమైనా అంటే ఊరుకోను” అంది మాధవి

చెవులు రిక్కించి వింటోంది లాస్య. “సరే కానీ లాస్యకి ఏం తక్కువ చేయద్దు. మనకి ఏం లేకపోయినా పర్వాలేదు. మనకున్న మొత్తం బంగారం, పొలం, ఇల్లు అన్నీ మన లాస్య పేరు మీద పెట్టేయండి. మనం ఉన్ననాళ్లు ఈ ఇల్లు మీ పెన్షన్ మనకి చాలు. ఆడపిల్ల ఎక్కడికి వెళ్లినా ఏ ఇబ్బంది పడకూడదు. వినపడుతోందా?” అంది మాధవి శేఖర్ తో కాస్త గట్టిగా. “పిచ్చిదానా! ఎంత మంచి మనసే నీది పెళ్లై వచ్చిన కొత్తలో మనం ఒక బిడ్డని కందామని అంటే వద్దన్నావు లాస్య చాలు అన్నావు. ఇప్పుడు మనకేం వద్దు ఆస్తంతా తనకిచ్చేయమంటున్నావు నీకు ఏ ఆశా లేదా?” అన్నాడు శేఖర్.

“నాకు ఒకటే ఆశ అండీ అది ఎలాగు నెరవేరదులెండి”

“ఏంటి మధు చెప్పు” అన్నాడు శేఖర్

“లాస్య నా గురించి ఎప్పుడు ఎవరికి చెప్పినా ఆవిడ ఆవిడ అని సంబోధిస్తూ చెబుతూ ఉండేది ఏరోజైనా నాపై తనకి ప్రేమ కలగదా? నన్ను అమ్మా! అని నోరార పిలవదా? అనుకునేదాన్ని ఈ జన్మకి ఆ సంతోషం లేదు ఇక” అంది బాధగా మాధవి.

“సర్లే ఇక పడుకో తెల్లవారు ఝామున లేవాలి మళ్లీ వియ్యాలవారికి మర్యాదలు చేసి వారితో లాస్యని పంపాలి అతిగా బాధపడుకు మధు. నీకు ఇంతే ప్రాప్తం అనుకో తప్పదు” అన్నాడు శేఖర్.

“ఇదిగో మీకే చెబుతున్నా అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లాస్య నా కూతురు. ఆ… వినబడుతోందా? దానికి ఏ విషయంలో అయినా తక్కువ చేసారో ఊరుకునేదే లేదు “

“సరి సర్లే పడుకో మధు” అన్నాడు వారిస్తూ శేఖర్

కిటికీ దగ్గర నిలబడి వారి మాటలు వింటున్న లాస్య కళ్లలోంచి పశ్చాత్తాపంతో కన్నీళ్లు బొటబోటా కారిపోతున్నాయి. ఆ కన్నీళ్లలో ఇన్నాళ్లు మాధవిపై లాస్య పెంచుకున్న కోపం, ద్వేషం కరిగిపోతున్నాయి. ఆ స్ధానంలో ఎంతో గౌరవభావం ఏర్పడింది. లాస్య తన తప్పు తెలుసుకుంది. తెల్లారింది. అప్పగింతల కార్యక్రమం పూర్తైంది. లాస్యని అత్తవారికి అప్పగిస్తుంటే అందరి హృదయాలు బరువెక్కాయి. మాధవి వెక్కి వెక్కి ఏడ్చింది. కార్లు లాస్య అత్తగారి ఊరువైపు బయలుదేరాయి.

లాస్య ఎక్కిన కారు కాస్త ముందుకు కదిలి ఆగింది. వెంటనే అందులోంచి దిగిన లాస్య మాధవి దగ్గరకు వచ్చింది. అందరూ ఏమైందా? అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. “అమ్మా! నన్ను క్షమించు” అంటూ లాస్య ఒక్కసారిగా మాధవిని పట్టుకుని గుక్కపెట్టి ఏడ్చేసింది. లాస్య పిలుపుకి మాధవి ఆనందంలో మునిగిపోయింది లాస్య తలనిమురుతూ ఓదార్చింది.

“ఈ పిలుపు కోసమే కదా ఇన్నిరోజులు ఎదురుచూసింది” అనుకుంటూ మాధవి భర్త శేఖర్ వైపు చూసింది. ఇప్పటికైనా తన కూతురు మాధవి ప్రేమను అర్ధం చేసుకున్నందుకు శేఖర్ కళ్లు చెమ్మగిల్లాయి. లాస్య ఆనందంగా అత్తారింటికి వెళ్లింది. కూతురు మళ్లీ ఎప్పుడు పుట్టింటికి వస్తుందా? అని మాధవి ఎదురుచూస్తోంది.

లక్ష్మి పెండ్యాల

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!