విహరించు స్వేచ్ఛా విహంగమై..!

నేటికీ సమాధానం లేని ప్రశ్నే

మగువ తెగువని కాగితాల్లో చూపే మాటలేగానీ

అంతర్మథనంలో ఆమె ఎప్పుడూ

విడుదల లేని బంధీయే.

కుటుంబ ఆంక్షల చెరలో

సమాజపు అడ్డుగోడల తెరలో

మగాడి కోరికల వలలో..

ఆమె ఎపుడూ జీవిత ఖైదీనే!

బంధాలకు అనుబంధాలను

పెనవేసుకుని బాధ్యతల

బందిఖానాలో ఆమెది ఎపుడూ

స్వేచ్ఛ లేని స్వీయ నిర్భందమే!

ఆకాశంలో సగం

అవకాశంలో సగం అంటారే కానీ..!!

అతనిలో సగం సమాజ నిర్మాణంలో

సగభాగమని గుర్తించేదెవరు?

మానవ మస్తిష్కాలలో లేని మార్పు

ఏ కాగితపు చట్టాలు కావు నీకు ఓదార్పు.

ఇంకెన్నాళ్లీ బేల చూపులు

రా….బయటకు రా…!!

ఆ కాగితపు లెక్కలు తుడిచెయ్

నీ హక్కుల్ని పోరాడి గెలిచెయ్

ఎల్లలు లేని స్వేచ్ఛా విహంగానివై

అవధుల్లేని అవకాశాలకై…!!

ఉద్యోగమైనా… వ్యాపారమైనా….

స్వదేశమైనా.. విదేశమైనా…

బ్రతుకుదెరువు ఆటలో ఆలివై

కామాంధుల వేటలో భద్రకాళివై

జ్యోతిలా కాదు అగ్ని జ్వాలలా రగిలిపో

గీతదాటని సీతలా కాదు

నవసమాజపు నుదుటి రాతవై

చరిత్రను మార్చే స్ఫూర్తిప్రధాతవై

    స్వాతి బొలిశెట్టి

You May Also Like

One thought on “విహరించు స్వేచ్ఛా విహంగమై..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!