అంజలి డాటర్ ఆఫ్ రాజ్ కమల్

వేకువజామున తొలి కోడి కూయక ముందే ఇంకా చీకటి తెరలను చీల్చుకుని వెలుగు రేఖలు నేలతల్లిని ముద్దాడక ముందే వడివడిగా అడుగులు వేసుకుంటూ తడపడిన అడుగుతో పడిపోకుండా నిలదొక్కుకుంటూ కంట్లో నుండి జారుతున్న కన్నీరు చెంపలపై పడి భూమాత ఒడిలో సేదతీరుతుంటే. ఏమైందక్క అలా తూలుతూ నడుస్తున్నావు అని అడిగింది శారద. “ఏం లేదే రాత్రి ఏం తినలేదు అందుకే ఓపిక లేదు”అంది ఆయాసంగా రొప్పుతూ మాట్లాడుతున్న కమల. “మాట్లాడడానికే ఆయాసపడుతున్నావు మరీ అంజలికి పాలు?”అంది కంగారుగా.

“హ్మ్… పాలు… రెండు నెలల చంటి దానికి కడుపు నిండా పాలు ఇద్దామంటే పాలు కూడా రావడం లేదు, అయినా పాలు మాత్రం ఎలా వస్తాయే? ఏమైనా తింటేనే కదా వచ్చేది, నేను ఇచ్చేది. అది గుక్కపట్టి ఏడుస్తుంటే ఏం చేయాలో ? తన ఆకలి ఎలా తీర్చాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుని ఏడ్వడం తప్ప ఇంకేమి చేయలేని అసమర్థురాలిని. పాలు రాని రొమ్ముని తన నోట్లో పెట్టి ఆ మంటకి నేను ఏడవడం తప్ప ఏమి చేయలేని చేతకానిదాన్ని” అంది వస్తున్న ఏడుపును ఆపుకుంటూ.

“మళ్ళీ ఏమైంది? అత్త మళ్ళా ఏం చేసింది” అంది కాసింత కంగారుగా. “నీకు తెలిసిందే కదే, ఆ తాగుబోతు సచ్చినోడు పీకలదాకా తాగేసి వచ్చి మొన్న నన్ను కొట్టాడు”. “అయ్యయ్యో అక్క పచ్చి బాలింత అని కూడా చూడకుండా కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? కనీసం అత్త అయినా ఆపి ఉండాల్సింది. అయిన ఇంత చదువుకున్న దానివి ఇక్కడ ఇలా ఎందుకు ఇంత నరకం అనుభవిస్తున్నావో నాకైతే అర్థం కాదు. మా బ్రతుకులు అంటే అలవాటు అయినవి, కానీ నీకు ఈ ఖర్మ ఏంటో?”అని నిట్టూర్చి, దెబ్బలు ఏమన్నా గట్టిగా తగిలాయా? అంది మళ్ళి.

“ఆ, అప్పుడే ఇదుగో ఈ చెవిపైన బాగా కొట్టాడుగా. ఒళ్ళంతా నొప్పులు. పచ్చి పుండులా ఉంది. చెవి పోటులా అనిపిస్తే కాస్త నూనెలో వెల్లుల్లిపాయ వేసి వేడిచేసిన నూనె చల్లారాక రెండు చుక్కలు చెవిలో వేసుకున్నాను అయినా నొప్పి తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది. ఆ నొప్పి తట్టుకోలేక అత్తతో చుక్కల మందు ఇవ్వవా చెవిలో వేసుకుంటా అత్త అని అడిగినందుకు అంతే తింటున్న పళ్ళెం లాగేసుకుంది.

“నీ బాబు వేలకి వేలు కట్నాలు ఏం ఇవ్వలేదు, నువ్వు చేసిన కప్టం ఏం రాశులు పోయడం లేదు. నీ అయ్య కి పిల్ల పురుడు చేసి ఓ తులం గొలుసు మెడలో వేయడం చేతకాలేదు అనే కదే నా కొడుకు నిన్ను చితకబాదింది. అది గుర్తు లేదు కానీ చుక్కల మందు కావాలంట చుక్కల మందు. నొప్పితో ఏం పోవులే, పోయినా పీడ పోయేది. నా కొడుక్కి లక్షలు తెచ్చే సంబంధం చేసేదాన్ని” అంది విసుక్కుంటూ అత్త .

“ఏంటో అక్కా నువ్వు చెబుతుంటే కడుపు తరుక్కుపోతుంది. చదువు సంధ్య లేనోడిని పెళ్లి చేసుకుని కట్నం తక్కువ అయింది అని మళ్లీ గొడవ ఇదేం చోద్యం ! ఇంత కాలం తరువాత కూడా. ” ఆశ్చర్య పోతూ అంది శారద. “అపుడే ఏమైపోయింది, అది చాలదన్నట్లు తన ముందు నోరు తెరిచి మాట్లాడినందుకు రాత్రి పడుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వలేదు, చలికి వణుకుతూ పడుకున్నా, నిన్నంతా అన్నం లేదు కదా, ఓపిక లేదు” అంది నిస్సత్తువగా నిలబడి పోతూ అడుగు ముందుకి వేయలేని స్థితిలో.

దారిలో పక్కకు ఓ బండ లాంటిది కనిపిస్తే అక్క ఇలారా అని శారద, కమల చేతిని పట్టుకుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి తన చీర కొంగులో దాచి ఉంచిన రొట్టెలను తీసి కమల చేతిలో పెట్టి తిను అక్క అంది. ఆ క్షణం కమల కళ్ళకి శారద తన ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవిలా, కన్నతల్లి లా కనిపించింది. కానీ “వద్దులేవే, అవి నీకోసం తెచ్చుకున్నట్టున్నావు” అని అంటుంటే “నీకు, నాకు ఇద్దరికి సరిపోతాయి,అయినా రాత్రి నేను తిన్నాను,ఈ పూట కాస్త తగ్గించి తింటే ఏమవ్వదు నాకు;నువ్వు తిను. ” అనగానే కమల ఇంకేం మాట్లాడకుండా తినేసి, గట గట నీళ్ళు తాగి దీర్ఘం గా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసుకుంది.

శారద కళ్ళ చివరన మెదులుతున్న కన్నీరును చూసి, “ఏమైంది అక్క ఎందుకు ఆ కన్నీళ్లు?”,తనకి తెలిసిన కారణం అయిన అడగకుండా వెళ్లిపోయింది. స్కూల్లో పిల్లల తల్లి తండ్రులకి పిల్లల కి పౌష్టిక ఆహారం ఏంత ముఖ్యమో చెప్పిన నేను, ఈ రోజు నా రొమ్ము నుండి నా పిల్లకి గుక్కెడు పాలు పట్టలేని స్థితిలో ఉన్న, ఒక కన్న తల్లి కి ఇంత కన్నా దయనీయమైన స్థితి ఉంటుందా? పొరలి వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది మొహం రెండు చేతుల్లో దాచుకుంటూ.

శారద మౌనం గా ఉండటం తప్ప ఏం మాట్లాడ లేక పోయింది, కొన్ని నిముషాలు మౌనం గా గడిచాయి ఇద్దరి మధ్య. కాస్త తెములుకుని ఓపిక వచ్చినట్టనిపించడంతో “పద వెళ్దాం”అనటంతో, లేచి తునికి ఆకు కోసం కంచె, గుట్ట అంతా తిరిగి మూట నిండా ఆకు తెంపుకుని మళ్ళీ మిగిలిన రొట్టెలు తిని ఇంటి బాట పట్టారు ఇద్దరు. కమలకి ఒక్కటే ఆలోచన ఇల్లు ఎపుడు చేరతానా పాప కి పాలు ఎప్పుడు పడతాన అని.

అలా రోజులు గడుస్తు అంజలికి సంవత్సరన్నర వచ్చేసింది. కమల భర్త రాజాలో కానీ, ఇంట్లో వాళ్ళలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకి అత్త ఆరళ్ళు, భర్త చీదరింపులు ఎక్కువ అవుతుంటే ఏం చేయాలో పాలుపోలేదు. భర్త ప్రవర్తనలో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటా అని ఆరా తీస్తే తన అత్తగారు రాజాకి తన మేనకోడలిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది అని తెలిసింది. తనని ఎన్ని బాధలు పెట్టినా, తిండిపెట్టకపోయినా, నిద్రకు దూరం చేసి చలిలో కూర్చోబెట్టినా, తనకి పుట్టింది ఆడపిల్ల అని తనని అక్కున చేర్చుకోకపోయినా తట్టుకుంది.

కానీ తన స్థానంలో వేరొకరిని తీసుకునిరావాలని అనుకుంటున్నారు అని తెలియడంతో తన భర్త పక్కన వేరో మనిషిని ఊహించుకోలేక కమల కోపం కట్టలు తెంచుకుంది. ఏ రోజుకైనా మారతాడు, తనని, తన బిడ్డని ప్రేమగా చూసుకుంటాడు అని ఎదురుచూసింది. ఇప్పడు తల్లి ప్రేమ మాత్రమే పొందుతున్న తన కూతురు ఏరోజుకైనా తండ్రి ప్రేమకి, నాన్నమ్మ లాలనకి నోచుకుంటుందని ఆశ పడింది. కానీ తన ఆశ అడియాసే అని తెలుసుకుంది.

వెంటనే అత్త అత్త అని అరుస్తూ లోపలకి వెళ్ళిన కమలకి అరుగు మీద కూర్చుని బీడీలు చుడుతున్న అత్తగారు కనిపించింది. కమల అంత గొంతేసుకుని అరుస్తుంటే మింగుడుపడక “ఏందే బతుకు మీద ఆశ చచ్చిందా ఏమిటి? నా ముందే గొంతు లేస్తోంది ఏంది కథ” అంది కనుబొమ్మలు ఎగరేస్తూ. “ఇక్కడ జీవితమే పోతోంది వెధవ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంతా? ముందు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మా ఆయన కి మళ్లీ పెళ్ళి చేయాలని చూస్తున్నారా” అంది కమల సూటిగా చూస్తూ.

అత్తగారిలో ఏ మాత్రం జంకు లేకపోయినా, రాజా కళ్ళల్లో బెరుకు, తప్పు చేస్తున్నానన్న భావన సృష్టంగా కనపడుతుంటే కమలకి కాస్త ధైర్యంగా అనిపించింది. ఇదంతా అత్తగారి ఘనకార్యం అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అని తల్లి మాటని కాదని తనని, పాపని సరిగా చూసుకుంటాడని నమ్మకం కూడా లేదు.  అందుకే ఎదురు తిరిగింది.

మన అనుకున్నది మన గుప్పిట్లో మన అరచేతిలో లేకపోయినా, మన పక్కన ఉంటే చాలు అనుకుంటాం. కానీ అనుకోకుండా అది మనది కాకుండా పోతుంది అంటే, తనకి మాత్రమే సొంతం అనుకున్నది, వేరొకరి సొత్తు అవుతుంది అనుకుంటే, తన తప్పు లేకపోయినా తనని తన స్థానం నుండి తప్పించాలని చూస్తున్నారని అర్థమైతే ;తన ప్రాణాన్ని తన నుండి వేరు చేసి తనకు అస్థిత్వమే లేకుండా చేస్తున్నారని తెలిస్తే ఎ మహిళ అయినా ఎలా ఊరుకుంటుంది? గదిలో బంధించి హింసిస్తే పిల్లి కూడా పులిలా ఎదురు తిరుగుతుంది. అలాంటిది మంచి,చెడు మధ్య విచక్షణ తెలిసిన మనిషిగా తను మౌనంగా ఎలా ఉండగలుగుతుంది? అందుకే అత్తగారికి ఎదురుతిరిగింది.

“చెప్పండి ఎందుకు ఇంకో అమ్మాయిని మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారు? ఎందుకు నా స్థానాన్ని మరో ఆడదానితో భర్తీ చేయాలనుకుంటున్నారు ?” అని భర్తని నిలదీసింది. మగాడు కదా తిరుగుబాటును తట్టుకోలేకపోయాడు. అందుకే ఎదురు దాడికి తెగపడ్డాడు. “అవును చేసుకోవాలనుకున్నా ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకున్నా అయితే ఏంటి? నువ్వేమైనా రాశులకు రాశులు కట్నాలు తెచ్చావా? లేదంటే ఇంటి వారసుడిని కన్నావా?

లేదే. ఓ ఆడపిల్లని కని నా మెడకు గుదిబండని కట్టావు? ఇప్పుడు ఆ పాపని పెంచి, చదువులు చదివించాలి. ఒకవేళ నా రెక్కలు ముక్కలు చేసుకుని గొప్ప చదువులు చదివిస్తే చదివి నౌకరి ఏమైనా చేస్తుందా? ఒకవేళ చేసినా ఆ డబ్బులు తెచ్చి నా దోసిట్లో ఎమైనా పోస్తుందా?దాని మొగుడి చేతుల్లో పెడుతుంది. అంత మాత్రం దానికి చదివించడం ఎందుకు?చదివించకపోయినా లక్షలకు లక్షలు కట్నాలు పోసి పెళ్ళిచేయాలి. అలా చేసాక ఓ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో దీపం పెడుతుంది. ఆ ఇంటిని ఉద్దరిస్తుంది కానీ మనకోసం ఏం చేస్తుంది?

అదే వారసుడు పుడితే వాడిని గొప్ప చదువులు చదివిస్తే వాడికి మంచి కొలువు దొరికితే ఫలాన వాళ్ళ కొడుకు మంచి నౌకరి చేస్తున్నాడు అని చెప్పుకుంటారు. నా కొడుకు గొప్ప నౌకరి, మంచి జీతంతో గొప్పగా బతుకుతాడు. నన్ను చక్కగా చూసుకుంటాడు. వాడికి పెళ్ళి చేస్తే నా వంశాన్ని నిలబెడతాడు. అడుగడుగునా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, శుభాలు, అశుభాలలో వంశాన్ని, వంశ వృక్షాన్ని, తాత ముత్తాతలను, గోత్ర నామాలను తలచుకునేందుకు కారణం అవుతాడు. ఉన్నప్పుడు పూవుల్లో పెట్టి చూసుకుంటాడు. పోయాక తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించి మోక్షాన్ని పొందేలా చేస్తాడు. ఆ వారసుడి కోసమే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా” అన్నాడు ఆవేశంగా.

కమలకి రాజా మాటలు వింటుంటే కళ్ళు గుండ్రంగా తిరుగుతున్నాయి. కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయి తను అందులో కూరుకు పోతున్నట్టుగా అనిపిస్తోంది. తాను వింటున్నదంతా అబద్దమైతే ఎంత బాగుండేదని మనసు ఘోషిస్తోంది. నిదురలో కన్న పీడకల కళ్ళు తెరిచిన వెంటనే చెదిరిపోయినట్టు, ఇది కూడా ఒక కలలా మారిపోతే ఎంత బాగుంటుంది అని మనసు మూగగా రోదిస్తుంటే, కళ్ళు గుండెల నిండుగా నిండిన బాధని తట్టుకొలేక ఊపిరి పీల్చుకోవడానికి ఆ బాధని కన్నీళ్ళ రూపంలో బయటకు పంపేస్తున్నామన్నట్టు ఆగకుండా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

తెరిచిన తన గొంతు మళ్ళీ మూగవోకూడదు అని దృఢంగాగా నిర్ణయించుకుంది కమల. తన ప్రాణం నిలుపుకోవడానికి తన చిన్నారి కడుపు నింపే పాలధారల కోసం తినడానికి మాత్రమే తెరిచే తన నోరు ఈ రోజు తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అజ్ఞానంతో కళ్ళు మూసుకు పోయిన అత్త, భర్తల కళ్ళు తెరిపించడానికి విప్పిన గొంతును తొక్కి పెట్టకుండా, పాతాళంలో అణచి పెట్టకుండా,మళ్ళీ ఆ గొంతు మూగపోకుండా ఉంచాలని బలంగా కోరుకుంది. అందుకే తన జీవనపోరాటంలో అడుగు ముందుకు వేయడానికి సిద్దపడింది.

“అవునా ఆడపిల్ల చదువు అత్తారింటిలో కాసులు కురిపిస్తుందా? మరి నేను చదివానుగా యమ్. బి. ఎ. లు, బి.ఎడ్ లు, ఏ నౌకరి చేస్తున్నాను? ఏ నౌకరి చేయనిస్తున్నారు? ముచ్చటపడి చేరిన జాబ్ లో పట్టుమని పదిరోజులు ఉండనీయలేదు. నాకు తెలిసిన జ్ఞానాన్ని చేతనైనంత మందికి పంచాలని,నేను చదివిన చదువుకు సార్థకత ఉండాలని బడిలో టీచర్ గా చేరాను. అబ్బే ఊరుకున్నారా? లేదు. నేను వ్యవసాయం చేస్తుంటే నా పెళ్ళాం నౌకరి చేయడం నాకిష్టం లేదు. నాకు చిన్నతనంగా ఉంటుంది అన్నారు. చదువుకున్న అమ్మాయి మీ ఇంటి కోడలు కావడం మీకు చాలా గొప్ప విషయం. కానీ ఆ చదువుతో తను మీకంటే గొప్పగా ఎదగకూడదు. అణిగి మణిగి ఒదిగి ఉండాలి. తల్లి చాటు బిడ్డలా నేను మీ వెనకే ఉండాలి. నన్ను ముందుండి నడిపించే బాధ్యత, అవసరం మీకు లేదు నాకంటూ ఓ గుర్తింపు ఉండకూడదు. అంతేగా?”అంది ఆవేశంగా.

ఒసేయ్ కమల అంది అత్త రాధమ్మ ఆవేశంగా. “హ… కమలనే మాట్లాడుతున్న అత్తయ్య” అనగానే కమల చెంప పగిలి విసిరేసిన బొమ్మలా అల్లంత దూరాన పడింది. పెదవి చిట్లి రక్తం కారుతోంది. చెంప ఎర్రగా కందిపోయి నాలుగు వేళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయి. అయినా కమల భయపడలేదు. ఎందుకంటే తనకు దెబ్బలు కొత్త కాదు కదా. ఇన్నిరోజులు ఒంటికి మాత్రమే తగిలిన దెబ్బలు ఇప్పుడు మనసుకు కూడా తాకుతున్నాయి అంతే తేడా. అందుకే లేచి నిలబడింది. బట్టలకు అంటిన దుమ్ము దులుపుకుంది.

అలాగే ఈరోజుతో వాళ్ళ బుర్రలకు పట్టిన దుమ్మును కూడా వదిలించాలనుకుంది. పోయాక తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పిస్తాడని,కొడుకు పుట్టాక సంబరపడడం కాదు. పుట్టిన పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు కన్న తల్లిదండ్రులకు,ఉన్న ఊరికి, నా అనుకున్న వారికి మంచి పేరు తీసుకువచ్చినప్పుడు సంబరపడాలి. అలా వాళ్ళు ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. సహాయం చేయాలి, తగిన తోడ్పాటు, మానసిక ధైర్యం అందించాలి. అది ఆడ, మగ అనే తేడా ఉండకూడదు.

అదుగో అప్పుడు గర్వపడాలి. ఉన్నన్ని రోజులు గాలికి వదిలేసి చచ్చాక తలకొరివి పెట్టి నరకం నుండి తప్పించడం కాదు, అమ్మ నాన్న మరో జన్మంటూ ఉంటే మీకు అమ్మ నాన్న గా పుట్టి మీ రుణం తీర్చుకుంటా అని కహానీలు చెప్పే పిల్లలు కాదు వృద్దాప్యంలో చంటి పాపలా చూసుకునే పిల్లలు, కష్టకాలంలో వదిలేయకుండా కాటికి చేరేవరకు కడుపులో పెట్టి చూసుకోకపోయినా, కన్నవాళ్ళను కన్నపిల్లల్లా చూసుకునే పిల్లలు కావాలి. అది కూడా ఆడపిల్లా, మగ పిల్లాడా అని చూడాల్సిన అవసరం లేదు.

అయినా మీరు చూడాల్సినవి , వినాల్సినవి గుళ్ళో చెప్పే గోత్రనామాలో, పేరుకు ముందు తగిలించుకునే ఇంటి పేరులో, పోయాక వదిలే తర్పణాలో కాదు. అయినా ఇంటిపేరు తగిలించుకుని తరతరాలుగా వంశాన్ని ఈడ్చుకు రావాలని చూస్తే మీరు కాస్తో, కూస్తో చదువుకున్నారుగా. గుర్తులేదా! గౌతమి పుత్ర శాతకర్ణి తన తల్లి పేరును తన పేరు ముందు చేర్చుకోలేదా? తండ్రి ఇంటి పేరుతోనే బ్రతకాలి అని చట్టం చేయలేదు, శాసనం వేయలేదు” అంది కోపంగా.

“ఏం మాట్లాడుతున్నావే, మతి గాని పోయిందా ఏంటే? పైత్యం చేసి పిచ్చి ముదిరినట్టుంది అంది. వెర్రికి వేయి తలలు అన్నట్టు ఇవాళ ఇలా చిందులు తొక్కుతున్నావు నాలుగు తగిలిస్తే మూలన కూర్చుంటావు. పో . పోయి వంట పని చూసుకో పో అంది నిష్టూరంగా” అత్త రాధమ్మ. “నాకు మతిపోలేదు అత్తయ్య! పోయిన దారితప్పిన మీ మతిని వెతికే పనిలో పడ్డాను. పైత్యం చేసి పరాకష్టకు చేరిన మీ చేష్టలను కట్టడి చేసి మన ఇంటిని, మన జీవితాలను గాడిలో పెట్టాలనుకుంటున్నాను”.

“అవును అత్తయ్య మీరు ఆడవారా? మగవారా” అంది రాధమ్మ వైపు సూటిగా చూస్తూ. “ఏం మాట్లాడుతున్నావే ముదనష్టపు దానా? నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయటే, నీ కళ్ళల్లో కారం కొట్టా. నిక్షేపంగా, నుదుటిన రూపాయంత బొట్టు పెట్టుకుని మహాలక్ష్మిలా నట్టింట తిరుగుతున్న నన్ను పట్టుకుని ఆడా? మగా? అంటావా” అంది బుసలు కొడుతూ. కమల ఏమాత్రం బెదరకుండా, “అవునా అత్తయ్య మీరు ఆడవాళ్ళ కడుపున పుట్టారా? మగవాళ్ళ కడుపున పుట్టారా” అంది నిర్బయంగా రాధమ్మ గారిని చూస్తూ. “అనుమానమే లేదురా రాజా, దీనికి పొలం దగ్గరో, అడవిలో కట్టెలకు పోయినప్పుడో, తునికి ఆకుకు పోయినప్పుడో ఏ గాలో, ధూళో వాలింది రా. లేదంటే దీని మొహం మండా మగాడు పిల్లలను కనడమేమిటే నీ చోద్యం సంతకెళ్ళా” అని తలబాదుకుంది రాధమ్మ.

అలా తల కొట్టుకుంటున్న రాధమ్మ చేతులు పట్టుకుని “మిమ్మల్ని కనడానికి ఓ ఆడది కావాలి. ఓ ఆడదాని కడుపున ఆడపిల్లలా మీరు పుట్టచ్చు. మీకు వండి పెట్టడానికి, మీ కొడుకుతో కాపురం చేయడానికి, మీ వంశాన్ని ఉద్దరించడానికి ఓ ఆడది కావాలి. ఏమండి మీకు తోబుట్టువులు ఉన్నారు కదా. రాఖీ పండుగ రోజు మీ చేతికి రాఖీ కట్టడానికి ఓ ఆడది కావాలి, కానీ ఆ ఆడది మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు కదా, మరి అందరు మనలాగే అనుకుంటే,ఏ ఇంట్లో ఆడపిల్లే ఉండకపోతే. ఓ చెల్లి, ఓ తల్లి, ఓ భార్య, ఓ కూతురు ఆకాశం నుండి ఊడిపడరు కదా,అమ్మ కడుపులో నుండే రావాలి” అంది ఆవేశంగా కమల. “ఇప్పటికైనా మీరు మారి మళ్ళీ పెళ్ళి అనే విషయం మరచిపోతే బాగుంటుంది. ఆడ, మగ అనే తేడా మరచిపోతే ఇంకా బాగుంటుంది” అంది కమల.

వింటే అత్త ఎందుకవుతుంది? అహనికి పోకుండా అర్థం చేసుకుంటే మగాడు ఎందుకు అవుతాడు?   అందుకే తను చెప్పిన విషయాలన్ని నిజమే అనిపించినా మనసు ఒప్పుకోనియడం లేదు. అందుకే వివేకం కంటే ముందు అహం మేల్కోంది. ఆ అహం కంటి పొరలను కమ్మేసి నిజాన్ని చూడనని మొరాయించి కూర్చుంది.  అందుకే రాధమ్మ అందుకుని “ఇందుకేరా కొడుకా చదువుకున్న దానిని చేసుకోకురా మనకు ఈ సంబందం వద్దురో అని మొత్తుకున్నాను. ఇన్నావా నా మాట చూడు ఏ ఇంట్ల కోడలైనా గీ రకంగా గొంతు పెంచుతందా? సంసారం నడిరోడ్డుమీద పెడుతందా?” అని రంకెలస్తుంటే.“అవునే నాకు కొడుకే కావాలే. అందుకోసం మళ్ళీ పెళ్ళి చేసుకుంటా ఏం చేస్తావు?” అన్నాడు రాజా.

“అవునా అయితే మగపిల్లాడిని కనలేదని నన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకుంటావన్నమాట. అయితే ఒక విషయం తెలుసుకో ముందు. పుట్టేది ఆడో, మగో నిర్ణయం అయ్యేది ఆడదానివల్ల కాదు. ఆడదాని చేతుల్లో ఏం లేదు. అది కేవలం మీ వల్లే మారుతుంది. మగాడి క్రోమోజోముల్లో ఉండే కణాల వల్లే అది నిర్ణయం అవుతుంది. అది కూడా మీ చేతుల్లో లేని పనే. కానీ మీ వల్ల, మీ నుండి వచ్చే క్రోమోజోముల వల్లే నిర్ణయింపడుతుంది. అలా అని ఏ ఆడది తనకు మగపిల్లాడు పుట్టలేదు, ఆడపిల్లే పుట్టింది అని ఏ మగాడిని నిందించడం లేదే? హింసించడం లేదే? దీనిని బట్టి చూస్తే నాకు మగపిల్లాడు కాకుండా ఆడపిల్ల పుట్టాడానికి కారణం నువ్వే, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కడుపున రేపటిరోజున నా లాంటి ఇంకో ఆడదాన్ని హింసించే, తన మనసును గాయం చేసే మగాడు పుట్టలేదు. నాలా ఎన్నో ఒడుదుడుకులు తట్టుకుని మట్టిలో మాణిక్యంలా మెరిసే ఆడపిల్ల పుట్టింది ” అంది.

అర్థం చేసుకునే వారైతే సమస్య అంతటితో పరిష్కారం అయ్యెది,అంత అవగాహన,అర్థం చేసుకునే మనసు లేదు కాబట్టే ఇంకో సమస్య మొదలైంది. “ఓ అవునా… అయితే నావల్లే నీకు మగపిల్లాడు కాకుండా ఆడపిల్ల పుట్టిందన్న మాట. మంచిది అయితే నాలాంటి ఆడపిల్లలను ఇచ్చే భర్తతో నీకేం పని, నీకు బాగా తెలివితేటలు వచ్చేసాయి, నీ లెక్కన చూస్తే ఆడది అన్నింటిని, అంతటిని చూసుకోగలదు, అందుకే నీ బతుకు నువ్వు బతుకు. నా బతుకు నేను బతుకుతా చట్టాలు, శాసనాలు అని తెగ మాట్లాడుతున్నావు కదా! ఆ చట్టం సాక్షిగానే విడిపోదాం” అన్నాడు రాజా.

అసలు కమలకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తన ప్రమేయం లేకుండానే విషయం తన పుట్టింటి వరకు చేరింది. వాళ్ళు ఎంత చివాట్లు పెట్టినా విషయం చాలా దూరం వెళ్ళడంతో అన్నింటికి సరే అంటూ కూర్చుంది. రాజా విడాకులకు కోర్టులో అప్లై చేసుకోవడం కూడా అయింది., కోర్టు వారు సంవత్సరం కలిసి ఉన్న తరువాత కూడా విడిపోవాలనుకుంటే విడాకులు మంజూరు అవుతాయని తీర్పు ఇచ్చింది. ఈలోగా ఒకరినోకరు ఇబ్బంది పెట్టే ఎలాంటి పనులు చేయరాదని కూడా హెచ్చరించింది.

కోర్టు నుండి బయటకు రావడమే ఆలస్యం కమల పడిపోవడంతో అక్కడే ఉన్న డాక్టర్ ఒకావిడ చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. అసలు కమలకు సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాలేదు ఏదైతే అది అవుతుందని నిర్ణయించుకుంది. ఆ విషయం తెలిసి కమల విడాకులకు వెనకడుగు వేస్తుందని, తనని వదిలేయొద్దని తన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతుందని అనుకున్నాడు రాజా.

కానీ అతను ఊహించినట్టు అలా ఏమి జరగలేదు. కమల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోని నిలబడడానికి సిద్ధంగా ఉంది. కమల తనలా తను బ్రతకడం అలవాటు చేసుకుంది. ఊరిలో గొప్ప పనులు, మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇళ్ళలో సగం గొడవలకి కారణం మందు అని గ్రహించి ఊరిలో మందు అమ్మకుండా చేసింది. మద్యం పై వ్యతిరేకంగా పోరాటం చేయడంతో తనతో అనేక మంది మహిళలు కలిసి ఒక సంఘంలా ఏర్పాటు అయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ మందు అనేది అమ్మకుండా నిషేధాన్ని విధించారు.

ఒకవేళ తమ మాట మీరి ఎవరైనా అమ్మితే వాడిని వాళ్ళ ఇంటి ఆడవాళ్ళతోనే బుద్ధి చెప్పించి వాళ్ళ మందు షాప్ వాళ్ళతోనే మూయించేలా చేసేది. ఎక్కడ బాల్యవివాహాలు జరిగినా అడ్డు కునేది. చదువు విలువ తెలియచేసి బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చేసింది. కుటుంబ మనుగడలో, అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో ఆడదాని పాత్ర ఎంత అవసరమో అర్థం అయ్యేలా వివరించడం మొదలు పెట్టింది. ఆ ఊరిలో, చుట్టుపక్కల గ్రామాల్లో తనకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకుంది కమల.

తమకు అందుబాటులో ఉండే సామాగ్రి, అడవిలో దొరికే కర్రలు, పుల్లలు, ఆకులువాటితో చేతివృత్తులు ఎ విధంగా పెంపోందించుకోవచ్చో తెలియచెప్పింది. పనికోసం వెతుక్కునే తాము ఈ చేతివృత్తుల వలన తమతో పాటు ఇంకా కొంత మందికి ఉపాధి ఇవ్వగలమని నిరూపించింది. కమల మాటల్లో చెప్పిన విషయాలు విన్నంత సేపు అర్థం చేసుకోకుండా కటువుగా ప్రవర్తించిన రాజా తను చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి అచ్చెరువొందాడు. ప్రతి ఒక్కరు కమల గొప్పతనాన్ని పొగుడుతుంటే పొంగిపోయాడు.

ఇన్నాళ్లు తన కాలి కింద అణగతొక్కిన కమలేనా ఇంత గొప్ప మేధావిలా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి ఆలోచన, ఆవిష్కరణ అమోఘమైనదిగా, పదిమందికి ఉపయోగపడేలా చేస్తున్నది తనేనా? ఇంతటి గొప్ప మనిషినా తను అర్థం చేసుకోకుండా బాధపెట్టింది అని కమలని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పుకున్నాడు రాజా. తన అత్త రాధమ్మ కూడా నీకు తోడుగా నిలబడాల్సిన నేనే నీ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించానని క్షమించమని వేడుకుంది.

రోజులు గడుస్తున్న కొద్ది చూస్తూ ఉండగానే తొమ్మిది నెలలు నిండి కమల మహాలక్ష్మి లాంటి పాపకి జన్మనిచ్చింది. అప్పుడు రాజా ఆడపిల్ల పుట్టిందని బాధపడకుండా మరో కమల పుట్టిందని సంతోషించాడు. సంవత్సరం తరువాత విడాకులు తీసుకోకుండా తమ జీవితాన్ని తమ పిల్లలు, కుటుంబంతో కలిసి పరిపూర్ణం చేసుకున్నారు. కమల చేసే ప్రతి పనిలో రాజా తోడుగా నిలబడ్డాడు.

అంజలి కూడా కమల లాగానే ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీసేది. తప్పు చేయడం కంటే తప్పు చేస్తున్నా వారిని ప్రోత్సహించడం ఇంకా తప్పు. తప్పు జరుగుతున్నప్పుడు తనకేం సంబంధం లేనట్టు ఎదురించకుండా చేష్టలుడిగి చూడడం మరీ తప్పు అనేది. అమ్మాయ్ ఇంత చిన్న వయసులోనే ఇన్ని గొప్ప పనులు చేస్తున్నావు ఎవరి అమ్మాయివి నువ్వు అని ఎవరైనా అడిగితే అంజలి గర్వంగా చెప్పుకునేది. నా పేరు “అంజలి రాజ్ కమల్ డాటర్ ఆఫ్ రాజ్ కమల్” అని చెప్పేది. ఆ మాట విన్నప్పుడల్లా రాజా విజయగర్వంతో తన తల ఎత్తి, పొంగిన ఛాతితో, మీసం మెలేసి నా కూతురు అంటే ఏమనుకున్నారు అని సంతోషంగా చెప్పుకునేవాడు.

గీతారామ్

You May Also Like

One thought on “అంజలి డాటర్ ఆఫ్ రాజ్ కమల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!