అమ్మకే అమ్మలా

అమ్మకే అమ్మలా

రచయిత :: స్వాతికృష్ణ సన్నిధి

వెతల ఏరులెన్నో మది నదిలో సంగమించి కన్నీటి సంద్రంలో కలసిపోతున్నాయి..

ఏమని చెప్పాలి..ఈ వేదన లోతు ఏ మాటల మట్టితో పూడ్చాలి..

శోకాగ్నిలో దహించే నా హృదయాన్ని ఓదార్ప నీటితో ఆర్పేదెవరు?

అమ్మకు అమరత్వముంటే ఎంత బావుండేదో..

బిడ్డల కోసం
ఎంత అలసిపోయిందో
విశ్రాంతి తీసుకుంటోంది సమాధి శయ్యపై..

కానరాదు కదా ఇప్పుడు అమ్మ! కాటికి నేనెళ్లినా..

ఉదర కుడ్యాల గదిలో చీకటిలోనున్న చిరు నలుసుకు ..

రుధిర చమురును పోసి ప్రేగుల ఒత్తితో ప్రేమ దీపాన్ని వెలిగిస్తుంది ..
భయమన్నది తెలియకుండా..

అవును జీవం పోసిన నుండి అమ్మ విగత జీవిగా మారేదాకా..

అలుపన్నది లేక బిడ్డ భవిత సౌధాన్ని నిర్మించే అవిశ్రాంత శ్రామికురాలు అమ్మ..

కష్టాల నలుసును పడనీయక కంటికి తానే రెప్పవుతుంది..

కడగండ్ల వాన కురిసేలోపే కొంగు ఛత్రాన్ని కప్పేస్తుంది..

అందుకే..

అమ్మ లేని అవని లేదు..
కన్న ప్రేమ తెలియని అమ్మ లేదు..

అందిపుచ్చుకో ఆ అనురాగాన్ని అమ్మ ఉన్నప్పుడే..

తీరని ఋణమల్లే మిగిలి మారాలి అమ్మకే అమ్మలా..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!