సెల్ ఫోన్ వలన మనిషి జీవితంలో వచ్చిన మార్పులు

సెల్ ఫోన్ వలన మనిషి జీవితంలో వచ్చిన మార్పులు

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: పరిమళ కళ్యాణ్

సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఎంతో మార్పును తీసుకువచ్చిన ప్రముఖమైన అంశాల్లో ఒకటి. ఈ సెల్ ఫోన్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే మరిన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఒకప్పుడు దూరంలో ఉండే మనుషులతో మాట్లాడాలి అంటే చాలా కష్టం అయ్యేది. ఉత్తరాలు, టెలిగ్రామ్ ల ద్వారా మాత్రమే సమాచారం చేరవేసే అవకాశం ఉండేది. కానీ ఈ మొబైల్ పుణ్యమా అని అర చేతిలో ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచీ ఏ వార్త అయినా క్షణాల్లో మనకి చేరిపోతోంది.దూరంగా ఉండే మన వాళ్ళని చూడలేకపోతున్నాం అనే బాధ లేకుండా వీడియో కాల్స్, వీడియో ఛాట్స్ కూడా వచ్చాయి.వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా ల్యాండ్ లైన్ తో మొదలైన ఈ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అయ్యి, రకరకాల వింతలను విశేషాలను, ఎన్నో అద్భుతాలను మనకి అందిస్తోంది. అయితే దానిలో విజ్ఞానం ఎంత ఉందో, మోసం/చెడు కూడా అంతే ఉంది.
పసి పాపడు సైతం ఇప్పుడు చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకుంటున్నాడు. తల్లికి పని ఒత్తిడి కోసమో, పిల్లవాడి అల్లరి తగ్గటానికో సెల్ పిల్లల చేతికి ఇచ్చేస్తున్నాం. మొదట్లో హాయిగా ఉన్నా క్రమేపి దాని వలన ముఖ్యంగా పసి వయసు పిల్లలలో కలిగే ప్రభావాలు అధికం. కాబట్టీ పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళు పది సార్లు ఆలోచించాలి.
ఒకప్పుడు ఏ వస్తువు కావాలన్నా ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏది కావాలన్నా క్షణాల్లో ఇలా ఫోన్లో ఆర్డర్ చేస్తే అలా మనింటికి వచ్చేస్తున్నాయి.
బ్యాంక్ పనులు, పోస్ట్ ఆఫీస్ పనులు, కరెంట్ బిల్లులు దగ్గర నుండి గ్యాస్ బిల్లుల వరకూ, అన్నీ ఫోన్లోనే అయిపోతున్నాయి. సెల్ ఫోన్ వలన ఒకింత శ్రమ తగ్గిందనే చెప్పవచ్చు.
అయితే దీని వలన ఒకరకంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయనే వాదన కూడా ఉంది. అందులోనూ నిజం లేకపోలేదు. పొద్దున్న లేస్తే, రాత్రి నిద్రపోయే వరకు ఫోన్లో ఉండేవారు ఎందరో. ఇంట్లో ఉండే అమ్మా, నాన్నల్ని పట్టించుకోకుండా ఎక్కడో దూరంగా ఉండే స్నేహితులను, బంధువులను ఫోన్లో పలకరిస్తే ఏం ప్రయోజనం చెప్పండి..? టెక్నాలజీ పెరిగింది, మనిషి మేధ పెరిగింది. కానీ ఈ సెల్ ఫోన్ వాడకం వలన మనిషి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందనేది నా భావన. కారణం ఫోన్ నంబర్లు, పాస్వర్డ్ లు అన్నీ మనం ఫోన్లో నోట్ చేసుకోవటం, మన మెదడులో సేవ్ చేసుకోలేకపోవటం.
అన్నిటికీ ఉన్నట్టే సెల్ ఫోన్ వాడకానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటితే అనర్థాలే..! కాబట్టి మనం ఆపరేట్ చేస్తున్న సెల్ ఫోన్ మనల్ని ఆపరేట్ చేసే పరిస్థితికి మాత్రం చేరుకోకూడదు.

సర్వేజనా సుఖినోభవంతు..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!