దెయ్యం చెప్పిన మాట

(అంశం:”అల్లరి దెయ్యం”)

దెయ్యం చెప్పిన మాట

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

అదో చిన్న గ్రామం. ఊరు పేరు యెందుకులేండి కథకు. అక్కడ ఎప్పటినుంచో ఒక గుబురుగా బూరుగు చెట్టు వుంది. ఒకప్పుడు ఆ చెట్టు మీద దెయ్యాలు చాలా వుండేవట. కానీ యెవ్వరినీ యేమి చేసిన దాఖలాలు లేవు. చుట్టూ యిళ్ళూ, జనాలు రావడంతో వేరే చోటకు వెళ్ళి పోయాయో లేక గడువు తీరిన తర్వాత మనుష్యులుగా జన్మించాయో తెలియదు.

కానీ ఒక దెయ్యం మాత్రం ఆ చెట్టు మీద అభిమానమో లేక వారి పూర్వీకులు ఆ చెట్టు మీద నివసించే వారనే ప్రేమతోనో అక్కడే వుండి పోయింది. తప్పుడు ఆలోచనలు వుండేవారిని మాత్రం అల్లరి పెడుతూ వుంటుంది.
…..

ఆ వూరి పెద్ద రాజయ్య. ఆ వూళ్ళో అందరికీ అతనంటే ఎంతో గౌరవం. ఊరు జనాల మధ్య గొడవలు వస్తే తీర్పు చెప్పటం, కొన్ని విషయాల్లో మధ్యస్థంగా, సామరస్యంగా నచ్చ చెప్పడం చేస్తూ వుంటాడు. దాదాపుగా అందరికీ నచ్చేవి.

రాజయ్యకు భార్య లేదు. ఒక కొడుకు చైతన్య, కోడలు చందనా. ముగ్గురు ఎంతో అన్యోన్యంగా వుంటారు. చందన పుట్టిపెరిగిన వూరు కూడా అదే. ప్రస్తుతం చందన గర్భవతి.

ఇంటి దగ్గర ఆరుబయట చైతన్య, చందన కాలక్షేపంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ‘చందనా నీకు పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా’ అని అడిగాడు చైతన్య. వారిరువురు అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.

‘నాకు బాబే కావాలండి, ఆడపిల్లలు ప్రస్తుత సమాజంలో బతకలేరండి, ఎన్ని యిబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం కదా’ – చందన

‘నీ ఆలోచన తప్పు చందనా. ఆడపిల్ల ఆది దేవత, ఆదిశక్తి. స్త్రీ లేకపోతే సృష్టే లేదు, పకృతికి చైతన్యమూ లేదు. నువ్వు చెప్పిన యిబ్బందులకు మనమే కారణం. చిన్నప్పటినుంచి అబల అని, నువ్వు ఆడపిల్లవే నువ్వు చెయ్యలేవే అని పిరికితనమూ, భయముతో తీర్చిదిద్దుతున్నాము. ఈ విషయంలో నీ ఆలోచనలు మొలకగా వుండగానే తుంచి వేయి’ – చైతన్య

ఈలోపు రాజయ్య రావడంతో సంభాషణ ఆగిపోయింది.
……

ఇంటిలో చందన ఒక్కతే వుంది. ఏవో సరుకులు కొనవలసి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తూ, రిక్షాలో సరితను చూడటం, సరిత చందనను చూడటం జరిగింది. సరిత రిక్షా ఆపి, దిగింది.

‘ఏమిటే చెప్పాపెట్టకుండా వచ్చేవు సరితా’ ఆశ్చర్యపోతూ అడిగింది చందన.

‘మా రాము బాబాయి కి అనారోగ్యం అంటే హఠాత్తుగా వచ్చానే. వాళ్ళింటికి వెళుతున్నాను. నువ్వు ఎలా వున్నావు’ అంటూ కడుపు వైపు చూసి ఎన్నో నెల ఏమిటి. నేను త్వరలోనే మళ్లీ వస్తాను. మహాలక్ష్మి లాంటి కూతురుతో కనపడాలి ఓకెనా’ – సరిత

‘అలాగేలేవే. రేపు మా ఇంటికి రా. కబుర్లు చెప్పుకుని చాలా రోజులయ్యింది. హరిత కూడా వచ్చిందా?’ – చందన.

‘తెలియదే. నిన్ననే వస్తానంది. బాబాయి విషయం తెలియగానే, మా వారితో చెప్పి, నేనొక్కదాన్నే వచ్చాను. రేపే వెళ్ళిపోతా. మళ్లీ వస్తానులే’ అని రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది.

రిక్షాలోంచి బై అని చెపుతూనే సడెన్ గా మిస్ అయ్యింది. సందులో తిరిగిందేమోలే అనుకుంది. ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగి, కొంచెం సేపు అయ్యింది. అంతే బెల్ మోగింది. తలుపు తీసింది.

‘అరే హరితా నువ్వా. ఇప్పుడే సరితను దారిలో కలిసి వస్తున్నాను. బాబాయి దగ్గరకు వెళుతోంది’ అంటూ మంచి నీళ్ళు ఇచ్చింది.

‘ఏమీ వద్దు, కాఫీ కూడా పెట్టకు. బాబాయి యింటిలో తీసుకునే వస్తున్నా. తనకు ఆరోగ్యం సరిగా లేదంటే నిన్ననే వచ్చాను’ – హరిత

బాబాయి కి బాగోలేదని మామయ్య, చైతన్య కూడా చెప్పలేదే, మరిచిపోయి వుంటారులే అనుకుంటూ, ‘ఇప్పుడు ఎలా వుంది బాబాయికి’ – చందన.

‘ఇప్పుడు పర్వాలేదు’ అని చెప్పింది హరిత.

ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

‘చందన కడుపు చూసి, ఎన్నో నెల ఏమిటి. మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని కనవే, హాయిగా వుంటుంది ప్రాణానికి’ – హరిత

‘అబ్బ మీ కవల అక్కాచెల్లెళ్ళు యిద్దరి బుద్ధులు ఒకటేనే. ఒకేలా ఆలోచిస్తారు. తనూ అలాగే అడిగింది. కిరాణా దుకాణంకి వెళ్ళి వస్తుంటే రిక్షాలో కనిపిస్తే పలకరించా. నువ్వు ఇలా వచ్చావు, తను అలా ఇంటికి చేరి వుంటుంది. నాకు ఆరో నెల. ఈ విషయంలో తనకూ, చైతన్యకు జరిగిన సంభాషణ అంతా చెప్పి, నాకు మాత్రం అబ్బాయి కావాలనిపిస్తోంది’ – చందన

‘చైతన్య చెప్పింది కరెక్ట్. నువ్వు ఎందుకు స్త్రీని తక్కువ అంచనా వేస్తావు. మనం యిద్దరం స్త్రీలమే కదా. తండ్రి లేకపోయినా అన్నీ తానై నిన్ను పెంచి పెద్ద చేసిన మీ అమ్మ గారు స్త్రీ కాదా. తప్పుడు ఆలోచనలు నుంచి బయటకురా. నువ్వు చాలా మొండిదానివని తెలుసు. ఎవ్వరి మాటా వినవు. మనసు పెట్టి ఆలోచించు.

వేద కాలం నాటి స్త్రీకి ఎంతో వున్నత స్థానం వుంది. అప్పటి సమాజంలో ఎంతో గౌరవం వుంది. మొదట్లో మాతృస్వామ్య వ్యవస్థ వుందని తెలుసు కదా.

పురుషాధిక్య కారణమో లేక స్త్రీ ప్రేమను, మంచితనాన్ని, మానవతను, అమాయకతను ఆసరా చేసుకునో తెలియదు కానీ స్త్రీని అబలగా చూపారు. వంశోద్దారకుడు కోసం అబ్బాయి పుట్టాలనే కారణం కూడా కొంత. మగవారితో సమంగా, అవసరమైతే వున్నత స్థాయిలో ఎదగాలి. ఏమంటావు.

చిన్నప్పటినుంచి ఆడపిల్లలకు పకృతి పరంగా వచ్చే శారీరక, మానసిక మార్పులను అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేట్ చేయగలగాలి. ప్రత్యేకంగా స్వీయ రక్షణ కోసం కరాటే, కర్రసాము లాంటి శిక్షణ యివ్వాలి – హరిత.

వాళ్ళిద్దరి మధ్య చర్చలో ముగింపు వచ్చింది. చందన మనస్సులో గందరగోళం తగ్గి ప్రశాంతత చేకూరింది.

‘నిజమే హరితా నేను పెరిగిన వాతావరణం, నా చుట్టూ వున్న సమాజం వలన నేను అలా మౌల్డ్ అయ్యివుండవచ్చు. నాకు పాప పుడితే మా యింటి మహాలక్ష్మిలా చూసుకుంటా. థ్యాంక్యూ హరితా’ – చందన.

‘చాలా సంతోషం. ఈ రోజు నీతో వుండాలని, మామయ్యను, చైతన్యను కలవాలనే వుంది. కానీ రేపే వెళ్ళి పోవాలి. మళ్ళీ కలుద్దాం. బై’ – హరిత.

తరువాత మామయ్య, చైతన్య ఒకేసారి ఇంటికి వచ్చారు. వాళ్ళకి మంచినీళ్లు అందిస్తూ, ‘ఏమిటండి రాము బాబాయికి ఒంట్లో బాగుండ లేదట కదా, నాకు చెప్పలేదు’ – చందన.

‘అదేమిటి, నాన్న, నేను అనుకోకుండా రాము బాబాయి యింటిలో కలుసుకుని వస్తున్నాము. బాగానే వున్నాడు. పైగా సరిత, హరితలను సంక్రాంతి పండక్కి రమ్మని ఉత్తరం రాసాడట, మనల్ని కూడా అప్పుడు మా ఇంటికి వచ్చేయండి అన్నాడు’ – చైతన్య.

ఈరోజు సరిత, హరిత యిద్దరూ తనను కలవడం గురించి, హరిత ఇంటి దగ్గరే ఆడపిల్ల విషయంలో తనను కౌన్సెలింగ్ చేసి, తన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిందీ పూసగుచ్చినట్టు చెప్పింది చందన.

ఎందుకో వణుకు పుట్టింది చందనకు. రాజయ్య చందన దగ్గరకు వచ్చి, తల నిమురుతూ, ‘నువ్వేమీ కంగారు పడకు తల్లీ. ఎవ్వరికీ హాని తలపెట్టని, మంచి వాళ్ళకు వుపకారం చేసే మంచి అల్లరి దెయ్యం పని అయ్యుంటుంది. కౌన్సిలింగ్ కూడా చేస్తుంది అది. భూత వైద్యులను పిలిపించమని కొంతమంది ఒత్తిడి చేసినా, నేను ఒప్పుకోలేదు, దానివలన మనకు మంచే కాని చెడు లేదని. చెడు చేసేవాళ్ళని మాత్రం అల్లరి చేసి అల్లరి పాలు చేస్తుంది’ – రాజయ్య.

చైతన్య యిది అంతా విని, ‘ఓ అయితే నువ్వు నా మాట వినకుండా, అల్లరి దెయ్యం మాట వింటావన్న మాట’ అంటూ ఆట పట్టించాడు.

రాజయ్య నవ్వుతూ, ఈ అల్లరి దెయ్యం మీ అత్తనేమోనమ్మా అనగానే చైతన్యతో పాటు చందనా నవ్వులు కలిపింది .

(నోటు: ఈ కథ మంచి మెసేజ్ తో సరదాగా మనోహరం పత్రిక వారు నా ద్వారా సృష్టించబడిన అల్లరి దెయ్యమే కానీ, దెయ్యాలు వున్నాయని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు)
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!