దయ్యాలు

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

దయ్యాలు

రచయిత :: సావిత్రి కోవూరు

“అమ్మ నాకు అసలు చేతనవుతు లేదు. నీవు ఎప్పుడు వస్తున్నావ్” అన్నది అమెరికాలో ఉన్న మా చిన్నమ్మాయి.
“వస్తున్నానమ్మ మీ నాన్న ఆఫీస్ లో పని ఎక్కువగ వుంది రాలేనన్నారు. నేనొక్క దాన్నె వస్తున్నాను. లీవ్ కు అప్లై చేశాను. శాంక్షన్ అయ్యింది. కానీ నీవు  డిసెంబర్ పదికి బదులు, ఐదుకే రమ్మంటివి. దానికొరకు మళ్లీ అప్లికేషన్ పెట్టుకొని మళ్లీ డి.ఇ.ఒ.పర్మిషన్ తీసుకొని, డైరెక్టరేట్ ఆఫీస్ లో ఎన్.ఒ.సి. తీసుకోవడానికి చాలా కష్టమైంది. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఎలాగో సాధించాం. వచ్చేస్తున్నాను లే. ఐదో తేదీ బయల్దేరుతాను”అని అన్నాను.

ఐదో తారీకు అమెరికాకి బయల్దేరాను. ఒంటరిగా స్కూల్ కు తప్ప ఎక్కడికి, మా వారి తోడు లేకుండ వెళ్ళని నేను పరాయి దేశానికి , పద్దెనిమిదేళ్ళ నాడు, మూడు విమానాలు మారి, ఏడు సముద్రాలు దాటి, ముప్పైఆరు గంటలు ప్రయాణం చేసి, హైదరాబాద్ నుండి సింగపూర్, సింగపూర్ నుండి తైపే, తైపే నుండి సియాటిల్ వెళ్లాను.

మొదటి సారి ఒంటరిగా విమాన ప్రయాణం చేస్తున్నానన్న సంతోషం కంటే విమానం ఎంత ఎత్తులో పోతుందో, ఎక్కడ వెళుతుందో,ఇంక ఎంత టైం పడుతుందో లోపల ఎదురుగుండ స్క్రీన్ పైన చూస్తుంటే సముద్రాల పైన పోతున్నప్పుడు చాల భయమేసింది.

సియాటిల్ లో మా అమ్మాయి అల్లుడిని చూసిన తర్వాత కానీ నా భయం కంగారు తగ్గలేదు. వాళ్లతో కలిసి సియాటిల్ నుంచి లాంగ్వ్యూ కి వెళ్లాను. మా అల్లుడు విజయ్ అక్కడ జాబ్ చేస్తున్నాడు.

అక్కడ సంవత్సరంలో 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. 24 గంటలు ముసురు పడుతూనే ఉంటుంది. మనం బయటకు రావాలంటే కోటు, రెయిన్ కోటు, షూస్, గ్లౌజులు, క్యాప్ పెట్టుకుంటే గాని, బయటకు కాలు పెట్టలేము.

నేను వెళ్ళిన రోజు మా అమ్మాయి తో, మా అల్లుడు “ఈరోజు మన ఇల్లు ఇల్లులా ఉంది చూడు. ఎంత నిండుగా ఉంది” అని అంటుంటే విని ఎంతో ముచ్చటేసింది.అప్పటి వరకు స్నేహితులు తప్ప చుట్టాలెవరు వెళ్ళలేదు వాళ్ళింటికి. అందుకే  అతడు చాలా సంతోషంతో అలా అన్నాడు.

వెళ్లిన రోజు రాత్రంతా ముచ్చట్ల తోనే సరిపోయింది. రెండవ రోజు రాత్రి తొందరగా వంట చేసి ముగ్గురం తినేసాం. వాళ్లు ఉన్న బిల్డింగ్ ఒకవైపు గేటు మూడు వైపులా లివింగ్ పోర్షన్స్. అది రెండంతస్తుల బిల్డింగ్ మధ్యనంత ఓపెన్ ప్లేస్ తో టూ సైడ్స్ మెట్లతోటి ముచ్చటగానే ఉంది. వీళ్ళుండే పోర్షన్ కి వెళ్ళాలంటే ఒక్క పోర్షన్ ముందు నుంచి వెళ్లి వీళ్ళ ఇంట్లో కి వెళ్ళాలి. వెళ్ళగానే మా అమ్మాయి “పక్క పోర్షన్ లో తప్ప మిగతా బిల్డింగ్ అంత  ఖాళీయే, పక్క పోర్షన్ లో ఎవరు ఉంటారో మేము ఎప్పుడూ చూడలేదు” అన్నది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా బాగుంది అనుకున్నాను.

అక్కడ నేను ఉన్న నాలుగు నెలల్లో రెండు రోజులు మాత్రం కొంచెం ఎండ వచ్చింది. మా అల్లుడు, అమ్మాయి సంతోషంతో ఎండ లోపలికి రావాలని డోర్ తెరచి పెట్టారు.

నాకు అక్కడికి వెళ్ళాక రాత్రిళ్ళు నిద్ర వచ్చేది కాదు. టీ వి పెట్టుకుని తెల్లవార్లు చూస్తూ పడుకునే దానివి. మా అమ్మాయి మధ్యమధ్యన  ఇంక పడుకో అమ్మా ఆరోగ్యం పాడవుతుంది అనేది.

ఒక రోజు రాత్రి ఎదురుగుండా పోర్షన్  వైపు చూస్తే నాలుగైదు నిప్పు కణికలు ఎదురుగుండ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతున్నట్టు కనిపించి గుండెల్లో దడ మొదలయ్యింది.ఎందు కంటే అక్కడ ఎవరుండటం లేదన్నది మా అమ్మాయి. అక్కడ కిటికీలు తలుపులు పూర్తిగా చెక్కతో లేవు. కిటికీలు డోర్స్ అన్ని గ్లాస్ తోనే ఉన్నాయి.అంటే హాల్లో ఒక వైపు వాల్ మొత్తం గ్లాస్ తోనే ఉందన్నమాట. భయమేసి వేరే రూం లోకి వెళ్లి బయటకు చూశాను. అక్కడ చెట్టు కింద అవే నిప్పు కణికలు అటు ఇటూ కదులుతున్నాయి. చిమ్మచీకట్లో మన దగ్గర ఉండే చెట్లకి మూడింతల ఎత్తుతో పొడవాటి చెట్లు గాలికి విపరీతంగా ఊగుతూ దయ్యాల్లా కనిపిస్తున్నాయి.
దాని కింద మూడు నాలుగు ఆకారాలు కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు కదలికలు. కళ్ళు బాగా తెరచి పరిశీలనగా చూశాను. కొద్దిసేపటి తర్వాత మాయమయ్యాయి. విపరీతమైన గాలి. నక్కలు ఊళ పెడుతున్నట్టు శబ్దాలు. మొదట మెల్లగా మొదలై రానురాను పెరిగే శబ్దం లోలోన చాలా భయమేసింది. రాత్రంతా జాగారం నిండా దుప్పటి కప్పుకొని ఆంజనేయ దండకం చదువుతూ, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తు పడుకున్నాను.

తెల్లవారిన తర్వాత మా అమ్మాయి తో చెబుదామనుకున్నా. అదసలే గర్భంతో ఉంది. ఆ పిల్లకి ఇలాంటివన్నీ చెప్పి మానసిక ప్రశాంతతను భంగం కలిగించడం ఆరోగ్యకరం కాదని ఆగిపోయాను. పెద్దదాన్ని నాకే భయం వేసింది అంటే,  దానికి ఇంకా ఎంత భయమేస్తుందో అని చెప్పలేదు. అల్లుడికి ఇదంతా చెప్తే నవ్వుతాడో ఏమో అని,  మీరింత చదువుకొని ఉద్యోగం  చేస్తున్నా, దయ్యాలను కూడా నమ్ముతారా? అంటాడేమో అని భయంతో ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. మళ్లీ రాత్రవుతున్నదంటే, నాకు భయం మొదలైంది.

రెండో రోజు రాత్రి కూడా అలాగే మొదట ఎదురుగుండా బాల్కనీలో మెరుస్తూ అటు ఇటు తిరుగుతూ కనిపించడం, ఇంటి ముందు వైపు కటిక చీకటి అదే ఏడుపుల శబ్దం మొదట మెల్లగా మొదలై రానురాను  నక్క ఊళ పెట్టినట్టు శబ్దము, దానికి తోడు గాలికి జడలు విరబోసుకున్నట్టు పెద్ద పెద్ద చెట్లు అటూ ఇటూ ఊగడం. దానికింద నిన్నటి లాగానే నిప్పు కణికల నృత్యం నాకు భయం తో కన్ను మూత పడితే ఒట్టు.

తెల్లవారి నాక నా ఎర్రటి కళ్ళు, నిద్ర లేక అలసిపోయిన ముఖముతో నీరసంగా ఉండేసరికి మా అమ్మాయి అల్లుడు “ఇంకా మీకు టైమింగ్ సెట్ కాలేదు. నాలుగైదు రోజుల్లో సెట్ అవుతుంది” అన్నారు. ఐదారు రోజులు అలాగే రాత్రి అవుతుందంటే వణికిపోయే పరిస్థితి. ఇంకా ఆరోజు ధైర్యంగా పడుకోవాలని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. మా అమ్మాయి వాళ్ళు చాలా సేపు మాట్లాడి వాళ్ల రూమ్ లోకి వెళ్లి పోయారు. నాకు మాత్రం నిద్ర రావటం లేదు.

సడన్ గా బాల్కనీలో గ్లాస్ డోర్ వెనకవైపు ఏదో పెద్ద ఆకారం కనిపించింది. అంత చలిలోనూ చెమటలు పట్టాయి. మెల్లగా దుప్పటి పక్కకు తొలగించి చిన్న సందులోంచి చూశాను ఎత్తయిన ఆకారం, ఒత్తయిన పొట్టి జుట్టుగంపలా, పెద్ద తల గ్లాస్ డోర్ దగ్గర నిల్చుని గొణుగు తున్నట్టు శబ్దం. నాకు ఆ ఆకారానికి మధ్యన ఒక గ్లాసు డోర్ మాత్రమే. విపరీతమైన భయం, వణుకు. గట్టిగా మా అమ్మాయిని, అల్లుణ్ణి పిలుద్దామని నోరు తెరిచాను. కానీ, నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రావట్లేదు. కొంచెం సేపు అలాగే ఊపిరి బిగబట్టి బ్లాంకెట్ సందు లోంచి చూస్తున్నాను ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ. చివరికి ఆ ఆకారం మెల్లగా కదులుతూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు మా అమ్మాయి వినకుండా, మా అల్లుడికి రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాను. మా అమ్మాయి  మానసిక ప్రశాంతత కోల్పోవడం మంచిది కాదని. మా అల్లుడు అంతా శ్రద్ధగా విని “ఈ రోజు కూడ అలాగే అనిపిస్తే నన్ను పిలవండి. నేను మేలుకువగానే ఉంటాను” అన్నాడు. రెండవ రోజు ఆంజనేయస్వామి ఫోటో తల దగ్గర పెట్టుకున్నాను. దేవుని బొట్టు పెట్టుకొని పడుకున్నాను. అయినా నిప్పుకణికల డాన్స్ లు  అలగే చేశాయి. కానీ ఆ ఆకారం కనిపించలేదు. అమ్మయ్య అనుకున్నాను. కానీ నక్క ఊళల్లాంటి అరుపులు ప్రతిరోజూ వినబడుతూనే వున్నాయి.

రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ ఆ ఆకారం గ్లాస్ డోర్ దగ్గర తచ్చాడటం ఏదో గొణగడం వినిపిస్తూనే ఉంది. ప్రతిరోజు రాత్రి అవుతుందంటే నరకమే అనిపిస్తుంది నాకు. మా అల్లుడు పిలవమన్నాడు కదా అని ఆ రోజు ఆ ఆకారం గ్లాస్ డోరు దగ్గర కనబడగానే గట్టిగా పిలవాలని నోరు తెరిచాను. కానీ భయంతో నోరు పెగలక శబ్దం బయటకు రావట్లేదు. ఆరోజు కూడా ఐదు నిమిషాలు డోర్ దగ్గర తచ్చాడి వెళ్ళిపోయింది ఆ ఆకారం.
ఆ రోజు ఉదయం నా ముఖం చూసి మా అమ్మాయి అల్లుడు హడలిపోయారు. నిద్ర పట్టక పోవడం కాదు. నన్ను ఆ ఆకారము, నిప్పు కణికలు, ఆ నక్కల ఊళల్లాంటి శబ్దాలు నా మెదడుని తినేస్తున్నాయి. ఇక లాభం లేదని మళ్లీ మా అమ్మాయి, అల్లుడితో చెప్పాను.

మా అమ్మాయి “ఇన్ని రోజులు ఒక్కదానివే ఇంత భయపడుతూ రాత్రంతా ఎలా గడుపుతున్నావు. మేము కూడ ఇక్కడ బెడ్ వేసుకుని పడుకుంటాము భయపడకు” అని ఆ రోజు వాళ్ల మంచము హాల్లో వేసుకొని పడుకున్నారు. ఆరోజు కూడా తలంత గంపలా విరబోసుకుని, ఎంతో ఎత్తైయిన లావాటి ఆకారం డోర్ దగ్గర ప్రత్యక్షం. అల్లుడు అమ్మాయి మంచి నిద్రలో ఉన్నారు. అయినా  నా చేయి దగ్గర ఉన్న గ్లాస్ ను మెల్లగా మా అల్లుడి చెవి దగ్గర పడేలా జరిపాను. దాని సౌండ్ కి మా అల్లుడు లేచి వెంటనే డోర్ వైపు చూశాడు లైట్ వేసి, ఆ ఆకారం అక్కడే నిలబడి ఉంది. నాకు భయమేస్తుంది మా అల్లుణ్ణి వద్దంటున్నా, డోర్ దగ్గరికి వెళ్లి ఆ ఆకారం ఏమి మాట్లాడుతుందో వినడానికి చెవిని తలపు సందు దగ్గర పెట్టాడు. తర్వాత గబగబ ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేశాడు. ఆ ఆకారం కదిలిపోయింది.

తెల్లవారిన తర్వాత మా అమ్మాయి “ఏంటి సంగతి” అని అడిగితే,

మా అల్లుడు “కొన్ని రోజుల కింద ఒకావిడ మన పక్క పోర్షన్ లోకి అద్దెకు వచ్చిందట. ఆమెకి ఏదో జబ్బు చేయడం వల్ల భర్త, పిల్లలు వదిలేస్తే ప్రభుత్వం
ఇచ్చే సోషల్ సెక్యూరిటి,హోమ్ కేర్ తో బ్రతుకుతుంది. ఆమెకీ మధ్య మధ్య కడుపులో ఏదో విపరీతమైన నొప్పి వస్తుందట. ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు. అందుకే మనని హాస్పిటల్ కి ఫోన్ చేసి చెప్పమని, నొప్పి వచ్చినప్పుడల్లా పగలయితె బయట ఎక్కడి నుండో కాల్ చేస్తుందట, కాని రాత్రిళ్ళు మన డోర్ దగ్గర కొచ్చి చెపుతున్నదట.మనం లేవక పోయేసరికి అలాగే వెళ్లిపోతుంది. ఈరోజు నేను హాస్పిటల్ కి కాల్  చేయగానే అంబులెన్సు వచ్చి ఆమెను తీసుకెళ్లి  ట్రీట్మెంట్ చేసి ఉదయమే వదిలి వెళ్లారు.

ఆమె చాల ఎత్తు, లావు ఉండి ,రింగు రింగుల ఒత్తయిన జుట్టు  ఉండటంతో, చీకట్లో అత్తయ్య భయపడినట్టున్నారు. అంతేకాకుండా ఆమె కడుపునొప్పి బాధతో స్పష్టంగా, గట్టిగా మాట్లాడకుండ గొణిగినట్టు ఉండేసరికి ఇంకా భయపడిపోయారు” అన్నాడు.

“అది సరె విజయ్ మరి రాత్రి మీకు చూపించాను కదా! నిప్పు కణికలు ఆ ఊళలు అవేంటి”  అని నేనంటే

“అత్తయ్య ఇక్కడ రాత్రి భోజనం చాలా తొందరగా అంటే సాయంత్రం ఆరు గంటలకే తినేస్తారు చాలామంది. మళ్లీ పడుకునేటప్పుడు లైటుగా స్నాక్స్ ఏమైనా తింటారు. అవి తినగానే  సిగరెట్ తాగడానికి బయటకు వస్తారు. వాళ్లు రోజు ఎదురుగుండా పోర్షన్ ఖాళీగా ఉండటం వల్ల కారిడార్లో అక్కడ అటు ఇటు తిరుగుతూ సిగరెట్స్ తాగుతుంటారు. చీకట్లో మనుషులు కనిపించక వాళ్ళుతాగే సిగరెట్స్ మాత్రమే నిప్పుల్లా కనిపిస్తున్నాయి. చెట్టు కింద కూడా కొంత మంది ఒక దగ్గర కూర్చుని సిగరెట్ తాగి వెళ్లి పోతుంటారు.
ఇంకా ఊళల సంగతి ఏంటంటే బిల్డింగ్స్ పైన స్నో పడ్డపుడు అది కరిగి ఆ నీరు పోవడానికి కాలువలాగ  పెట్టిన ఏర్పాట్ల నుండి బయటకు పోవడానికి కొన్ని గొట్టాలు పిక్స్ చేస్తారు.వాటి మధ్య నుండి విసురుగా గాలి పోవడం వల్ల అలాంటి శబ్దాలు  వస్తాయి” అని చెప్పేసరికి అంతేనా అనుకుని ఊపిరి పీల్చుకున్నాను.

వారం రోజుల కిందనే మా అల్లుని కి చెప్పుంటే ఈ వారం రోజుల నరకం ఉండేది కాదు కదా అనుకున్నాను.

You May Also Like

2 thoughts on “దయ్యాలు

  1. దెయ్యం ఉందని నమ్మి, దెయ్యం కోసం చూస్తే అంతటా దెయ్యాలే కనపడతాయి 😄 good story!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!