దయ్యం లేదు గియ్యం లేదు..

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

దయ్యం లేదు గియ్యం లేదు

రచయిత :: లోడె రాములు

ముప్పైఏళ్ల క్రిందటి సంఘటన ఊరికెళ్లి నప్పుడల్లా యాదికొస్తది..
ఇప్పుడు ఊరు అబ్బివృద్ది చెందింది.ఏ గల్లీకి వెళ్లినా కాంక్రీట్ రోడ్లు,బిల్డింగులు.. ఇంటింటికి వాహనాలు..ఎవ్వరికెవ్వరు పట్టనట్లు ఉండే పట్నం పోకడలు..
నిలబడడానికి కూడా చెట్టు నీడ కరువైంది..
సంచార జాతులవారు ఊరి బయట చెట్లక్రింద నెలల తరబడి జీవనం సాగించేవారు..ఆనాటి ఊళ్లు ఏమాయెనో…
అప్పట్లో నేను ఊరికి పట్నానికి అప్ అండ్ డౌన్ చేసేవాడిని..
మా మండల కేంద్రం వరకు ఎదో ఒక వాహనం దొరికేది..
అక్కడి నుండి మా ఊరు ఎనమిది కిలోమీటర్లు..
రోడ్ మీద దిగి ఊర్లోకి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని..ఓ రోజు అర్ధరాత్రి రోడ్ నుండి ఊర్లోకి నడుచుకుంటూ వెళుతున్నాను.. అమావాస్య చీకటి రోడ్డు కిరువైపులా దట్టమైన చెట్లు గుబురుగా అల్లుకున్నట్లుగా ఉండేవి..రాత్రుళ్లు ఒంటరిగా నడుస్తున్నందుకు కాస్త భయంగానే ఉండేది..ఆరోజు నేను కూడా భయం భయంగానే నడుస్తున్న..
నాకు అలవాటు లేకున్నా .. వచ్చేటప్పుడు ఓ సిగరెట్టు,అగ్గిపెట్టె వెంట తెచ్చుకునే వాడిని .. భయం అనిపించి నప్పుడు వెలిగించేవాడిని..
ఆ రోజు కూడా అలాగే సగం దూరం వెళ్లాక సింగరేట్ వెలిగించాను..
అప్పుడే చెట్ల పొదళ్ల నుండి సన్నగా ఏడుపు ..గుర్..గుర్ మని వినిపించింది..వెంటనే నాలో భయంతో రోమాలు నిక్కబొడిచాయి.
నేను కాస్త దగ్గి నట్లు..నోటికి వచ్చిన పాట అందుకున్నాను..నడక వేగం అందుకుంది..దయ్యమో, దొంగనో,అర్ధం కాని అయోమయ పరిస్థితి ..అంతకు ముందు రోజు ఊర్లో ఓ యువతి ఆత్మహత్య అప్పుడే ఆ సంఘటన యాదికోచ్చింది.
అందరి ముందు దయ్యం గియ్యం జాన్తా నై.. అంతా భ్రమ అని గప్పాలు కొట్టడం మాములే..ఏదైనా తనదాక వస్తే కానీ…తెలియదు ..మనసు పరి పరి విధాల ఆలోచన .. శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం.. దండకం ఎత్తుకొని వడివడిగా ఇల్లు చేరాను..నా వెనక ఆ ఏడుపు ఇంకా వినిపిస్తూనే ఉంది..ఇంటికి చేరాక బతుకు జీవుడా..అని ఊపిరి తీసుకున్నాను..నాన్న లేచి తలుపులు తీశాడు..
నేను కొంత ఆందోళన గా ఉండడం చూసి ,విషయం తెలుసుకుని.. నన్ను భుజం మీద చరచి… చుట్టు పక్కల వాళ్ళను లేపి కందిల్ , దుడ్డు కర్రలు తీసుకొని పదరా ..!ఎక్కడో చూద్దాం అని గుంపుగా ఆ దయ్యం ఏడుపు వినిపించిన చెట్ల పొదలవద్ద చూపించాను..అందరూ పెద్దగా శబ్దాలు చేస్తూ..దీపం కందిల్ తో చూస్తూ..కర్రలతో చెట్లను కొడుతూ ఉంటే అప్పుడు ఏడుపు పెద్దగా విన్పించింది..అది మనిషి గొంతుగా గుర్తించి బయటకు రా…!
ఎవరో.!రాకుంటే దెబ్బలు తినాల్సిందే…అని నాన్న గర్జించాడు . నాన్నా తో పాటు అందరూ గొంతు పెంచారు. మెల్లగా చెట్ల పొదల్ల నుండి ఓ మహిళ భయం భయంగా ఏడుస్తూ బయటకు వచ్చింది..అందరూ ముందు కొంచం భయపడ్డా,దీపం వెలుగులో ఆమె ముఖం చూసి ,ఒకేసారి యాదమ్మా..అని అరిచారు..ఆమె అందర్ని చూసేసరికి ప్రాణం లేసోచ్చింది..
తనివితీరా ఏడ్చింది.. తాను ఎదో అఘాయిత్యానికి పాల్పడం కోసమే ఇల్లు విడిచి వచ్చినట్లుగా అర్ధమైంది..”పొలం పనికి వెళ్లి వచ్చాక..వంట చేస్తుంటే ,ఎడ తాగివచ్చాడో..ఏమో మా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది..గొడ్డును బాదినట్టు బాదిండు.. ఏ నుయ్యో గోయ్యో చూసుకొని సద్దామనుకున్నాను..
పిల్లలు యాదికి వచ్చి ..ఇక్కడే మూల్గుతూ ఉన్నా”అని ఏడుస్తూ చెప్పింది…అందరికి
“అయ్యో..అంత పని చెయ్యొద్దమ్మా..మేమంతా లేమా..! రేప్పొద్దున్నే వాడ్ని మక్కెలిరగ తన్ని
బుద్దిచెబుదాంలే..పదా..కళ్లు తుడుచుకో..” అని అందరూ కలసి వాళ్ళింటికి తీసుకెళ్లి..ఆమె భర్తను లేపితే అందర్ని చూసి ఖంగు
తిన్నాడు.అందరితో పాటు తన పెళ్ళాం యాదమ్మ ఉండడం చూసి..సిగ్గుతో కూడిన బిడియం ప్రదర్శించాడు..చివరికి తలా ఓ మాట అని,పెళ్ళాం మొగుళ్ళన్నాక
సంసారంలో ఎదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి.అన్నింటిని సర్దుకుపోవాలి..నీ తాగుడు కు ఓ హద్దుండాలి.జర ఆరోగ్యం కూడా చూసుకొ. మళ్ళీ సారి యాదమ్మని కొట్టినా,తిట్టినా నీ భరతం పడ్తామ్.. అని అందరూ బెదిరించినట్లుగా అనే సరికి కిమ్మనకుండా తల కింది కేసుకున్నాడు..
అక్కడి నుండి అందరూ దయ్యమని మమ్మల్ని కంగారు పెట్టితివి గదరా..అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్లారు….
నాకు ఊపిరి పీల్చున్నంత పని అయ్యింది.చదువుకున్నోడిని నేనే దయ్యం అని భ్రమ పడ్డందుకు సిగ్గనిపించింది..మనిషికి భయమే.. ఇలాంటి ఆలోచనలకు
మూలకారణం..కదా.. ఏదైనా ఇదో జ్ఞాపకం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!