అనుకోని అథితి

(అంశం:: మనసులు దాటని ప్రేమ)

అనుకోని అథితి

రచయిత:: సిరి “అర్జున్”

తొలి చూపు లోనే ప్రేమ పుడుతుందా? అంటే పుడుతుందేమో అని చెప్పవచ్చు. బహుశా! ప్రేమ పుట్టడానికి ఒక్క సంఘట చాలేమో!! దీనికి ఉదాహరణ
నా కథేనేమో..!!

అప్పుడే మంచు తెరలు వీడిపోతున్నాయి. ట్రైన్ వెళ్లిపోతుందేమో అన్న కంగారుతో “అన్నా! త్వరగా పోనీ” ఆటో అతనితో అన్నాను. అప్పటికే పది సార్లు పైగానే చెప్పి ఉంటాను.
“వెళ్తున్నాం కదమ్మా!” విసుగ్గానే చెప్పాడు.
రైల్వేస్టేషన్ కి చేరుకున్నాను. ఆటో దిగి ఐదు వందల నోటు అతని చేతికిచ్చాను.
“యాభై రూపాయలకు ఐదు వందలు ఇస్తే ఎలాగమ్మా! పొద్దు పొద్దున్నే చిల్లర ఎక్కడినుంచి తీసుకురావాలి? చిల్లర ఇవ్వమ్మా” అడిగాడు.
“అన్నా నా దగ్గర చిల్లర లేవు. నీ దగ్గర ”
” బోనీ నువ్వే  తల్లీ. ఈ చుట్టూ పక్కల షాపుల్లో ఉన్నాయేమో చూడు”
రెండు మూడు షాపుల్లో అడిగా అందరూ ఒకటే సమాధానం “లేవు”.  ఒక వైపు ట్రైన్ ఫ్లాట్ ఫార్మ్ మీదకి వచ్చేసింది. ఏదైతేనేమి ఐదు వందలు ఇచ్చేయాలి అని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఆ ట్రైన్ మిస్ అయితే తరువాత రోజు వరకు ట్రైన్ ఉండదు అని గుర్తుకొచ్చి.
“నువ్వే తీసు.. ” ఇంకా చెప్పేలోపు. నా పక్క నుండి ఒక చెయ్యి ఆటో అతని చేతిలో యాభై రూపాయలు పెట్టింది. ఆ చెయ్యి ఎవరిదో తెలియక ఆతృతగా తల ఎత్తి చూసాను. హెల్మెట్ పెట్టుకుని వున్నాడు. ఆటో అతను వెళ్ళి పోయాడు. హెల్మెట్ హ్యాండ్సమ్ కూడా స్టేషన్ లోపలికి వెళ్లిపోతున్నాడు. “ఏమండీ?” అతని వెనుక నా బాగ్ ఈడ్చుకుంటూ పరుగు లాంటి నడక సాగించాను.
నేను ఫ్లాట్ ఫార్మ్ మీదకి వెళ్ళేసరికి అతను కనుమరుగయ్యాడు. ‘ఇటు వైపే కదా వచ్చాడు’ అనుకుని చుట్టూ చూశాను. కనిపించలేదు. ‘ఎవరిని అయినా దిగబెట్టడానికి వచ్చాడేమో!’ అనుకుని ముందే బుక్ చేసుకున్న నా సీట్ లో కూర్చున్నాను. అలా కూర్చున్నానో లేదో ట్రైన్ కదిలింది. కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా తెలుపలేదు. అందుకే కొంచెం బాధగా ఉంది.

ఉదయం ఆరు గంటలే కావడంతో ఎక్కువ మంది జనం లేరు. ఏమి తోచక తలుపు దగ్గరకి వెళ్ళి నిల్చుని బయటకి చూస్తున్నాను. చల్లటిగాలికి ఎగిరే నా కురులు విసుగు తెప్పిస్తుంటే! వాటిని ముడి పెట్టి వెళ్లే చెట్టు పుట్టలను చూస్తున్నాను. నా హైదరాబాద్ నుండి సెలవుల్లో  మా ఊరికి వెళ్తున్నాను. ఏవో మాటలు వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాను. నా కళ్ళు మెరిశాయి. నాకు సహాయం చేసిన హెల్మెట్ హ్యాండ్సమ్. కాకపోతే ఇప్పుడు హెల్మెట్ లేదు. అతని ముఖం చూడకుండా నే గుర్తు పట్టగలిగాను. అతను వేసుకున్న బట్టల ద్వారా.

“తర్వాత చేస్తా. ఉంటాను ” అతను కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే! “హెల్లో సర్” పిలిచాను.

నా వైపు చూశాడు. అతని చూపులో ‘ ఎందుకు పిలిచావ్?’ అన్నట్టు అనిపించింది.

“థాంక్ యూ సర్” అన్నాను కొంచెం ముందుకు నడిచి.
“ఎందుకు?” అతని వాయిస్ చాలా నచ్చింది నాకు.
“స్టేషన్ బయట హెల్ప్ చేశారు. ఆటో అతనికి మనీ” గుర్తు కి వచ్చిందా, లేదా అతని వైపే చూస్తున్నాను.

“ఓహ్ ఒకే. పర్వాలేదు” సన్నగా నవ్వాడు. ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు. ‘ఎంత బాగుందో అతని నవ్వు’ అనుకోకుండా ఉండలేక పోయాను.
కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. బహుశా! ఇదేనేమో!!

అతనికి ఫోన్ వచ్చింది.లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని నా వైపు చూశాడు. ‘ఇబ్బందిగా ఉందేమో’ అనుకుని చిన్నగా నవ్వి తలుపు దగ్గకి వెళ్ళి బయటకి చూస్తున్నాను.

అతని మాటలు కొంచెం కొంచెంగా వినిపిస్తున్నాయి నాకు.

“కీర్తులు సారీ రా! మన పెళ్ళికి ఇంకా పది రోజులు వుందే. ఈ లోగా వచ్చేస్తాను. వైజాగ్ లో కొంచెం పనుంది” చాలా ప్రేమగా బుజ్జగిస్తున్నాడు.

నా మనసు బాధతో మూలిగింది.
“నువ్వు నా బంగారానివే! నన్ను నీకంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు” నవ్వుతూ చెప్పాడు.
కాల్ కట్ చేసి నా వైపుగా వచ్చి “హెల్లో మిస్” పిలిచాడు.
నా కనురెప్పలు దాటిన కన్నీటి చెమ్మ తుడుచుకుని నవ్వుతూ అతని వైపు తిరిగాను.
“మీ పేరు” అడిగాడు.
“నిధి” అన్నాను.
“నైస్ నేమ్.పేరే కాదు మీరు కూడా బాగున్నారు.  నా పేరు ఆదిత్య. ఇందాక కాల్ చేసింది కీర్తన. నాకు కాబోయే భార్య” ఆమె పేరు చెబుతున్నప్పుడు అతని కళ్ళలో మెరుపు.

“నైస్” అన్నాను. ఇంకేం చెప్పాలో తెలియక. అతను ఒక్క చిన్న సంఘటన తో నా మదిలో గొప్ప స్థానం సంపాదించాడు. అందుకే అంటారు ఏమో! ఏ అనుభూతి చెందలన్నా ఒక్క సంఘటన చాలు అని!! అని ఆదిత్య సహాయ గుణం నా మదిలో అతను నిలిచిపోయేలా చేసింది. నా మనసులో అతని మీద ఉన్నది ప్రేమో ఏమో?

“ఇంత త్వరగా స్నేహితులయ్యాము. పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి”
“అయ్యో అప్పటికి కుదరదు అండి. కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఎక్సమ్స్ కూడా ఉన్నాయి. ఏమి అనుకోండి”
” ఇట్స్ ఒకే! ”
నేను చిన్నగా నవ్వి కాదు కాదు లేని నవ్వు తెచ్చుకుని అక్కడ నుండి నా సీట్ లో కూర్చుని కళ్ళు ముసుకున్నాను.

అతని ప్రేమ ని  నేను ఎప్పటికీ పొందలేను అని నాకు తెలుసు!!
నా ప్రేమ అతని దరి చేరదని కూడా తెలుసు. నా ప్రేమ నా మది దాటలేదు. మదిలోనే చిగురించి, మదిలోనే ముగిసిపోతుందేమో!!
నాకు తెలుసు నా మనసుకి ఇంకా అర్థం కాలేదేమో!! కళ్ళ ద్వారా కన్నీరు బయటకి పంపుతుంది. మా ఊరు వచ్చే వరకు కళ్ళు మూసుకునే వున్నాను. ఊరు రాగానే బాగ్ తో దిగి తలుపు దగ్గర నిల్చుని ఉన్న ఆదిత్య వైపు చూసి చిరు నవ్వు నవ్వి
చెయ్యి ఊపి స్టేషన్ బయటకు దారితీశాను… నా కంట్లో కారే కన్నీటిని తుడుచుకుంటూ!!

**

 

You May Also Like

4 thoughts on “అనుకోని అథితి

  1. Akka yedipinchesavu…. Nijame le anni love stories success kaavu kadhaa.. but kastha badha ga anipinchindhi… Super akka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!