మాయా లోకం

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
మాయా లోకం
రచన::పి. వి. యన్. కృష్ణవేణి

దూరంగా కనిపించే హరివిల్లు ఎంత అందంగా ఉంటుందో, మన జీవితంలో కనిపించే మనుష్యులు కూడా చాలా మంది రంగుల ప్రపంచం లో విహరిస్తూ ఉన్నట్టు కనిపిస్తారు. కానీ దగ్గర నుంచి చూస్తే అర్ధమవుతుంది వాళ్ళది కలల  ప్రపంచం అని.

రంగుల ప్రపంచంకి అందమైన అర్థం సినిమా ప్రపంచం. మురిపించే రంగుల కలలాంటి నిజం అది.

అమీనా, ఒక అందమైన అద్భుతం. సినీ పరిశ్రమలో అరుదైన హీరోయిన్ ఆమె. ఒకానొక టైంలో సినీ ప్రపంచంలో నెంబర్ వన్ హీరోయిన్. కాలేజ్ స్టూడెంట్స్ కి  రోల్  మోడల్.

తన అభిమానులు అయిన వాళ్లు అందరూ చూసేది తెర పైన కనిపించే అభినయాన్ని, కానీ  తను మాత్రం నా వెనుక ఉన్న పరదాలన్నీ తొలగిస్తే, నా  నిజ జీవితం కనిపిస్తుంది అనేది పేలవంగా నవ్వుతూ.

నేను మీ పి .ఎ. నే కదా మేడమ్, నాతో పంచుకోవచ్చు కదా మీ భాధను అనేదాన్ని నేను నవ్వుతూ . దానికి కూడా ఒక అందమైన చిరునవ్వు నవ్వుతూ నన్ను సమాధాన పరిచేది.

ఒక రోజు నేను డ్యూటీ లో  జాయిన్ అవ్వడానికి వెళ్ళే సరికి, ఇల్లంతా చాలా హడావిడి గా ఉంది. ఏంటి ఎప్పుడూ లేనిది ఇంత హడావిడి  అనుకుంటూ మేడమ్ కోసం వెతికాను.

చాలా సేపటికి బయటకి వచ్చారు మా మేడమ్. నన్ను చూసి దగ్గరకు రమ్మని సైగ చేసారు.

దగ్గరగా వెళ్ల గానే ఇవాళ కాల్ షిట్స్ అన్నీ క్యాంసెల్  చేసెయ్యమని చెప్పారు. నేను ఒకే చెప్పి బయటకు వచ్చాను.

కాసేపటి తర్వాత మేడమ్ నుంచీ  మళ్లీ పిలుపు వచ్చింది నాకు.

నేను మేడమ్ రూం లోకి వెళ్లేసరికి, మేడమ్ మంచం పైన వాళ్ళ అమ్మా, చెల్లి అనుకుంటా (వయసుని బట్టీ) కూర్చుని డబ్బు కట్టల లెక్క కోసం వాదులాడుకుంటున్నారు.

అమీనా మాత్రం, నైట్ డ్రెస్ వేసుకుని, జీవం లేని కళ్ళతో నా వైపు చూసింది. ఆ నిమిషంలో, తన అభిమానులు ఎవరన్నా ఆమెని చూస్తే, గుండె తరుక్కు పోయేది వాళ్ళకు. కానీ ఆమెతో మాకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ల డబ్బు గొడవలో వాళ్ళు ఉన్నారు. అక్కడున్న ఇద్దరు.

నన్ను చూసి మేడమ్ వేరే రూంలోకి రమ్మని పిలిచారు.

వేరే రూంలొకి వెళ్లి కుర్చున్నాము. అమీనా కళ్ల ల్లో చిన్న కన్నీటి పొరలు.

మేడమ్, చెప్పుకుంటే పోతుంది  కొంత బాధ అంటారు. మీకు అభ్యంతరం లేకపోతే  ఏమి జరిగింది అని అడగవచ్చా? అన్నాను.

నీకు తెలిస్తే ఏమైంది శోభ, నాకు చెల్లి లాంటి దానివి. అని చెప్పటం మొదలుపెట్టింది.

నాకు సవతి తల్లి, సవతి చెల్లి వాళ్ళు ఇద్దరూ. చెల్లికి పెళ్లి చేశారు.  ఇప్పటి వరకూ కూడా నేనే ప్రతి నెల వాళ్ల ఇద్దరికీ  కొంత డబ్బు పంపిస్తున్నాను. ఈ నెల కూడా వాళ్ల అమౌంట్ వాళ్లకి చేరింది.

రాత్రి నేను అమ్మకి ఫోన్ చేసి, నేను అమిత్ ని  ఇష్ట పడుతున్నాను. ఇద్దరం పెళ్లి చెసుకుందామని అనుకుంటున్నాము అని చెప్పాను. అంతే రాత్రికి రాత్రి ఇద్దరూ వచ్చేశారు.

ఓసి నీ ఇల్లు బంగారం గానూ, నువ్వు మా కొంప ముంచుకు.

నీ దారి నువ్వు చూసుకుని వెళ్లిపోతే, మాకు దిక్కు ఎవరు? అయినా ఇన్నేళ్లకు నీకు పెళ్లి గుర్తుకు వచ్చిందా? అంటూ  రాత్రి అంతా రభస. పొద్దున్నే ఉన్న డబ్బు అంతా ఇలా వాటా వేసుకుంటున్నారు అని ఏడుస్తూ నా వైపు చూసింది.

మేడమ్, నన్ను చెల్లెలు అన్నారు. అందుకే నేను మీకు ఒక సలహా చెపుతాను అన్నాను.

ఏమిటి అన్నట్టు చూసింది అమీనా నన్ను.

ఇప్పుడు ఉన్నదంతా వాళ్లు పంచేసుకుని వెళ్ళేటప్పుడు, ఇంకా ఇదే మీకు నేనీచ్ఛె ఆఖరి సంపాదన అని చెప్పండి.

మీరు పెళ్లి అయిన వెంటనే అమిత్ ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. నా సంపాదన మొత్తం అమిత్ ఇష్టం అన్నట్టు వాళ్ళని నమ్మించండి.

వాళ్లకు ఇష్టమైతే, ఇంటికి రమ్మని చెప్పండి. మీరు కావాలని అనుకుంటే వస్తారు. లేదా డబ్బే కావాలి అంటే వాళ్ళు ఇంకా మీకు జీవితంలో కనిపించరు అని చెప్పాను.

ఎందరి హృదయాల్లోనో నివసించే కలల రాణి కళ్ళు నన్ను చూసి నవ్వుతున్నాయి ఆ క్షణంలో.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!