ప్రకృతి సూత్రం

ప్రకృతి సూత్రం

రచయిత :: లోడె రాములు

ఆడుతూ పాడుతూ పాడెపై పండగలా..ఊరు ఊరేగించింది…
చిటికె చిటికెకూ….డప్పు దరువు జోరందుకున్నప్పుడల్లా …
దరహాసమే అగుపించే నీమోములో…
బరువులూ.. బాధ్యతలు.. తీరిపోయేనని తీరిగ్గా పయనమై పోతివి…
తిరిగి ఎప్పుడొస్తావో చెప్పి వెళ్లవైతివి.. అయ్యా…!
చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటా..
ప్రతి ఏడాదీ ఎదురుచూస్తున్నా..
నా పిల్లల కడుపు పంటగానో వస్తే మురుద్దామని ….

ఎప్పుడైనా ,కలలోనైనా కనిపిస్తా వేమోనని అనుకున్నా…
నా కలలో రావని తెలుసు..
అమ్మలోనే నిన్ను చూసుకుంటాను..
నీ యాదిలోనే అమ్మ బతుకుతుంది
అమ్మ కైనా అప్పుడప్పుడు కలలో కనిపించి వేళ్లు…
నీ ఒక్క చూపు చాలు మరో పదేళ్లు ఆయువు పోసుకుంటది…
మీ సేవలో తప్పటడుగులు ఎన్నో వేశాను..
సమర్ధించుకోవడానికి
ఎన్నో చెబుతాను..అన్నీ సాకులే..
నియ్యతి లేని కొడుకును….
ఉన్నా, లేనట్లే ….
మళ్ళీ జన్మంటూ ఉంటే ఏ గర్భంలోనూ పుట్టించకు..
పాపాలను జమ చేయకు..
రాయిగానో రప్పగానో..
ప్రాణంలేని ఏ ముడి పదార్థం గానో జన్మ ఇవ్వమని బ్రహ్మకో.. శంకరునికో..చెప్పు..నాన్నా.
నేను ఇష్టంగా కోరుకుంటున్న.. శిక్షా.!.కాదు..కాదు..
ధర్మం..
నేను ఏమి ఇస్తానో..
తిరిగి నాకు అదే వస్తుంది..
పశ్చాత్తాపానికి సమయం కాదు..
ప్రకృతి సూత్రానికి…
తల వంచాల్సిందే..
ఎవ్వరమైనా..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!