మౌనంలో మర్మం
రచన :: డేగా.వి.ఆర్.రెడ్డి
కాలం
సాగిపోతోంది
మౌనంగా!
– తనతో వచ్చే
గడబిడ ప్రపంచానికి
తన సమాధానంగానే!
చెప్పాలంటే –
కడుపులో
గాయాల బాధను
భరిస్తూనే,
మేధో చయనికపై
లిఖిస్తూనే!
మరీముఖ్యంగా –
ప్రకృతి
ప్రళయాలు విలయాలు
ప్రభంజనాలను
కాసుకొంటూనే,
తనలో దాచుకుంటూనే!
అవి –
‘కాలంచేసిన
గాయాలం’టూ
మనిషి నిందిస్తున్నా..
మౌనాన్నెక్కడా వీడకుండానే!
– అపరాధి ఆరోపణల్ని వింటూ
తనదారిన తానుగానే!
అయినా –
వదలక
వెంటబడి
వేధిస్తోంది లోకం
పెద్ద వేటగాడిలా!
– చప్పుడు చేయని
కాలానికి డప్పులతో
సుద్దులు చెబుతూ!
అందుకే చెబుతున్నా –
లోకనిందకు పాపశమనం
కాల కేతనానికి హేతువందనం!
