అక్షరలక్ష్యం

అక్షరలక్ష్యం

రచన :: డేగా.వి.ఆర్.రెడ్డి

నాది
ఓ నిశ్శబ్ధం
విశ్వాబ్ధంలో దాగిన
శబ్ధార్ధ లబ్ధం!

– వీక్షణానికి
అందని లక్షణం నాది!

నేను
ఓ అగ్నిపర్వతం
శబ్ధం మాటేసిన
నిశ్శబ్ధ గృహం!

– ఏ క్షణమో
తెలియని వీక్షణం నేను!

నిత్యంలో
అనిత్యంగా,
సత్యానికి దగ్గరగా,
క్షణక్షణం ఉత్కంఠగా..
దిక్కులకోనలో
అక్కున చేరిన గిరి శిఖరాన్ని!

ఓహ్.. బాగుబాగు!
కాని,

తప్పని ప్రేలుడు
పెఠేల్మన్నప్పుడు..
ఆ అగ్నిశిఖల
అతలాకుతలం
అవనినంత కాల్చేస్తే –

బూడిద కుప్పల
భూగోళాన్ని
మేడిపట్టి‌ కాడిదున్నే
అక్షర రైతుగ తిరిగి జన్మిస్తా
– తరగని తరాలకు దారిగ నే వర్తిస్తా!

జలధి
తరంగమై,
గాలి కెరట‌మై,
అగ్నికున్న మగ్నతై,
గగనికే నే గమనినై,
భువనితో నా బంధమై!
– వస్తూ పోతూ నేనో పరంపరంగా!!

నేనే సత్యంగా
నేనే నిత్యంగా
నాదే లోకంగా
విశ్వం నేనై
విద్యుక్తం నాదై
వర్తిస్తా.. నర్తిస్తా
వస్తు ప్రపంచంలో
భావ ప్రకంపనలే పుట్టిస్తా
ప్రాయోజితాలే పరిపరి సృష్టిస్తా!

అందుకే –
నేనో నిశ్శబ్ధ లబ్ధం
నాదొక అవిశ్రాంత ధర్మం
వెరసి, నేనొక సరస్వతీ పుత్రం
– అక్షర లక్ష్యంలో నాదో పర్వం!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!