మేలుకొలుపు..!
రచన ::పిల్లి.హజరత్తయ్య
ఉదయిస్తున్న సూర్యుని రంగు ఎరుపు
ఎందరో జీవితాల కది మేలిమలుపు..
అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు
భక్తుల పాలిట చల్లనిచూపు..
ప్రియురాలి బుగ్గలోని లేలేత ఎరుపు
ప్రియుడి మనసులో రేకెత్తించు కైపు..
ప్రాథమిక రంగులలో ముఖ్యమైనది ఎరుపు
మనిషి గుండెనిండా ధైర్యాన్ని నింపు..
రాబోయే ప్రమాదాలకు సూచిక ఎరుపు
సురక్షితమైన ప్రయాణానికి పిలుపు..
చైతన్యస్ఫూర్తిని రగిలించునది ఎరుపు
అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కలుపు..
మగువ తిలకము,పారాణి ఎరుపు
ఆమెలోని తెగువకు అదియే ఊపు..
సైనికులు ముద్దాడేరంగు ఎరుపు
ప్రాణాలనిచ్చి దేశ సమగ్రతను నిలుపు..
కర్షక,కార్మికుల శక్తికి సూచిక ఎరుపు
ఎన్నో ఉద్యమాలు కదే గెలుపు..
నాలో ఉరికే రక్తం ఎరుపు
నా కవితా లక్షణం మేలు’కొలుపు’..!
***