నా తెలుగు

నా తెలుగు

రచన : ప్రసాదరావు రామాయణం

గత తెనుగుభాషా వైశిష్ట్యాన్ని
గోతిలో పూడ్చి శిక్షించారు వారు
గోనెసంచిలో వేసి మూతికట్టి
విసిరేశారు ఆంగ్లేయులు
బంగాళా ఖాతంలో వెతుకు
కనిపిస్తుందేమో
పసిఫిక్ సముద్రంలో వెతుకు
కొన్ని అక్షరాలైనా దొరుకుతాయి

ఇప్పుడేమని చెప్పను గత వైభవం?
మా తాతలు నేతులు త్రాగారు
మా మూతులు వాసన చూడండని చెప్పనా?
“చెయ్యిత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి తెలుగోడా”
అని చప్పట్లు చరచనా
ఆ పోతన్న
ఆ రామన్న(తెనాలి)
ఆ శ్రీనాధుడు
ఆ విశ్వనాధుడు మనవాడే
అని ఎవరికి చెప్పనూ?
ఆ వేమన్న
ఆ సోమన్న(పాల్కురికి)
ఆ శ్రీశ్రీ
ఆ సినారె
ఎవరు విన్నారు కనుక
ఈనాటి బాలాలూ?
చెప్పండి చెప్పండి
షేకులనూ, మిల్టన్లనూ
చంపండి చంపండి
విద్యార్థులను వల్లెవేయమని

ఆయ్యయ్యో నా తెనుగు
తేనెవంటి తెనుగు
మల్లెల పరిమళం లా
కన్నెపిల్లల లాస్యంలా
తెనుగు…….
మా అమ్మ చనుబాలు!
అదృశ్యమై పోతుంటే
విల విల లాడుతూంది హృదయం
వల వల శోకిస్తూంది తెలుగుతల్లి
కార్పొరేట్ పాఠశాలలు
ప్రభుత్వ బడులు
అన్నీ ఇంగిలీసు చంక నాకుతుంటే
ఎవరినీ నివారించలేని
అసమర్థుడిని
తెలుగు అంతరించి పోతే
పర భాష పలుకవలసి వస్తే
నా నాలుక కోసుకుంటా కానీ
ఇంగిలీసు మాత్రం మాటలాడను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!