ఓ ఉక్కు కార్మికా…

ఓ ఉక్కు కార్మికా…

 రచయిత :సత్య కామఋషి


కోరిన గనులనిచ్చి మన అక్కర తీర్చలేదు..
ఏ వార్షిక బడ్జెట్ లోనూ పైసా కూడా రాల్చలేదు..
ప్రైవేటు కేటుగాళ్ళకిచ్చినట్టు
పన్ను రాయితీలు ఇవ్వనూ లేదు
రుణమాఫిలూ చేయలేదు…

నష్టాలను భరించాం..
రక్తాన్ని మరిగించి,లాభాలూ గడించాం, 
కష్టాలను జయించాం,స్వేదాన్ని చిందిస్తూ,స్వాంతన పొందాం
ఏనాడు మన ఊసుపట్టలేదు, మనల్నిఅమ్మే హక్కూ లేదు…

పోరాడుదాం..పోరాడుదాం,తగ్గేదీ లేదు..
తలొగ్గేదీ లేదు..
మన పంతం నెరవేరువరకు…
మన ఆత్మగౌరవం నెగ్గేవరకూ…

కార్పోరేటు కబంధ హస్తాల చిక్కి
బానిసలుగా మారకుండా ఉండేందుకు,పోరాడుదాం,
మన ఉనికిని కాపాడుకునేందుకు..
 పెత్తందార్ల పాదాల కింద మట్టి పురుగులై నలిగిపోకుండా ఉండేందుకు,పోరాడుదాం..
మన తెగువను చాటేటందుకు.. 

నలిగిపోతున్న సగటు సామాన్యుడి విస్తర్లకు
వట్టి మాటల మూటలనట్టేపెట్టి,
తెగబలిసిన బడాబాబులు బకాసురులకు 
జాతి సంపద రొక్కపు బొక్కసమును కట్టబెట్టే అఘాయిత్యపు …

నీతిమాలిన నాయకుల పనికిమాలిన సంస్కరణలను…
రాజకీయ సిద్ధాంతాలను తిప్పికొట్టి, తరిమికొట్టే వరకు,
నియంతృత్వ పాలకుల మెడలు వంచి..
మనం గెలిచేవరకు…

పోరాడుదాం..పోరాడుదాం, చేయిచేయి కలిపి సమైఖ్య శక్తిగా
ఒక్కటైన ఉక్కు పిడికిళ్ళను బిగబెట్టి..కలిసి కదంతొక్కుదాం
ఎదురులేని,బెదరులేని,తిరుగులేని
అఖండ శ్రామిక శక్తిగా.. 

కదలిరా కార్మికుడా, కలిసి రా శ్రామికుడా, ఉప్పెనలా ఉరికి రా
పోరాడితే ,పోయేదేముందీ,వెధవ బానిస సంకెళ్లు తప్ప
ప్రాణానికి విలువేముందీ నిండైన ఆత్మ గౌరవం కోల్పోయాక..

You May Also Like

3 thoughts on “ఓ ఉక్కు కార్మికా…

  1. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు..కార్మికుల కష్టాన్ని బాగా తెలియ చేశారు సర్..🙏🙏

  2. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!