ఓ ప్యారి పానీపూరి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి బైటారు ” దేవి తనయ
అక్కడెక్కడో ఉత్తరాదిన పుట్టినా
నేడు ప్రతి గల్లీ లో బండి పై ఊరిస్తూ
సాయంత్రం కాగానే జనాలను బారులు తీయిస్తూ
పిల్లాపెద్దా తేడా లేకుండా అర్రులుచాయించేలా చేస్తున్న
పసందైన పానీ పూరి గురించి చూద్దామా ఓ సారి
ఢిల్లీ లో గోల్ గప్పాగా, ముంబై వీధుల్లో పానీ పూరి గా,కోల్ కత్తా వాకిట పుచ్కాగా
పిలవబడుతూ అందరి మనస్సులు దోచుకుంటున్న ఓ ప్యారి పానీపూరి!!
బాగా పొంగిన చిన్న పూరి లో లాఘవంగా రంధ్రం చేసి బంగాళా దుంప ముద్ద కూరి
ఆపై పచ్చని కొత్తిమీర, పుదీనా నీటిలో బుడుంగున ముంచి ఒకేసారి నోట్లోకి కూరుకుని కళ్ళు మూసుకుంటూ
అదిరిపోయింది అంటూ రుచిని ఆస్వాదించడానికి
నీకోసం క్యూ లు కడ్తున్నారంటే నువ్వెంత రుచి తో మైమరిపిస్తున్నావో ఓ ప్యారి పానీపూరి!!
పక్కనే ఉన్న మురికి కాలువ దుర్గంధాన్ని కూడా పట్టించుకోకుండా
సవ్యసాచిలా రెండు చేతులతో ఇచ్చే పానీపూరివాలా తో
ఇంకొకటి ఇంకొకటి అడుగుతూ వరుసపెట్టి
తినేస్తూ ఆస్వాదిస్తున్నారంటే
ఆ రుచి పానీపూరి వాలా చేతి మహిమా లేక
వాడే నీళ్ల మహిమా లేక ఇంకేమైనా?
ఆఏదేమైనా విదేశాలకు కూడా నీ ఖ్యాతి పాకిందంటే నీవెంత గొప్పదానివి ఓ ప్యారి పానీపూరి!!
