ఒడి ఊయల్లో

ఒడి ఊయల్లో

రచయిత :: శ్రీతరం బింగి శ్రీకాంత్

పొద్దు సుక్క పొడుస్తుంటే
జొన్న సేను కావలి
పిట్టలల్లీయ్య నువ్వు బోతుంటే
కళ్ళ ఊసులు కడగకుండా
ఎంటపడిన రోజు యాదికొస్తోంది అమ్మా…

నీవు కట్టె తీసుకు భయపెట్టి
ఇంటివరకు తరిమినా
కన్నీళ్లు పెట్టుకుంటూ
జొన్న కొయ్యల దాపున
దాక్కొని దాక్కొని వస్తుంటే…

కర్నవొళ్ళ బాయికాడ
కళ్లు పెద్దవి చేసి
నాకేసి సూస్తుంటే
అమాంతం నా సేతులు
నీ కాళ్ళకు పెనవేసి
కొయ్యగుద్దిన రకుతం కాళుతో
విలవిలలాడిపోయా…

అది చూసి నువ్వు
ఎంతపనాయరా అయ్యా!
అంటూ, కన్నీళ్లు పెట్టుకుంటూ
పైట కొంగు చించి కట్టుకట్టి
ఎదలకు హత్తుకున్న
జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది అమ్మా…

కాళ్ళు కింద పెట్టనీకుండా
ఒడి ఊయల్లో ఎత్తుకుని
ఇంటివరకు మోసినప్పుడు
కొంగు గొడుగు చల్లగాలికి
నొప్పిని ఆదమరచి నిద్రపోయిన
ఆ ఆనందం ముందు
అన్నీ దిగదుడుపేనమ్మా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!