పచ్చగా పదిలంగా ఉందాం

పచ్చగా పదిలంగా ఉందాం!

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బొల్లాప్రగడ ఉదయభాను

పునరపి జననం పునరపి మరణం
కనిపించే ప్రతిదీ కొన్నాళ్ళకు
కను మరుగై కాల గర్భంలో కలిసి పోతుంది
మరణం తప్పని ఓ ప్రయాణం
మరణం కొందరి దృష్టిలో
కొన్ని పడలేని బాధలకు విముక్తి
పుట్టాక గిట్టటం సహజమే కానీ, ఏమిటో!
చావు ఆ పేరు వింటేనే గుండెల్లో గుబులు పుడుతుంది.
ఈ రోజు చూసిన వ్యక్తులు
అదేమిటో మరలా కనిపించరంటే.
అదో రకమైన భయం
రేపు మనమైనా ఇంతేగా అనే నైరాశ్యం
ముందే తెలిస్తే..చాలా చేసేయచ్చు అనే ఆలోచన.?
కానీ చిన్న దెబ్బ తగిలితే ఓర్చుకోలేని మనం
మరణం గురించి ముందే తెలిస్తే అమ్మో!
ఆ మరణ భయం, వద్దు బాబూ వద్దు
అమ్మ పొత్తిళ్ళలో నుంచి
ఎన్నో ఒత్తిళ్ళు ఎదురుకుని
అలసి సొలసి కన్నులు మూసి
మహా ప్రస్థానం చేరే జీవి ఎన్నో ఆశలు, ఊహలు
ఉన్నంత కాలం ఉట్టి కట్టుకుని
ఉయ్యాల ఊగుతుంటాడు
రైలో, బస్సో ఎక్కి మన గమ్యం రాగానే
దిగి పోయినట్టు, భగవంతుని పిలుపు రాగానే
పైకి పయనమవుతున్న జీవులు ఆశలు నిరాశలు
ఇంకా మిగిలే ఉన్న అసంతృప్తులు
ఏదో చెయ్యలేక పోయామనే దిగులు
ఈ సమయానికి పోతాం అని ముందే తెలిస్తే
చక్కగా ప్రణాళిక వేసుకుని
అన్నీ సద్దుకునే వారం అనిపిస్తుంది కానీ
ఎప్పుడూ ప్రయాణాలకు పడే ప్రయాస ఆందోళనల్లానే మహా ప్రయాణం గురించి
ముందు తెలిసినా! అదే ఆందోళన ఎంత సద్దుకున్నా
ఇంకా ఎంతో కొంత మిగులు బాటు,
అందుకే నరకమో, నాకమో తప్పదని తెలిసినప్పుడు.
మన వారి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందాన్ని అందిద్దాం
కేవలం గోడ మీద గురుతుల్లా కాక వారి జ్ఞాపకాలలో
పచ్చగా పదిలంగా మిగిలుందాం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!