మరణం కూడా వరమే

మరణం కూడా వరమే

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ఏభై ఏళ్ళ క్రిందటి మాట. “మా ఊరి గాంధీ గా పిలవబడే పూర్ణయ్య పంతులు గారు ప్రముఖ గాంధేయవాది”. స్వాతంత్ర్య యోధులు. ఆ ఊరికి ఎవరొచ్చినా! వీరి ఇంట్లో ఆతిధ్యం స్వీకరించవలసినదే. వీరు లేని సభ కార్యక్రమం ఉండేవి కావు. ఎప్పుడు ఖద్దరు వస్త్రాలతో గడ్డంతో కర్ర పట్టుకుని మనుమడి సహాయంతో వెళుతూ ఉంటే మా ఊరి దేముడు. ఆయన నిండా నూరేళ్ళు బ్రతకాలి అని ప్రజలంతా కోరుకునే వారు. దారి పొడుగునా అందరిని పలకరిస్తు బాగున్నారా! అని క్షేమ సమాచారాలు అడిగేవారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినాల్లో ఆయనచేత జాతీయ జెండా ఎగురవేయించి వారు స్వాతంత్ర్య సముపార్జన లో పనిచేసిన సంఘటనలు, పొట్టిశ్రీరాముల త్యాగనిరతి దుర్గాబాయ్ దేశముఖ్ స్త్రీ జనోద్ధరణ గురించి చెబుతు నైతిక విలువలు సంస్కారం మానవులకు అవసరం అని ఆచరించి చెప్పడం ఇప్పటికి గుర్తు. వినాయక నవరాత్రులు, వసంత నవరాత్రులలో సీతా రాముల కల్యాణం ఆయన చేతులమీద అత్యంత వైభవంగా జరిగేవి.
దసరా నవరాత్రులలో పూర్ణయ్య పంతులు గారికి  వంట్లో అస్వస్థతకు లోనైనపుడు డాక్టరు వచ్చి ఆయనతో గాక వారి కుమారునితో విశాఖపట్నం పెద్దాసుపత్రికి తీసుకు వెళ్ళమని అంబులెన్స్ లో చెబితే  వెంటనే  అది పెద్దాయన చెవిన పడి “ఎందుకురా! వద్దన్నా,” సరేలే నీ ఇష్టం అన్నారు.
కె.జి.హెచ్ లో పరీక్షలు చేసి గుండెలో చిల్లు పడింది. దానికి స్టంట్ అన్న పరికరాన్ని ఆరోజులలో అమెరికా నుంచి తెచ్చివేసినా వయస్సు చేత జీవించడం కష్టమన్నది ప్రముఖ హృద్రోగ నిపుణులు ప్రొఫెసర్ సిన్హా చెప్పడం అంత వరకు ఈయన ఎలా ఉంటారో అన్నది విన్న పూర్ణయ్య గారి మాటలు ఎందరికో స్ఫూర్తి. అవి “చిన్నవారైన సి.నా. రే  వ్రాసినది అక్షర సత్యం ‘కనుతెరిస్తే జననం, కనుమూస్తే మరణం
లిప్త పాటు జీవితకాలం’అని ఆనాడే ఆదిశంకరులు చెప్పిన “పునరపి జననం పునరపి మరణం”అన్నది నిజమే కదా! అని జీవితంలో అన్నీ చూసాను. నా ఒక్కగాని ఒక్కకొడుకు చేతి మీదుగా మంచాన పడకుండా, ప్రజలందరు బాగుండాలని ఆశీస్తు పరమేశ్వరుని సన్నిధికి ఎనిమిది పదులు దాటిన నేను భాధ పడకుండా ఎవరిని భాధ పెట్టకుండా వెళ్ళడం వరమే”. ఎప్పటికైనా ఇది తప్పదు. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు, బాధ్యతలు నిర్వహిస్తున్న నడి వయస్సు వారి మరణం అపసవ్యమే కానీ, విధి బలీయం అని అంటు దసరానాడు రాత్రి ఏకాదశి ఘడియలలో అమ్మదరికి చేరిన పూర్ణయ్య పంతులు గారు చిరస్మరణీయులే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!