ఉమాదేవి-ఉగాది పచ్చడి

ఉమాదేవి-ఉగాది పచ్చడి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

          బారెడు పొద్దెక్కింది ఒక్కడు లేవరే పండుగపూట అభ్యంగన స్నానం చేసి దైవప్రార్ధన అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడి తింటే ఆ ఏడాదంతా సుఖసంతోషాలతో ఉంటుందని పెద్దలు ఏనాడో చెప్పారు. ఏం కాలంమో ఏమిటో రాత్రి రెండింటి వరకు కంప్యూటర్ తో, ప్రొద్దున్న లేవగానే ‘కరాగ్రే వసతే లక్ష్మి’ అని కాకుండా చరవాణి తో దినచర్య ప్రారంభిస్తారు. అయినా ఏం లాభం కొడుకే కాదు కోడలు, మనుమలు అందరిది ఇదే తంతు. కనీసం పండుగ నాడైన ఐదో గంటకి లేవాలన్న ధ్యాస లేదు ఎవరికీ, ఏమైనా అంటే మీ రోజులు వేరు అంటారు ఇలా సాగిపోతున్న ఉమాదేవి మాటలకు ఆమె ఏకైక ముద్దులకొడుకు అశ్విన్ లేచి మొదలు పెట్టావా అమ్మా శెలవు రోజునైన కొంచెం సమయం పడుక్కోనీయవా అని  రాత్రి నేను, మీ కోడలు విశాలి పడుక్కునేసరికి మూడయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ తో చస్తున్నాము. వారికి పగలు మనకు రాత్రి ఇద్దరం టీం లీడర్లం. మాదే భాద్యత. ఏం చేస్తాం డబ్బులు ఊరికే ఇవ్వరు కదా ఉద్యోగం అన్నాక తప్పదు అని నవ్వుతు నీ గొడవ నీదే కాని మా భాధ కూడా పట్టించుకో అమ్మా అని ముందుకు వస్తున్న కొడుకుతో ముట్టుకోకు మడిలో ఉన్నా. నా పూజ అయిపోయింది. నాన్న గారు అనుష్టానంలో ఉన్నారు. ఉగాది పచ్చడి సిద్ధంగా ఉంది అన్నారు ఉమాదేవి. అమ్మా ముఖం కడుక్కుని కాఫీ త్రాగేక ఉగాది పచ్చడి తింటాను అని అన్న కొడుకు ఆశ్విన్ తో అది కాదురా నాయనా ఈరోజైన ముఖం కడుక్కుని అభ్యంగన స్నానం చేసిన తరువాత ఉగాది పచ్చడి తిని ఆ తరువాత కాఫీ త్రాగితే నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు కోరుకున్నవి జరుగుతాయి  ప్రమోషన్ వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది నీవు ఇలా అంటుండబట్టే నానమ్మ నీకేమి తెలియదని మనుమలు అంటున్నారు. నేను  చదివిన స్కూలుఫైనల్  చదువే నయం. నా పాటి ఇంగ్లీషు పరిజ్ఞానం ఇంజినీరింగ్ చదువుతున్న నీ పిల్లలకు రాదు. కానీ మాటకి మాట జనరేషన్ గాప్ అంటారు. మాటలకేం ముందు పిల్లలను లేపి ముఖం కడుక్కో. ఇప్పుడే కోడలు స్నానానికి వెళ్ళింది అన్నారు. ఉదయం ఏడున్నరకి ఉమాదేవి గారి కొడుకు, కోడలు, మనుమలిద్దరు అభ్యంగన స్నానానంతరం పూజగదిలోకి రాగానే ఆమె స్వయంగా ఇలవేల్పు వేంకటేశ్వరునికి, సద్గురు సాయికి నమస్కరించమని, కుంకుమ, విభూతి ధారణ చేసి ఉద్దరిణి తో వద్దన్నా మూడు పర్యాయాలు అందరి కుడి చేతుల్లో ఉగాది పచ్చడి వేసి తీసుకొండి చేతులు కడుక్కున్నాక కాఫీ ఇస్తాను అన్నారు. బ్రతుకు జీవుడా అంటూ తింటుంటే ఈ ఏడాది ఉల్లాసంగా, ఉత్సాహంగా, కరోనా పోయి హాయిగా ఉంటుంది అన్న అత్తగారి మాటలు విన్న విశాలి నిజంగా షడ్రుచుల ఉగాది పెద్దావిడ బాగానే చేశారు అన్నిపాళ్ళు సమంగా ఉందని మనస్సులో అనుకుంది. మనుమలిద్దరు నానమ్మ పచ్చడి బాగుంది కొంచెం చేతిలో వెయ్యి అని అడిగి మరీ తిన్నారు. అనుష్ఠానం ఆయిన భర్త చేతిలో కూడా ఉగాది పచ్చడి వేసిన ఉమ ఎలా వుంది అంటే నలభై ఏళ్ళయి చూస్తున్న నీ ఉగాది పచ్చడి  భేషుగ్గా ఉంది ఏమనుకున్నారు మా ఆవిడ ఏది చేసినా అమృతమే అని భార్యని పరమేశ్వరరావు పొగుడ్తుంటే పోదురు అని సిగ్గుతో ఉమాదేవి తలదించుకుని చేతులు కడుక్కోండి వేడి వేడి కాఫీ ఇస్తాను అంటూ స్టవ్ వైపుకు ఆనందంతో వెళ్ళడం చూసి అమ్మ నిజంగా మా పాలిట భగవంతుడు ఇచ్చిన దేవతయే కదా అని అశ్విన్ భార్యతో అనడం సన్నగా ఉమాదేవికి వినిపించినప్పుడు నా జీవితం ధన్యమైనది బాబా అని తను నమ్మిన షిర్డీసాయి ని తలచుకున్నారు…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!