స్నేహం

స్నేహం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:సావిత్రి తోట “జాహ్నవి”

           రాజేష్ కి టామ్ అంటే చాలా చాలా  ఇష్టం. అతడు  లేనిదే తాను లేడు. ఎక్కడికి వెళ్లాలన్న, ఏం చేయాలన్న  ఇద్దరూ కలిసే వెళ్లి, ఆ పని పూర్తి చేసుకుని వస్తారు. ఏ కారణం చేతనైన ఒక రోజు టామ్ ని చూడకపోతే రాజేష్ మనస్సు మనసులో ఉండదు. ఆ రోజంతా టామ్ గురించి ఆలోచనలతో సరిగ్గా నిద్ర కూడా  పోలేడు. అసలు రాజేష్ కి టామ్ తో స్నేహం ఎలా కుదిరిందో తెలిస్తే చాలా ఆశ్చర్య పోతారు. అపుడు రాజేష్ వయసు 6 ఏళ్లు. ఒక రోజు రాజేష్ వాళ్లమ్మ తనని స్కూల్ నుండి తీసుకుని రావడానికి వెళ్లేసరికి కొంచెం లేటయింది. పిల్లలు అందరూ వాళ్ల పేరెంట్స్ తో వెళ్లిపోయారు.
రాజేష్ ఒకడే స్కూలు బయట వాళ్ల అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు రాజేష్ ని కిడ్నాప్ చేయడానికీ  బలవంతంగా తమ కారులో ఎక్కించబోయారు. మరి ఎక్కడ నుంచి చూసాడో టామ్.  పరుగు పరుగన వచ్చి, రాజేష్ ని బలవంతంగా  కారు ఎక్కిస్తున్న వ్యక్తి  చేతిని గట్టిగా  పట్టుకుని, అడ్డుకున్నాడు. మిగిలిన వాళ్లు ఎంత కడుపులో, కాలి మీద, ముఖం మీద తంతూ, ఎన్ని పిడిగుద్దులు కురిపించిన  కూడా పట్టుకున్న చేయి వదలలేదు. ఆ వ్యక్తి చేతుల నుండి రక్తం  రక్తం ధారగా కారేలా అలా పట్టుకునే ఉన్నాడు. అది చూసిన రెండో వ్యక్తి ఇక లాభం లేదని టామ్ ని కత్తితో పొడిచి, రాజేష్ ని తీసుకెళ్లద్దామనుకునేలోపు రాజేష్ వాళ్ల అమ్మ దూరం నుండి వస్తూ అది చూసి గట్టిగా అరవడం తో అందరూ చుట్టుముట్టి, ఆ వ్యక్తులను నాలుగు తన్ని పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత రాజేష్ వాళ్ల అమ్మ టామ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి, బాగయ్యాక తాను ఎవరూ లేని ఆనాథ అని తెలుసుకుని, ఇంటికీ తెచ్చి, అప్పటి నుండి రాజేష్ తో సమానంగా చూసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోక్కసారి రాజేష్ కన్న ఎక్కువగానే చూస్తుంటుంది. ఎందుకంటే ఆ రోజు టామ్ లేకపోతే రాజేష్ ఎక్కడ, ఏ పరిస్థితి లో ఉండేవాడో. అందుకే రాజేష్ కు కూడా టామ్ అంటే అంత ఇష్టం, అంతకన్న ప్రేమ అంటే బాగుంటుందేమో. టామ్ కి రాజేష్ గదిలోనే మెత్తటి పక్క ఏర్పాటు చేసారు. అలాగే తాము తిన్న తినకపోయిన టామ్ కి ఇష్టమని స్పేషల్గా మాంసం తెచ్చి వండి పెడతారు. ఎక్కడికి వెళ్లిన రాజేష్ వెంట టామ్ ఉండవలసిందే. రాజేష్ ఇపుడు ఇంజనీరింగ్ లో  జాయిన్ అవ్వాలి. తమ రాష్ట్రం లో ఒక్క దగ్గరే  I. I. T ఉంది. అక్కడ చదవాలంటే హాస్టల్లో ఉండాలి.
టామ్ ని హాస్టల్ ఉండనివ్వరు. ఇపుడు ఎలా అన్నది రాజేష్కి వంద మార్కుల క్వశ్చన్. రాజేష్ నెల రోజుల నుండి తిండి తిప్పలు మానేసి ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాడు. హాస్టల్ కి వెళ్లను , ఇక్కడే ఉండి చదువుకుంటానని. కాని రాజేష్ వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. “నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని మా అందరి కోరిక. అందుకే నాకు  ఎంత కష్టమైన నీకు మంచి కోచింగ్ ఇప్పించాను. నువ్వు వచ్చేవరకు టామ్ బాధ్యత నాది. నువ్వు తప్పకుండా హాస్టల్ లో ఉండి చదవవలసిందే. నా మాటకి మరి తిరుగులేదు. లేదంటే టామ్ ని దూరంగా పంపించేస్తాను”. అని ఖచ్చితంగా చెప్పేసారు. దానితో రాజేష్ మరి తప్పక టామ్ ని వదిలి హాస్టల్ కి బయలుదేరాడు. టామ్ ఊరి చివరి వరకు భౌ…భౌ మంటూ…  రాజేష్ ని సాగనంపాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!