సంస్కృతి – సంస్కారం

సంస్కృతి – సంస్కారం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

వినాయకచవితి వారం ఉండగానే వీధిలో వాదులాట మొదలు,కొన్ని కుటుంబాల మధ్య. ఉండేది పల్లెటూరు వాతావరణమే అయినా అన్నీ తెలిసిన ఆరిందాలు వీళ్ళు. ప్రతి ఇంట్లో పిల్లలు చూసి రమ్మంటే కాల్చి వచ్చే వాళ్లే. ఎక్కడ కక్కడ పెద్దల్ని చూసి సంపాదనలో లౌక్యం.. ఆహార విహార సౌఖ్యం బాగా ఔపోషన పట్టేసారు. దీనికి ఆడా మగా తేడాలేదు.
వినాయకచవితి చందాలు దండే బ్యాచ్లలో పార్టీలన్నీ ఇప్పుడు మాత్రం కలిసే ఉంటాయి. పండగయ్యాక పంచుకున్న విందు మందులతర్వాతే ఎవరున్న పార్టీ అజెండా వాళ్ళదే. నాలుగు ముఠాలకీ డబ్బులు ఇవ్వాలి. తలో సెంటర్ లో బొమ్మ పెట్టేసి చెవులు పగిలే మైకులు, సీరియల్ లైట్ల డెకరేషన్.. పొద్దున్న సాయంత్రం వచ్చి పూజలు చేసే దానికీ నలుగురు కుదిరారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు శక్తి మేర చందా లిచ్చాం పిల్లలపేరుతో. ఇంట్లో చేసే పూజలుకీ ఉత్సవాలు కీ ఎంతో తేడా కదా.
ఈ విధంగానైనా సంస్కృతి సంప్రదాయం నిలిచిఉండేలా ఏర్పాట్లు బాగున్నాయి. మా వీధిలో సెంటర్ కీ కుర్రాడిని పంపారు పూజారి గారు. అబ్బాయి శిఖ తో ముఖంలో తేజస్సు యజ్ఞోపవీతం,ఉత్తరీయం గోచి పోసిన పంచె కట్టు, పద్ధతిగా ఉన్నాడు. మంత్రోచ్ఛారణకూడా స్పష్టంగా ఉంది. వచ్చి నిర్మాల్యం తీసి తెచ్చిన పూలు అలంకరణ చేసి, కుళాయి వద్ద పూజ తాంబాలం, పంచపాత్ర ఉద్దరణ,గంట వగైరా తోముకొని చెంబుతో నీళ్ళు పట్టుకొని వెళ్లి, దీపారాధన అష్టోత్తరపూజలు అన్నీ బాగా చేస్తున్నాడు.
సాయంత్రం ఒక్క రొక్కరే కొబ్బరికాయ, పళ్ళు తో వస్తున్నారు క్యూ లోకి. వంట గది కిటికీ నుండి చూసి నేను కూడాతయారుగా ఉంచుకున్న సెజ్జ తో వెళ్లి క్యూ లో నిలబడ్డాను.పెందలకడనే స్వామికి నైవేద్యం ఇస్తే అదో సంతోషం. కొంపల్లో చాకిరీ ఎప్పుడూ ఉండేదే కదా.. నలుగురు చొప్పున ముందుకెళ్ళి పూజ చేయిస్తూన్నారు. ఊరికే నిలబడి బోర్ కొట్టి క్యూ లో జనాన్ని పరిశీలనగా చూస్తున్న. కొందరు కాలనీ లో తెలిసిన ముఖాలే.. చూపులు కలిసినపుడు చిరునవ్వు పలకరింపుగా.. అంతలో కొద్దిగా కలకలం.. చూసేసరికి కాలనీ పంచాయతీ బోర్డు మెంబర్ పద్మావతి, కుటుంబం.. పక్కన ఆమె తమ్ముడు కొత్తగా పెళ్లి అయినటుంది. అందరు క్యూలో మధ్య నుండీ బదనాంగా ముందుకొచ్చేసారు.
ఆ అమ్మాయి మరీ ఆడంబరంగా అలంకరణ. కిలో నగలున్నాయి వంటి మీద.. బొడ్డు కిందకిపట్టు చీర, మరీ వీపoతా కనిపించే స్లీవ్ లెస్ జాకెట్.. విరబోసుకున్న జుట్టు.. ఒక్క పువ్వు లేదు తల్లో.. లిప్ స్టిక్, మస్కారా.. ఈ రాత్రి వేళా ఇంత షో దేనికో అర్ధం కాలేదు. కనుబొమల మధ్యలో ఎక్కడో ఆవగింజ అంత నల్లరాయి బొట్టు.పాపిట కుంకుమ కూడా లేదు. పాపిట బిళ్ల మాత్రం వేలాడుతుంది.. అలంకరణకీ నాకేం అభ్యంతరం లేదు గానీ ఆ కొంత సేపటిలోనే ఆమె కళ్ల లో అహంకారం ఛాయలు స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యం వేసింది.”ఏమి పద్మా బాగున్నారా? “అన్నా.” హా.. బాగున్నామండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. “అంటున్నదామె. స్వామి దర్శనం లో అలంకరణ చూడటంలో లీనమైపోయాను.
ఉత్సాహంగా ఇద్దరు యువకులు అందరిదగ్గర పూజ బుట్టలు తీసుకోవడం చక చక కొబ్బరికాయ కొట్టడం, పళ్లెంలో పెట్టి పూజారికివ్వడంతో అతను స్తోత్రంతో కర్పూరం కడ్డీలు వెలిగించి హారతిచ్చి పళ్లెం ముందుకు చాపాడు. ఒక్కొక్కరు హారతి కళ్లకద్దుకోని దక్షిణ డబ్బులు వేస్తున్నారు. బదనామ్ గా ముందుకొచ్చిన పంచాయతీ కుటుంబం లో కొత్త పెళ్లి కొడుకు పర్సు తీసి పది రూపాయలనోటు పళ్లెం లో పెట్టాడు. అది చూసి ముఖం కందగడ్డలా చేసుకున్న అతని భార్య.. “పెద్ద షావుకారివే.. పది రూపాయలు ఇస్తారా? ఆ పిల్ల పూజారి తీసుకొని పోతాడు. రూపాయి పడేస్తే పోయేది. నీకు అసలు డబ్బు విలువ తెలియదు” అంటూ ఎద్దేవగా మాట్లాడుతుంటే.. వాళ్ళు ఎవరు అడ్డు చెప్పడం లేదు. తప్పు చేసిన వాడిలా ఆ అబ్బాయి, అవమానంతో పూజారి యువకుడు.. దిగ్భ్రమగా చూస్తున్నారు. ఈమే కనీసం డిగ్రీ చదివి ఉంటుంది. చదువుకున్నది అలంకరణ వరకేనా..?
నాకైతే ఛీ ఛీ అనిపించింది.సంస్కృతి తెలుసు దానిలో సంస్కారం, ధర్మం తెలియని ఇలాంటి అహంకారపు మనుషులు, ఏదొక రోజు చాలా దెబ్బ తింటారు.
టీవీ సీరియల్స్ చూసి ఓవర్ యాక్షన్ అనుకుంటాం.. కానీ నిజంగా కూడా కొందరు ఉన్నారు. ఎపుడెలా సంస్కారం చూపాలో తెలియని హీనత్వం వీళ్ళని అట్టడుగున ఉండేలా చేస్తుంది.
పురాణాలు, ఇతిహాసాలు వల్లె వేయడం, ఎక్కడ పూజలు ఆర్బాటంగా ఉంటే అక్కడ డబ్బులు కట్టేసి వెళ్లి పాల్గొని కార్పొరేట్ భక్తులుగా పిక్ లు తీసుకోవడం కాదు. నిజమైన ధార్మికులని గౌరవంతో చూడటం దేవుని సంగతి అలా ఉంచి, మనల్ని ఒక మనిషిగా చూపుతుంది కదా…ఇవాళ రేపు ఈ సంస్కృతి ని నిలబెట్టే నిజం భక్తులు ఈ పల్లెటూరు వాళ్లే. ఎంత శ్రద్దగా చేస్తారు. ఒకర్ని తక్కువగా మాట్లాడటం తెలియదు.. అనుకుంటూ ఇవతల కొచ్చేసా!!

(సమాప్తం )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!