ఇదోరకం యాచన

ఇదోరకం యాచన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అరుణ చామర్తి ముటుకూరి

పొద్దున్నే పనిమనిషి రాక పనుల హడావిడిలో ఉన్నా. చలికాలం కాబట్టి అపార్ట్మెంట్లో ఉండే బెత్తెడంత వాకిలి రాత్రే చేసి ముగ్గు వేసేశా.
ఇక దంతధావనం తర్వాత, టీ నో కాఫీ నో తాగాలి గా. ఈలోగా మా జీవితంలో భాగమైపోయిన బుజ్జమ్మ కుయ్ కుయ్ మంటూ మొరిగింది. పాలు వేడి చేసి దానికి పోసి, బాల్కనీలో కట్టేశా. దాని కాలకృత్యాల కే అదే బాత్ రూమ్. ఈలోగా టీ ఉడికి పోయింది. గబగబా వచ్చి వంటగదిలో టి వడ పోస్తూ ఉంటే, నా ఫోన్ బెడ్రూంలోనుంచి మోగుతున్న శబ్దం లీలగా వినబడింది. వెళ్లి చూస్తే ఏదో కొత్త నెంబరు. కొరియర్ వాళ్ళ మరి ఇంత పొద్దున్నే నా… అనుకుంటూ లిఫ్ట్ చేసి “హలో ఎవరండీ ?”అన్నా
“మేడం గారు నమస్తే అండి, నేను విజయవాడ పక్కన ఉన్న చిన్న ఊరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కార్తీక్”
” ఆహా” అన్న ఇక ఎలా స్పందించాలో తెలియక. ఎందుకంటే అతను ఎవరో నాకు అసలు తెలియదు.
” మరేం లేదండీ, మీరు రావూరి గారి గురించి రాసిన కవిత సాహితీకిరణం పత్రిక ఉంది కదా! అందులో చూశాను. చాలా బాగా రాశారు” అవునా ఏ పత్రిక అన్నారు ఎవరి గురించి, ఈ మధ్య నేను రాసినవే పత్రికకి పంపలేదే?” మళ్లీ కాస్త వివరంగా సాహితీకిరణం లో, రావూరి గారు” అన్నది వినబడింది. ఓహో ప్రింట్ అయిందా! థాంక్యూ అండి” అని ఫోన్ పెట్టేయ బోయాను.
“ఆ మేడం మేడం ఒక్క నిమిషం అండి ఒక చిన్న సహాయం”. ‘పొద్దున్నే ఎవర్రా బాబు ఇతను’ అనుకుంటూ.”చెప్పండి” అన్న మర్యాదగా పైకి
“మా తాతయ్య మెట్లు దిగుతూ జారిపడ్డాడు అండి. ఫ్రాక్చర్ అయ్యింది ఆపరేషన్ కి బాగా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు ఏమన్నా సాయం చేయగలరేమో అని… మన కవులు అందర్నీ కూడా అడుగుతున్నాను” “ఓరిని అసలు సంగతి అన్నమాట అసలు ఇతను కవి అవునో కాదో తెలియదు.. ఆ తాతయ్య ఉండడం ఆయనకు దెబ్బ తగలడం నిజమో కాదో తెలియదు.. ఎంత బాగా మీ కవిత బావుంది అన్న ఒక పొగడ్త కి డబ్బులు అడిగేస్తున్నాడు”. నాలో నేను అనుకుంటున్నాను మౌనంగా మేడం లైన్ లో ఉన్నారా అండి, నా గూగుల్ నంబర్ ఇదేనా అండి మీకు తోచినంత సాయం.” హా, చూడండి నేను ఉద్యోగస్తురాలను కాదు. నా దగ్గర ఎలాంటి డబ్బులు ఉండవు.”
“అయ్యో అలా అనకండి తప్పని పరిస్థితుల్లో అడుగుతున్నాను,”పెట్టకపోయినా పెట్టే చేయి చూపించమన్నారు. నేనేమి సాయం చేయలేను నా స్నేహితులు ఎవరైనా చేస్తారేమో నీ నెంబర్ ఇస్తాను”
అలా ఎందుకు లేండి? మీరే వారందరి దగ్గర అడిగి తీసుకుని నాకు ఈ నెంబర్ కి పంపించండి.
భలేవాడే నాకు ఎలా ఆర్డర్ లేస్తున్నాడో. అతని గొంతులో ఏ మాత్రం తాతకి దెబ్బ తగిలిందని బాధ కానీ , కంగారు కానీ ఏమీ వినిపించడం లేదు. పైగా డబ్బులు నేను కలెక్ట్ చేసే అతని నెంబర్ కి పంపించు మనడంతో ఏదో ఫేక్ అని నాకు అర్థం అవుతూనే ఉంది. ముందే నేను జాగ్రత్త పడి చెప్పేసాను కూడా ఇవ్వలేను అని. ఒక వేళ అది అబద్ధం అని తెలిసి సైబర్క్రైమ్ వాళ్ళకి రిపోర్టు ఇచ్చినా కలెక్ట్ చేసింది నేను కాబట్టి తప్పు నాదే అవుతుంది. ఇలాంటి వెధవ తెలివితేటలు చూడండి. మొన్నామధ్య మా స్నేహితుడికి, మరో స్నేహితుడి లాగా మెసేజ్చేసి.. అర్జెంటుగా అమ్మకి ఆపరేషన్ డబ్బులు ఎంత ఉంటే అంత పంపించవా 15000 కావాలి అన్నాడట.” అయ్యో అంత లేవురా 7000 పంపిస్తాను ఉంది” అని వెంటనే ఆ స్నేహితుడు జాలి గుండెతో దానకర్ణుడిలా పంపేయడం కూడా జరిగింది. అదిగో అసలైనది అక్కడ జరిగింది. మామూలుగా అయితే అనుమానం కూడా వచ్చేది కాదు , మిగిలింది కూడా స్నేహితులను అడిగి త్వరగా పంపు”. ” అదేంటి నా స్నేహితులు వాడి స్నేహితులు కూడా కదా స్నేహితుడి నడిగి పంపు అని చెప్తున్నాడు ఏంటి వాడే అడగొచ్చు కదా. “అని అనుమానం వచ్చి ఏ స్నేహితుడని చెప్పుకొని డబ్బులు తీసుకున్నాడో అతనికి ఫోన్ చేస్తే అతను కాదు ఫోన్ చేసింది. అని అర్థమైంది. ఫేస్బుక్ లో కాంటాక్ట్ చూసి, మెసెంజర్ లో మెసేజ్ లు పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు. 7000 గోవిందా.. ఆ ఫోన్ ఏదో కాస్త ముందు చేసిన బాగుండేదని లబోదిబో మన్నాడు. నేను ముందే జాగ్రత్త పడ్డాను కదా జాలి పెట్టుకోకుండా. ఏమంటారు?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!