యాచకుడు

యాచకుడు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీనివాసరావు శింగరాజు

                 వాసుదేవ బ్యాంకులో గుమాస్తా గిరి వెలగబెడుతున్నా కోరికలు మాత్రం కోటీశ్వరుడి లెవలుకు ఏమాత్రం తగ్గవు. అందుకే దేవుడికి ఖర్చు అనుకోకుండా పూజలు గట్రా చేస్తుంటాడు. ఈమధ్యనే పది లక్షలు బ్యాంకులో పర్సనల్ లోను తీసుకుని పాతిక గదులు స్థలం కొన్నాడు. ఆ స్థలం నాలుగేళ్ళలో నాలుగు రెట్లు పెరిగితే ఆ లోను కట్టేసి, మిగిలిన డబ్బుతో ఇంకో స్థలం కొనాలని కోరిక. అలా స్థలాల మీద వ్యాపారం చేస్తూ కోట్లు గడించాలని పేరాశ అతనికి. ఆ క్రమంలోనే కొన్న స్థలం నాలుగేళ్ళ కంటే ముందుగానే పెరగాలని ఆంజనేయస్వామికి వడమాల పూజ చేయించి, పెరిగితే మరోమారు పూజ చేయిస్తానని, ఇది టోకెన్ అడ్వాన్సని చెప్పి దణ్ణం పెట్టుకుని బయటకు వచ్చాడు. శ్రమ పడకుండా డబ్బు సంపాదించాలనే భర్త ధోరణి వనితకు నచ్చదు. ఏదైనా కష్టపడి సంపాదించుకుంటే దాని తృప్తే వేరు అని ఆమె అభిప్రాయం. అయినా ఉన్నదాంట్లో తృప్తి పడాలని ఆమె సిద్ధాంతం. అందుకు పూర్తి భిన్నం వాసుదేవ.
“వనితా ఇక బయలుదేరుదామా”
“ఆ..పదండి”
ఇద్దరూ బయటకు వచ్చారు.
“బాబూ ధర్మం చేయండి” అడిగాడొకడ నడివయసతను. మనిషికి ఏ లోపమూ లేదు.
“లేవు” విసుక్కున్నాడు వాసుదేవ.
“ఒక్క రూపాయ బాబయా” వేడుకున్నాడు
“దుక్కలాగున్నావు. ఏదైనా పని చేసుకుని బ్రతకకూడదూ” సీరియస్ గా ముఖం పెట్టి వెళ్ళబోయాడు.
“అంత కోపం దేనికయ్యా. ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. నేనెట్టాగుంటే మీకేందయ్యా” వాడికి కొంచెం కోపం వచ్చింది.
“అందరికీ శ్రమ పడకుండా డబ్బు సంపాదించాలనే యావే”
“అందులో తమరు కూడ ఉంటారయ్యా”
“ఎందిరా మాటలు తూలుతున్నావ్”
“తమరేగదయ్యా మొదలుపెట్టింది. ఎంత అడుక్కునే వోల్లమైనా అంత ఇసుక్కుంటే ఎట్టాగయ్యా”
కోపం నసాళానికంటింది వాసుదేవకు. ఇంతలో పక్కనున్న అతను లేచి “ఒరేయ్ నరిసిగా ఊరుకోరా. పెద్దోల్లతోటి తగవేంది. ఇత్తే తీసుకో లేకపోతే లే. ఊరికే వాదులాడమాక” అన్నాడు.
“అదికాదు మావా. నేనేమన్నా. ఆల్లు మాత్రం అడుక్కోడంలా. కాకపోతే ఆల్లు గుల్లో అడుక్కుంటారు మనం బయట అడుక్కుంటాం అంతేగా. ఆల్లు కూడ కట్టం లేకుండా ఆల్ల ఆస్తులు పెరగాలనే అడుక్కుంటారు గదా. ఎవురైనా అడుక్కునేటోల్లే ఈ పెపంచికాన” కోపంలో కూడ వేదాంతం చెప్పాడు నరిసిగాడు.
“ఏందిరా మాటలు మీరుతున్నావు. ధర్మకర్తకు చెప్పి నీ సంగతేంటో తేలుస్తా. రేపటినుంచి ఇక్కడ ఎలా అడుక్కుంటావో నేనూ చూస్తా” చిందులు తొక్కాడు వాసుదేవ.
“అంతమాటెందుకయ్యా. ఆడేదో సిన్నోడు. తెలిసీ తెలవక అన్నాడు. మీరెల్లండి బాబయా” సర్దాడు పక్కనతను.
చిలికి చిలికి గాలివాన అవుతుందని తెలిసి భర్తను లాక్కుని పోయింది వనిత.
“ఉండవే నువ్వు”
“ఏంది ఉండేది పదండి. చేసిన రచ్చ చాలు. ఇష్టముంటే ఇవ్వాలి. లేకుంటే లేదని చెప్పాలి. అంతేగాని వాడితో గొడవెందుకు” అని భర్తను మందలించి స్కూటరు దగ్గరికి తీసుకు వచ్చింది.
“వాడికంత పొగరు పనికిరాదు. మాటకు మాట చెప్తాడా” హూంకరించాడు వాసుదేవ.
“కాస్త నిదానించి ఆలోచించండి. అతడిని మీరు కించపరచబట్టే కదా అతను అన్ని మాటలన్నది. అయినా అతను చెప్పినదానిలో తప్పేముంది. మనం లోపలికి వెళ్ళి మనం కొన్న స్థలం శ్రమలేకుండా తొందరలో నాలుగింతలు చెయ్యమని దేవుడిని అడుక్కున్నాం. అంటే మనం కూడ యాచకులమే కదా. శ్రమ లేకుండానే లబ్ధి పొందాలనుకున్నాం కదా. దానికి తోడు వడమాల పూజను లంచంగా ఎరవేశాము . ఇప్పుడు అతనికి, మనకు తేడా ఏమిటో చెప్పగలరా?” ప్రశ్నించింది వనిత.
తప్పు తెలిసింది వాసుదేవకు. కానీ ఒప్పుకోను అహం అడ్డుపడింది. మౌనంగా బండిని స్టార్టు చేశాడు. ఇక జీవితంలో ఊరక ఏదీ కావాలని భగవంతుడిని కోరకూడదనే నిర్ణయానికి వచ్చాడు వాసుదేవ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!