ఘాట్ రోడ్డులో”పిన్”మలుపు
రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి
ఒక ఊర్లో ఒక డాక్టరు గారు ఉండేవారు.ఆ డాక్టర్ గారికి ఐదుగురు సంతానం. అందులో ఆఖరి పిల్లకి పెళ్ళి వయసు వచ్చింది.ఒక సంబంధం రాగా వారియొక్క చక్కటి ప్రవర్తన, మాటలకు ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు డాక్టర్ గారు. గారాలపట్టి, ముద్దుల కూతురు. ఆమె పైనున్న ఒక అక్క, ముగ్గురు అన్నల ముద్దుల చెల్లి, అమ్మకు ఎలాగూ ముద్దే, బంధువులందరికీ ముద్దే. జనముద్దు బిడ్డగా ఎదిగింది. ఎంతో నెమ్మదస్తురాలు,పద్ధతైన మనిషి.పెంపకమలాంటిది మరి.
అన్ని సద్గుణాలు నిండుగా, మెండుగా ఉన్న ఆమె ఇక కొత్త జీవితంలో అడుగు పెట్టే సమయం ఆసన్నమైందిగా, సంబంధం కుదిరిందిగా.ఇక ఏమాత్రం లోటు లేకుండా నగలేంటి,చీరలేంటి అన్నీ కొత్తవి చక్కగా అమర్చి, సిద్దం చేసిన ఆ తల్లితండ్రులు కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేరు. కూతుర్ని అత్తవారింట్లో దింపి వచ్చేరు.
అసలు కధ అక్కడే మొదలైంది.అత్త వారియొక్క అసలు స్వరూపం తెలిసింది.ఆమెను ఎంతసేపూ డబ్బు కోసమే తప్పించి ఒక ఏ.టీ.ఎమ్.మెషీన్ అనచ్చేమో ఈరోజుల్లో భాషలా. పూర్వం ఇన్ని ఏ.టీ.ఎమ్.లు గల్లీకొకటి లేవనుకుంటగా. ఆమెను ఆ తీరులోనే ట్రీట్ చేస్తూ మానసిక, శారీరక హింసలకు గురి చేసిన ఆ ఇంటి.. యజమాని కాదు సుమా.. అంటే మామగారు కాదు… అత్తగారు,పెళ్ళికి సిద్దంగా ఉన్న ఆడబడుచు,భర్త.వీరియొక్క ప్రవర్తనను ఏమని చెప్పుకోగలదు.తన వైవాహిక జీవితం ముందు నిష్కల్మష ప్రపంచంలోంచి, పూర్తి సున్నితమైన, సుందరమైన మనసుతో,ఎన్నో కోటి ఆశలతో అడుగు పెట్టిన ఆ కొత్త పెళ్ళి కూతురి మానసిక స్థితిని ఏమని వర్ణించగలం,కలం కదలటం లేదు. వచ్చి ఇటువంటి పూర్తి కల్మష, అరాచక కుటుంబంలో పడి జీవితమంటే ఎలా నెట్టుకొచ్చిందో ఆమెకే తెలియాలి. ఆ క్రమంలోనే సంతానాన్ని కూడా కనడం జరిగింది మరి.. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు పుట్టింటివారికి నోరు విప్పి,పెదవి కదిపి ఒక్క ముక్క చెప్పిన పాపాన పోలేదు. ఇంటి గుట్టు గడప దాటనివ్వలేదు.
కాలక్రమేణా ఇంక అన్నలు, తండ్రి ఆ మాత్రం, ఈమాత్రం తెలివైన వాళ్ళు కాబట్టి గ్రహించి కాస్త ఒడ్డున పడేసేరు… ఇంకా ఇంకా ఆమె జీవితం మునిగి పోకుండా. పిల్లలు కూడా అక్కడ ఉంటే ఏమైపోతారో అనే ఉద్దేశంతోనే..వారి ఉద్దేశ్యం వేరుపరచడం కాదు. ఈ విధంగా మొత్తం,ఈకాలం లోనే ఇంటి గుట్టంతా కడుపులో పెట్టుకున్న ఆ ఇంటి ఇల్లాలి వలన అది సలక్షణమే అయినప్పటికీ,మరి మనుషులు మారి ఆమె జీవితం చక్కబడితే బాగుండేది,అంటే మరి వాళ్ళు కరడుగట్టిన రాక్షసులేమో,ఇక మరి మారే అవకాశం కనిపించ లేదు. అన్నల చేయూత తో,సలక్షణాలేగా మరి ఆమె నర నరాలా అన్నీ సలక్షణాలే, స్వశక్తితో తన కాళ్ళమీద తను నిలబడి చక్కగా నెట్టుకొచ్చింది, పిల్లల్ని మంచిగా తీర్చి దిద్దింది,ఉన్నత స్థానాల్లో నిలిపింది, తను సగర్వంగా తలెత్తుకుని సన్మార్గంలోనే తన జీవితమంతా నడిపింది.ఇది ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక స్త్రీ జీవితం.
పూర్తి శాంతి జీవితం నుండి మూడు ముళ్ళతో నెట్టివేయబడ్డ అశాంతి లోకం,ఆపై బతికి బట్టకట్టిన ఆ తల్లి,బిడ్డల ఉన్నతితో పొందెను మనశ్శాంతి.
*యదార్థ సంఘటన*
