కూలిన ఆశల సౌధం

కూలిన ఆశల సౌధం

రచన: పరిమళ కళ్యాణ్

పెళ్ళై రెండు నెలలు కాకుండానే పుట్టింటికీ పుట్టెడు దుఃఖంతో వచ్చింది లోక్య. లోపలకి రమ్మని కూడా అనలేదు తల్లి సుహాసిని. పోర్టికోలో కూర్చుని గతం ఒక్కసారి గుర్తుచేసుకుంది.

అల్లారుముద్దుగా పెంచారు అమ్మా నాన్న తనని. బాగా ఉన్న కుటుంబం కాకపోయినా, ఒక్కగానొక్క కూతురు అవ్వటంతో తను అడిగిందల్లా చేసేవాడు తండ్రి వెంకటేష్.

లోక్య కి నచ్చిన స్కూల్లో చేర్పించాడు, తనకి నచ్చిన బట్టలే కొన్నాడు. తనకి నచ్చిన చదువు కూడా చెప్పించాడు. కానీ తనకి నచ్చిన వరుడిని మాత్రం ఇవ్వనన్నాడు. ఆ కోపంతో తను ఇల్లు వదిలిపోయింది, కానీ ఇప్పుడేమయ్యింది?

డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన కాలేజిలో సీనియర్ వినీత్ తన వెంట పడేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పేవాడు, కానీ ఎప్పుడూ అతి చెయ్యలేదు. తనని ప్రేమించమని బలవంతం చెయ్యలేదు. అలాగే వినీత్ కాలేజిలో బెస్ట్ స్టూడెంట్ కూడా.

అందుకేనేమో ఏడాది తర్వాత తను కూడా వినీత్ ని ఇష్టపడింది లోక్య. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కాలేజి అంతా వీళ్ళ ప్రేమ వార్త పాకిపోయింది. క్లాసులు మానేసి ఇద్దరూ కబుర్లలో పడిపోయేవారు. ఆ కారణంగా ఒక సబ్జెక్ట్ తప్పింది లోక్య. కానీ వినీత్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు.

వినీత్ చదువు పూర్తి చేసుకుని సిటీలో వేరే కాలేజిలో పిజిలో చేరాడు. కానీ రోజూ లోక్యతో మాట్లాడుతూనే ఉండేవాడు. వినీత్ మెస్సేజ్ తోనే తెల్లారేది లోక్యకి, చివరిగా తనతో మాట్లాడే నిద్రపోయేది.

ఇంట్లో మనుషులతో అంటీముట్టనట్లు ఉండేది. తల్లి తండ్రి ఏం చెప్పినా మౌనంగా వినేది, ఊ కొట్టేది. కూతురి ప్రవర్తనలో తేడా గమనించి ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పకుండా దాట వేసేది.

కానీ ఎలాగోలా లోక్య ప్రేమ విషయం తెలుసుకున్నాడు వెంకటేష్. కూతురి ఇష్టాన్ని గ్రహించిన తండ్రి వెంకటేష్, వినీత్ గురించి సిటీ వెళ్లి అతను చదివే కాలేజిలో తెలుసుకున్నాడు. అక్కడ అతనికి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది..

కూతురికి నచ్చ చెప్పాలని చూసాడు. కానీ వినలేదు. చదువు పూర్తి అవ్వగానే పెళ్లి చేద్దాం అనుకున్నాడు వెంకటేష్. కానీ చదువు పూర్తి కాకుండానే, తను ప్రేమించిన వినీత్ కోసం ఊరు దాటింది లోక్య.

పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరీ వెళ్ళింది. పోలీసులు వచ్చి వెంకటేష్ కి, అతని భార్యకి వార్నింగ్ ఇచ్చారు. వెంకటేష్ ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడు.

వినీత్ హఠాత్తుగా వచ్చిన లోక్యని చూసి షాక్ అయ్యాడు. పెళ్లి చేసుకోమని అడిగింది లోక్య. ఎవరికి తెలియకుండా గుళ్లో పెళ్ళి చేసుకుందాం అన్నాడు వినీత్. గుళ్లో దండలు మార్చుకుని ఒకటయ్యారు ఇద్దరూ. ఇల్లు తీసుకుని ఉన్నారు ఇద్దరూ. ఒక నెల గడిచాక వినీత్ చదివే కాలేజీకి వచ్చింది లోక్య.

వినీత్ అక్కడ వేరొక అమ్మాయితో ఉండటం చూసింది. వినీత్ ని ప్రశ్నించింది. సమాధానం రాలేదు. అప్పటి నుంచి రోజూ మాటల యుద్ధమే ఇద్దరికీ. చివరికి నువ్వు నాకు ఇక వద్దు అని తెగేసి చెప్పాడు వినీత్.

మోసపోయానని తెలుసుకుని బాధ పడింది. ఇంటికి వెళ్లలేక పిచ్చి దానిలా తిరిగింది. తండ్రి చనిపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకుని ఇంటికి వెళ్ళింది.

                                                                                                         ***

గుమ్మంలో ఉన్న కూతుర్ని చూసి కోప్పడినా, తల్లి మనసు తల్లడిల్లింది. లోపలకి పిలిచి హత్తుకుంది. కన్నీళ్లు ఇంకిపోయేలా, గుండెల్లో బాధ బయటకి వచ్చేలా వలవలా ఏడ్చారు ఇద్దరూ.

ప్రేమించిన మనిషితో జీవితం గడపాలని ఎన్నో కలలు కంది లోక్య. తను నిర్మించుకున్న ఆశల సౌధం కూలిపోయింది, తండ్రిని పోగొట్టుకుంది. మళ్ళీ తన జీవితంలోకి ప్రేమని ఆహ్వానించకూడదని అనుకుంది. తల్లికి తోడుగా నిలవాలని నిర్ణయించుకుంది. ఆపేసిన చదువు పూర్తి చెయ్యటానికి కాలేజీకి బయలుదేరింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!