మద్యపానం

మద్యపానం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: సావిత్రి కోవూరు 

ప్రస్తుతము దేశంలో యువతను నిర్వీర్యం చేసి మెదడు చురుకుదనాన్ని హరించేది, స్తబ్దతను కలిగించేది మద్యపానం మాత్రమే. విస్కీ, బీర్, సారాయి మొదలగునవెన్నో మత్తును కలిగించే  పానీయాలు అందరికీ ఎక్కడంటె అక్కడ సులువుగా దొరుకుతున్నాయి. పూర్వకాలంలో ఎక్కువగా పెద్దవాళ్లు, ముసలి వాళ్లు మాత్రమే మద్యం సేవించే వాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ అలవాటు లేని యువత చాలా అరుదనే చెప్పాలి. ఇప్పుడు యువత కాలేజీలో సీటు దొరికినా సంతోషంతో, దొరకకపోతె బాధతో మద్యం సేవిస్తారు. పాసైతె సంతోషంతో, ఫెయిల్ అయితె బాధతో మందు పార్టీలు చేసుకుంటున్నారు. ప్రేమించినా పార్టీనే, ప్రేమ విఫలమైన పార్టీనే, పెళ్లి కుదిరితె బ్యాచిలర్ పార్టీ, పెళ్లి జరిగితె సంతోషంగా పార్టీ. పిల్లలు పుట్ట పోతున్నారన్న పార్టీనే, పిల్లలు పుట్టకపోయినా బాధతో మద్యపానమే. పిల్లలు పుట్టినా పార్టీలే. పుట్టినరోజులకు సరే సరి. ఈ విధంగా జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా మద్యం పార్టీలే చేసుకుంటున్నారు. ఈ కాలంలో వ్యక్తులకు కారణాలేవయినా మద్యపానం మాత్రం తప్పక ఉండాల్సిందే. సినిమాల ప్రభావం కూడా నేటి యువతపై చాలా ఎక్కువగా ఉంది. పూర్వము సినిమాలలో విలన్స్, ప్రేమ విఫలం అయిన హీరోలను మాత్రమే మద్యం సేవించి నట్టుగా చూపేవారు. కానీ ఇప్పుడు హీరోలు మద్యం మంచినీళ్లలా 24 గంటలు తాగుతున్నట్టు గానే చూపించటం వలన వివేకం లేని యువత అదే ఫ్యాషన్ అనుకుని వారిని అనుకరిస్తున్నారు. అంతెందుకు తాగుడు అలవాటు అయిన కొడుకులను మందలించాల్సిన తండ్రులే తమ కొడుకులను తాగుటకు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఎన్నో సినిమాలలో చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా తమకు టాక్స్ ల రూపంలో భారీగా ధనం సమకూరడం వల్ల మద్యం దుకాణాలను పుట్టగొడుగుల్లా స్థాపించుటే ధ్యేయంగా పెట్టుకొని లైసెన్సులు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చి యువత త్రాగుబోతులుగా మారుటకు పరోక్షంగా కారణం అవుతుంది. ప్రభుత్వము ప్రజల క్షేమం కోరి, తమ ఆదాయాన్ని వేరే రూపంలో సమకూర్చు కొనుటకు ప్రయత్నించి, మద్యం దుకాణాలను కట్టడి చేయడమే గాక, సినిమాలలో కూడా విచ్చలవిడిగా మద్యపాన దృశ్యాలు పెట్టకుండా సెన్సార్ చేస్తే యువత మెదడులకు పట్టిన మద్యపానమనె  గ్రహణం వీగిపోయి, చురుకుగా పనిచేసి విజ్ఞానంతో కూడిన  నైపుణ్యాలతో సమాజాభివృద్ధికి దోహద పడతారు. మద్యానికి బానిసలైన వ్యక్తులకు అదే లోకంగా ఉండి చురుకుదనం కుంటుపడి ఉపాదులను  కోల్పోతారు. డబ్బులకు ఇబ్బందులు తలెత్తడంతో కొంతమంది నేరాలకు పాల్పడతారు. దీనివల్ల సంసార జీవితాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, పిల్లలు క్రమశిక్షణ లేక సంఘానికి చీడపురుగులుగా తయారవుతారు. ప్రస్తుత కాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలలో 95 శాతం మద్యపానం చేసి వాహనాలను  అతివేగంగా నడుపుతూ, అదుపు లేక జరిగేవే. ఈ ప్రమాదాల వలన తమ ప్రాణాలే కాకుండా రహదారులలో ప్రయాణించే ఇతర వ్యక్తుల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయి వారిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు దిక్కులేనివై వీధుల పాలు అవుతున్నాయి. పరువు, పైకము, ప్రాణాలు, ఆప్తులను దూరం చేసె ఈ మద్యపానం, మత్తుపదార్ధాలు తీసుకోక పోవడం అన్ని విధాల శ్రేయస్కరం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!