ప్లాస్టిక్ వాడకం ప్రాణాలకు హానికరం

ప్లాస్టిక్ వాడకం ప్రాణాలకు హానికరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక),

వ్యాసకర్త: అరుణ చామర్తి ముటుకూరి

ఈనాడు మన ప్రపంచమే ప్లాస్టిక్ మయం అయిపోయింది. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి కలిగే ముప్పు ఎంతో తెలుసుకుందాం. నిజమే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వాడకం చాలా అధికమైపోయింది. అసలు ఎలా ఇది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందో కానీ, పూర్వం మన తాతలు, ముత్తాతలు వాడిన పనిముట్లు వంటపాత్రలు తిరిగి మళ్లీ పదేళ్లకు ఫ్యాషన్ వచ్చినట్లుగా వాడడం మొదలైతే తప్పకుండా కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది.
విషయానికి వస్తే మొట్టమొదట అనాగరికంగా గుహల్లో జీవించినప్పుడు వేట ప్రధాన వృత్తిగా ఉండి పచ్చి మాంసం తినే వారు. ఎప్పుడైతే నిప్పు కనిపెట్టడం జరిగిందో అప్పుడే ఆహారాన్ని ఉడికించి తినడం కూడా మొదలైంది. అప్పుడు దానికి అవసరమైన సామాగ్రిని మట్టితోనే తయారు చేసి, మట్టిపాత్రల్లో చేసేవారు. కాలక్రమంలో అవి పగిలినా, భూమిలో కలిసిపోవడం వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ తరువాత లోహం కనుక్కున్న క్రమంలో, ఇత్తడి రాగి ఆరోగ్యానికి మంచివని, వాటితో అనేక వంట ఇంటి సామాను తయారుచేసి ఉపయోగించేవారు. పూర్వం నాణాలు కూడా రాగితో చేయడం మనకు తెలిసిందే. ఆ కాలంలో చెరువు నుండి అందరూ ఇళ్లల్లోకి నీరు తెచ్చుకునేవారు కాబట్టి, రాగి పాత్రలో 8 గంటలు నానిన నీరు చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని గుర్తించి రాగి నాణాలను చెరువులో వేయడం అనే ఆచారం పెట్టారు. అయితే మన దేశాన్ని ఆక్రమించిన పరాయి దేశస్తులు మన ఆరోగ్య విషయాలను గ్రహించి వాటిని దెబ్బతీయడం కోసం జర్మన్ సిల్వర్ (రాతి వెండి గా పిలుస్తారు)ను ప్రవేశపెట్టారు. అంతవరకు మనవారు ఇత్తడి వాడినా కిలుం పట్టకుండా లోపల పూత పూయించేవారు. అలా ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న మనవారు తరాలు మారే కొద్ది కొత్త మోజులో పడ్డారు. రాతి వెండి లో చేసే వంట అధిక వేడికి కొంత కరిగి శరీరం లోకి వెళ్లడం అది ఎముకలపై ప్రభావం చూపించడం అన్నది చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే ఎటు చూసినా ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను పరిశ్రమల వారు సముద్రాల్లోకి వదరడం, తద్వారా అవి జలచరాల కడుపులోకి చేరడం, కాడ్మియం వంటి హానికారక టాక్సిన్స్ కూడా వాటిలో ప్రవేశించడం జరుగుతోంది. అంతేకాకుండా బీచ్ ఒడ్డున తిని పారేసే కవర్లు బాటిల్స్ వల్ల కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మన నిత్య జీవితంలో వాడే వస్తువుల్లో కూడా బయట పారవేసినప్పుడు అవి మోరీలోకి చేరి, వర్షాకాలం పొరపాటున చెరువు గట్టు తెగి వరదలు వస్తే కాలువల్లో అడ్డం పడి నీరు రోడ్డు మీదకి వచ్చేలా తయారైపోతుంది. పోనీ పగిలిన ప్లాస్టిక్ భూమిలో నిక్షిప్తమై పోతుందా అంటే అది జరగదు. అది కలిసిపోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అలాగని దాన్ని కాల్చేస్తే వెలువడే పొగ కార్బోజోల్స్ వాతావరణంలోని ఓజోన్ పొరకు హాని కలిగిస్తున్నాయి. అందువల్ల ప్లాస్టిక్ వాడకం అనేది ఏ విధంగానూ సమ్మతించదగినది కాదు. మనం నిత్యజీవితంలో చూసుకుంటే, బజార్ కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కుని ఆ సరుకులు ఇంటికి తీసుకు వచ్చే కవర్లు, బయట టీ కాఫీ తాగాలంటే వాడే గ్లాసులు, ఏ టిఫినో తెచ్చుకుంటే వేడి సాంబారు కూరలు వేసే కవర్ల తాలూకు కొంత భాగం కరిగి మనం తినే ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరి క్యాన్సర్ వంటి వాటికి కారణం అవుతున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున 40 మైక్రాన్ల కవర్లు తప్ప అంగీకరించమని ఉద్యమం జరిగింది. అసలు అప్పుడెప్పుడో 1950 లో మొదలైన ప్లాస్టిక్ వాడకం క్రమంగా అందరూ ఇష్టపడడం మొదలై మరింతగా ఊపందుకుంది. ఇందుకు ముఖ్య కారణం ఇత్తడి రాగి వంటివాటిల్లో పులుపు వస్తువులను పెట్టలేము, ప్లాస్టిక్ కి ఆ ఇబ్బంది లేదు. ప్లాస్టిక్ చాలా తక్కువ బరువు కలిగి ఉండటం కూడా ఇవి చాలా తొందరగా మన జీవితంలో భాగమై పోవడానికి ప్రధాన కారణం. ఆటోమొబైల్ రంగాల్లోనూ ఎయిర్క్రాఫ్ట్ లోనూ మెడిసిన్ రంగాల్లో ఎక్కువగా వాడకం మొదలైంది. ఎప్పుడైతే గృహిణులు వీటిని ఇష్టపడి వాడడం మొదలుపెట్టారో ఇది మరింతగా విస్తరించింది. అందుకే ప్రపంచం మొత్తం మీద 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ తయారీ ఏటికేడాది  పెరుగుతూనే ఉంది. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్యాకింగ్ ఫ్యాక్టరీ నుంచి, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుండి ఉంటే.. గృహ అవసరాలకు వాడి వదిలేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు 2,3 వంతులు ఎక్కువగా ఉంది అని అంచనా వేశారు. కుండలు పోయీ ఫ్రిజ్లు వచ్చిన తర్వాత, మంచి నీళ్లు తాగే బాటిల్స్ నుంచి, మిగిలిన పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే డబ్బాల వరకు అంతా ప్లాస్టిక్ మయమే. కలికాలంలో పుట్టిన అసురునిలా  తయారైంది ప్లాస్టిక్ భూతం. కొంతమంది ఇప్పుడిప్పుడే తిరిగి మట్టి పాత్రల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అలాగే అందరూ  బయటకు వెళ్లేటప్పుడు, గుర్తుపెట్టుకుని మరి గుడ్డ సంచులను తీసుకొని వెళితే ప్లాస్టిక్ సంచులు వాడకం చాలా వరకు తగ్గిపోతుంది. బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవడం దాని వల్ల కలుగుతున్న వ్యాధులు ఇబ్బందులు గ్రహించే ఈ దేశాలన్నీ ఒక ఒప్పందానికి వద్దామని ఏర్పరుచుకున్న సమావేశంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దీనికి అంగీకరించలేదు. సముద్రంలో చేరే ప్లాస్టిక్ వల్ల, అక్కడ జలచరాలకు జీర్ణక్రియ సమస్య, క్షీరదజంతువులకుపాలివ్వ లేనితనం ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయి. వేల్ జెల్లీఫిష్ సముద్ర తాబేలు ఇలాంటి ఎన్నో ఒడ్డుకు కొట్టుకు వచ్చి చనిపోయి ఉంటే వాటి కడుపులో ప్లాస్టిక్ వ్యర్ధాలను కనుగొన్నారని మనం ఎన్నో సార్లు వార్తల్లో విన్నాం. ఈ ప్లాస్టిక్  వ్యర్ధాల నీటిలో చేరడం వల్ల మనమా నీరు తాగడం వల్ల మాంసం తినే వారు ఆ జలచరాలను తినడం వల్ల, మానవులలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాల్చేయడం వల్ల వాతావరణం కలుషితమై పోయి ఓజోన్ పొర దెబ్బ తినడం, పూడ్చిన భూమిలో కరగక భూమి సారం లేకుండా అయిపోవడం. వంటి అనేక కారణాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఇది పోను పోను వచ్చే తరాలకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనమే ముందు ప్లాస్టిక్ వాడకాన్ని త్యజించి తర్వాతి తరాలకు చక్కని పర్యావరణాన్ని ఏర్పరుద్దాం. ఇప్పటికే మన దగ్గర ఉన్న డబ్బాలు ఇలాంటి వాటిని చక్కగా చిన్న చిన్న పూల మొక్కలు పెట్టే కుండీలు లాగా వాడుకుంటే కొంతలో కొంత ఉపయోగం. రీసైక్లింగ్ గాని చాక్లెట్ పేపర్లు బిస్కెట్ల కంపెనీ ప్యాకింగ్ పేపర్లు వీటన్నిటినీ నీళ్ల బాటిల్స్ లో గట్టిగా నింపి , (ఆ రేపర్ల్ శుభ్రం చేసిన తర్వాత మాత్రమే) మూత బిగించి చేస్తే ఆ బాటిల్ గట్టిగా ఉండి ఒక ఎకో బ్రిక్ లాగా తయారవుతుంది. అలాంటి ఇటుకలతో ఫర్నిచరే కాదు బిల్డింగులు  కట్టిన కూడా ఏమీ కాదు. బిల్డింగుల నిర్మాణం కూడా తక్కువ పడుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ వినియోగం తగ్గి వ్యర్థాలు సముద్రాల్లో మోరీ లో అడ్డుపడడం తగ్గుతుంది. ఇది గనుక పాటిస్తే చాలా మంచి ఆలోచన. పర్యావరణంలో ప్లాస్టిక్ ద్వారా వచ్చే వాతావరణ కాలుష్యం తగ్గి పోయినట్టే. ఉప్పు ప్యాకెట్ ల నుండి చిప్స్ ప్యాకెట్ ల దాకా అన్ని ప్యాకింగ్ లు చేసే రేపర్లు. చెత్తలో ప్లాస్టిక్ బాటిల్ లు ఏరుకునే వాళ్ళక్కూడా పనికిరావు. అందుకే అన్ని అలాగ పేరుకుపోయి ఆ వ్యర్ధాలన్నీ మనకు హాని కలిగిస్తాయి. అంతే కాదు సముద్ర జీవులకు మన మధ్య తిరిగే ఆవు లాంటి వాటికి కూడా. ఆలయాలలో దేవుడి గుడి, బొమ్మ ముద్రించి ఇచ్చే కవర్లు ఇవన్నీ కూడా. ప్రసాదం తిని మనం పడేయగానే ఆహార పదార్ధం ఏమైనా ఉందేమో అని తినడానికి ప్రయత్నం చేసే ఆవులు కుక్కల  కడుపులోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు పోయి వాటి జాతిని అంతరింప చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. నందన్ అన్న వ్యక్తి ఇలాంటి ప్లాస్టిక్ రేపర్ లని, వాటి వల్ల కలిగే హానిని ప్రజలకు చెప్పి ప్రేరణ కలిగించి వివిధ ఆర్గనైజేషన్స్ తో కలిసి వాటినన్నిటినీ తను పోగేయడం మొదలుపెట్టాడు. తర్వాత వాటిని తక్కువ నీటితో శుభ్రంగా కడిగి ఎండబెట్టి రంగులు ప్రకారం వాటిని సపరేట్ చేసి, సన్నని దారాలుగా కట్ చేసి. చక్రం సాయంతో కండెలుగా చేసి, చేనేత వారికి ఇచ్చి దాన్నొక ఫ్యాబ్రిక్ గా తయారు చేయించాడు. దాని సాయంతో పర్సులు సంచులు వంటి అనేక ఉపయోగపడే వస్తువులు తయారు చేయించాడు. నిజంగా ఇలా చాలా మంచి విషయం కదా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!