అనుకున్నదొక్కటి

అనుకున్నదొక్కటి

రచన: శ్రీదేవి విన్నకోట

ట్రాఫిక్ కదలడం లేదు, సమయం దగ్గర పడుతుంది. త్వరగా వెళ్లాలి, ముహూర్తానికి టైం అయిపోతుంది, నేను లేకపోతే పెళ్లి ఎలా జరుగుతుంది అసలే నేనే పెళ్ళికొడుకుని, ఒక్క క్షణం కారులోంచి దిగి నడిచి వెళ్లిపోదామా అనిపించింది, కానీ నడవాల్సింది చాలా దూరం, అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది ఏమో అని ఆలోచించి ఆగిపోయాను,

నా పేరు కార్తీక్  ఏ పనైనా లాస్ట్ మినిట్ వరకు వేచి ఉండి ఆలోచించి చేయడం నాకు మొదటినుంచి అలవాటు, ఒకవిధంగా ఇది నాకు దురలవాటె అని చెప్పాలి. కానీ ఇలా నా పనులు అప్పటికప్పుడు మొదలెట్టి చేసినా ప్రతిసారి విజయం సాధిస్తూ ఉండడంతో నాకు అలాగే అప్పటికప్పుడు చేయడం అలవాటు అయిపోయింది ఏ పనైనా, అక్కడికి నేను చేరాల్సిన చోటికి చాలా తొందరగానే బయలుదేరాను, మధ్యలో ఈ దిక్కుమాలిన ట్రాఫిక్ జామ్ కాకపోయి ఉంటే ఈపాటికి కళ్యాణమండపం చేరి పోయి ఉండేవాడిని,అలా ఆలోచిస్తూ వచ్చేస్తున్నాను అని ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకున్నాను, కర్మ నేను చూసుకోలేదు చార్జింగ్ అయి చచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఐపోయింది, రెండు రోజుల నుంచి నా పెళ్లి పనులతో బాగా బిజీగా ఉండి చార్జింగ్ పెట్టడం మర్చిపోయాను, కార్ లో పవర్ బ్యాంకు కూడా లేదు ఇంట్లో వదిలేసా, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఏం చేయలేక అలాగే ఉండిపోయా.

నా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్లు అందరూ చాలా త్వరగా కళ్యాణమండపానికి వెళ్లిపోయారు, నేను నేను ఏవో పనులు పురమాయిస్తూ బిజినెస్ వ్యవహారాలు చూస్తూ వాళ్ల అందరిని ముందు వెళ్ళిపొమ్మని నేనే కాస్త లేటుగా బయల్దేరాను, అక్కడికి మా వాళ్లు అంటూనే ఉన్నారు నువ్వు లేట్ చేస్తావు జరిగేది నీ పెళ్లి త్వరగా రా అని ఒకటికి పది సార్లు చెప్పారు,నేను సరే అని చెప్పిన లేట్ అయిపోయింది,

రెండు గంటల ప్రయాణమే కదా ఎంత సేపట్లో చేరుకుంటానులే అన్నట్టుగా ఆ ధీమా తోనే రెండు గంటల ముందు కళ్యాణ మండపానికి  బయలుదేరాను, ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయి గంటసేపు పైనే అయింది, ఇప్పుడిప్పుడే క్లియర్ అయ్యేలా లేదు, దేవుడా ఏం చేయాలి  ఇప్పటికే నాకు 30 ఏళ్లు  వచ్చేశాయి, నా పెళ్లి చాలా  లేట్ అయిపోయింది, ఇప్పుడు నేను చేసుకోబోయే అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చిన సంబంధం, చూడ చక్కనైన అమ్మాయి, బోలెడంత ఆస్తి, అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకుంటూ, ఆలోచనల నుంచి బయట పడి, ముందు చూస్తే కనిపించనంత దూరం ముందు నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వెనకాల కూడా అలాగే ఉంది ఇంచుమించు,కారుని ముందుకు తీసుకు వెళ్ళలేను వెనక్కి తీసుకు వెళ్ళలేను, ఇక తప్పదు, నడిచి కొంచెం దూరం వెళ్లి అక్కడ ఏ క్యాబో ఆటోనో ఎక్కితే సరిపోతుంది, త్వరగానే చేరుకోవచ్చు అనుకుంటూ కారుని లాక్ చేసి అలా వదిలేసి దిగి ముందుకు నడవడం మొదలు పెట్టాను, ఆగిపోయి ఉన్న కార్లు  నుంచి నెమ్మదిగా తప్పించుకుంటూ చాలా దూరం నడిచాను, ఎంత నడిచిన దూరం తరగదే, క్యాబ్ బుక్ చేద్దామంటే ఫోన్ స్విచాఫ్, ఎలాగైతేనేం కళ్యాణ మండపం అడ్రస్ చెప్పి ఒక ఆటో ఎక్కాను, ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకుని అమ్మకి నాన్నకి ఫోన్ చేయడం మొదలు పెట్టాను కానీ ఒక్కళ్ళు ఎత్తరే, ఎవరి నెంబర్స్ గుర్తు లేవు ఇంకా,వేరే ఎవరికైనా చేద్దాం అంటే, నా మెమొరీ అంత ఫోనే మింగేస్తుంది.అన్నీ ఫోన్ లోనే ఉంటాయిగా ఇంకా నేనెందుకు ఎందుకు గుర్తు పెట్టుకోవడం అనే నిర్లక్ష్యం నాకు. అందుకే ఏమి గుర్తుపెట్టుకో లేదు ఆ నిర్లక్ష్యంతోనే ఇలా తయారయ్యాను అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను.

ఇంతలో ఆటోకి ఏమొచ్చిందో సడన్గా ఆగిపోయింది, ఏమైంది అని అడిగాను చాలా సీరియస్ గా, వాడికి నా మొహం నా తీరు నచ్చలేదనుకుంటా, వాడు కూడా అంతే సీరియస్ గా చూస్తున్నా సామి అన్నాడు, త్వరగా చూడు అర్జెంటు నేను వెళ్ళాలి అంటూ అతన్ని కంగారు పెట్టేసాను.ఉండండి సర్ చూస్తాను అంటూ ఆటో కింద చుట్టూ తిరిగి బ్రేక్ వైర్ తెగిపోయింది, ఇప్పుడు వేయించాలంటే చాలా టైం పడుతుంది, మీరు వేరే ఏదైనా వెహికల్ చూసుకుని వెళ్లిపోండి సర్ అని ఉచిత సలహా ఒకటి పడేసాడు, ఆ ఆటోవాలా, నాకు తిక్క వచ్చేసింది. ఏంట్రా రోడ్డుమీదికి వచ్చేటప్పుడు ఆటో ఏ కండిషన్ లో ఉందో చూసుకోవద్దా అంటూ ఆటో వాడి మీద అరిచాను. చాలా ఎక్కువైంది సారు, చాలు కాస్త నోరు తగ్గించండి మీ ఇంట్లో వాళ్ళ తో మాట్లాడినట్టు నాతో అలా దురుసుగా మాట్లాడకండి, అంటూ ఆటోని  తోసుకుని వెళ్లి రోడ్డు పక్కగా నిలిపాడు ఆటో అతను, ఎవరినైనా లిఫ్టు అడగడానికి ట్రై చేశాను, మరీ వాళ్లకి నేను ఎలా కనిపించానో  తెలియదు కానీ, ఒక్కరు కూడా తమ వెహికల్ ఆపలేదు. కాళ్లు ఇడ్చుకుంటూ నడవడం మొదలు పెట్టాను, ఏదో స్ట్రైక్ అయినట్టు అటు వైపు వెళ్లే బస్సు ఒక్కటి కూడా రావట్లేదు, ముహూర్తానికి టైం అయిపోయి  నేను వెళ్లాల్సిన టైం మించి పోయింది, అయ్యో అనుకుంటూ, కాస్త లేట్ అయినా ముహూర్తం లేకపోయినా వెళ్లి ఎలాగైనా పెళ్లిచేసేసుకోవాలి అనుకున్నాను మనసులో.

ఎలాగైతేనేం నడిచి రెండున్నర గంటలు లేటుగా కళ్యాణ మండపానికి చేరాను. లోపలికి వెళ్లగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యంగా స్తబ్దుగా నిలబడి పోయాను, నా ఆశల సౌధం ఒక్కసారిగా గా కుప్పకూలిపోయింది,కళ్యాణ మండపం లో పెళ్లి జరిగి పోయి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి,పెళ్ళికొడుకు ఎవరో కాదు  వాడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి నాకు తమ్ముడు కూడా  అయిన రాంప్రసాద్ గాడు.

నన్ను చూడగానే అమ్మానాన్న లబోదిబోమంటూ పరిగెత్తుకు వచ్చారు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఎక్కడున్నావో ఏమైపోయావు తెలీదు, ఇక్కడ వాళ్ళందరూ పెళ్లి నీకు ఇష్టం లేక ఎక్కడికో నువు వెళ్ళిపోయావు అని (పారిపోయావు)చెప్పుకుంటున్నారు. అందుకే ఫోన్ కూడా కావాలనే లిఫ్ట్ చేయలేదు అనుకున్నారు.

అప్పటికప్పుడు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని నిర్ణయం తీసుకుని, పిటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోకూడదు అని ఆ పిల్లని బాబాయి వాళ్ళ అబ్బాయి రామ్ కి ఇచ్చి పెళ్లి  చేసారునీ గురించి మాత్రం వాళ్ళ వాళ్ళు మన వాళ్ళు అందరూ చాలా తప్పుగా అనుకుంటున్నారు.

పెళ్లి కూతురు తండ్రి అయితే నువ్వు చిట్ చేశావు అని నీ మీద చీటింగ్ కేసు పెడతాను అన్నాడు, అందరం కలిపి ఎలాగో బలవంతంగా నచ్చచెప్పి ఆపాము అంటూ మా అమ్మ కళ్ళ నీళ్ళతో చెప్పేసరికి నాకు బాధతో కంట్లో నీళ్లు తిరిగాయి, నా ఏడుపు ఎందుకో తెలుసుగా మీకు.చక్కని చుక్క లాంటి అమ్మాయిని, తనతో పాటు వచ్చే కట్నాన్ని ఆస్తిని కోల్పోయాను, అతిగా ఆశ పడితే నాలాంటి వాడికి ఇలాగే జరుగుతుందేమో అనిపించింది, ఇక ఏడుపొక్కటే తక్కువ నాకు.ఒసేయ్ ట్రాఫిక్ జామా నీకు కాస్త అయినా జాలి కనికరం లేదా, నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తావా ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పెళ్ళికి నన్ను దూరం చేశావు కదా, నిన్ను ఎప్పటికీ క్షమించను అంటూ నాటకీయంగా ట్రాఫిక్ జామ్ ని తిట్టుకోవడం తప్ప మరి ఏం చేయగలను, ఇక తప్పదు బావుండదు నలుగురిలో పలుచన అవడం ఎందుకు అన్నట్టుగా నాకు ఇష్టం లేకపోయినా అందరితో పాటు వధూవరులకు నాలుగు అక్షింతలు వేసి బాధను నా మనసులోనే అదిమీ పెడుతూ ఏడుపు మొహంతో భారంగా ఇంటికి బయలుదేరాను, ఇప్పుడు మరో పెళ్లి సంబంధం చూసుకోవాలి అని మనసులో గొల్లున ఏడ్చుకుంటూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!