మా పల్లెటూరు

మా పల్లెటూరు

రచన: వి.వి.రమణ

చేయితిరిగిన చిత్రకారుడెవరో
అదాటున ప్రకృతి కాన్వాసుపై
పచ్చనిరంగు ఒక్కసారి గుమ్మరించినట్లు
శోభాయమానంగా ఉంటుంది మా పల్లెటూరు

తొలిసంధ్యవేళ గుడిలో సుప్రభాతాలు
మనసును మెల్లగా తట్టిలేపుతుంటే
తరువులపై పక్షుల కిలకిలారావాలు
శ్రావ్యకాలై శుభోదయరాగాలతో
క్రొంగొత్తగా ఆహ్వానాలు పలుకుతుంటాయి

ఒంపులు తిరిగిన పిల్లకాలువలు
ముగ్ధలా వయ్యారంగా సాగుతుంటే
పచ్చనిచీర కట్టుకున్న పంటచేలు
స్వచ్ఛమైన గాలిని మోసుకొచ్చి
నిత్యం వింజామరలు వీస్తుంటాయి

ఇక్కడ కార్ఖానాల ఘీంకారాలుండవు
కాలుష్య రక్కసి కబందహస్తాలుండవు
మట్టివాసనల పుప్పొడులను వెదజల్లే
కల్మషం ఎరుగని హృదయాలు తప్ప!

స్వర్గాన్ని వదిలి రంగుల కలలుకన్న పిట్టలు
స్వేచ్ఛలేని సుదూరాలకు ఎగిరిపోతున్నప్పుడు
గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు
విలవలలాడి కృంగిపోతుంది మా ఊరు

అయినా…
సర్వకాల సర్వావస్తలయందు
తనను నమ్ముకున్నోళ్ళందరినీ
అమ్మలా అక్కున చేర్చుకుంటుంది
చిక్కని ప్రేమలు కొలువైన చక్కని మా పల్లెటూరు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!