అంశం: ఇష్టమైన కష్టం
సగటు మహిళ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: లగిశెట్టి ప్రభాకర్
ఇల్లే ఇలలో స్వర్గం
ఇల్లాలే ఇంటికి దీపం
సూరీడు కన్న ముందే లేచి
ఇంటి పనులన్ని చేసి
అమ్మా.. నా బ్యాగ్ ఎక్కడ.
అమ్మా.. నా షూ ఎక్కడ.
ఆ.. వస్తున్నా అంటు.
స్కూల్ సమయానికి పిల్లలకు
టిఫిన్లు,బాక్సులు అన్ని సర్ది
ఏమోయి.. ఉన్నావా
నా టవల్ ఎక్కడ.
నా బనీను కనిపించడం లేదు.
వస్తున్నానండి…. అంటు
చేతులు తుడుచుకుంటూ
రెండు మాటలు పడుతూ.
అన్ని సమకూర్చి.
శ్రీవారిని ఆఫీస్ కు పంపి
వీలైతే గుక్కెడు టీ గొంతులో పోసుకొని
అత్త,మామలకు టిఫిన్లు,టీలు ఇచ్చి
తాను టిఫిన్ తినాలంటే
టైం.. పది, పదిన్నర.
మళ్ళీ అన్ని సర్దుకొని
మధ్యాహ్నానికి భోజన ఏర్పాట్లు
వాషింగ్ మిషన్ లో బట్టలు
పనమ్మాయి రాకపోతే
అంట్లన్ని తోముకోవడం.
అన్ని పనులు పూర్తి చేసుకొని
భోజనం చేసేవరకు టైమ్.రెండు.. మూడు
అలా కొంచెం నడుం వాలుస్తారో లేదో
అత్తగారో, మామ గారో పిలుపు..
ఈ లోగా పిల్లలు వచ్చే సమయం
ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాట్లు
రాగానే పిల్లలకు స్నానాలు, స్నాకులు
హోం వర్క్ లు చేయించడం
బట్టలు ఐరన్ చేయలేదా..
ఏం చేస్తున్నావు.. ఖాళీగానే ఉన్నావుగ ఇంట్లో
శ్రీవారి ఇసడింపులు
రాత్రి వంటలు.. అందరి భోజనాలు
అన్ని సర్ది నిద్రకు ఉపక్రమించే వరకు రాత్రి 11..
ఇలా పొద్దంతా రాట్నం లా తిరుగుతూనే
ఎంత కష్టమైనా ఇష్టంగానే
అన్ని పనులు,అందరికీ చేస్తూ
అందరితో మాటలు పడుతూ
బతుకు సాగదీస్తున్న…..
నేటి సగటు మహిళా…