మారేదెప్పుడో

మారేదెప్పుడో

రచన: శృంగవరపు శాంతికుమారి

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని

ఒక్కపూట ఆకలి తీర్చలేని
మనిషికన్నా డబ్బుకి
గుణముకన్నా ఘనతకి
సంస్కారం కన్నా స్థాయికి విలువిచ్చి
మంచితనం మానవత్వం లేని
కులమెందుకు మతమెందుకు !

గుహల్లో నివసించినప్పుడు
బట్టకట్టడం తెలియనప్పుడు
నాగరికతే లేనప్పుడు
జంతువులతో మమేకమై జీవించే
ఆదిమానవుడికి కులమేది మతమేది !

అంధవిశ్వాసం, అజ్ఞానం, స్వార్ధం, అహంకారం పేరుకుపోయి
అంటరానివారని అంటితే పాపమని
బడిలో గుడిలో ప్రవేశం లేకుండా చేసి
దళితులని దరిద్రులని ముద్రవేసి చులకనగా చూసి నిరక్షరాస్యులను చేసి
భూములను కాజేసి భూకామంధులుగా బడాబాబులుగా అధికారాలు చెలాయించి
రాబందుల్లా పీక్కుతిని
కూలీలుగా, పాలేర్లుగా, సేవకులుగా బానిసలుగా చేసి
నడిచేదారి తాగేనీరు వాడే వస్తువులు
మా మీ అని వేరు చేసి
పూరి గుడిసెలకే పరిమితం చేసి
తెలివితేటలను శక్తి సామర్ధ్యాలను అణగదొక్కి
శిక్షలు హింసలు కక్షలు వివక్షలు….
నాడు ఆగిన గుండెలెన్నో
ఆకటి చిచ్చుతో దహించుకుపోయే దేహాలెన్నో
ఒరిగిన నర కంఠాలెన్నో!

సమానత్వం కోసం సమాన హక్కులు, హోదాలు కోసం
విద్యా అర్హతలు కోసం
అలుపెరుగనిపోరాటాలు,
ఉద్యమాలు, త్యాగాలు
అయినా ఏముంది గర్వకారణం….

నానాటికి కుల పిశాచాలకు
బలౌతున్న ప్రేమికులు
విచ్ఛన్నమౌతున్న కుటుంబాలు
ఎక్కడ చూసినా….
కులవివక్షలు కక్షలు హత్యలు
మానవ మనుగడను నాశనం చేసి
మనిషి ఉనికినే లేకుండా చేసి
దేశ ఔనత్యాన్నే అల్లకల్లోలం చేసి
నాగరికత, సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించి
మనిషిని మృగంలా మార్చే
కులమెందుకు మతమెందుకు !

అందుకే వివక్షల్లేని
స్వేచ్ఛగా విహరించే జంతువులు పక్షులు తో కలిసి విహరిస్తా….
పరోపకారులైన తరువులతో స్నేహంచేస్తా
సకల జీవరాశులకు ఆధారభూతాలైన పంచభూతాల్లా అందరికి సాయం చేస్తా….

కులమత,పేద ధనిక, హీనులు దీనులు, అన్నార్తులు అనాధులు, వృద్ధులు అభాగ్యులు అన్న భేదం లేకుండా
సేవలందించే వైద్యుల్లో
రక్తదానం చేసే యువకుల్లో
పవిత్రమైన స్నేహితుల్లో
ఆదుకొనే ఆపద్భాందువుల్లో సేవామూర్తుల్లో సంఘసంస్కర్తల్లో
దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్లో
వీరుల్లో నాయకుల్లో
కులవివక్షలకు చోటేలేదు
నర నరాల్లో ధ్వనించేది
దేశ భక్తి సమానత్వం మానవత్వం మనుషులంతా ఒక్కటే అన్న ఐకమత్య భావన !

సమస్త మానవాళిని సమానంగా కాపాడిన
ఈశ్వర అల్లా యేసు
రూపాలు పేర్లు వేరైనా
సర్వాంతర్యామి దేవుడు ఒక్కడే
మనిషులంతా ఒక్కటే
అన్న సత్యాన్ని గ్రహించి
కులవివక్షలు లేని లోకంగా
మారేదెప్పుడో !!
***********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!