★ప్లవ★
ఉత్సాహం ఉరకలు వేస్తుంటే
ఉగాదిని స్వాగతిస్తాం ఉద్వేగంగా
ఏటేటా….
భయం వేస్తోంది ప్లవా!
స్వయంగా నిన్ను ఆహ్వానించాలంటే
శార్వరి ,నీ సోదరి
పేరులోనే చీకటి!
మా బ్రతుకుల్లో చీకటి
చిమ్మి పోయింది
సాచి కొట్టిపోయింది
రాచి రంపాన పెట్టింది
శ్రామికులూ,కార్మికులూ
హాలికులూ,వ్యాపారులూ
కృంగిపోయారు తీరని నష్టంతో
ఎందరినో యమపురికి పంపింది
బళ్ళు లేవు
గుళ్లు లేవు
బజార్లకే తాళం
ఇంటి గూటి.క్రింద నరకం
మూతికి చిక్కాలు
కోతిమూతికి కొబ్బరి చిప్పల్లా!,
ఆ అమ్మడి చిరునవ్వు చూచి
ఎన్నాళ్ళయిందో!
ఆ యువతి అరుణ పెదవులు
చూచే భాగ్యం మాకు లేదదేమో!
ఆమె చెల్లివి కదా ప్లవా!
నీ పేరులోనే నలుపు
కాదా నీ బుద్ది పులుపు?
స్వాగతం ఎవరు చెబుతారు నీకు?
మామిడి తోరణాలతో
ముత్యాల ముగ్గులతో
గడపలకు పసుపు కుంకుమలతో
కోకిలమ్మ కుహూ కుహూలతో?
మా చీకటి బ్రతుకులకు
మరింత నలుపు పెయింట్ చేస్తావా?
అవునన్నా కాదన్నా
మా చంకనెక్కి కూర్చుంటావ్
మీ చావు మీరు చావండని!
రచన: ప్రసాదరావు రామాయణం