అంతర్ముఖుడు

అంతర్ముఖుడు

రచయిత:తాళ్ల శ్రీకాంత్

నాన్న నువ్వో…అంతర్ముఖుడివి
నేను పుట్టగానే ఏడుస్తుంటే
అమ్మలా పైకి నవ్వకుండా
నీలో నువ్వు మురిసిపోయి
ఇకపై నేను ఎప్పుడు ఏడవకూడదు అని
నన్ను తనివితీరా ముద్దాడకుండానే
నా భవిష్యత్తుకై ఎన్నో కలలు కన్నావు

అక్షరాలతో పరిచయం లేని నువ్వు
నాకోసం మొదటిసారి పాఠశాలకు వెళ్ళావు
కూలి పని చేసి కూడబెట్టిన సొమ్ముతో
కాన్వెంట్ చదువులు చదివించాలనే నీ తపనను
అర్థం చేసుకోలేని నా పసి మనసు మారం చేస్తుంటే
నాపై ప్రేమనంతా నీలో దాచుకుని
పైకి మాత్రం కాస్త కోపం నటించే వాడివి
కానీ అమ్మలా ఎప్పుడు చేయి చేసుకోలేదు

నేను ఎదుగుతున్న క్రమంలో
నా అవసరాలకు
డబ్బు ఇవ్వడం వరకే నీవనుకున్న
నన్ను మందలించే ప్రతి సారీ
నువ్వు ఛాందస వాదివనుకున్న
కానీ నాపై ప్రేమతో
నువ్వు గారాబంగా చూస్తే
ఎక్కడ నా భవిష్యత్ పాడవుతుందో అని
కనపడని ప్రేమతో
కనిపించె కోపాన్ని నటిస్తున్నావ్ అని తెలుసుకోలేకపోయా

నాన్న
నాపై నువ్వు కోప్పడ్తే
బాధ పడేవాణ్ణి
నాపై నీకెందుకు కోపం అని అడగాలనిపించేదీ
కానీ మొదటిసారి మీకు దూరమై వెళ్తుంటే
దుఃఖం దారి పొడువునా నిన్నే గుర్తుచేస్తుంటే
నాన్న నీవంటే ఏంటో ఆ రోజే తెలిసింది
నువ్వు చూపించే ప్రేమను పెద్దగా పట్టించుకోలేదు
నాపై నీకెందుకింత ప్రేమ అని ఇప్పుడు అడగాలనిపిస్తుంది

నాన్న
నీకు తెలియకుండానే
నీలో ఉన్న కళను నాకు నేర్పి
ఈ లాక్ డౌన్ సమయంలో నీతో గడిపేలా చేసావ్
నీ జీవిత అనుభవాలు కథలుగా చెప్తూ
నాకు తెలియని ఎన్నో విషయాలను నేర్పిస్తున్నావ్

మా ఆనందం కోసం ఇప్పటికీ
నీ సరదాలు సంతోషాలు త్యాగం చేస్తూనే ఉన్నావు
అందుకే ఏదో ఒక రోజు…
నీ సరదాలు సంతోషాలు అన్ని నువ్వు అనుభవించే రోజులు
నీకు నేను పరిచయం చేస్తా
నాలోని నీకు మాటిస్తున్నా…

You May Also Like

One thought on “అంతర్ముఖుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!