వయ్యారాల జాబిల్లి అలక 

అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
             ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..

వయ్యారాల జాబిల్లి అలక 

రచయిత:చల్లా.సరోజినీ దేవి

     పగలంతా పనిపాటులతో  అలసిన ఇందుకు , పతి దేవుని ఫోన్ కాల్ వేసవి కాలంలో చన్నీటి చిలకరింతలా పులకరింత కలిగించింది. ” రెడీ గా వుండు ఇందూ , సినిమాకు వెళ్దాం ” అంటూ సమాచారం అందిన వెంటనే చక్కగా తయారైంది. క్రాంతికి ఇష్టమైన మావి చిగురు అంచున్న లేత పసుపు చీర కట్టుకుని, కళ్ళకు కాటుక దిద్దుకొని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. “సినిమాకే ఇంత సీన్ఏమిటీ?” అని అనుకోకండి. ఆ దంపతులిద్దరూ ఉద్యోగ రీత్యా చాలా బిజీగా వుంటారు. వారి పిల్లలిద్దరూ చదువుల కోసం హాస్టల్ లో వుంటారు. ఆది వారాలు కూడా ఆఫీస్ పని ఒత్తిడి తో తల మునకలు అవుతుంటాడు క్రాంతి. అతని పని అయ్యేవరకూ పుస్తకాల తో కాలక్షేపం చేస్తుంది ఇందూ. ఏ ఐదారు నెలల కో ఒకసారి మాత్రమే వాళ్ళు సరదాగా బయటికి వెళతారు. అందుకే ఇందుకు అంత సంతోషం. ఇంతకీ క్రాంతి అనుకొన్న సమయానికి రాలేదు. చూసి, చూసి విసుగు పుట్టిన ఇందూ తన అలంకరణ అంతా తీసేసి, గదిలోకి వెళ్లి పుస్తకం చేతిలోకి తీసుకుంది..

     చాలా ఆలస్యంగా ఇల్లు చేరిన క్రాంతి తన వద్ద ఉన్న  రెండో కీ తో తలుపు తీసుకుని లోనికి వెళ్ళాడు. భర్త అలికిడి విని కూడా ఇందిర కదలకుండా అలాగే కూర్చుని పుస్తకంలో కి మరింత దీక్షగా చూడ సాగింది. క్రాంతి కి అర్థమైంది ” తన అందాల జాబిలి అలిగిందని. ఆమెను ఈ వేళ ప్రసన్నం చేసుకొంటే సూర్యుడు ఉత్తరాన ఉలికి పడుతాడు అని.” అందుకే ” ఇందూ, అసలు ఏమైందో తెలుసా నీకు ?” అన్నాడు ఊరిస్తున్నట్లుగా. కానీ ఇందూ తలెత్తలేదు.

” అబ్బ, అలుక చాలించు తల్లీ, నా అందాల జాబిలి. మనం మన పనుల  హడావుడిలో పడి బుక్ ఫేర్ అయిపోవచ్చింది అనే సంగతే మరిచి పోయాం. నువ్వు ఎప్పటి నుండో చదవాలని కోరుకుంటున్న  వావిలాల సుబ్బా రావు గారి “చలం గారి కథానికా సాహిత్యం  అను శీలన”  అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ రోజే చివరి రోజు. మా కొలీగ్ చెప్పేదాకా నాకూ గుర్తు లేదు. దేవీ గారి సేవలోనే భవదీయుడు మాట తప్పాడు.” అని చేతిలోని పాకెట్ ను ఇస్తూ చేతిని ముందుకు చాపాడు క్రాంతి. సంతోషంతో ఒక్క ఉదుటున కుర్చీ లోనుండి లేచి ఆ పాకెట్ ను అందుకొని “నిజమా, ఈ బుక్ కోసం  ఎన్నాళ్లు గా ఎదురు చూస్తున్నానో? Thanq dear.” అంటూ క్రాంతి బుగ్గ పైన ముద్దు పెట్టింది ఇందిర. ” హమ్మయ్యా, అలక తీరునట్లేనా నా అందాల జాబిలీ , సుగంధాల సిరి మల్లి” అంటూ నవ్వాడు క్రాంతి. సిగ్గు పడుతూ చిరునవ్వులు చిందించింది ఇందూ. 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!